Home » Yandamuri veerendranath » దుప్పట్లో మిన్నాగు


    ఆమె కోపానికి మరింత ఆజ్యం పోస్తున్నట్టుగా రవిశంకర్ ఆ రోజు గది వదిలి వెళ్లలేదు. పైగా డ్రమ్స్ వేసుక్కూర్చున్నాడు. మద్దెల వాయిస్తున్నట్టు వాటిమీద నుంచి వచ్చే 'దబ్ దబ్' శబ్దానికి ఆ ఇంటి గోడలు పత్రిధ్వనించసాగాయి.
    సాయంత్రం ఆరయింది. భర్త ఇంకా రాలేదు. రాధ కాలుకాలిన పిల్లిలా హాల్లో పచార్లు చేయసాగింది. గదిలో అతడు డ్రమ్స్ మీద కొడుతున్న బీట్స్ ఆమెకి తన గుండెలమీద కొడుతున్నట్టే వుంది.  కొంచెం సేపయ్యాక ఇక కోపం  ఆపుకోలేక  తనే వెళ్ళి అతడిని నాలుగూ దులిపేద్దమన్న ఉద్దేశ్యంతో అతడి గది దగ్గరికి వెళ్ళింది. వేసివున్న  తలుపు కొట్టబోయి- పక్కకిటికీ లోంచి లోపలి చూసింది.
    అంతే!
    ఆమె ఒంటినిండా ఒక్కసారిగా చెమట పట్టింది. కాళ్ళు వణక సాగాయి. గిటారు పక్కనే గ్లాసులో పచ్చటి ద్రవం మిలమిలా మెరుస్తూ కనబడుతూంది. వాయిస్తూ మధ్యలో దాన్ని తీసుకుని ఒక్క గుక్క తాగి పక్కన పెట్టి  తన పనిలో నిమగ్నమవుతున్నాడు. ఈ ప్రపంచం అంతా తనదే అన్నంత ధీమాగా ఆ సాయంత్రాన్ని అనుభవిస్తున్నాడు.
    ఆమె గాలిలా వచ్చి తన బెడ్ రూమ్ లో పక్కమీద వాలిపోయింది. డ్రింక్ చేయటం ఆమెకి కొత్తకాదు. బ్యాంకులో ఏవైనా ఫంక్షన్సు జరిగినప్పుడు భర్త ఒకటి రెండు పెగ్ లు తాగి రావటం అలవాటే. ఏదో అనాలి కాబట్టి చిరాకుపడేది కానీ- ఆమెకీ అంతర్గతంగా తన భర్త 'అప్పుడప్పుడు' అలా రావటం ఇష్టంగానే వుండేది. అలా వచ్చినప్పుడు మామూలుకన్నా ఎక్కువ ఎనర్జీతో అతడు మేల్కొని వుండేవాడు. ఇల్లా- సత్రమా? ఇంటిలోనే ఈ కుర్రవాడు బ్రాందీషాపు పెట్టేశాడు. ఇంకా నయం తనే ముందు చూసింది కాబట్టి సరిపోయింది. కానీ తమింటికి ఏ బంధువులో వచ్చినప్పుడు ఈ విషయం బైటపడి వుంటే ఏమై వుండేది?
    ఆమెకి హఠాత్తుగా మరో విషయం జ్ఞాపకం వచ్చి ఒళ్ళు గగుర్పొడిచింది.
    ఇంటిలో తమిద్దరే వున్నారు. అతడు తాగి వున్నాడు.
    బైటంతా చీకటి.
    టైమ్ ఏడు కావస్తూంది.
    విసిరేసినట్టు ఇళ్ళున్న ఆ కాలనీలో .....ఒక ఇంటిలో ఏం జరిగినా ఇంకో ఇంటివాళ్ళకి అసలు తెలీదు. ఆమె కిటికీ తెర తొలగించి ఎదురింటివైపు చూసింది. ఎదురింటి పరంధామయ్య ఇటే చూస్తున్నాడు. అతడు రిటైరయి సంవత్సరం కావస్తూంది. ఎప్పుడు రాధ బయటకొస్తుందా అని చూడటమే ప్రస్తుతం అతడి వ్యాపకం. ఆమె విసుగ్గా కిటికీ మూసేసింది. ఆమెకి భర్తమీద కోపం వచ్చింది ఇంత రాత్రివరకూ అతడేం చేస్తున్నాడు?
