Previous Page Next Page 
మోడల్ పేజి 12


    మనోహర్ పగలు బంజారా హొటల్ దగ్గర షూట్ చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి తెరమీద. రూపా చక్రవర్తి, గీతా బెహెల్ దేవకన్యల్లా శృంగార దేవతల్లా కనిపిస్తున్నారు తెరమీద.

    ఇంత బాగా సెల్యులాయిడ్ పైకి ఎక్కించగలడని షూటింగ్ జరుగుతున్నప్పుడు వూహించలేదు. కాని వారిని అర్ధనగ్నంగా చూపించటం వెగటుగా, అసభ్యంగా అనిపించింది మంగళకు. తన భావాలను తనలోనే దాచుకుంది.

    కమలినికి మనోహర్ సామర్ధ్యం తెలుసు. అయినా ప్రతి ఫిల్మ్ లో ఏదో నూతనత్వం, ప్రోడక్టు ఎక్స్ పోజింగ్ లో వెరైటీ, అలౌకికమైన రసానుభూతిని తీసుకొస్తాడు. అదే ఎలా  అన్నది అర్ధంకాదు పదిహేనేళ్ళుగా మోడలింగ్ లో వుంటున్న కమలినికి.

    ముగ్గురూ తెరవైపే చూస్తున్నారు. హఠాత్తుగా తెరమీద కొన్ని పొదలు కనిపించాయి. ఆ పోదల్ని ఎందుకు షూట్ చేసాడో కమలినికి  అర్ధంకాలేదు. ఆ పోదల్ని చూడగానే మంగళకు స్ఫురించింది.....తను అనుమానంగా చూసిన పోదల్ని మనోహర్ షూట్ చేసాడని, ఆ పొదల్లో పొంచివున్న ఆగంతకుడ్ని కనుక్కొనేందుకే రష్ ఫిల్మ్  అంత  త్వరగా తెమ్మన్నాడని.

    పొదలు షాట్ అయిపోయింది. మనోహర్ వెంటనే రివైండ్ చేసాడు ఫిల్మ్ ని. మరలా ప్రాజెక్టు చేశాడు తెరమీద. లాంగ్  షాట్ లో పొదలు కనిపిస్తున్నాయి. ఆ షాట్ ని జామ్ చేసినందువలన పొదలు దగ్గరగా, ఇంకా దగ్గరగా. బాగా దగ్గరగా వచ్చాయి. అప్పుడు  తెరమీద  ఒకే పోడ కనిస్తోంది, మనోహర్ ఠక్కునలేచి ప్రాజెక్టురుని ఆన్ లోనే వుంచి ఫిల్మ్ రన్నింగ్ స్టాప్ చేసాడు.

    ముగ్గురూ పరిశీలనగా  ఆ పోదవైపు చూశారు. పొదలో ఒక వ్యక్తి చేతిలో జామ్స్ లెన్స్ ఫిక్స్  చేసిన కెమేరాతో ఫోటోలు తీస్తున్నట్లుగా  అస్పష్టంగా కనిపించాడు.

    "ఎవరతను మనోహర్? అతనక్కడేం చేస్తున్నాడు?" కమలిని అడిగింది అనుమానంగా.

    "అతను ప్రదీప్ సక్సేనా మనిషి. నా ప్రతి చర్యను కనిపెట్టమని పంపించి వుంటాడు" అంటూ తెరమీద కనిపిస్తున్న పొదను మరింత పరిశీలనగా చూసాడు.

    అప్పుడు అతనిలో కలిగినభావాల్ని నిక్షిప్తం చేసుకున్నాడు.

    ప్రొజెక్టర్ ఆఫ్ చేసి ఫిల్మ్ ని ప్రొజెక్టర్ నుంచి తీసి, ఎడిటింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు, పొదల షాట్ ని ఫిల్మునుంచి కట్ చేసేందుకు. కమలినికి, మంగళకు టెన్షన్ గా వుంది. ఏమిటీ మిస్టరీ.....? ఏం జరుగుతోంది.....?

    మనోహర్ ఫిల్మ్ కట్ చేయగానే ముగ్గురూ డ్రాయింగ్ రూంలోకి వచ్చారు.

    "మనూ.....నేనింక ఆగలేను బాబూ....ఏమైందో త్వరగా చెప్పవా?" అడిగింది మంగళ బ్రతిమిలాడుతున్న ధోరణిలో.

    కమలిని పరిస్థితి దాదాపుగా అలానే వుంది.

