Previous Page Next Page 
చిలకలు పేజి 13


    "ఓ.కె." నరేంద్ర విజయ్ కేసి చూశాడు.
    విజయ్  లేచి వెళ్ళి టేబుల్ డ్రాయిర్ లోనుంచి ఓ కవరు  తెచ్చి అద్వయితానికి అందించాడు.
    "మిస్టర్ అద్వయితం! ఈ ఉత్తరం  గురించి ముందు నేను పెద్దగా పట్టించుకోలేదు. దీనిలోని విషయం  ఇప్పుడు కొంతవరకు అర్థం అవుతోంది. చదువు, నీకు ఇందులోని సమాచారం చాలావరకు ఉపయోగపడుతుందనే నాభావం. రాధారాణి హత్యకు సంబదించి తోక అయినా దొరుకుతుందేమో చూడు" అన్నాడు నరేంద్ర.
    ఇన్ స్పెక్టర్ ఉత్తరం మడతలు  విప్పి చదవసాగాడు.
    "ప్రియమైన రాణీ!"
    అంతవరకు పైకి చదివి ఇన్ స్పెక్టర్ మనసులోనే  చదువుసాగాడు.
    "పైకి చదువు మేము వింటాం."
    "సగం చదివేశాను. ఇందులో మనకు ఉపయోగపడేదేమీ కన్పించలేదు. నువ్వు చదవ లేదా?"
    "చదివాలే. పోనియ్ అక్కడ్నుంచే పైకి చదువు."
    ఇన్ స్పెక్టర్ మధ్య నుంచి ఉత్తరం ప్రారంభించాడు.
    "నీతోపాటే ఆశ్రమాన్ని విడిచి రాలేకపోయినందుకు విచారిస్తున్నాను! 700 రూపాయల ఉద్యోగం చేస్తూ ఆ హైదరాబాద్ లో "నా" అనే వాళ్ళులేని చోట ఎంతో  బాధపడుతున్నావో నేను  అర్థం చేసుకోగలను.
    నువ్వు బయలుదేరిన రోజే నేనూ ఈ ఆశ్రమం నుంచి నీతో పాటే వచ్చేస్తే నీకా బాధలు తప్పేవి. ఉద్యోగం వెతుక్కోవడానికి ఎన్ని బాధలకు, అవమానాలకు గురి అయి వుంటావో కూడాఊహించగలను. నేను చాలా ధనవంతుడినని చెప్తేనువ్వు ఆశ్చర్యపోతావు. ఆ విషయం నీకు ఆశ్రమంలో ఉండగా చెప్పలేదు నన్ను క్షమించు నీ నిష్కల్మష ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. అప్పుడు నామనస్థితి గురించి నీకు తెలియదు. ఆడ జాతి అంటేనే ద్వేషిస్తూ ఉండేవాణ్ణి.
    ఆ రైలు ప్రమాదం నా జీవితాన్నే తారుమారు చేసింది. స్పృహ తప్పి పడి ఉన్న నన్ను చిదానంద స్వాములు తన ఆశ్రమానికి చేర్చారని నాకు స్పృహ వచ్చాక నువ్వే చెప్పావు. నేను మూడు రోజుల తర్వాత కళ్ళు తెరిచి.
    నప్పుడు మొదటిసారిగా నాకు శుశ్రూష చేస్తూ కన్పించింది నువ్వే. ఆ తర్వాత కూడా దాదాపు నెలరోజులు నేను లేచి  తిరిగే స్థితిలో లేను. అన్ని రోజులూ నన్ను కంటికి రెప్పలా కనిపెట్టుకొని వుండి సేవలు చేశావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అనుకుంటూ ఉండేవాడ్ని.
    నువ్వు ఆశ్రమంలో ఎందుకు చేరావో నాకు తెలియదు. నువ్వు చెప్పలేదు. నేను అడగలేదు. ఈనాటికీ నాకు తెలుసుకోవాలని లేదు. నీ గతం గురించి నాకు అనవసరం.
    నాకు బాగా స్వస్థత చేకూరక ఒక విషయం తెలుసుకున్నాను. నా భార్య-నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకొన్న భార్య- నా స్నేహితుడ్ను- నేను ఆసరా ఇచ్చి నిలబెట్టిన  స్నేహితుడ్నే పెళ్ళిచేసుకుంది. నేను చనిపోయానని భావించారు. నిజమే. కనీసం ఓ ఆరు నెలలైనా నా కోసం చూడకుండా భార్యాభార్తలుగా జీవించసాగారు. ఇప్పుడు ఆ వివరాలు నీకు రాయడం అనవసరం. అయితే నాకు అంతకుముందే పెళ్ళి అయిందని కానీ, చాలా ఆస్తిపరుడినని కానీ నీకు చెప్పలేదు, అందుకు నన్ను క్షమించు నిన్ను గౌరవించాను. నిన్ను ప్రేమిస్తున్నట్టుగానీ, నువ్వు నా జీవితానికి ఓ అర్థం కల్పించగలననిగానీ ఆనాడు భావించలేదు. కారణం ప్రపంచం అంటే కలిగిన విరక్తే. నువ్వు రెండు  మూడు ఉత్తరాలు రాశావు. కాని నేను సమాధానం రాయలేదు. మళ్ళీ ప్రపంచంమీద అనురక్తి కలిగించుకోవాలనే కోరిక లేకపోవడం వల్లనే.
