Previous Page Next Page 
13... 14.... 15 పేజి 12


    "నా మిత్రురాల్ని మోసం చేస్తున్నాను కాబట్టి" మనసులో అనుకుంది.

    మాటల్లోనే ఇల్లొచ్చింది. "రా కాఫీ తాగి వెళ్దూగాని" ఆహ్వానించింది లక్ష్మి.

    "వద్దులే. బయటకొచ్చి చాలా సేపయింది. ఇంటికి వెళ్తాను. అన్నట్టు అసలు విషయం చెప్పటం మర్చిపోయాను. ప్రహసిత్ అని ఒక  టెన్నీస్ ప్లేయరున్నాడు. పేరు విన్నావా?"

    మెట్లమీద నుంచి తూలిపడబోతూ అతి కష్టంమ్మీద నిలదొక్కుకుంది లక్ష్మి. ప్ర.....హ....సి....త్.

    ఆమెలో కలుగుతున్న సంచలనాన్ని మధూహ గుర్తించలేదు. తన ధోరణిలో చెప్పుకుపోతోంది. "చాలా స్మార్ట్ గా  వుంటాడ్లే కుర్రవాడు. పాపం ఎవరో  'లక్ష్మి' అనే అమ్మాయిని చూసి మొదటి చూపులోనే ప్రేమించాడట. చాలా  సిన్సియర్ ప్రేమలాగే  కనపడుతూంది. ఆమెకోసం టెన్నీస్ మానేశాడు. అంత నిజాయితీగల ప్రేమ దొరకటం కష్టమే అనుకో. ఈ రోజుల్లో అయితే దాదాపు అసాధ్యమే....."

    "ఇప్పుడు..... ఇప్పుడు ఆ ప్రసక్తంతా దేనికి?" వణుకుతున్న కంఠంతో అడిగింది లక్ష్మి.

    మధూహ నవ్వింది. "అతడినుంచి ఒక రహస్యం చెప్పించటానికి ఆ లక్ష్మి ఫోన్ నెంబరు నాకు తెలుసని చెప్పి నీ నెంబర్ ఇచ్చాను. పైగా మా పత్రికలో సీరియల్ వ్రాస్తున్నావని  కూడా చెప్పాన్లే. నీకు ఫోన్ చేస్తాడేమో. నీవా లక్ష్మివి కాదని చెప్పి ఫోన్ పెట్టేయ్. ముందు చెప్పకపోతే కంగారు పడతావని పరుగెత్తుకు వచ్చాను. వెళ్తానేం....." అని వెళ్ళిపోయింది.

    లక్ష్మి నిశ్చేష్టురాలైపోయింది. దేన్నైతే  దూరంగా వుంచాలనుకుందో అది ఈ రకంగా వస్తుందని ఊహించలేదు. ఎలా.....ఇప్పుడెలా?

    లోపల్నుంచి ఫోన్ మోగుతున్న శబ్దం ప్రారంభమైంది.

    వేల వేల గంటలు చెవిదగ్గర ఒకేసారి మ్రోగిస్తే వినిపించే శబ్దంలా వున్నాదా ఫోన్ శబ్దం!

    ఆమె ఎంతసేపు ఎత్తకపోయినా అది అలా  మ్రోగుతూనే వుండేట్టుంది.

    నిస్సహాయంగా  ఆమె రిసీవరు ఎత్తింది. తన చెయ్యి కంపించటం ఆమెకు స్పష్టంగా తెలుస్తోంది! రిసీవరు చెవి దగ్గర వుంచుకుని మాట్లాడకుండా వుండిపోయింది.

    అట్నుంచి '....హలో' అని వినపడింది.

    ఆమె మాట్లాడలేదు.

    "హలో.....హలో...." అట్నుంచి విసుగ్గా అరుస్తున్నారు. కంఠం అనుమానం వచ్చి, "హలో" అంది నెమ్మదైన స్వరంతో.

    'కాల్ గ్యాస్ కంపెనీనుంచి మాట్లాడుతున్నామండీ. మా సిలిండర్ అందిందా అట్నుంచి ఎవరో ఎంక్వయిరీ చేస్తున్నారు.

    "అందింది" అని పోన్ పెట్టేసి కుర్చీలో కూలబడింది. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించినట్టు అయింది.

    "అప్పటివరకూ ఫోన్ - 'అతడి' - దగ్గిర్నుంచేమో అని వణికిపోయిన ఆమె అది అతడి దగ్గిర్నుంచి కాదని తెలిసి నిరాశ చెందుతోంది.

    మనసనేది ఎంత చిత్రమయింది!