    "మధు ఫైల్ తెచ్చిచ్చాడా?"

    విషయమేమిటో చెబుతాడనుకుంటున్న మనోహర్ టాపిక్ మార్చడంతో ఉక్రోషం పొడుచుకొచ్చింది.

    మంగళ విసురుగా లోనికెళ్ళి మధు ఇచ్చిన వెళ్ళి ఫైలు తెచ్చి మనోహర్ ముందు పడేసింది.

    మనోహర్పైలు చేతిలో తీసుకొని ఇద్దరి వైపుకి చూసాడు. ఇద్దరి మొహాలు సీరియస్ గా వున్నాయి. విషయం ఏమిటో తెల్సుకోందే కమిలిని వెళ్ళేలా లేదు.

    వారికి చెప్పగూడదని కాదు మనోహర్ మనస్సులో అనుకొనేది.

    తనను ఎంతగానో అభిమానించే వారికి పందెం విషయం చెబితే భయపడవచ్చు. తనను ఈ పందెంలోంచి వెనక్కులాగే ప్రయత్నం కూడా చేయవచ్చు. అదీ మనోహర్  కి ఇష్టంలేదు ఈ పందెంలో నెగ్గేందుకు ఎలాంటి రిస్క్ కైనా సిద్దంగా వున్నాడు మనోహర్.

    ఆలోచిస్తూనే మధు ఇచ్చి వెళ్ళిన కోరమాండల్ ఇండస్ట్రీకి చెందిన ఫైల్ తెరిచాడు. ఫైల్లో మొదటి పేజీలో, తానో కోరమాండల్ ఇండస్ట్రీకి తీయబోయే నాలుగు యాడ్ ఫిల్మ్స్ కి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్ట్ మీద  అప్రూవ్ చేస్తూ కంపెనీ సీల్, మార్కెటింగ్ డైరెక్టర్  సంతకం వున్నాయి.

    పందెంలో తొలివిజయం తాలూకు ఆనందం మనోహర్ మోముపై కదలాడింది.

    "ఏమిటిది....మనోహర్.....మా  మానాన మేం అడుగుతున్నాం. నీ మానాన నీవు ఫైల్ చూసుకుంటున్నావ్...?" కోపంగా అడిగింది కమలిని_____ఆ కోపంలో చనువు, ప్రేమ, అభిమానం మిళితం చేస్తూ.

    "లేట్ మీ ఫీల్  హేపీ..... ఐసే.......

    నా శక్తి సామర్ధ్యాలు చూపించుకొనే అవకాశం ఇన్నాళ్ళకు వచ్చింది. దీంతో నా చిరకాలవాంఛ నెరవేరుతోంది. యాడ్  ఫోటోగ్రాఫర్ గా  ఇంటర్నేషనల్ ఫేమ్ సంపాదించుకోవాలి" అన్నాడు ఆనందంగా ఆ ఫైల్ ని నిమురుతూ.

    కమలిని లేచి మనోహర్ చేతిలో ఫైల్ లాక్కుంది విసురుగా. ఫైల్ తెరిచింది కమలిని. ప్రక్కనే వున్న  మంగళ, కమలిని దగ్గరకు  జరిగి పైల్లోని చూసింది ఆసక్తిగా. కమలిని ఫైల్ లోని పేపర్స్ ని తిరగవేస్తూ  ఓ  చోట ఆగిపోయింది. అక్కడ కనిపించిన ఫోటోలోని అమ్మాయిని చూసి.

    "కంగ్రాట్చ్యులేషన్స్ ఫర్ సూపర్స్" అంది కమలిని ఆ ఫోటోవైపే తదేకంగా చూస్తూ.

    "థాంక్యూ"

    "ఈ అమ్మాయి మోడల్ గా వచ్చిందంటే తామే గొప్పని  గర్వపడుతున్న పాండ్స్ మోడల్ సంగీతా. కాల్గేట్ చబ్బీ ధరీవాల్, వి.ఐ.పి. అనితా రెడ్డి, చార్మినార్ నీషాపింగ్ అందరూ ముసుగు పెట్టుకోవాల్సిందే ఇంతకీ ఎవరీ తరంగణి......"

