Previous Page Next Page 
మోడల్ పేజి 13


    జరిగిన పొరపాటును మర్నాడే సరిద్దుకునే ప్రయత్నంలో గంట క్రితమే కోరమాండల్ ఇండస్ట్రీస్ మార్కెటింగ్ డైరెక్టర్ వ్యాస్ కి ఫోన్ చేస్తే, అతడు బొంబాయి వెళ్ళినట్లు, రావటానికి రెండు రోజులు  పట్టేట్టు తెలిసింది మనోహర్ కు. బెడ్ రూమ్ లోంచి డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చి ఎయిర్ హొస్టెస్ శాలినికి ఫోన్ చేశాడు.

    చాలాసేపటివరకు రింగ్ అవుతున్నా ఫోన్ ఎత్తలేదు శాలినిపాటిల్ కనిపించింది. ఆమె ఫీచర్స్ నచ్చి ఒక యాడ్ ఫిల్మ్ లో ఛాన్సిచ్చాడు. ఆ తరువాత ఇండియాన్ ఎయిర్ లైన్స్ ఒప్పుకోకపోవడంతో ఆ ఒక్క ఫిల్మ్ తోనే మానేసింది శాలిని. అప్పటినుండి మనోహర్ అంటే  శాలినికి ప్రత్యేకమైన గౌరవాభిమానాలున్నాయి.

    అయిదు  నిముషాలకు ఫోన్ లో శాలిని గొంతు  వినిపించింది మనోహర్ కు.

    "హలో......" చిరాగ్గా ఉంది ఆమె గొంతు అర్దరాత్రి నిద్ర  లేపినందుకు.

    ఆ గొంతులో మత్తు.....అది నిద్రమత్తో, తాగినమత్తో అర్ధంకావటం లేదు. సోఫిస్టికేటెడ్  లైఫ్ కి అలవాటుపడ్డ శాలినికి మందుత్రాగడం కల్చర్ అయిపోయింది. ఈనాడు అరిస్టాక్రాటిక్ సొసైటీ లైఫ్ కి అలవాటుపడ్డ చాలామంది ఆడవాళ్ళు మందు త్రాగటాన్ని కల్చర్ గా, ప్రెస్టేజ్ గా భావిస్తారు.

    "నేను....మనోహర్ ని మాట్లాడుతున్నాను."

    మనోహర్ గొంతు వినగానే శాలినిలో మత్తు దిగిపోయింది.

    "హలో సార్......ఎలా వున్నారు? హఠాత్తుగా అర్ధరాత్రి గుర్తు వచ్చానేంటి? మీకు అమ్మాయిలతో అర్దరాత్రి అవసరం రాదే?! వస్తే  మాత్రం నా అదృష్టమే......" అంది మత్తుగా.

    "షటప్......అండ్ స్టాప్ యువర్ నాన్ సెన్సికల్ టాకింగ్......"

    మనోహర్ గొంతులోని సీరియస్ నెస్ కి, తీవ్రతకు భయపడిపోయింది శాలిని.

    "సారీ సర్.....విషయం ఏమిటి?"

    "సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్, రేపు ఉదయం ఢిల్లీ ఫ్లయిట్ లో ఒక టిక్కెట్ కావాలి. అదేరోజు రిటన్ టిక్కెట్ కూడా....."

    "చాలా కష్టం సార్."

    "కష్టమనే నీకు ఫోన్ చేసింది. నీ ఇన్ ప్లుయన్స్ ఉపయోగించాలి. చాలా అర్జెంట్.

    "ఓ.కే సార్. ట్రై చేస్తాను. ఏ  పేరుమీద?"

    "అవినాష్.....కె. అవినాష్......." నోటికొచ్చిన పేరు చెప్పాడు మనోహర్.

    "అతనెవరు?"

"    "రేపు ఉదయం మధుచక్రవర్తి నీ దగ్గరకు వచ్చి టిక్కెట్  కలెక్టు చేసుకుంటాడు. నువ్వు ఎయిర్ పోర్టులో బుక్ స్టాల్  వద్ద టిక్కెట్ తో సిద్ధంగా వుండు."

    "మారుపేరు మీదా?"

    "వివరాలు తరువాత. ప్లీజ్ మేకిట్ కాన్ఫిడెన్షియల్.  ఢిల్లీలో ఎవరి  ద్వారా రిటన్  టిక్కెట్ రెడీ  చేస్తావ్?"