    చేతికందిన ఏదో పుస్తకం తీసుకుని ఆమె చదవటం ప్రారంభించింది. భర్త తొందరగా వస్తే సెకెండ్ షోకి వెళ్దామని ఆమె అనుకుంది. కానీ అతడిప్పుడప్పుడే వచ్చే సూచనలు కనబడటంలేదు.
    ఆమె చదువుతున్నది ఒక ప్రేమ నవల. హీరో మాటిమాటికీ హీరోయిన్ ని రెక్కపట్టుకుని దగ్గిరకు లాక్కుంటున్నాడే తప్ప ఇంకేమీ చెయ్యటంలేదు. హీరోయిన్ రోషంగా హీరోవైపు చూస్తూందే తప్ప మనసులో మాట చెప్పటం లేదు. ఇద్దరిలో ఏ ఒక్కరు అది చేసినా నవల పూర్తయి ఉండేది. చెయ్యకపోబట్టి మూడొందలు పేజీల్నుంచి సాగుతూంది.
    ఏదైనా పుస్తకం చదివేటప్పుడు బోర్లా పడుకుని, రొమ్ముల క్రింద దిండు పెట్టుకుని కాళ్లు గాలిలో వూపుతూ చిన్న పిల్లలా చదవటం ఆమెకి అలవాటు. అలా చదువుతూ తలుపు చెక్కవైపు మామూలుగా ఆమె తల తిప్పి చూసింది. తమ గదికీ  అతడి గదికీ మధ్యనున్న తలుపు అది!
    చప్పున ఏదో అనుమానం వచ్చి ఆమె తలుపు దగ్గిరకి వెళ్ళింది చూడటానికి తలుపుకి కన్నాలు ఏమైనా ఉన్నాయోమోనని పరీక్షించింది. ఆమె గుండె ఆగినంత పని అయింది. కుడివైపు రెండు చెక్కలూ కలిసే చోట చిన్న రంధ్రం  వుంది. ఆమె అవతలి గదిలోకి చూసి షాక్ తగిలినదాన్లా వెనక్కి జరిగింది. ఆమె మొహం ఎర్రగా  కందిపోయింది. లైట్ ఆర్పేసి ముందుగదిలోకి వచ్చి సోఫాలో కూర్చుంది. తన  గుండె చప్పుడు తనకే విన్పిస్తూంది. సర్దుకోవటానికి కొంచెం సేపు  పట్టింది. ఇంకానయం. దీనిసంగతి తనే ముందు గమనించింది. లేకపోతే - రాత్రి చాలాసేపటివరకూ లైటు వేసుకొని వుండే తమ అలవాటుతో ......ఛా.....ఆపైన మరి ఆలోచించలేకపోయింది.
    కొవ్వొత్తి తాలూకు మైనం లోపల్నుంచి తీసుకొచ్చి ఆ రంధ్రాన్ని మూస్తుంటే ఇంతలో తలుపుకొట్టిన చప్పుడయింది. భర్తేమో అనుకుని ఆమె తొందరగా వెళ్ళి  తీసింది. కానీ- అతడు!!! ఆమె అడుగు వెనక్కి వేసి కటువుగా "ఏం కావాలి?" అని అడిగింది.
    "నా కోసం ఎవరన్నా వస్తే రూమ్లో కూర్చోమనండి. అరగంటలో వస్తాను పెయింట్ ట్యూబ్ అయిపోయింది. ఇదిగో తాళం చెవి" అని ఆమె ఏదో అనబోయే లోపులో తాళం చెవి ఆమె చేతుల్లో  పెట్టి మెట్లు దిగి వెళ్ళిపోయాడు ఇదంతా వేషం అని ఆమెకి తెలుసు. తనో పెయింటర్ ని అని తెలియ చెప్పాలనే ఆ ప్రయత్నం. తాళం చెవి మిషమీద తనని లోపల్నించి పిలవటం కోసం అదో ఎత్తు. అన్నిటికన్నా ముఖ్యంగా కీ అందించేటప్పుడు కావాలని చెయ్యి తాకించటం......