    "తరంగణి కాదు, సోఫియా. రూపాచక్రవర్తి చెల్లెలు. ఓసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు చూసానామెను. చాలా బావుంది. భవిష్యత్ లో మంచి ఆఫర్, డబ్బున్న క్లయింట్ వస్తే ఆమెను మోడల్ గా తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. ఇన్నాళ్ళకు ఆమె అవసరం వచ్చింది. ఈ విషయమే రూపాతో మాట్లాడడానికి వెళ్ళాను, మీరు  ఫోన్ చేసిన టైమ్ లో" అన్నాడు ఆనందంగా.

    కుండ బ్రద్దలుకొట్టినట్లు తన అభిప్రాయాల్ని చెప్పే సీనియర్ మోడల్ కమలీని తన డిస్కవరీని మెచ్చుకొంటుంటే చాలా గర్వంగా వుంది మనోహర్ కి. కాని అదెంతసేపో నిలవలేదు.
   
    "నువ్వేమంటున్నావో నాకర్ధం కావడంలేదు. నువ్వేమో సోఫియా అంటావు, ఇక్కడేమో తరంగిణి అని వుంది.....నువ్వో కన్ ప్యూజన్ మాస్టర్ వి" అంది మనోహర్ వైపు వింతగా చూస్తూ.

    మనోహర్ ఉలిక్కిపడ్డాడు తరంగిణి పేరు విని. ఏం జరిగిందో ఓ నిమిషం అర్ధంకాలేదు. ఠక్కున కమలిని చేతిలోంచి ఫైల్ లాక్కున్నాడు.

    ఫైల్ లోని కాగితాలు తిరగేస్తూ కమలిని ఆగినచోటే ఆగిపోయాడు.

    మనోహర్ షాక్ తిన్నాడు ఆ ఫోటో చూసి. ఆ ఫోటోలో వున్న అమ్మాయి ఎవరో తెలియదు ఎప్పుడూ చూడలేదు.

    సోఫియా  ఫోటో బదులు ఈ ఫోటో ఎలా వచ్చింది ఫైల్ లోకి?

    ఆ ఫోటో పై ఆమెను మోడల్ గా  అంగీకరిస్తూ కంపెనీ సీల్, సంతకం వున్నాయి.

    మనోహర్ ఆలోచనలు స్తంభించిపోయాయి. మెదడు మొద్దుబారినట్లయింది. ఎలా జరిగిందీ పొరపాటు?

    ఎంతో శ్రమపడి రాత్రింబవళ్ళు కష్టపడి ప్రాజెక్టు రిపోర్ట్ తయారుచేసుకున్నాడు. ఈ ప్రాజెక్టు  తన కెరియర్ కే గొప్ప బ్రేక్ గా హొప్ పెట్టుకున్నాడు.

    ప్రమాదాన్ని కూడా లెక్కచేయకుండా దిగాడు. పైపెచ్చు ఛాలెంజ్ కూడా విసిరాదు. అంతలో బాంబూలా ఈ పోరపాటెలా జరిగింది? ఎవరైనా మోసం చేసేందుకు అవకాశంలేదు. ఫైల్ విషయం, అందులోని వివరాలు అతి రహస్యంగా వుంచబడ్డాయి.

    మధుకి, తనకు తప్ప మరెవ్వరికి తెలియనీ ఫైల్ విషయం.

    మధు నిజాయితీ ఎంతమాత్రం శంకించనవసరంలేదు.

    ఫైల్ కోరమాండల్ ఇండస్ట్రీస్ కెళ్ళి తీసుకొచ్చింది మధు. పొరపాటు జరిగిందని తెలిస్తే చెప్పేవాడు.

    అంటే.....మధుకి తెలియకుండానే ఈ పొరపాటు జరిగుండాలి.

    వెళ్ళేప్పుడుగాని, వచ్చేప్పుడుగాని మధు ఫైల్ చూసి వుండడు.

    ఈ ఆలోచనలలో పచ్చగా వుండే మనోహర్ మొహం అస్తమిస్తున్న సూర్యుడిలా ఎర్రగా కందిపోయింది.

    వంట్లోని రక్తం అంతా మొహంలోకి వచ్చింది మనోహర్ కి.

    తెల్లగా, స్వచ్చంగా వుండే అతని కళ్ళు అరుణవర్ణం దాల్చాయి.

    విపరీతమైన కోపం వచ్చినపుడు మనోహర్ మొహంలో  ఇలాంటి మార్పులు వస్తాయి. కాని ఇలాంటి సందర్భాలు చాలా  అరుదు మనోహర్  జీవితంలో.

    పైల్ మూసి ప్రక్కన పడేసాడు విసురుగా. మనోహర్  ముఖంలో కదలాడే భావాల తీవ్రత మంగళకు, కమలినికి భయాన్ని కల్గించాయి.

