క్షణాలు భారంగా దొర్లుతున్నాయి. నిర్ఘాంతపోయిన ప్రధానే తొలిగా తేరుకున్నారు. తమను తాము నిభాయించుకుని, యధాస్థితికి వచ్చి మందహాసం చేశారు.
కలిగిన అసౌకర్యానికి ప్రధానికి అందరి తరపున ఒక వృద్ధ జర్నలిస్టు సారీ చెప్పాడు.
మాటమీరిన కుర్ర జర్నలిస్టు బిక్కచచ్చి తల వాల్చుకున్నాడు!
ఒక్కమాటతో, అసలు సమస్యలను ప్రక్కకు నెట్టి కొత్త సమస్యను కొనితెచ్చుకున్నట్టయింది పాత్రికేయులకు. ఒక్కని వల్ల అందరికీ...
ప్రతి వ్యక్తికీ సొంత భావోద్రేకాలు ఏవో కొన్ని వుండడం సహజం. అలా అని ఎవరి అభీష్టం మేరకు వారు అతిగా ప్రవర్తిస్తే ఆవలి వారి స్వేచ్చకు గౌరవానికి భంగం కలిగే పరిస్థితులు ఏర్పడతాయి. అదే జరిగిపోయింది ఇంతకు ముందు.
ఇప్పుడు ప్రధాని జరిగినదాని గురించి ఆలోచించడం లేదు. జరగవలసిన దాని గురించే!
పత్రికల వారికీ తమకూ మధ్య ఏ విధమైన పొరపొచ్చాలు పొడచూపకుండా, అందరినీ సంతృప్తిపరచి ప్రెస్ కాన్ఫరెన్స్ ను ప్రస్తుతానికి ముగించాలనే ప్రధాని ఆలోచన.
"ఎస్...యస్! మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ తప్పక ప్రత్యుత్తర మిస్తాను. జవాబు చెప్పకుండా దాటవేయడానికి కాదుకదా పత్రికా గోష్ఠిని ఏర్పరచింది!
ఇతఃమునుపే మనవి చేశాను, ఈ దేశ సమస్యల గురించి ఒక అవగాహన అంటూ వచ్చిన తరువాతనే ఏ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోజించిమరీ అమలుపరుస్తాను. అలా అని అంతవరకు సమస్యలను మరవడం గాని, నాన్చడం కాని జరగదు. నిర్దిష్టమైన తాత్కాలిక చర్యలు అవసరం. సంబంధిత అధికారులకు ఈ సమస్యల విషయంలో కొన్ని ఆదేశాలు ఈపాటికే జారీచేయడం జరిగింది.
ఈ దేశం నా ఒక్కడిదే కాదు. ఎదుర్కొంటున్న సమస్యలు ఏ ఒక్క వ్యక్తికొ, ప్రాంతానికో, పార్టీకో పరిమితం కావు. దేశ భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని, దేశ సుస్థిరతకోసం ప్రయత్నించవలసిన బాధ్యత మాది, మీది, మనందరిదీ! కాదా? ముఖ్యంగా కలం బలం గల మీరు దేశం ఎదుర్కొంటున్న సమస్యలను గోరంతలు కొండతలుగా ఎత్తి చూపడమే కాదు, వాటి పరిష్కార మార్గాలను సయితం సూచించాలి. ఔనా? అంతేకాదు. ప్రజలను చైతన్యమంతం చేయవలసిన బాధ్యత కూడా మీ భుజస్కంధాలపై వున్నదనే విషయాన్ని విస్మరించ కూడదు! ఏమంటారు?"
అంటూ ప్రధాని వారి వారి ప్రశ్నలన్నింటికీ కూడా క్లుప్తంగా జవాబులు చెబుతూనే, పత్రికలవారిని కూడా భాగస్వాములను చేశారు.
ఆయన మేధావి! తెలివిగల ప్రధానిగా తమను తాము నిరూపించుకున్నారు.
ఆయన ప్రతి వాక్కులో చిత్తశుద్ధి, దూరదృష్టి ప్రతిధ్వనించాయి.
సమస్యల పరిష్కారంలో ప్రధానికి తమవంతు పూర్తి సహకారాన్ని ఇస్తూ, ప్రజలను చైతన్యమంతులను చేయవలెనని పత్రికా ప్రతినిధులు అందరూ నిర్ణయించుకున్నారు.
తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ సత్ఫలితాన్నిచ్చింది. ప్రధానిని పత్రికలవారిని సన్నిహితం చేసింది.
రేపటి గురించి ఆలోచిస్తూ, అందరూ లేచారు.
"ఆఖరి ప్రశ్న......." అందరిలో వెనుకగా కూర్చున్న వ్యక్తి ఠక్కున లేచాడు తక్కిన పత్రికా ప్రతినిధులంతా అతని వంక గుర్రుగా చూశారు.
అప్పటివరకు రాలేదు ఏమీ అడగకుండా మౌనంగా కూర్చుని, అంతా సజావుగా జరిగిపోయిందని అందరూ సెలవు తీసుకోవడానికి సిద్ధంగా వున్నప్పుడే ప్రశ్న గుర్తుకు వచ్చిందా?
అతను ఇరువదయిదేండ్ల యువకుడు. భుజాన్ గుడ్డసంచి వ్రేలాడుతున్నది. ముఖాన కళ్ళజోడు. వేసుకున్నది లాల్చి, పైజమా. పేరు ఆనంద్. 'జగజ్యోతి' పత్రిక రిపోర్టరు. అసలు అతని వాలకం చూస్తేనే అతనొక జర్నలిష్టని తెలిసిపోతుంది!
"ప్లీజ్, ప్రొసీడ్, అండ్ ఆల్ ఆఫ్ యు కెన్ సిట్ కంఫర్ట్ బుల్లీ" అంటూ తిరిగి ప్రధాని తన సీటులో కూర్చున్నారు.
ప్రధాని అలా కూర్చోవడంతో ప్రతినిధులంతా మరల తమ సీట్లలో ఆసీనులయ్యారు.
అందరూ మౌనం. నిశ్శబ్దం.
"అడగండి -మీరేదో ఆఖరి ప్రశ్న అడుగుతానన్నారు!" చిరునవ్వుతూ అన్నారు ప్రధాని.
"సర్..." గొంతు సవరించుకున్నాడు ఆనంద్.
"...మాజీ దివంగత ప్రధాని అమరేంద్రగారి కేసు ఇప్పటి వరకు తేలలేదు. అసలు అది హత్య? లేక హఠాత్మరణమా? దర్యాప్తు ఎవరు చేస్తున్నారు? దర్యాప్తులో ఏదన్నా బ్రేక్ త్రూ వచ్చిందా?" ప్రశ్నల వర్షం కురిపించినా, అవన్నీ స్థూలంగా ప్రధాని అమరేంద్ర కేసుకు సంబంధించినవే.