    అతడిమీద ఆమెకి ద్వేషం క్షణక్షణానికి పెరిగిపోతూంది. అతడు వచ్చి ఇంకా పూర్తిగా ఇరవై నాలుగు గంటలు కాలేదు. ఇంత తక్కువ సమయంలో ఎన్నో సంఘటనలు...... జరిగినవన్నీ ఆమెని ఇరుకున పెట్టేవే. ఆలోచనలతో ఆమె నిద్రలోకి జారుకుంది. అప్పటికి తొమ్మిది కాలేదు.
    అకస్మాత్తుగా చప్పుడయి నిద్రలోంచి మేలుకుంది. అతడు లోపలి వస్తూ తాళంచెవి" అన్నాడు. ఆమె లేవబోయింది కానీ.....
    అతడు దగ్గరికి రాసాగాడు. అతడి ఉద్దేశ్యాన్ని గ్రహించి ఆమె భయభ్రాంతురాలైంది. కిటికీమీద పెట్టిన తాళం చెవిని అతడు చూశాడు. కానీ, అటు వెళ్ళటంలేదు. ఆమె భుకాల్ని  రెండు చేతుల్తోనూ పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. అందులో భయంలేదు. ఆమె తన వస్తువు అయినట్టు ఆమె మీద తన  కెప్పట్నుంచో అధికారం వున్నట్టు ఆమెని  పైకి లేపాడు. సర్వశక్తులూ కూడగట్టుకుని గింజుకుంటూ ఆమె అరవటానికి ప్రయత్నించింది. కానీ అంతలో అతడి పెదవులు ఆమె నోటిని మూసేశాయి. అతడి దృఢత్వం ముందూ, బలం ముందూ ఆమె ఆటబొమ్మ అవుతూంది. ఆమెనుంచి విడివడకుండానే మోకాళ్ళ  క్రింద చెయ్యివేసి ఆమెని గాలిలోకి  లేపి మంచం మీద పడేశాడు. ఆమె స్ప్రింగ్ లాగా లేవబోయింది. అది గ్రహించినట్టు చేతితో నొక్కిపట్టి ఆమెని పూర్తిగా  ఆక్రమించుకున్నాడు.
    నిస్సహాయత నిండిన కంఠంతో ఆమె "వదులు-వదులు" అన్నది. అతడు  వినిపించుకోలేదు. అతడి చెయ్యి ఆమె నడుము వంపులోంచి క్రిందికి జారింది. అతడి మొహం మెడవంపు నుంచి క్రిందికి దిగింది. దాంతో షాక్ తగిలినట్టుయి, ఆ జలదరింపులోనే పక్కి  తిరగటానికి ప్రయత్నించి, ఆ ప్రయత్నంలో అతడి వంటికి మరింత దగ్గరయింది. ఇప్పుడు ఆమె ప్రతీ అమ్గానికీ తన ఉనికి తెలుస్తూంది. ప్రతీ అవయవమూ మెదడుకి తరంగాలు తరంగాలుగా కమ్యూనికేషన్ పంపుతూంది/ చల్లటి షవర్ నాలుగు వైపుల్నుంచీ ఒక్కసారిగా వంటిమీదకు జాలువారిన అనుభూతితో శరీరం వణికింది. ఏదో అఖాతం నుంచి శరీరం గాలిలో పైకి తెలిపోతూంది. అయితే అదంతా క్షణికం మాత్రమే! క్షణంలో ఆమె తెప్పరిల్లింది. అతడి మెడచుట్టూ పెనవేసుకున్న చేతుల్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుని, బలంగా అతడిని తోసేసింది. అతడు గాలిలో అదృశ్యమైపోయాడు ఆమెకు దుఃఖం వచ్చింది. తల దిండులో మొహం దాచుకుని వెక్కి  వెక్కి రోదించసాగింది.