    ఏం జరిగిందో చెప్పడం లేదు. రష్ ఫిల్మ్ లో కనిపించిన ఆగంతకు డెవరో తెలియదు.

    ఫైల్ లో ఫోటో ఎందుకు మారిందో ఎలా మారిందో అంతకంటే తెలియని మంగళ, కమలినికి మనోహర్  ఏదో రిస్క్ లో  ఇరుక్కునట్లుగా  గ్రహించగలిగారు.

    అతని గురించి పూర్తిగా తెలిసిన ఇద్దరికీ ఎలాంటి  ప్రమాదం  నుంచైనా తెలివిగా బయటపడగలడనే నమ్మకం కూడా వుంది.

    జరిగిన పొరపాటును జీర్ణం చేసుకొని దానిని సరిదిద్దుకునేందుకు మానసికంగా సిద్ధమవుతున్నాడు మనోహర్.

    యాడ్ ఫోటోగ్రాఫర్ వృత్తిలోకి దిగిన దగ్గర్నుంచి ఎలాంటికష్టం వచ్చినా, ప్రమాదం ముంచుకొచ్చినా దాని గురించి ఎక్కువసేపు మధనపడడు మనోహర్. చప్పున ఆ పరిస్థితినుండి తేరుకుని చేయాల్సిన దానిగురించి ఆలోచిస్తాడు జెట్ స్పీడ్ లో.

    అతనా పరిస్థితిలో ఉండగా ఏం జరిగిందని అడిగే దైర్యం లేక పోయింది ఇద్దరికి.


                                                                      *    *    *

    మర్నాడు చేయవల్సిన పనుల గురించి ఆలోచిస్తూనే పక్కమీద ఒరిగాడు మనోహర్.

    ప్రక్కగదిలో మంగళ, కమలిని పడుకున్నారు.

    మంగళ. మనోహర్ వత్తిడి చేయటంతో ఆ రాత్రికి అక్కడే పడుకుంది కమలిని.

    మోడల్ గా జీవితం ప్రారంభించాక శారీరక వాంఛతో ఆమె పక్కను ఎంతోమంది పంచుకున్నారు.

    వాంఛకి అతీతంగా, ఆత్మీయుల మధ్య ఆమె శరీరం సేదతీరింది మాత్రం ఆ రాత్రే. భయంకరమైన ఎన్నోవేల రాత్రుల్లో, ఈ రాత్రి ఆమెకో అమృతం కురిసిన రాత్రి. ఆ పగలు, రాత్రి జరిగిన సంఘటనల తాలూకు భయంతో తల్లి కోడిరెక్కల మాటున దాక్కున్న పసికోడి పిల్లలా, కమలినిని కన్నతల్లిలా అల్లుకుపోయిన మంగళను చూసి కమలిని కళ్ళు చెమ్మగిల్లాయి. మంగళను రెండు చేతులతో పొదివిపట్టుకుని, ఆప్యాయంగా ఒళ్ళంతా నిమురుతూ, తన గుండె లోతుల్లో ఎక్కడో ఓ మారుమాల ఇంకా మిగిలివున్న, తల్లి కావాలన్న ఆశకు ఆమెను ఊహా మాత్రపు ఆలంబన చేసుకుంటూ నిద్రలోకి జారుకుంది. అందాల మాంసపు ముద్దల ప్రపంచంలో ఓ ప్రాకుడురాయి అయిన కమలిని.

    పడుకున్న గంటకే ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్లు లేచిపోయాడు పక్కమీదనుంచి మనోహర్. తన ప్రతి పని ఠంచనుగా, కరక్టుగా, పకడ్భందీగా జరిగేలా చూసుకుంటాడు మనోహర్. యాడ్ ఫోటోగ్రాఫర్ గా  వృత్తి ప్రారంభించిన నాలుగు సంవత్సరాల నుంచి జరగని  పొరపాటు ఈ రోజెలా జరిగింది. ఇది ప్రదీప్ సక్సేనాకు తెలిస్తే....!?

    ఆ వూహే మనోహర్ ని  భయకంపితుణ్ణి చేసింది. ఆ భయం తనకేదో అవుతుందన్నది కాదు. తన ప్రాజెక్టుకి ఏదైనా అవాంతరం ఏర్పడుతుందా అనే ఆలోచన తాలూకు భయం. 

 Previous Page Next Page