                                        6


    మధూహ ఇంటికొచ్చేసరికి ఇల్లు బంధువుల్తో కిటకిటలాడుతోది.ఆమె  గుండె గుభిల్లుమంది. అసలే  డబ్బుకి కటకటలాడుతూన్న ఈ సమయంలో పులిమీద పుట్రలా ఈ ఖర్చొకటి.

    ఈ బంధువులనేవారు వస్తున్నట్టు ముందు చెప్పరు. అవతలివాళ్ళ ఇబ్బంది వున్నదేమో అని ఆలోచించరు. వచ్చిపడిపోతారు. తమ స్వంత ఇల్లులా వ్యవహరిస్తారు. ఈ కరువు రోజుల్లో అవతలివాళ్ళకి  కష్టమేమో అన్న  ఆలోచనే రాదు. తమ పక్కలు వాళ్ళకి ఇచ్చి మరోచిన్న గదిలో సర్దుకోవటం, డబ్బుకోసం వెతుక్కోవటం, అవతలివాళ్ళకి ఏ లోపమూ రాకుండా చూడటం కోసం మరిన్ని ఇబ్బందులు పడటం.....ఇదంతా అనుభవిస్తేనే తెలుస్తుంది.

    అవతలివాళ్ళు ఇవన్నీ గుర్తిస్తారా? ఒకవేళ గుర్తించినా, గుర్తించనట్టు కనపడతారా? పైకి మామూలుగానే వుంటారు. నట్టింట్లో కూర్చుని బోల్డన్ని కబుర్లు చెపుతారు. పిల్లలకు శలవులిచ్చారు కాబట్టి వచ్చామనో, ఫలానా ఆఫీసులో పనివుందని వచ్చామనో చెప్తారు. అలా రావటం తమ జన్మహక్కు అన్నట్టు  చాలా  మామూలుగా వచ్చి చేరిపోతారు.

    మధూహ వుంటున్నది పట్నం కాబట్టి ఈ బంధువుల తాకిడి ఎక్కువే. ఆ కుటుంబానికి ఈ బాధ ఎప్పటినుంచో వుంది. అందులోనూ వారిది రెండుగదుల ఇల్లు అవటంతో ఆ ఇబ్బంది మరీ కొట్టొచ్చినట్టు కనపడేది.

    ఈ బాధని ఎలా తట్టుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు, ఆమెకు మరొక కొత్తకోణం స్ఫురించింది. చాలాబాధాకరమైన కొత్తకోణం!

    తనూ మరొకరికి బంధువే.

    తను పరీక్షలకు వేరొకవూరు వెళ్ళాల్సి వొచ్చినప్పుడు, ఆ వూరిలోవున్న బంధువుల ఇంటికి వెళ్ళి వారం పదిరోజులు వుండటం చెల్లెలి శలవులకు కుటుంబం మొత్తం మామయ్య గారింటికి వెళ్ళి మకాం వెయ్యటం గుర్తొచ్చాయి. ఇప్పుడు ఈ కోణంలోంచి ఆలోచిస్తే, అత్తమ్మ అయిదింటికే తమకోసం లేచి ఇంటెడు చాకిరీ చేయటం మనసు చివుక్కుమనేలా చేసింది! తమలాటి వాళ్ళు పదిమంది వుంటే ఒక ఆ ఇల్లాలికి జీవితంలో సుఖసంతోషాలు వుండవనే అనిపించింది. అందుకే ఆ శలవులకి వాళ్ళింటికి వెళ్ళటం అనే ప్రోగ్రాం విరమించుకుంది. మామయ్య నిష్ఠూరంగా వుత్తరం వ్రాసాడు. అయినా తను వెళ్ళలేదు. ఆయన తెలంగాణా ప్రాంతంలో ఒక బీదరైతు. ఆయనకు ఒకడే  కొడుకు.

    .....శలవులకు వెళ్ళకపోవటం సరే. మానేయగలదు. కానీ పక్కవూర్లో ఏదైనా అవసరం వొచ్చినప్పుడు ? అవసరం వొచ్చి వారం రోజులు వుండవలసి వచ్చినప్పుడు?

    మధ్యతరగతి, క్రింది తరగతి కుటుంబాల్లో అన్నేసి రోజులు హొటళ్ళలో వుండటమన్నది జరిగే పనేనా? ఇచ్చిపుచ్చుకునే బార్టర్ సిస్టమ్ కోసమే కదా ఈ  బంధువులూ, స్నేహితులూ.....ఇచ్చిపుచ్చుకునే ఆతిథ్యమూ, నలుగురు ఇంటికొచ్చారన్న ఆనందమూ..... ఇదేగా  మన వ్యవస్థలో వున్న గొప్పతనం.....

