"థాంక్యూ... యిది నా పర్సనల్ పని... మిమ్మల్ని".
"అదిగో...అదే వద్దంటా... నేనేమీ యిబ్బందిగా ఫీలవడంలేదు."
"థాంక్యూ...వన్స్ ఎగైన్...అన్నట్టు మరో చిన్న విషయం..."
ఏమిటన్నట్టు చూసింది ప్రణవి.
"మరేం లేదు...తను వొంటరిగా పడుకోలేదు...అందుకని."
ప్రణవి మొహం ఒక్క క్షణం ఎర్రబడింది.
"మీరు మరోలా.."
"ఛ...ఛ నేను తను కూడా పడుకుంటాను" వెంటనే అనేసింది.
"మీకెలా థాంక్స్ చెప్పాలో అర్ధం కావడంలేదు. వుంటానండీ...రేప్పొద్దున వచ్చి, తనని పికప్ చేసుకుంటాను. బై సరితా" అంటూ లేచాడు కృపాల్.
కృపాల్ వెళ్ళిపోయాక తలుపేసాక ప్రణవి భార్గవ గదిలోకి వెళ్లింది.
భార్గవకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్ధం కావడంలేదు.
భార్గవ లోపలి గదిలో నుంచి మాటలన్నీ వింటూనే వున్నాడు. పైగా తన గురించి ప్రస్తావన కూడా చేయలేదు కృపాల్. యిదంతా కావాలనే చేసాడా?
మెల్లగా భార్గవ తన గదిలోనుంచి హాలువైపు చూసాడు. ఆ అమ్మాయిని పరీక్షగా చూసాడు. ఎక్కడో చూసినట్టనిపించింది.
జేమ్స్ డేవిడ్ దగ్గర పొలీసువాళ్ల లిస్టు వుంది. అతని మెదడులో ఆలోచనలు మొదలుయ్యాయి.
సడన్ గా గుర్తొచ్చింది. ఆ అమ్మాయి పోలీసు...ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం మానేసింది.
సందేహం లేదు. ఆమె కృపాల్ పంపిన అమ్మాయే...ఖచ్చితంగా పోలీసమ్మాయే...
జేమ్స్ డేవిడ్ చూపించిన ఆల్బమ్ లో ఈ ఫోటో వుంది. అంటే యిందతా పకడ్బందీగా జరిగిందా?
ఈ లోగా అడుగుల శబ్దం వినిపించింది.
ప్రణవి గదిలోకి వచ్చింది.
"సారీ అండీ" అంది అతనికి దగ్గరగా వచ్చి. ఆమెకూ బాధగానే వుంది. చాలారోజుల తర్వాత భర్తతో కలిసే ఈ అవకాశం మిస్ చేసుకుంటున్నందుకు.
భార్గవకు ప్రణవిని రేప్ చేయాలన్నాంత యిదిగా వుంది. ఆమెను దగ్గరకు లాక్కోబోయాడు.
ఈ లోగా హాలులోనుంచి కేక.
ప్రణవి కంగారుపడి హాలులోకి వచ్చింది.
గట్టిగా కళ్లు మూసుకుని వుంది సరిత.
"ఏంటండీ...ఏం జరిగింది?" కంగారుగా అడిగింది ప్రణవి.
"పిల్లి...పిల్లి అండీ...నామీదికి దూకబోయింది..."
"పిల్లా...తేలిగ్గా నవ్వింది...దానికే అంత భయమా!"
"నాకు పిల్లి అన్నా, బొధ్దింకలన్నా భయం" అంది మొహంలో భయాన్ని నింపుకొని.
"సర్లేండి...నేనున్నాగా" అంది హాలులో వున్న సోఫాని మంచంలా అడ్జస్ట్ చేస్తూ.
"మీరు మా దగ్గరే పడుకోండి" భయంగా అంది.
"అలాగే" అంది ప్రణవి. బెడ్రూం వైపు చూస్తూ.
ఏ అర్ధరాత్రయినా భర్త గదిలోకి వెళ్దామన్నా ఆ అవకాశం కూడా లేదని అర్ధమైంది. భారంగా నిట్టూర్చింది.
తను సరిత పక్కనే మేను వాల్చింది. సరిత తనలో తనే నవ్వుకుంది అటు తిరిగి
అర్ధరాత్రి సైతం గూండాలుండే ఏరియాలో ఒంటరిగా తిరిగొచ్చిన బ్రేవ్ పోలీస్ సరిత...అనే విషయం ప్రణవికి తెలియదు.
మరో అరగంట తర్వాత ఫోన్ రింగయ్యింది. భార్గవ హాలులోకి పరిగెత్తు కొచ్చాడు.
రిసీవర్ లిప్ట్ చేసాడు
సరిత చెవులు రిక్కించింది.
ప్రణవి ఎప్పుడో నిద్రలోకి జారుకుంది.