    "ఎయిర్ హొస్టెన్ రంజితా."

    ఫోన్ పెట్టేసాడు మనోహర్.

    వెంటనే మరో నాలుగయిదు చోట్లకు ఫోన్ చేస్తూ కూర్చున్నాడు.

    అదే టైమ్ లో మనోహర్ కి ఫోను చేసిన ప్రదీప్ కి మనోహర్ ఫోన్  ఎంగేజ్ లో వుండటం ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని కలిగించింది.

   
                                   *    *    *


    "ఎయిర్ పోర్టులో టిక్కెట్ తో, బుక్ స్టాల్ దగ్గర నీకోసం సిద్ధంగా వుంటుంది శాలినిపాటిల్. రిటన్ టిక్కెట్ కూడా ఈరోజు ఈవెనింగ్ కి  ఢిల్లీ ఫోన్ చేసి ఆరేంజ్ చేసుంటుంది.  ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగగానే ఎయిర్ హొస్టెస్ రంజితా నీకు రిటన్ టిక్కెట్ ఇస్తుంది, పని పూర్తి చేసుకుని వచ్చెయ్."

    "కాని సార్......సోఫియా వాళ్ళక్క రూపా చెప్పకుండా ఏ పనీ  చేయదని మీరే అన్నారు ఈమధ్య. అలాటంప్పుడు నా పని  ఎలా  అవుతుంది?" ప్రశ్నించాడు మధు.

    తెల్లవారుఝామునే బాస్  తనగదికి రావటం, తక్షణం  ఢిల్లీ బయలు దేరమనడం,  ఢిల్లీలో చేయవలసిన పని చెప్పటం అంతా అయోమయంగా వుంది మధుకి.

    బాస్ ముఖంలో కనిపించే టెన్షన్ చూస్తుంటే ఇదంతా ఏమిటని అడిగే దైర్యం లేకపోయింది.

    "నీ తెలివితేటలు ఉపయోగించి పని పూర్తిచేసుకురా.  ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగే లోపు నీకు ఐడియాతడితే నువ్వు ఈ వృత్తిలో పైకొస్తావు. తట్టకపోతే నాకు ఫోన్ చెయ్యి, ఐడియా చెబుతాను కానీ ఆ తరువాత నా దగ్గర  వర్క్ చేయటానికి పనికిరావు" అంటూ కారును రివర్స్ చేస్తూ మధువైపు చూశాడు......మధు కారు దగ్గరకు వచ్చాడు.

    "ఈ జర్నీలో నీ పేరు కె. అవినాష్ గుర్తుపెట్టుకో, బీకేర్  పుల్. నువ్వు హఠాత్తుగా  ఢిల్లీ వెళ్ళినట్టు ప్రదీప్ కి తెలియకూడదు అందుకే నిన్ను జాగ్రత్తగా వుండమంటున్నాను" అంటూ కారుని ముందుకు  దూకించాడు.

    మధు జెట్ స్పీడ్ లో ఆలోచించడం మొదలెట్టాడు బ్రీఫ్  కేస్  సర్దుకుంటూనే .అప్పుడప్పుడు మనోహర్ ఇలాంటి చిన్న చిన్న  టెస్ట్ లు  పెడుతుంటాడు మధు చక్రవర్తికి. ఆ టెస్టుల్లో నెగ్గి తన  బాస్ తో "వెరీగుడ్" అని అనిపించుకోవడం చాలా ఇష్టం మధుకి. మనోహర్ మధుచక్రవర్తిని సొంత తమ్ముడిలా చూసుకుంటాడు. వృత్తి వృత్తి రహస్యాలు,  మెలకువలు శ్రద్దగా చెబుతూంటాడు అప్పుడప్పుడు.

    మధుతో ఉన్నంత చనువుగా గిరిష్ తో వ్యవహరించడు.

    ఆ తేడా  ఏనాడో కనిపెట్టాడు మధుచక్రవర్తి. అందుకే మనోహర్ అంటే మధుచక్రవర్తికి గౌరవం. అంతకుమించిన పూజ్యభావం ఉన్నాయి. ఈ పందెంలో తన బాస్ నెగ్గాలని, అందుకు తను ప్రాణాలివ్వటానికైనా సిద్దం కావాలని, మనస్సులోనే నిర్ణయించుకున్నాడు మధు.

