Previous Page Next Page 
అందమైన అపశృతి పేజి 13


    "ఆ  మరే అంతకన్నా నాకు మరో పనుంటేగా!" అంటూ మంచినీళ్ళగ్లాసు సిద్దార్థ కందించింది శృతి.

    "అదెలాగూ నిజమేలే. అమ్మొచ్చింది. ఇహ ఇవతల చెంబు అవతల తీసిపెట్టే చిన్నపని కూడా లేదు." అంటూ మంచి నీళ్ళుతాగి గ్లాసు కింద పెట్టి "ఇందాక శృతి ఏమందేవిటీ?" అన్నాడు సిద్దార్థ.

    "ఆ ఏంలేదు.  అన్నయ్యకి తొందరగా పెళ్ళిచెయ్యి. ఏ శ్రీదేవో రెడీగానే వుంటుంది అన్నాలే" అంటూ వెక్కిరించింది శృతి. నీ సంగతి నాకు తెలియదా అన్నట్లు చూస్తూ.

    సిద్దార్థ రెండు గుటకలు మింగి "శ్రీదేవో, భూదేవో నా పెళ్ళిసంగతి నీ కెందుకు! ముందు చెయ్యాల్సింది నీ పెళ్ళి." చిరుకోపంతో అన్నాడు.

    "శ్రీదేవి, సిద్దార్థ పరస్పరం మనసిచ్చి పుచ్చుకునే వుంటారని శృతికి అనుమానం. వాళ్ళిద్దరు ఎదురుపడినప్పుడు వాళ్ళ చూపులే చెప్పక చెపుతుంటాయ్. శ్రీదేవి మాటెత్తితే చాలు, సిద్దార్థ కంగారుపడిపోతాడు. శ్రీదేవి అంతే, వారానికి రెండు రోజులు ఇక్కడికి రావాల్సిందే వస్తూనే సిద్దార్థ వున్నాడేమో  అని ఆమె చూపులు నలువైపులా దొంగలా చూస్తుంటాయ్.

    పెళ్ళిమాట ఎత్తగానే సీతమ్మకి గుర్తొచ్చినట్లుంది. "మరిచేపోయానే అమ్మయ్! సుబ్బలక్ష్మికి పెళ్ళి కుదిరిందిగా____"

    "ఎల్లుండి రాత్రికి పెళ్ళి, నాకెందుకు తెలియదూ?" అంది శృతి మధ్యలో కలుగజేసుకుని.

    "పెళ్ళి విషయం కాదు నే చెప్పేది. మగ పెళ్ళివారికి మంగమాంబగారింట్లో విడిది ఏర్పాటు చేశారా? వాళ్ళకి నూతకం వచ్చింది. ఏం చేద్దాం, ఎవరింట్లో విడిది సంగతి చూడాలి. ఇప్పటికిప్పుడు ఎవరిల్లు యిస్తారాని నానా కంగారు పడుతుంటే మనిల్లు తీసుకోమని చెప్పాను___"

    శృతి పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. "వీల్లేదు" అంది గట్టిగా.

    సీతమ్మ ఇదేం చిత్రమే నా తల్లీ అన్నట్లు చూచి "ఎందుకు వీల్లేదే? శుభకార్యానికి చోటు చూపిస్తే పుణ్యం" అంది.

    "పెళ్ళివారు అంటే ఒకరా, ఇద్దరా? దాదాపు వందమంది వుంటారు. పిల్లాపీచు, ముసలీముతక ఇల్లంతా ఫలహారాలు తిని పడి దొర్లి నానా ఆగం చేస్తారు. మన సామాను పాడువుతుంది. విడిది లేదు,  గిడిదిలేదు కుదరదని చెప్పు."

    "మాటిచ్చి వెనక్కి తీసుకుంటామటే? ఎవరన్నా వింటే మొఖాన నవ్వుతారు. రేపు నీ పెళ్ళికి ఎందరు సాయం రావాలో? ఇక్కడ అన్ని క్వార్టర్సులోను పిల్లలతో పెద్ద సంసారాలే వున్నాయి. మనింట్లోనే ముగ్గురముంది. సామానులదేముంది? అన్నీ అట కెక్కించేస్తే సరి. ఎమంటావురా సిద్దూ!"

