Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 11

    "వెర్రి ముఖమా! అది అంత ఈజీ కాదు. వీడూ వాళ్ళూ లాలూచీ అయి మళ్ళీ వాడు వచ్చే సరికి మనం రైలు దిగి ఇంటికెళ్ళిపోతాము. వచ్చే స్టేషనులోనే మనం దిగేది" చిద్విలాసంగా నవ్వుతూ సెలవిచ్చాడు కోదండరామయ్య.

    "నిజమేస్మీ" అని ఆమె నవ్వుతూ ఆశ్చర్యపోయింది.

    కొద్దిసేపు ఆగి వెంకుమాంబ పెద్ద అనుమానం వచ్చింది.

    "ఓ వేళ ఎప్పుడైనా ఏకపాదం మనకి తారసపడ్డాడే అనుకోండి" అంది.

    "నష్టమేమిటి....?" కోదండరామయ్య అడిగాడు.

    "ఈ పెట్టె మనం తీసుకువెళ్ళామని తెలిసి పోట్లాటకిదిగితే అప్పుడు మనం ఏం చేయాలి?"

    "మనకి తల వుందికదా?"

    "వుంది" వెంకుమాంబ అయోమయంగా అంది.

    "బర బర గోక్కుందాము"__చక్కగా సెలవిచ్చాడు కోదండరామయ్య.

    "వేళాకోళానికి కూడా వేళాపాళా వుండాలి. వెనకటికో మహానుభావుడు మీలాంటి వాడే చస్తుంటే సంధ్యా మంత్రం వల్లిస్తూ కూర్చున్నాడుట."

    "మంచిపని చేశాడు. లేకపోతే ఏమిటోయ్ ఎప్పుడో ఏకపాదం ఎదురైతే ఏం చేయాలి, పోట్లాటకి దిగితే ఏంచేయాలి! కత్తి తీసి బెదిరిస్తే ఏం చేయాలి! ఎప్పుడో ఏదో జరగవచ్చన్న ఈ అనుమానాలు దేనికి? అప్పటి సంగతి అప్పుడు. ఊహ వచ్చిన దగ్గరనుంచి నా పందొమ్మిదేళ్ళ వరకు కలిసి తిరిగిన నా ప్రాణ మిత్రుడు అప్పారావు, ఆ తర్వాత మళ్ళీ నా జీవితంలో తారసపడ లేదు. నా వయస్సు ఇప్పుడు ఎంత అంటావ్! ఎంతో నీకు తెలుసు కదా! నా పందొమ్మిదో ఏట విడిపోయిన నా ప్రాణమిత్రుడని నేను ఇంతవరకు చూడలేకపోయాను. అలాంటిది ఏకపాదం మళ్ళీ మనకి జీవితంలో తారసపడడం అన్నది జరగదు, జరగబోదు. ఓ వేళ జరిగితే అప్పటి సంగతి అప్పుడు! అంతే గాని ఆ ఆలోచనతో బుర్ర వేడెక్కించుకోవడం ఎందుకు?" కోదండరామయ్య చిన్న స్పీచ్ ఇచ్చాడు.

    ఓ నిట్టూర్పు విడిచి "నిజమే లెండి" అంది వెంకుమాంబ.

    వీళ్ళు మాటల్లో వుండగానే సర్కార్ ఎక్స్ ప్రెస్ స్టేషన్ లో నిలిచింది.

    లైసెన్స్ కూలీలు కిటికీ దగ్గర చేరి "కూలీకావాలా!" అని అడిగారు.

    అలవాటు ప్రకారం వెంకుమాంబ సంచి చేతిలోకి తీసుకుని "అక్కర లేదబ్బాయ్!" అంది.

    నెల రోజులు యాత్రలు తిరిగినా, ఆరు నెలలు తిరిగినా అర రోజు తిరిగినా, కూలీ అవసరం లేకుండా చూసుకుంటారు వాళ్ళు. మరచెంబు మంచినీళ్ళకి తీసుకు వస్తే ఖర్మకాలి మరచెంబు ప్రయాణంలో పోతే డబ్బు దండగ! అందువల్ల వాళ్ళు మంచి నీళ్ళకి చెంబు తెచ్చుకోరు. సీసా తెచ్చుకుంటారు.

    అలాగే.....  
                                         
    వెంకుమాంబ హ్యాండ్ బ్యాగ్ మోస్తుంది. చిన్న సూట్ కేసు కోదండరామయ్య మోస్తాడు. ఇప్పుడు వీళ్ళకి ఓ పెద్ద ట్రంకు పెట్టె తోడయింది. ఆ విషయం గుర్తున్నా కూలీ విషయం గుర్తులేదు.

    "నా తలకాయ అంత పెట్టె కొనిపించావు. వంద సామానులు దాని నిండా నింపావు. అది చాలక ఆ పెట్టెని కూడా నన్నే మొయ్యమంటావా!" తెచ్చి పెట్టుకున్న కోపంతో అన్నాడు కోదండరామయ్య.

    పొరపాటు తెలిసి వచ్చింది వెంకుమాంబకి "మనిద్దరం కలసి అటూ ఇటూ చెరో చెయ్యి వేస్తే బండిలోంచి పెట్టెని దింపలేమా?" తన వంతు పాత్ర అమాయకంగా పోషిస్తూ అంది.

    "నీకు తెలియదు చెపితేవినవు" కోప్పడినట్లు అని లైసెన్స్ కూలీలని పెట్టె ఎత్తుకోమని దర్జాగా బండి దిగాడు కోదండరామయ్య.
    లైసెన్స్ కూలీలు పెట్టె ఎత్తుకున్నారు. 

 Previous Page Next Page