    చిన్నప్పుడు అపరాధ పరిశోధన సాహిత్యం విపరీతంగా చదివేవాడు. తనో డిటెక్టివ్ అయినట్లుగా, తెలివిగా విలన్ ని పట్టుకున్నట్లుగా, రహస్యాన్ని ఛేదించినట్లుగా ఊహాలోకాల్లో విహరించేవాడు.

    ఓసారి తన మేనమామ ఓ డొక్కు క్లిక్ థర్డ్ కెమేరా ప్రెజెంట్ చేశాడు.

    అప్పటినుండి ఫోటోగ్రఫీ మీదకు మనస్సు మళ్ళినా, అపరాధ పరిశోధన మీద మక్కువ పోలేదు. తెలుగు డిటెక్టివ్ నవల్లు చీఫ్ గా వుంటున్నాయని, ఇంగ్లీష్ నవలలు చదవడం ప్రారంభించాడు. తను చదివిన అపారమైన అపరాధ పరిశోధనా సాహిత్యం తన నిజ జీవితంలో పనికొస్తుందని ఎప్పుడూ వూహించలేదు.


                                                                      *    *    *

   
    తెల్లవారుఝామున ఐదు గంటలకే మేలుకోవడం మంగళకు అలవాటు విశాఖ ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్ గా చేరిన దగ్గర్నుంచి ప్రతి రోజు ఐదు గంటలకే లేవడం, ఆరోజు కాలేజీలో టీచ్ చేయాల్సిన సిలబస్ ఒకసారి చూసుకోవడం అలవాటు. మంగళ లేచేసరికి ప్రక్కన కమలిని కనిపించలేదు. బెడ్ దిగి, గదికి అనుకొని ఉన్న లాబీలోకి వచ్చింది మంగళ.

    అక్కడ కమలిని పద్మాసనం వేసుకొని బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేస్తోంది కళ్ళు మూసుకొని.

     ఆమెమ డిస్టర్బ్ చేయకుండా  మనోహర్ గది దగ్గరకు వచ్చింది.

    మనోహర్ లేపేందుకు తలుపుపై చప్పుడు చేసింది. అంతలో వెనుకనుంచి "బావ్......"మని పెద్ద శబ్దం.

    ఉలిక్కిపడి వెనుతిరిగింది. మనోహర్ నవ్వుతూ తమాషాగా చూస్తూ కనిపించాడు.

    "భయపడ్డారా లెక్చరర్ గారూ......?" వెక్కిరిస్తూ కొంటెగా ప్రశ్నించాడు మనోహర్.

    తేరుకున్న మంగళ కోపంగా____

    "నువ్వూ....." అంటూ చేయి ఎత్తింది.

    ఆ చేతిని మధ్యలోనే పట్టుకొని, ఆమెకు దగ్గరకు  తీసుకొని నుదుటిమీద అంటీ అంటనట్లుగా చుంబించాడు.

    ఆ స్పర్శ ఎంతో మధురంగా అనిపించింది మంగళకు. ఆమెలోని అణువణువు తీయని అనుభూతికి  లోనైంది.

    వెనుకనుంచి దడిపించినందుకు మనోహర్ మీద కోపం తెచ్చుకున్న మంగళ ఆ సంఘటనతో ప్రసన్నంగా మారిపోయింది.

    కొద్దిగా సిగ్గనికూడా అనిపించి  తలవంచుకున్న మంగళవైపు చూస్తూ  "ఎంత అందంగా వున్నావు మంగళ" అన్నాడు ప్రేమగా చూస్తూ.

    చెదిరిన కురులు, బొట్టు, కాటుక ఆమె మోముకు  వింతశోభను చేకూర్చాయి.

    ముఖ్యంగా పిరుదులు దాటే, పట్టుకుచ్చులాంటి ఆమె జుత్తంటే చాలా ఇష్టం మనోహర్ కు.

    మంచిమూడ్ లో ఉన్నప్పుడైతే, తలాస్నానం చేసివచ్చిన మంగళ వెనుకచేరి ఆమె జుత్తును ప్రేమగా చేతులనిండుగా  తీసుకొని తనివితీరా ఆఘ్రాణిస్తాడు తన్మయంగా.

    అందులో ప్రేమ, ఆరాధన, తృప్తి మాత్రమే వుంటాయి.