    "నీ యిష్టమమ్మా" అన్నాడు సిద్దార్థ. సాధారణంగా తల్లి మాటలకు అడ్డంరాడు. శృతిలాగా ప్రతి మాటకి  కయ్యి కయ్యి మనడు.

    "నీకు తెలియదమ్మా విడిది ఇస్తే....."

    "నువు మాట్లాడకే శృతీ! ఇవతలి  చెంబు తీసి అవతల పెట్టొద్దు, సరేనా నేను సిద్దూ ఇల్లుసర్దుతాము. రేపు సామాను అటకెక్కిద్దాము. నువు ఇంట్లోనే వుంటావుకదరా సిద్దూ?"

    "వుంటానమ్మా!" అన్నాడు సిద్దార్థ.

    "దేముడా! ఏం కష్టం తెచ్చిపెట్టవయ్యా" అనుకుంది శృతి. ఆటకమీద వున్న దేముడి గురించో, ఆపైన వున్న దేముడి గురించో ఆ దేముడికే తెలియాలి.

    సీతమ్మ పెళ్ళివారి గురించి చెపుతుంటే సిద్దార్థ వింటూ కూర్చున్నాడు.

    ఈ పెళ్ళి ఆగిపోతే బాగుండుననుకుంది. అదే నోటితో ఛా....ఛా....ఇది నేను అనుకోవాల్సిన మాటేనా! అని బాధ పడింది. సీతమ్మ మాటలకు మధ్యమధ్య అడ్డుతగిలి ఏదో వంక చూపిస్తూ మనిల్లు విడిది ఇవ్వద్దు అంటూనే వుంది శృతి.

    ఉండి ఉండి సీతమ్మ అంది. "నేను ఊరునుంచి వచ్చినప్పటినుంచి చూస్తున్నారా సిద్దూ! అవునన్నాది కాదనటం, అన్నింటికీ పేచీలే."

    "రోజు రోజుకి మనుషులు ఎదుగుతారమ్మా! శృతి మాత్రం అలా కాదు. రోజు రోజుకి చిన్నపిల్లవుతోంది." సిద్దార్థ నవ్వుతూ జవాబిచ్చాడు.

    "చూడబోతే అలాగే వుంది"  అంది సీతమ్మ.

    మగపెళ్ళివారు తరలి రావటమూ ఖాయం ఈ యింట్లో విడిది దిగటమూ ఖాయం, నేను ఆపదలో చిక్కుకోటమూ ఖాయం. ఏం చేయాలి? ఈ రాత్రికి మురారిదేముడుతో చెబుదామంటే ఈ గదిలో అన్నయ్య. ఆ గదిలో అమ్మ పడుకుంటారయె. ఎలా? ఎలా?

    శృతి దీర్ఘలోచనలో మునిగిపోయింది.

    సీతమ్మ కొడుకుతో పెళ్ళివారి గురించి ఇంకా చెపుతూనే వుంది.

   
                                                                        10


    మురారిదేముడికి సమాచారం అందించుదామని రాత్రి పన్నెండు గంటలదాకా మేలుకుంది. శృతి. ప్రయత్నం ఫలించలేదు. టేబుల్ లైట్ పెట్టుకుని సిద్దార్థ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ చదువుతూ కూర్చున్నాడు. కాళ్ళు పీకుతున్నాయ్ అంటూ సీతమ్మ నిద్రపట్టక అటూ ఇటూ పడకమీద దొర్లుతూవుంది. ఎప్పుడు నిద్ర పట్టిందోగాని శృతికి నిద్ర పట్టింది.

    ఆ రాత్రి అలా తెల్లవారింది.

    ఇంట్లో పనితోపాటు అటకమీద ఎక్కించవలసిన సామాను కూడా సర్దటం మొదలు పెట్టింది సీతమ్మ.