    అంతలో బయట తలుపు చప్పుడయింది.
    ఆమె కళ్లు విప్పింది. నలగని పక్క...... చెదిరిన కాలని పరిహసించింది. వెళ్ళి  తలుపు గడియతీసింది. విశ్వనాధం నవ్వుతూ "ఏమిటి..... అప్పుడే నిద్రపోయావు? ఎంత సేపట్నుంచీ తలుపు తడుతున్నానో తెలుసా?" అన్నాడు. ఆమె  జవాబు ఇవ్వలేదు. ఈ లోపులో తిరిగి గేటు దగ్గిర చప్పుడయింది. రవిశంకర్ వస్తున్నాడు. ఆమె చప్పున కిటికీ దగ్గిర  తాళం చెవిని భర్తకి ఇస్తూ, "ఇది అతదికివ్వండి. ఇలా  అర్థరాత్రి  పూటా, తెల్లవారుజామునా వస్తే కుదరదని చెప్పండి" అంది. ఆ మాటలు అతడికి వినిపిస్తాయని ఆమెకి తెలుసు. వినిపించాయి కూడా! అతడు మాట్లాడకుండా కీ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు.విశ్వనాధం భార్యవైపు చిత్రంగా చూసి  లోపలికి నడిచాడు. ఆమె భర్తని అనుసరించింది.
    ఆ రాత్రి ఆమె ఆ ప్రసక్తి  ఎత్తలేదు కానీ, మరుసటిరోజు భర్త  ఆఫీసుకు వెళ్ళబోతూ భోజనం చేస్తూ ఉండగా "మీరెలాగైనా ఆ కుర్రవాడిచేత గది ఖాళీ చేయించాల్సిందే" అంది.
    మజ్జిగ కంచంలో పోసుకుంటూ విశ్వనాధం "ఎందుకు" అని అడిగాడు.
    "నా కిష్టంలేదంతే."
    "అదే, ఎందుకూ అని అడుగుతున్నాను."
    ఆమె వెంటనే జవాబు చెప్పలేకపోయింది.
    "అతడు నిన్నా, ఈవేళా నీపట్ల ఏమైనా చౌకబారుగా ప్రవర్తించాడా?"
    ఆమె మాట్లాడలేదు.
    "ఇంతకీ నువ్వు అంటున్నది అతడిని గది గది ఖాళీ చేయించి ఇంకెవరికయినా ఇద్దామానా? లేక అసలెవ్వరికీ ఇవ్వవద్దనా?"
    "ఇంకెవరికైనా ఇద్దాం."
    "ఇతడిని వెళ్ళపోమ్మనటానికి సరి అయిన కారణం వుండాలి కదా?" వేసుకుని స్కూటర్ తాళాలు తీసుకుంటూ అన్నాడు- "రాధా! నేను  నీలాగా సాహిత్యాన్నీ, మనుష్యుల మనసుల్నీ చదివినవాడిని కాదు. నాకుచెప్పటం సరీగ్గా రాదు. నిన్నటినుంచీ నిన్ను చూస్తున్నాను. నువ్వు ఒక రకమైన అబ్ సెషన్ తో బాధపడుతున్నావేమోనని నా ఉద్దేశ్యం. ఈ ప్రపంచంలో ఏ మనిషి  చెడ్డవాడు కాదు. అంతా మనం అనుకోవడంలో వుంటుంది. ప్రపంచం అంతా అంటుంది కాబట్టి మనమూ అలాటి దృక్పథాన్ని ఏర్పర్చుకోవాలని రూలేం లేదు. మనం ఏ  కోణంలోంచి అవతలివ్యక్తిని చూస్తామో ఆ కోణంలోనే అతడు కనబడతాడు. స్త్రీ అంటే పురుషుడికి భయపడాలి. కనీసం భయపడుతున్నట్టు నటించాలి. దూరంగా ఉండాలి అన్న మానసిక వ్యాధితో  నువ్వు భయపడుతున్నావేమో అని నా అనుమానం. నీ ఇన్ హిబిషన్స్ నుంచి ఒక్కసారి బైటకు రావటానికి ప్రయత్నించు. నీ కంటికి కనబడేదీ- దాని ఆధారంగా నువ్వు వూహించుకొనేదీ నిజం కాకపోవచ్చు. ఒకవేళ నిజం అయితే తప్పకుండా అతడిచేత గది ఖాళీ చేయిద్దాం . కానీ, నీ తరుపునుంచి ప్రయత్నం చెయ్యకుండా ఒక నిర్ణయానికి రావటం తప్పని నా అభిప్రాయం " అని ఆఫీసుకి వెళ్లిపోయాడు.