    తన ప్రియురాలిపై వుండే అమితమైన ప్రేమ తెలియజేయటానికో. దాచుకోలేకో ఒక్కోవిధంగా బయటపడుతుంటాడు ఒక్కో ప్రియుడు.

    మనోహర్ లో ప్రేమ ఉప్పొంగితే ఆర్తిగా మంగళ జుత్తుని చేతుల్లోకి తీసుకుంటాడు, ఆఘ్రాణిస్తాడు, నోటి నిండా కుక్కుకుంటాడు. ప్రేమ చేష్టలకి  అర్థాలంతగా ఉండవు. వుండకపోయినా, అందంగా, ఆనందంగా వుంటాయికామోసు.

    "నల్లపిల్ల నుగదా, అందంగా ఎలా వుంటాను?" మనోహర్ వైపు ఓరగా చూస్తూ అంది.

    "నలుపులో వుండే చార్మింగ్ తెలుపులో వుండదు. నువ్వు ఉమెన్స్ కాలేజీలో చేరటం నా అదృష్టం, అదే కో - ఎడ్యుకేషన్ కాలేజీలో చేరుంటే నాన్నంటే, నన్ను పెళ్ళిచేసుకోండి మేడమ్ అంటూ చదువుమానేసి క్యూ కట్టుండేవాళ్ళు కుర్రలెక్చరర్స్.అప్పుడు నేను అన్యాయమైపోయేవాణ్ని."

    "అప్పుడు మెట్టెలు వేసుకోనేదాన్ని కాళ్ళకు" అంది మంగళ తన అందమైన కనురెప్పల్ని అల్లల్లాడిస్తూ.

    "ఎందుకు?"

    "ఈమధ్య కాలేజీల్లో అమ్మాయిలు కొత్తటెక్నిక్ కనిపెట్టారు. తను ఎవరినన్నా ప్రేమిస్తే మరొకరు తనని ప్రేమిస్తున్నామంటూ వెంటపడకుండా ముందు జాగ్రత్తగా కాళ్ళకు మెట్టెలు పెట్టుకుంటారు. అంటే సారీ మిష్టర్ యూ ఆర్ లేట్ అని చెప్పటానికి."

    "ఓర్ని" అన్నాడు సంభ్రమంగా.

    "ఎంత ఫాస్ట్ అయిపోయారు అమ్మాయిలు......!"

    "మరేంటనుకున్నావ్. అవునూ ఇంత ప్రొద్దుటే ఎక్కడికి వెళ్ళొస్తున్నావ్?"

    "మధుని ఢిల్లీ పంపించటానికి."

    "ఢిల్లీ ఎందుకు?"

    "నిన్న జరిగిన పొరపాటును సరిదిద్దుకోవడానికి. సోపియాఫోటోలు రెండే వున్నాయి నా దగ్గర ఆ రెండు మిస్ అయ్యాయి చిత్రంగా. మరో రెండు ఫోటోలు తీసుకురావడానికి ఢిల్లీ పంపించాను. రూపాచక్రవర్తినే పంపుండేవాణ్ని. కాని ఆమెకివ్వాళ వర్క్ వుంది. అందుకే మధుని పంపించాను."

    "చిన్న పొరపాటు జరిగింది. ఫోటో తారుమారైందంటే ఒప్పుకోరా?"

    "ఒప్పుకోవచ్చు. ఒప్పుకున్నా నేననుకున్నా మోడల్ ఫోటోలు చూడాలి. అప్రూవ్ చేయాలి. ఒప్పుకోకపోయేందుకు కూడా అవకాశలున్నాయి. ఈ విషయం ప్రదీప్ కి తెలిస్తే ఒప్పుకోవద్దని డైరెక్టర్ పై ఒత్తిడి తేవచ్చు. ప్రదీప్, డైరెక్టర్ మంచి ఫ్రెండ్స్ నన్ను ఇరుకున పెట్టేందుకు, పందెంలో గెలవకుండా చేసేందుకు ఆ అమ్మాయే కావాలని పట్టుబట్టవచ్చు. ఉన్న టైమ్ చాలా తక్కువ. ఆమె ఎవరిని పట్టుకోవాలి? ఎక్కడుందని పట్టుకోవాలి?" ఈ ప్రమాదం నుంచి తప్పించుకొనేందుకు. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు మనోహర్. 

 Previous Page Next Page