    కానీ ఇందులో మళ్ళీ మరొక చిక్కున్నది. రాష్ట్ర కార్యాలయాలు, జిల్లా ఆఫీసులు వున్న వూర్లకి 'వచ్చేజనం' తాకిడి ఎక్కువ వుంటుంది. దీనినెలా బ్యాలెన్స్ చేయటం? కొంతమందికి ఇది చాలా చిన్న విషయంగా కనపడవచ్చు. 'నాలుగురూ ఇంటికొస్తే ఇల్లు కళకళలాడుతుంది. దానికి ఇంత రాద్దాంతమెందుకు' అనొచ్చు. కానీ అనుభవిస్తే తెలుస్తుంది ఆ కష్టం! ఈ కష్టం రెండురకాలకి సంబంధించినది. ఒకటి డబ్బు. రెండు పని. ప్రస్తుతం మధూహ సమస్య మొదటిదే.

    ఆమె ఈ రకమైన సమస్యతో సతమతమవుతూండగా, ఆమె మామయ్యా, తన ప్రవర్తన ద్వారా చక్కటి పరిష్కారాన్ని చెప్పేడు.

    ఆయన పేరు చంద్రయ్య. తెలంగాణా ప్రాంతంలో ఏదో మారుమూల ప్రాంతంలో నాలుగెకరాలు పొలం వుంది. కొడుకు ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. మధూహ ప్రతి సంవత్సరాంతపు శలవులకీ వెళ్ళేది అక్కడికే. ఆయన మాత్రం పట్నం ఎప్పుడూ రాడు.

    ఒక్కసారి మాత్రం వచ్చాడు. ఏదో రెవెన్యూ పనిమీద!

    పని అయ్యాక వెళ్తూ వెళ్తూ మధూహ చేతిలో రెండొందలు పెట్టి "వుంచమ్మా. ఎందుకయినా పని చేస్తుంది" అన్నాడు. మధుహ దెబ్బతిన్నట్టు చూసి, "అదేమిటి మామయ్యా" అంది.

    "అనుకోకుండా రావాల్సి వచ్చింది. నీక్కూడా కష్టం కలుగకూడదు కదా"

    మధూహ మరింత దెబ్బతిని, "అంటే.....ప్రతి సంవత్సరమూ మేమంతా నీ ఇంటికి రావటం నీకూ కష్టంగానే వుందన్నమాట" అంది నిష్టూరంగా.

    "మీ  అమ్మ నా చెల్లి. పుట్టింటికి రావటం ఆవిడ హక్కు. నేనలా కాదు. స్వంత పనిమీద పట్నం వచ్చాను. నా వల్ల మీకు డబ్బు ఖర్చు. పని ఎక్కువ. దీనంతటికీ వెల కట్టి ఇస్తున్నాననుకోకు. అలా ఇవ్వటం ద్వారా నన్ను నేను నియంత్రించుకుంటున్నానన్న మాట"

    అతడి మాటల్లో ఆమెకో గొప్పసత్యం అర్థమైంది.

    చంద్రయ్య నవ్వేడు. ".....ఇవన్నీ చేదు సత్యాలమ్మా. ఎవరూ అర్థం చేసుకోలేరు. ఒక శలవురోజుని మనం ఇంకొకరి ఇంటికి వెళ్ళి సంతోషంగా గడపాలనుకుంటున్నామంటే, మరొక శలవురోజుని వారికోసం ఖాళీగా వుంచుకోవాలి. అప్పుడు 'నేను పనితో చచ్చిపోతున్నాను' అని వాపోయే హక్కు మనకి లేదు. ఇది  ఇష్టంలేకపోతే అదీ మానెయ్యాలి."

    ఆమె తన మామయ్య ఒక బీదరైతుగానే తెలుసు. కానీ ఇంత విశిష్టమైన వ్యక్తిత్వం వున్నవాడిగా తెలీదు. కృష్ణాజిల్లా నుంచి తెలంగాణాకి వలసవెళ్ళిన వ్యక్తి ఆయన. ఆ మాటలవల్ల ఒక పాఠం నేర్చుకుంది. ఆ తరువాతెప్పుడో పత్రికఫీసు పనిమీద వేరేవూరు వెళ్ళి మూడురోజులు వుండవలసి వచ్చింది. వాళ్ళు  నెలకి ఓసారి పనిమీద పట్నం వచ్చి, తమ ఇంటిలో మకాం పెట్టేవారే. ఆమె పని పూర్తయి తిరిగి వచ్చేస్తూ వాళ్ళ పిల్లల చేతిలో రెండొందలు పెట్టింది.

