Previous Page Next Page 
అగాధాల అంచులలో పేజి 11

    రాజు చేతిలోంచి పెనుగులాడుతున్న హంతకుడిని పోలీసులు మీదపడి రెక్కలు విరిచి పట్టుకున్నారు.

    ఇన్ స్పెక్టర్ వంగి యెడం చేతిలోకి రివాల్వర్ తీసుకున్నాడు. ఓ లేడీ పోలీసు ఇన్ స్పెక్టర్ చేతికి కత్తితో గాయమయి నెత్తురు కారుతున్న చోట కర్ చీఫ్ తో బిగించి కట్టింది.

    "థాంక్స్ బ్రదర్! చాలా ధైర్యంగా తెలివిగా వ్యవహరించి హంతకుడిని పట్టించావ్? మీ పేరు?"

    "అబ్దుల్లా" పేరు చెప్పి అంతటితో ఊరుకోకుండా మరో నాలుగు మాటలు పెంచాడు. తనకి పక్కతను మీద మొదటి నుంచీ అనుమానంగానే వుందని, అందుకే ఓ కంట అతన్ని కనిపెడుతూ వున్నానని... కాబట్టే వెంటనే చెయ్యి విసరగలిగానని చెప్పాడు. తన మామ సత్తార్ చావు బతుకుల్లో వున్నాడని చివరి చూపులయినా దక్కుతాయో లేదో అని భయపడుతున్నానని. తన భార్య ఫాతిమా ఆయన కొక్కతే బిడ్డ అని చెప్పాడు. పోలీసులంటే చాలు ఉరితాడు కళ్ళముందు ప్రత్యక్షమౌతున్నది. ఆ భయం లేనివాడిలా మేకపోతు గాంభీర్యంతో మాట్లాడాడు రాజ్.

    "రాజూ నీ తెలివే వేరు. అందుకే నీవంటే నాకు ప్రాణం. నీవు రా అనగానే రావటంలో నా గొప్పేముంది. నీవు నిప్పుల్లో దూకమని ఆజ్ఞాపించు. కళ్ళు మూసుకుని ధన్ మని దూకేస్తాను" నందితాదేవి అనుకుంది.

    ఇతను మామూలు హంతకుడు కాదు. రాక్షసుడు, ఆడపిల్లల పాలిట కీచకుడు- మారువేషాలు వేయటంలో దిట్ట. మనోహరి అనే కాలేజీ అమ్మాయిని దారుణంగా రేప్ చేసి అంతకన్నా దారుణంగా హత్యచేసి పోలీసు వేషంలోనే పారిపోతున్నాడు. ఇన్ స్పెక్టర్ నంటూ పరిచయం చేసిన ఆ తీరు చూడండి." ఇన్ స్పెక్టర్ చెప్పుకుపోతున్నాడు.

    ఇన్ స్పెక్టర్ దిగవలసింది పక్కస్టేషనే. అవసరంవస్తే కబురు చేస్తానని రాజ్ అడ్రస్ అడిగాడు.

    అడ్రస్ చెప్పి "యీ అడ్రస్ పట్టుకోవాలంటే నీ సర్వీస్ అంతా సరిపోదు ఇన్ స్పెక్టర్ భయ్యా" అనుకున్నాడు.

    ఇన్ స్పెక్టర్ తన బలగంతోను, హంతకుడితోను ట్రైన్ దిగబోతుండగా హంతకుడన్నాడు కరుగ్గాను, గాంభీర్యంగాను.

    "అబ్దుల్లా! ఒకసారి చూసిన మనిషిని జీవితాంతం నే మర్చిపోను. నన్ను ఇన్ స్పెక్టర్ కి పట్టించి కొరివితో తల గోక్కున్నావ్ -- నేను రాక మానను, నీ ప్రాణం తీయకమానను"

    "నోరు ముయ్యి! మరొకసారి పారిపోవటం నీ తల్లో పేనుకు కూడా అసాధ్యం. నీ సంగతి తెలిసి ఇంక వూరుకుంటామా వెయ్యికళ్ళతో కాపలా కాయమూ" ఇన్ స్పెక్టర్ అన్నాడు.

    "వెయ్యి కళ్ళతో వెయ్యిమంది కాపలా కాయండి. లక్షన్నర మార్గాలు నాకెలాగూ వున్నాయ్. అబ్డుల్లాగాడి పీక పట్టుకున్ననాడు అల్లాకాదు నా మాట గుర్తురాక మానదు. గుర్తుంచుకో అబ్దుల్లా" హంతకుడు అన్నాడు!

    ఫక్కున నవ్వి గడ్డం నిమురుకుంటూ "హంతకుడిని అల్లా రక్షించడు భాయ్" అన్నాడు రాజ్.

    హంతకుడి మెడమీద గట్టిగా ఒక దెబ్బవేసి "నోరు మూసుకునిదిగరా" అన్నాడు ఇన్ స్పెక్టర్.

    మరికొద్ది సేపటిలో ట్రైన్ బయలుదేరింది.

    ప్రయాణం మధ్యలో ఏ అవాంతరాలూ రాలేదు.

    రాత్రి ఎనిమిది గంటలకు నందితాదేవి. రాజ్ పెద్ద స్టేషనులో ట్రైన్ దిగారు.

    రెండు పెట్టెలు, బాస్ కెట్ తో ఇరువురూ స్టేషన్ బైటికి వచ్చారు. రాజ్ మాటిమాటికి ఎర్ర రుమాలతో ముక్కు తుడుచుకోటం గమనించిన వకతను వీళ్ళ దగ్గరకు వచ్చాడు. తగ్గు స్వరంతో ఏదో చెప్పాడు.

    స్టేషను బయటకు వచ్చిన తర్వాత రెడీగా వున్న ఆటోలో నందితాదేవి ఎక్కింది. ఆటోలో సామాను వుంచారు.

    "గంటలో నేను వస్తాను. ఇతను నా ఫ్రెండ్ రమేష్. మనం ప్రస్తుతం వుండటానికి రూమ్ చూపిస్తాడు. నే వచ్చేసరికి స్నానంచేసి విశ్రాంతిగా వుండు" అని చెప్పి జనంలో కల్సిపోయాడు రాజ్ వేగంగా.  

 Previous Page Next Page