"ఇడియట్...యింకా ఏం చేస్తున్నావక్కడ...వెంటనే సిటీ బ్యాంకుకు వెళ్లు...అంతా సిద్దం చేసాను...ఈ క్షణంతో నీ భార్గవ అవతారం అంతమ వుతుంది" అటువైపు నుంచి జేమ్స్ డేవిడ్ గొంతు కఠినంగా వినిపించింది.
"ఈ ఒక్క రాత్రి వదిలెయ్...ఈ అమ్మాయిని.."
"షటప్...నేను చెప్పింది చెయ్...ఓ పక్కనీ గురించి మధ్యప్రదేశ్ పోలీసులు ఓ పార్టి యిక్కడికి పంపిస్తున్నారు" చెప్పాడు జేమ్స్ డేవిడ్ .
"అలాగే" బయల్దేరుతున్నాను. చెప్పేసి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగాడు.
ఎదురుగా సరిత...ఆమె చేతిలో రివాల్వర్ భార్గవ వేషంలో వున్న సెక్స్ మానియాక్ వైపు గురిపెట్టబడి వుంది.
భార్గవ వేషంలో వున్న ఆ సెక్స్ మానియాక్ ఈ సంఘటనను వూహించలేదు.
"ష్...మాట్లాడొద్దు...మాట్లాడితే ప్రణవి నిద్రలేస్తుంది...నీ అసలు విషయం తెలిసి, నువ్వు తన భర్తవు కాదని తెలిస్తే నా చేతిలో వున్న రివాల్వర్ తీసుకొని నిన్ను బుల్లెట్లు అయిపోయే వరకు కాలుస్తుంది" కఠినంగా అంది సరిత.
ఆమెవైపే చూస్తున్నాడతను.
"నేను ఫైరింగులో ఎక్స్ పర్ట్ " హెచ్చరించింది సరిత.
"అంటే...నా గురించి మొత్తం తెలుసుకునే వచ్చావన్నమాట"
"ఇన్స్ పెక్టర్ కృపాల్ ని నువ్వు తక్కువగా అంచనా వేసావు. మర్యాదగా నాతోపాటు బయటకు వచ్చేయ్" అంది రివాల్వర్ ని గట్టిగా పట్టుకుని.ఆమె వేలు ట్రిగ్గర్ మీద బిగుసుకుంది. ఏ క్షణమైనా పేల్చడానికి సిద్ధమైనట్టు .
"ప్రణవి" అన్నాడు కంగారుగా అతను.
ఒక్క క్షణం సరిత తల తిప్పి, సోఫాలో పడుకున్న ప్రణవి వైపు చూసింది.
ఆవిడ ప్రశాంతంగా నిద్రపోతోంది. అదే సరిత చేసిన పొరపాటు. అతడ్ని తక్కువగా అంచనా వేసింది.
అతని చేయి గాలిలోకి లేచింది. సరిత చేతిలోని రివాల్వర్ పైకెగిరి .సినిమాటిగ్గా అతని చేతిలోకి వచ్చింది.
"ష్...మాట్లాడొద్దు" యిప్పడతనన్నాడు. నేను ప్రొఫెషనల్ క్రిమినల్ ని అని మరిచిపోయావు...నిన్ను చంపేసేవాడినే...రివ్వాలర్ పేలిన శబ్దానికి చుట్టుపక్కల వాళ్లు లేస్తారు...అందుకే" అంటూ రివాల్వర్ ని వెనక్కి తిప్పి గట్టిగా సరిత తలమీద బాదాడు.
దబ్బున వెనక్కి విరుచుకు పడిపోయింది సరిత.
అతనాలస్యం చేయలేదు.
రివాల్వర్ మీద వున్న తన చేతి ముద్రలను కర్చీఫ్ తో తుడిచి, సరిత దగ్గర వదిలి, బయటకు నడిచాడు.
అతనికోసం బయట వ్యాన్ ఒకటి సిద్ధంగా వుంది. అందులోకి ఎక్కాడు వ్యాన్ బయల్దేరింది.
కిళ్లీకొట్టు పక్కనుంచి యిదంతా చూస్తోన్న శివరావు వైర్లెస్ ద్వారా ఈ సమాచారాన్ని కృపాల్ కు అంద జేసాడు.
సరిగ్గా అదే సమయంలో కళ్లు తెరిచింది ప్రణవి...మగ్ లోకి నీళ్లు తెచ్చి సరిత మొహం మీద చల్లింది.
సరిత కళ్లు తెరిచింది.
"అతను...అతను నా భర్త కాదు కాదూ" ప్రణవి కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి.
"నేనంతా విన్నాను...అతను ఫోన్ చేస్తూ వుండడం...నువ్వు లేవడం... నీ తల దిండు సర్దుతూ దానికింద వున్న రివాల్వర్ చూడగానే అనుమానం వచ్చింది. తను ఫోన్ చేస్తూ మెల్లగా మాట్లాడిన ఆ మాటలు అనుకోకుండా విన్నాను. నువ్వాయన వైపు రివాల్వర్ గురిపెట్టడంతో నా అనుమానం బలపడింది. అతను నీ తలమీద బాది వెళ్లిపోవడంతో నా అనుమానం ధృవపడింది. అతను...అతను...నా భార్గవ కాదుకదు" అలా అంటున్నప్పుడు ఆమె గింతు వణికింది.
ప్రణవి భుజంమీద చేయేసింది ఆప్యాయంగా సరిత.
"రాత్రి...నా శీలం కాపాడ్డానికి...అందుకే... అందుకే కదు...నువ్వొచ్చింది" ఆమెగుండె లో తలపెట్టి ఏడ్చేసింది.
"ప్లీజ్...కూల్ డౌన్"
"మీ రుణం...ఎలా...ఎలా తీర్చుకోను" ప్రణవి ఏడుస్తూనే వుంది.
"కృపాల్ గారిచ్చిన ఐడియా యిది...నీకు ఏమీకాకుండదనే యిదంతా".
కృపాల్ పట్ల కృతజ్ఞతతో ప్రణవి మనసు నిండిపోయింది.
ఆ క్షణమే వచ్చిన మరో ఆలోచన ఆమెను వణికించింది.
మరి...మరి...నా భార్తెక్కడ? అన్న ఆలోచన అది.
శివరావు నుంచి ఫోన్ అందుకోగానే కృపాల్ ఎలర్టయ్యాడు.
సిటీ బ్యాంకు దగ్గర పోలీసులను మోహరింపచేసాడు. తన జీపులో క్రాస్ రోడ్స్ దగ్గర కాపుకాశాడు.
సిటీ బ్యాంకుకు వెళ్లాలన్నా యిదే రూటు...అట్నుంచి రావాలన్నా యిదే రూటు.
భార్గవ రూపంలో వున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనే ఓపిక పట్టాడు. యిప్పడా అవకాశంవచ్చింది.
హొల్ స్టర్ లో రివాల్వర్ రెడీగా వుంది. కృపాల్ కు ఈ ఎడ్వాంచార్ గమ్మత్తుగా వుంది. తనెన్నో కేసులు డీల్ చేసినా, యిలాంటి కేసు ఫస్ట్ టైమ్ ఎటెంప్ట్ చేస్తున్నాడు. ఏ క్షణమైనా ఏ పరిస్ధితినైనా ఎదుర్కొవడానికి సంసిద్ధంగా వున్నాడు.
అతని ఆలోచనలు ఒక్క క్షణం ప్రణవి వైపు మరలాయి.
పాపం...భర్తే ప్రపంచంగా బ్రతికే సాదాసీదా అమ్మాయి. రెండ్రోజులు భర్తలాంటి వ్యక్తితో ఒకే యింట్లో గడిపింది. అతను నీ భార్తకాదు అని చెప్పడానికి ఆధారాల్లేవు...అలా అని ఆ అమ్మాయి అతనికి దగ్గరవుతుంటే తను కామ్ గా వుండలేడు.
ఇప్పుడు భార్గవ రూపంలో వున్న వ్యక్తి మరెవరో అని తెలిస్తే ఆమె రియాక్షన్ ఏమిటి? తలుచుకోవడానికే యిబ్బందిగా అనిపించింది.
తప్పదు...వ్యక్తిగత జీవితంలో యిలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. ఈ సెంటిమెంట్స్ తననెక్కడ దెబ్బతీస్తాయోనని తను పెళ్లి చేసుకోలేదు.
తను వన్ అండ్ వోన్లీ వన్ పర్సన్. తనకే అటాచ్ మెంట్లు...సెంటిమెంట్లు లేవు...వుండకూడదు.
ఆలోచనల్లో నుంచి తేరుకుని తల విదిల్చాడు.
ప్రణవి తేలివైన ఆడపిల్ల...చెబితే అర్ధం చేసుకోగలదు. ఎలాగైనా ఆమె భర్తను తెచ్చి ఆమెకు అప్పగించాలి. అది తన బాధ్యత. భార్గవ రూపంలో వున్న వ్యక్తిని తను బంధించగలిగితే అన్ని నిజాలు బయటకు వస్తాయి.అయితే భార్గవ రూపంలో వున్న వ్యక్తిని బంధించడంకన్నా అతని వెనకవున్న వాళ్లను బంధించడం ముఖ్యం.
సిటీ బ్యాంకును రాబరీచేసే ప్రయత్నంలో అసలు మనుషులు తప్పక వస్తారు.
కృపాల్ మెదడు చురుగ్గా పనిచేస్తోంది. సిటీ బ్యాంకుకు...క్రాస్ రోడ్సుకు మధ్య దూరం కిలోమీటర్ కూడా వుండదు. ఈ మధ్య వాళ్లను పట్టుకోవాలి.