    ఆమె చిత్తరువులా నిలబడిపోయింది. భర్త ఇలా  మాట్లాడటం ఆమెకుషాక్. అసలు భర్తలో ఇంత అనలిటికల్ పవర్ వుంది అని ఆమె అనుకోలేదు కూడా. అతడు తననీ, తన ఘర్షణనీ ఇంతలా గమనిస్తున్నాడనేది ఆమెకి కొట్ట విషయం. ఇఅక్కడ మరో  విషయం కూడా గమనించాలి. ఆమెకూడా మూర్ఖపు  పట్టుదల వున్న మనిషేం కాదు. భర్త అలా మాట్లాడగానే కొద్దిసేపు ఆవేశపడింది కానీ, తరువాత అందులో లాజిక్ ఆలోచించింది. ఆలోచించేకొద్దిసేపు ఆవేశపడింది కానీ, తరువాత అందులో లాజిక్ ఆలోచించింది. ఆలోచించేకొద్దీ తను తీసుకున్న ఏక పక్షపు నిర్ణయాలు ఎంత అర్థరహితమైనవో తెలిసి సిగ్గేసింది.
    అప్పటికింకా పది అవలేదు. రవిశంకర్ తన గదిలోనే వున్నాడు.
    "లోపలి రావచ్చా?" అందామె, తలుపు దగ్గిర నిలబడి.
    అలా ఆమెని వూహించని అతడు కొద్దిగా విస్మయం చెందినా- ఆమె కంఠంలో ఏ విధమైన విసుగూ, కోపమూ కనిపించకపోయేసరికి ఉత్సాహంతో- "రండి.....రండి" అన్నాడు. ఆమె లోపలి అడుగుపెట్టి - అతడు వేస్తున్న బొమ్మవైపు చూసింది- ఆమెకి రంగుల మిశ్రమం గురించి ఏమీ తెలీదుగానీ ఏమీ తెలియని వాళ్ళకి కూడా బావుండేటంతగా బావుంది ఆ బొమ్మ.
    "మీరెక్కడ చదువుతున్నారు?" అని అడిగింది.
    "యూనివర్సిటీ నైట్ కాలేజీలో....." అన్నాడు. అదేగాక ఒక కమర్షియల్ కంపెనీలో పార్టుటైం పని చేస్తున్నాను".
    ఆమె అతడివైపు పరీక్షగా చూసింది. తనకన్నా రెండు మూడేళ్ళు చిన్నవాడేమో! బుగ్గలో పాలదనం ఇంకా పోలేదు. రఫ్ గా కనబడాలని కొద్దిగా గడ్డమూ, సైడ్  లాక్సూ పెంచినట్టు వున్నాడు. ఆమెకు నవ్వొచ్చింది. తమ ఊర్లో చదువుకుంటున్న తమ్ముడు గుర్తొచ్చాడు. వాడూ  ఇతనిలాగే వయసుకన్నా పెద్దగా కనబడాలని విశ్వప్రయత్నం చేస్తూ వుంటాడు. ఆమె దృష్టి గిటారూ, డ్రమ్స్ మీద పడటంతో అతడు ఇబ్బందిగా నవ్వి, "తెల్లవారుజామునే మీ నిద్ర డిస్టర్బ్ చేస్తున్నానా?" అని అడిగాడు.
