"ఇది పాంప్లెట్ అని నాకూ తెలుసు. ఈ రాతలకి అర్ధం ఏమిటా అని?..."
"మీరు చదివారా!"
"చదివాను."
"ఎందుకు చదివారు! మిమ్మల్ని చదవమని యివ్వలేదే! ఆడవాళ్ళు మాత్రమే చదవాలి."
"అలా అని దీనిమీద రాసిలేదు కదా!"
"లేదు. అసలు నేను ఆడవాళ్ళకి మాత్రమే యిస్తున్నాను. పొరపాటున మీ చేతి కిచ్చాను. ఇది ఆడవాళ్ళకి మాత్రమే సంబంధించినది"
ఏదో అర్ధమైనట్లు అయింది పృధ్వీరాజ్ కి "ఆ తెలిసింది." అన్నాడు.
"ఏం తెలిసింది?" దీక్ష అడిగింది.
పృధ్వీరాజ్ తో మాట్లాడుతుంటే చెడ్డ భావం కలగటం లేదు. పిల్లవాడితో మాట్లాడినట్లు వుంది దీక్షకి. చెట్టంత మగాడు చంటి నాయనలాగా అనిపిస్తున్నాడు దీక్ష కళ్ళకి.
"మీరు ప్రముఖ రచయిత్రి కోమలాదేవి యింట్లోకి వెళ్ళి మాట్లాడి రావటానికి ముప్పై రెండు నిమిషాలు పట్టింది. ఆమె పెద్ద రచయిత్రి అయితే మీరు పిల్ల రచయిత్రి అయి వుంటారు. ఈ మధ్య వార మాస పత్రికల వాళ్ళు దెయ్యాలకి సమాధి కట్టి కత్తుల కలాలు పట్టి క్రైమ్ రచనలు పట్టుకుని కొత్తరకం ప్రయోగాలు చేస్తున్నారు. ఏ పత్రిక తరుపునో ప్రచారానికి మీరు దిగారు. ఇలాంటి పాంప్లేట్లు ముందు ఆడవాళ్ళకి పంచి ఆ తర్వాత వచ్చి ఫలానా వారపత్రికలో గొప్ప సస్పెన్స్ సీరియల్ అని చెపుతారు. ఆడవాళ్ళంతా పడి కొంటారు. ఇదో కొత్తప్రయోగం. యామై కరెక్ట్!"
"మీరు శవ సాహిత్యం బాగా చదువుతుంటారా!" దీక్ష పెదవి బిగింపులో చిరునవ్వు చిందిస్తూ అడిగింది.
"శవ సాహిత్యం చదవను. క్రైమ్ నవలలు చదువుతుంటాను" పృధ్వీరాజ్ చెప్పాడు.
"మీరు పరిశోధన చేయటానికి పనికొస్తారు. ప్రైవేట్ డిటెక్టివ్ అన్న బోర్డ్ కట్టుకుంటే నాలుగు కేసులు వస్తాయి. అయినా మీరు పనికిరారు లేండి. రివాల్వర్ అంటే మీకు భయం కదా!"
"రివాల్వర్ అంటే భయపడంది ఎవరో చూపండి. పచ్చినెత్తురు తాగే ఖూనీకోరు కూడా ఎదుటివాడి చేతిలో రివాల్వర్ వుంటే చాలు భయపడతాడు. మారణాయుధం ప్రయోగిస్తే మంచివాళ్ళు హరీ అంటారు. చెడ్డవాళ్ళు హరీ అంటారు" పృధ్వీరాజ్ కోపంగా అన్నాడు.
"మీరు వక్కోసారి బాగా మాట్లాడగలరు పృధ్వీరాజ్ గారూ! ఇప్పటికే చాలా ఆలస్యం అయింది వస్తా." తమాషాగా అని దీక్ష బయలుదేరింది.
"అయ్యో! అసలు విషయం చెప్పకుండానే వెళుతున్నారు" పృధ్వీరాజ్ అన్నాడు.
"ఈ విషయం మగవాళ్ళు తెలుసుకోకూడదు. టాప్ సీక్రెట్." అని దీక్ష నవ్వుతూ వెళ్ళిపోయింది.
"టాప్ సీక్రేటా! చూస్తాచూస్తా ఇదేమిటో!" అనుకున్నాడు పృధ్వీరాజ్.
-6-
ఆడవాళ్ళంతా సమావేశం అయ్యారు.
సమయం మిట్టమధ్యాహ్నం పన్నెండూ పది.
"అందరూ వచ్చినట్లేనా?" బలవర్ధనమ్మ అడిగింది.
"అరుంధతమ్మ రాలేదు." అష్టలక్ష్మి చెప్పింది.
"సీతమ్మ రాలేదు."
"ఏ సీతమ్మ?'
"బొడ్డేపల్లివారి సీతమ్మ రాలేదు. శీనయ్య గారి సీతమ్మ రాలేదు."
"పన్నెండు దాటుతూనే అందరం కూచిపూడివారి ఇంట్లో సమావేశం కావాలని చెప్పాను."
"నీవు చెప్పింది నిజమే పిన్నీ! ఆడవాళ్ళు ఇల్లు వదిలి రావాలంటే వెయ్యి పనులు. కాస్త అటూ యిటూగా వస్తారు."
అప్పుడే వచ్చిన మందారవర్ధని "వదినగారూ! నే రావటం ఆలస్యం కాలేదుకదా!" అంది.
"నిండా నూరేళ్ళు మాటల్లో వచ్చావు వదినమ్మా!" అని నవ్వుతూ అంది అన్నపూర్ణమ్మ.