    శృతి ఆ రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చింది అలా చేస్తే తప్ప, ఆపద తొలగేటట్లు లేదు. తల్లితోపాటు ఆ సామాను, ఈ సామాను సర్ది అటక మీదికి తనే ఎక్కి పైన సర్దవలసిన సామాను పెట్టేస్తే సిద్దార్థ కంట మురారిదేముడు పడడు. ఇంతకు మించి ఉపాయంలేదు మరి.

    ఈ రాత్రికి సిద్దార్థ ఇంట్లో వుంటాడు. మురారిదేముడు అటక దిగటానికి అటంకమే.

    తెల్లవారితే మగ పెళ్ళివారు తరలివచ్చి ఇంట్లో విడిది దిగుతారు. ఓ వేళ పెళ్ళి సమయానికి అంతా తరలి వెళ్ళినా ఇల్లు తాళం వెయ్యరు. ఓ మనిషి కాపలా ఉంటాడు. గాయం చీము పట్టింది. పైగా జ్వరం ఒకటి. అలా పై నే  వుండిపోతే అతనికేమన్నా అయి అక్కడే.....!బాబోయ్.......

    శృతి ఆలోచన ఈ భయంతో ఆపైకి పోలేదు.

    "ఏం చోద్యమే నాతల్లీ!" అని సర్దుతున్న సామాను వదిలేసి సీతమ్మ బుగ్గలు నొక్కుకుంది.

    "చోద్యమా! ఇప్పుడే మయింది?" అంది శృతి.

    "రాత్రేగదే ఇవతలి చెంబుతీసి అవతల పెట్టనన్నావు. ఇప్పుడేమో నాతోపాటు సామాను సర్దుతున్నావు." అంది సీతమ్మ.

    "ఊరికే అలా అన్నాను. పెద్దదాని వయిపోయావు కదమ్మా! నేను పనిచేసి నీకు శ్రమ తగ్గించాల్సిందిపోయి చిన్నపిల్లలా అన్నింటికి అడ్డుతగలటం బాగుండదుకదమ్మా!" సామానులు గోతాంలో సర్దుతూ అంది శృతి.

    వీళ్ళమాటలు విన్న సిద్దార్థ "ఏదో మహాప్రళయ రాబోతున్నది!" అన్నాడు నవ్వుతూ.

    "అ...మరే ప్రళయం ముంచుకొచ్చిన తర్వాతచేసే దేముందని ముందే జాగ్రత్త పడుతున్నాను." తనూ నవ్వుతూ అంది శృతి.

    "పిచ్చిపిల్ల! ఊరకే గయ్యిగయ్యి మంటుందిగాని మనసులో ఏమీ వుండదు."

    "నీకు తెలియదమ్మా, కారణం లేకుండా చెల్లాయి ఇవతలి చెంబు తీసి అవతల పెట్టదు."

    "కారణం వుంది సరేనా?"

    "ఒప్పుకున్నావుకదా! సరే ఆ కారణంకూడా చెప్పు."

    "తర్వాత బాధపడిప్రయోజనం లేదురా అన్నాయ్."

    "బాధపడనులే చెల్లమ్మా! కానియ్ కానియ్."

    శృతి తల్లి వేపు తిరిగి "అమ్మా! అన్నయ్య నిన్ననాతో చెప్పింది మర్చిపోయి, చెప్పమంటున్నాడు. ఇప్పుడు అసలు విషయం చెప్పాననుకో, ఏమీ తెలియనట్లు భుజాలు తడుముకుని నేనెప్పుడు చెప్పాను! అన్నా అనవచ్చు. అయినా, చెప్పు అన్నప్పుడు చెప్పడం నా ధర్మం. అసలు నిన్న ఏం జరిగిందంటే అమ్మా! అన్నయ్య శ్రీదేవి కలిసి....."

    "అబద్ధం. అబద్ధం" శృతి మాటలకు అడ్డువచ్చి అరిచాడు సిద్దార్థ.

    "ఓయ్. ఓయ్ నే అబద్ధం ఆడుతున్నానా?" వస్తున్న నవ్వుని బిగబెట్టుకుని అంది శృతి.

    "శుద్ధ అబద్ధం."

    "శుద్ధ నిజం."

 Previous Page Next Page