    "లేదు- లేదు" అందామె. "మీరు ఎప్పుడు నిద్ర లేస్తున్నారోకూడా మాకు తెలియదు."
    "తెల్లవార్నే సాధన చేస్తే బావుంటుంది- అందుకే నాలుగింటికికల్లా లేచిపోతాను"
    అకస్మాత్తుగా థర్డు డైమెన్షన్ లో ఏదో కిటికీ రెక్క తెరుచుకొని ఒక్కసారిగా వెలుగు ప్రవహించినట్టు అనిపించిదామెకు. భర్త మాటలు జ్ఞాపకం వచ్చాయి. కొంతమంది పైకి ఎంతో మంచి వాళ్ళుగా, అమాయకులుగా కనబడతారు.  కొంతమంది రఫ్ గా, జీవితంపట్ల లక్ష్యం లేనివారుగా కనబడతారు.కానీ  తరచిచూస్తే ఎంత వైవిధ్యం! ఎప్పుడూ సిగరెట్ తాగుతూ, రాత్రి అవగానే  బాటిల్ విప్పే ఈ కుర్రవాడు, తమందరికన్నా రెండు రెట్లు ఎక్కువ పనిచేస్తాడు, పగలు ఉద్యోగం, రాత్రి చదువు, తెల్లవారు ఝామున  గిటారు ప్రాక్టీసు!
    జీవితంపట్ల ఒక నిర్దిష్టమైన అభిప్రాయంమ్ జీవితంలో ఒక గమ్యం  వున్నవాడు. గమ్యం వుండటం వేరు. దాన్ని సాధించటం కోసం కష్టపడటం వేరు  ఆ కష్టపడటంలో అతడికి సాటి ప్రపంచం మీద ఒక రకమైన నిరాసక్తత, నిర్లక్ష్యం ఏర్పడి వుండవచ్చు. దాన్ని అర్ధం చేసుకోలేకపోవటం తమ తప్పు.
    ఊకసారి ఈకమ్యూనికేషన్ గాప్ ని బద్దలుకొట్టేసరికి ఆమెకి అంతా మంచు విడిపోయినట్టు విడిపోయింది.
    "రేపు ఆదివారం. ఆయన కూడా వుంటారు- మా ఇంటికి లంచ్ కి  రావాలి అంది.
    అతడు మొహంలో ఆనందాన్ని ఏ మాత్రం దాచుకొనే ప్రయత్నం చెయ్యకుండా- "తప్పకుండా! మంచి భోజనం కోసం మొహం వాచిపోయాను" అన్నాడు స్వచ్చమైన నవ్వుతో.
    అతడు కథ పూర్తిచెయ్యగానే ఆ హాలులో ఒకరకమైన సంతృప్తి ఆవరించింది. ఏదో అస్పష్టమైన సంతృప్తి, ఇలా జరగబట్టి బావుంది అన్న సంతృప్తి.
    విజ్జూ అన్నాడు- "మిగతా కథల్తో పోల్చుకుంటే నీది చాలా సామాన్యమైన కథ. ఏ విధమైన సస్పెన్సూ లేదు. కానీ ఆలోచించే కొద్దీ అందులో ఏదో గొప్ప మానసిక విశ్లేషణ వుందనిపిస్తూంది. చాలా చిన్నది అయినా విశ్వనాథం పాత్రలో కూడా ఒక గొప్ప - అనలైజేషన్ ని ప్రవేశపెట్టావ్. అన్నిటికన్నా గొప్ప విషయం, ముగింపు!!! సడెన్ గా ఒక చక్కటి ట్విస్టునిచ్చి 'హమ్మయ్య' అనిపించే ముగింపు"
    "కేవలం వాడు నీ ఫ్రెండూ, బాగా కావల్సినవాడూ కాబట్టి వాడిని పొగుడుతున్నావా ఏమిటి?" అన్నాడు వెంకు.