    కాని ఇప్పుడు ఆ ఆశ్రమ  జీవితంలో  విసిగిపోయాను.ఈ ఆశ్రమవాసులు కూడా రాగద్వేషాలకు అతీతులు కారని  తెలుసుకొన్నాను. ఈ కృత్రిమ వాతావరణంలో నాకు ఊపిరి  సలపడంలేదు ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాలనే కోరికకలగగానే ముందు నువ్వే గుర్తొచ్చావు. నీ ప్రేమ నాకు కావాలి. అందుకే వచ్చేస్తున్నాను. నాకున్న ఆస్తి మనకే కాదు నాలుగు తరాలు తిన్నాతరగదు.
    దాసుడి తప్పులు దండాలతో సరి అంటారు గదూ! ఆనాడు నీతో రానందుకు నన్ను క్షమించమని మరోసారి ఆర్థిస్తున్నాను, నీ  నిష్కల్మష ప్రేమలు మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలానే  కోరికతోనే నిన్ను చేరుకుంటున్నాను.
    నీ రుణం ఎలా తీర్చుకోనూ అని ఆలోచిస్తూనే రెండేళ్ళ కాలం వృథా చేశాను. చాలా ఆలస్యంగా తెలుసుకొన్నాను. నాకు  హృదయం ఇచ్చి ప్రేమించిన వ్యక్తికి నేను ఇవ్వగలిగిందేముంది? నా హృదయాన్నీ, జన్మనూ అంకితం చేసుకోవడం తప్ప! ఈ ఆశ్రమ వాతావరణంలో ఇంత చిన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ఇన్ని  రోజులు పట్టింది.
    ఇక ఒక్క క్షణం కూడా జీవితంలో వృథా చెయ్యను. ఎళ్ళుండి రాత్రి ఢిల్లీ మద్రాసు ప్లైట్ లో వస్తున్నాను. హైదరాబాద్ చేరిన రెండో రోజు నేను చెయ్యబోయే మొదటి పని ఏమిటో తెలుసా? రిజిష్టర్ ఆఫీసుకు నిన్ను తీసుకెళ్ళి పెళ్ళి చేసుకోవడం.
    ఇప్పటికే చాలా పెద్ద ఉత్తరం రాశాను. వీలుంటే  ఎయిర్ పోర్టుకు వస్తావుగదూ?
    రామానంద అనే పేరు చదువుతూనే ఎగిరి గంతేసినంత సంతోష పడిపోయాడు ఇన్ స్పెక్టర్.
    'డబుల్ మర్డర్! రాధారాణి చంపినవాడే. రామకృష్ణను కూడా చంపాడు" ఉత్సాహంగా అరిచాడు విజయ్.
    ఇన్ స్పెక్టర్ సంతోషమంతా క్షణంలో నీరు కారిపోయింది. నీరసంగా కుర్చీకి చేరబడ్డాడు. నరేంద్ర ఇన్ స్పెక్టర్ ను ఓరగా చూస్తూ సిగరెట్ దమ్ము పీల్చాడు.
    "కొంపలారినై దొరికినట్టే దొరికి జారపోయింది."
    "ఏమిటి?"
    "కేసు, రామకృష్ణ హత్య కేసులో హంతకుడ్ని పట్టుకోవడానికి ఆధారాలు ఉన్నాయి కాని వాడే రాణీని కూడా చంపాడనడానికి సూది మొన మోపే ఆధారం కూడా లేదే? ఈ రెండు కేసులూ కలిపి, హంతకుడు ఒక్కడే నని నిరూపించడానికి ప్రయత్నిస్తే మొదటికే మోసం రావచ్చు. రెండు కేసులూ కలిపి బనాయిస్తే క్లియర్ గా ఉన్న కేసు  కూడా ఎగిరిపోవచ్చు" అన్నాడు నీరుకారిపోతూ. అరిచేతిలో ఉన్న హంతకుడు ఇట్టే జారిపోయినటు జారిపోయినట్టుగా అన్పించింది ఇన్ స్పెక్టర్ కు.
    నరేంద్ర ఇన్ స్పెక్టర్  కేసి దీక్షగా చూస్తూ, సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు.
    అతడు మాట్లాడకుండా కూర్చున్నాడంటే, ఏదో విషయాన్ని లోతుగా ఆలోచిస్తున్నాడనే అద్వయితం భావిస్తాడు.
    అద్వయితం తల విదిలించుకొన్నాడు. ఏదో అద్భుతమైన ఆలోచన తట్టినట్టు అతడి కళ్ళు మిలమిల మెరిశాయి. కుర్చీలో ముందుకు వంగి "మిస్టర్ నరేంద్రా!" అని ఆగి నరేంద్ర ముఖంలోకి చూశాడు.
    "చెప్పు!"
    "రాధారాణి క్సు పూర్తిగా నీకు వదిలేస్తాను. నేను రామకృష్ణ కేసు చూసుకుంటాను. అంటే నువ్వు అటునుంచి నరుక్కురా నేను ఇటునుంచి నరుక్కొస్తాను. అలా అయితే మనిద్దరం ఎక్కడో  ఓ చోట కలుసు కొకపోము ఏమంటావ్?"
    "ఎందుకూ? ఒకళ్ళనొకళ్ళం నరుక్కోవడానికా?" చిలిపిగా చూస్తూ అన్నాడు విజయ్.
    "అంతవరకూ వస్తే మా వాడు నా దెబ్బకు చాలడులే" అని  పొట్టఎగరేస్తూ పకపక నవ్వసాగాడు అద్వయితం.
    నరేంద్ర చేతిలోని సిగరెట్ యాష్ ట్రేలో పడేశాడు.
    "బయలుదేర్ధామా?" అన్నాడు నరేంద్ర ఇన్ స్పెక్టర్ తో.
    "ఎక్కడికి?" అయోమయంగా చూశాడు అద్వయితం.
    "రామకృష్ణకు అక్క ఉంది అన్నావుగా? వాళ్ళఇంటికి."
    "అలాగే వెళ్దాం. కాని ఇప్పుడు కాదు, డి.ఐ.జి.ని కలుసుకోవాల్సిన పని ఉంది. ఎందుకో కబురు పెట్టాడు."
    "త్వరగా వెళ్ళడం మంచిది."
    "ఓ.కె. ఈ రాత్రి వెళ్దాం. రాత్రి 7 గంటలకు  వస్తాను" అంటూ అద్వయితం లేచి బయటికీ వెళ్ళాడు.
    పోలీసు జీపు దడదడ శబ్దం చస్తూ వెళ్ళిపోయింది.
    విఅజయ్ కు ఎన్నో  అడగాలని ఉంది. కాని నరేంద్ర  ముఖం  చూసి అడక్కుండానే  లోపలకు వెళ్ళిపోయాడు.
    నరేంద్ర మరో సిగరెట్ వెలిగించి దీర్ఘలోచనలోకి పోయాడు.
    అనసూయ. సూర్యనారాయణ అతడి మనసులో మెదిలారు. దాదాపు ఇరవై నాలుగ్గంటల్లో రెండు హత్యలు. రెండు హత్యలూ సూర్యనారాయణ చేసి ఉంటాడా? రాధారాణి ప్రేమ గురించి తెలిసే అవకాశం  అతడికుందా? సూర్యనారాయణకు రామకృష్ణ ఆస్తి మీద పెద్దగా ఆశ ఉన్నట్టు లేదు. రాధారాణిని చంపాల్సిన అవసరం అతడికి లేదు.
    మరి! రామకృష్ణ అక్క కమలంబకిఅతడి మీద కోపం ఉంది తన కూతుర్ని చేసుకోలేదని, ఆమెకు రాధారాణిని చంపిస్తే వచ్చిపడేదేముంది.
    "అన్నయ్యా! అమ్మ భోజనానికి రమ్మంటుంది" సునంద వచ్చి పిలిచింది.
                                        7
    రెడ్ మారుతి ఏ.ఐ ఏ నం. 2000 సర్రునదూసుకొచ్చి పంచనటి గేటు ముందు ఆగింది. విజయ్ దిగి శబ్దం కాకుండా అతి జాగ్రత్తగా గెట్లు తెరిచాడు. కారు చిన్నగా తీసుకొచ్చి పోర్టికోలో ఆపాడు. విజయ్ దిగి వెనక్కు వెళ్ళి గేటు వేసి వచ్చాడు.
    సునంద కారు దిగి  విజయ్ కోసం చూస్తూ నిల్చుంది.
    "ఇంకా నిల్చున్నావేం? తలుపు తట్టి అత్తయ్యను పిలువు" అన్నాడు విజయ్  గొంతుతగ్గించి.
    "ఊహు! నువ్వే పిలువు బావా!" అంటూ సునంద విజయ్ వెనక్కువచ్చి నిలబడింది.
    "బాబోయ్ నేను పిలవను. నువ్వే పిలువ్వు" అన్నాడు విజయ్ భయంనటిస్తూ.
    "నువ్వేం చెప్పావ్ సినిమాకు డీసుకెళ్ళేప్పుడు? అమ్మ చూడకుండా రావచ్చని చెప్పావ్. అమ్మకు మనం ఇలా తిరిగడం సుతరాం ఇష్టంలేదు. పైగా రెండో ఆట సినీమాకు. నేను పిలవను బాబూ! నువ్వే పిలువు" అంది సునంద గోడపక్కగా జరిగినిల్చుని.

 Previous Page Next Page