    "ఇదేమిటమ్మా!" అన్నాదా పిల్ల తల్లి.

    "ఈ వూరిలో మీరున్నారు కాబట్టి సరిపోయిందండీ. లేకపోతే ఈ కరువు రోజుల్లో హొటల్లో......అందులోనూ ఒంటరిగా వుండటమంటే మాటలా? ఏదో నా  తృప్తి కోసం" అంది మధూహ. ఆవిడ తేరుకుని నిష్ఠూరాలాడక ముందే అక్కడనుంచి వచ్చేసింది. చాలా ఆశ్చర్యకరంగా ఆ ఇంటినుంచి పట్నం వచ్చి తన  ఇంట్లో మకాం పెట్టేవాళ్ళ సంఖ్య ఆ రోజు నుంచీ అనూహ్యంగా తగ్గిపోయింది.

    తల్లిమాత్రం ఇంటికొచ్చాక సాధించింది. "అదేమిటమ్మాయ్....బంధువులన్నాక ఆ మాత్రం రాకపోకలుండవా? మరీ ఇలా మడిగట్టుకు బ్రతుకుతానంటే ఎలా?" అంటూ.

    "నాకేం ఫర్వాలేదమ్మా. నలుగురూ ఇంటికొచ్చి కళకళలాడుతూంటే నాకూ సంతోషమే. కానీ ఎముకలు విరగ్గొట్టుకునేలా వారికోసం చాకిరీ చేసే నీ గురించే నా ఆలోచన" అంది మధూహ. తల్లి మాట్లాడలేకపోయింది. 'ఈ మాత్రం ఇంగితజ్ఞానం ఇంట్లో మగాళ్ళకుంటే ఎంత బావుణ్ణు' అనుకుందేమో మరి.

    గతాన్ని తల్చుకుంటూ మధూహ ఇంటిలోకి ప్రవేశించేసరికి మామయ్య ఎదురొచ్చాడు. ఆ కుటుంబాన్ని చూసి నిజంగానే సంతోషించింది. చంద్రయ్య నవ్వుతూ "తప్పలేదమ్మాయ్. ఈసారి మీ ఇంట్లో మా కుటుంబం మొత్తం పది రోజులకు పైగా మకాం పెడదామనుకుంటున్నాం......"అన్నాడు.

    మధూహ నొచ్చుకుంటూ, "ఛా. అవేం మాటలు మామయ్యా" అంది. చంద్రయ్య తనొచ్చిన విషయం చెప్పాడు. అతడి భార్యకు తరచూ జ్వరం వస్తోంది. అక్కడ పల్లెటూళ్ళో ఆయుర్వేద డాక్టరు ఆర్నెల్లనుంచీ ట్రీట్ చేసి, ఇక లాభంలేదనీ పట్నం తీసుకువెళ్ళమనీ చెప్పాడు. అందుకే పెళ్ళాం బిడ్డలతో వచ్చాడాయన.

    అత్తని చూసి ఆశ్చర్యపోయింది మధుహ. లక్ష్మీదేవిలా కళకళలాడుతూ వుండేది. అస్థిపంజరంలా తయారైంది. అది సామాన్యమైన మలేరియానో, టైఫాయిడో అయివుండొచ్చు కానీ సరిఅయిన ట్రీట్ మెంట్ లేక జ్వరం ఆమెని పీల్చిపిప్పి చేసినట్టు కనపడుతోంది.

    ఆ సాయంత్రం చంద్రయ్య ఆమె చేతిలో రెండువేలు పెట్టాడు. ఆమె బాధపడి "ఇదేమిటి మామయ్యా" అంది.

    "ఆస్పత్రి ఖర్చులూ, డాక్టరు ఖర్చులూ అన్నీ నువ్వే చూసుకోవాలమ్మా. పల్లెటూరివాడిని. నాకీ విషయాలన్నీ తెలియవు" అన్నాడు.

    "కానీ ఇంత డబ్బు......"

    "ఒక ఎకరం పొలం అమ్మేసానమ్మా....."

    మధూహ స్థాణువైంది.

    "మీ అత్తమ్మ కన్నా నాకా పొలం ఎక్కువకాదు"

    అదీ నిజమే అనిపించింది. కానీ..... ఉన్న నాలుగెకరాల్లో ఒకటి అమ్మెయ్యటమంటే..... ఆమె మనసంతా చేదుగా అయిపోయింది. "సాయంత్రం వెళదాం మామయ్యా. మన ఇంటి పక్కనే మంచి డాక్టరున్నార్లే. ఆయన క్లినిక్ కి వెళ్దాం" అంది. 

 Previous Page Next Page