    "ఏమో మరి- నాకు నిజంగా బావుంది అనిపించింది."
    శివ కల్పించుకుని, "ఆ మాటకొస్తే మన వెంకూగాడూ చెప్పిన కథలో కూడా సంతృప్తి వుంది. ఒక చక్కటి అమ్మాయిని పందెం పేరున మోసం చేయబోయిన వ్యక్తి చివర్లో శిక్షింప బడటం" అన్నాడు- "ముగింపు అంటే అలా వుండాలి"
    ఇక్కడో నేనో విషయం గమనించాను. విజ్జూ, శేషూ బాగా ఫ్రెండ్సు. అలాగే  శివ వెంకూ ఫ్రెండ్సు. వీడు వాడి కథనీ, వాడు వీడి కథనీ మెచ్చుకోవటంలో ఆశ్చర్యంలేదు.
    ఏ గ్రూప్ కీ చెందనివాడిని నేనే.
    "ముగింపు మూడు రకాలని నా ఉద్దేశ్యం....." అన్నాను నేను కల్పించుకుంటూ. "ఒక రకమైన ముగింపు పాఠకుడిని చాలా ఇబ్బందిలో పెడుతుంది. రచయితపైన విపరీతమైన కోపం వస్తుంది. రచయిత మాత్రం ముగింపు విషయమై "ఆ ఒక్కటీ అడక్కండి" అని తప్పుకుంటాడు. "దుప్పట్లో మిన్నాగు, "మానవాతీత వ్యక్తి" - అలాటి కథలని నా ఉద్దేశ్యం. పోతే రెండోరకం ముగింపులో రచయిత తను చెప్పదల్చుకున్నదాన్ని లీలగా స్పృశించి, మిగతాది పాఠకులకి వదిలేస్తాడు. "వరండా కుర్రాడు". ఓడ ప్రయాణం" అలాగే  ముగించబడ్డాయి. మూడోరకం ముగింపు మెలోడ్రమిటికల్ గా వుంటుంది. 'ఆ గదిలో నవ్వులు ప్రతిధ్వనించాయి...... ఈ కళ చెదిరిపోతుందేమో అన్నంతగా అతడిని  ఆమె అల్లుకు పోయింది- తమ కోసం త్యాగం చేసిన ఆ పవిత్రమూర్తిని తల్చుకుంటూ అందరూ కనులు మూసుకున్నారు....వగైరా ఆఖరి వాక్యాలతో నవలలు పూర్తవుతాయి."
    "కొంపతీసి ఆ రకం ముగింపులో నువ్వు  చెప్పబోతున్నావా?" విజ్జూ సైంటిఫిక్ ఫిక్షన్ కలపదల్చుకున్నాను" అన్నాను.
    నలుగురూ ఒకేసారి...... "బోర్.... బోర్......" అన్నారు. "మేమీ ఫిక్షన్ చదవలేక చచ్చిపోతున్నాం. దానికితోడు నువ్వు చెప్పేదీ అదేనా?"
    వెయిటర్ మళ్లీ సీసాలు, వేయించిన చికెన్ జాయింట్స్ తీసుకువచ్చి బల్లమీద పెట్టాడు. ఈ రోజుబిల్లు ఎవరు ఇవ్వబోతున్నారో గానీ తడిసి మోపెడు కాబోతూంది.
    "చెప్పేది సరిగ్గా చెప్తే ఏ ఫిక్షనైనా బాగానే వుంటుంది. పాఠకుల రీజనింగ్ కి అందకుండా చెప్తేనే కష్టం. అప్పుడు దాన్ని తిరగకొడ్తారు. అలా మీరు  నా కథని  తిరగకొడితే నాకే కదా నష్టం. బిల్లు ఇచ్చుకోవలసిన వాడిని నేను అవుతాను....
    "అవును. మాక్కావలసింది అదే. చెప్పు" 
                                               *శుభం*
    (67 ఎపిసోడ్ నుంచి నేను చెప్పిన కథ : అంతర్నేత్రం వస్తుంది)    

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra