అతను ఆ పని మీద వుండగా- వీథిలో ముష్టి ప్రెసిడెంటు పైడితల్లి కనిపించేడు.
అతన్ని చూడగానే చెయ్యి కాళీ లేదని చెప్పేడు రామానుజం.
"నాకు తమ చేతుల్తో పని లేదండి! చెవులు చాలు!" అన్నాడు ప్రెసిడెంటు.
రామానుజాచార్యులు కీడేదో శంకించేడు. ఇష్టం లేకపోయినా - పైడితల్లి నోటి దగ్గర తన చెవిని పెట్టేడు.
చెప్పవలసివదంతా పైడితల్లి రామానుజాచార్యులు చెవిలో చెప్పేసి నోట్లో బీడీ పెట్టేసుకున్నాడు.
పైడితల్లి చెప్పింది విని రామానుజాచార్యులు గుడ్లు తేలేశాడు గుండెను చేత్తో పట్టుకుని కూలిపోయేడు.
ఆ దృశ్యాన్ని చూడగానే - అమ్మో అమ్మో అంటూ అందరూ రామానుజాచార్యులను చేరుకున్నారు. పైడితల్లి బీడీ కాలుస్తూశోద్యాన్ని చూస్తున్నాడు.
11
ఆనందం ఇంటోంచి తాయారమ్మ, పరమానందం ఇంటోంచి జానకమ్మ వీథిలోకి వచ్చేరు.
వాళ్ల చేతుల్లో పూల సజ్జలున్నాయి. వాటిల్లో పూజాద్రవ్యాలున్నాయి. రోడ్డుమీద ఇద్దరూ కలుసుకున్నారు. బావున్నావా వదినా అని ఒకర్నొకరు పరామర్శించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ మెల్లిగా నడుస్తున్నారు. దార్లో-
"ఏం బతుకులో ఏమిటో?" అన్నది ఆనందం భార్య తాయారమ్మ.
"పాపిష్టి బతుకులు" అని ఆన్సరిచ్చింది పరమానందంభార్య జానకమ్మ.
"అంతేమరి! ఎదురెదురు ఇళ్లల్లో వుంటూ కూడా కనీసం మంచీ చెడూ మాటాడుకోవటమే పడటం లేదంటే ఏవనాలి?"
"పాపిష్టి బతుకులని మళ్లీ చెప్పాలా వదినా?"
"వద్దులే వదినా! ఒకసారి అనుకున్నాం గదా! మళ్లా ఎందుకులే?"
"పోయినేడాది కార్తీకమాసంలో కాబోలు కలుసుకున్నాం!"
"మళ్లీ ఇప్పుడు! అవునూ - అన్నయ్య గారు కులాసానా?"
"ఏమడుగుతావులే? పెట్టి పుట్టారు మారాజు ఇంటో ఏముందీ ఏమి లేదని ఒక్కనాడైనా పట్టించుకున్నారా? ఏమన్నానా? మా అన్నగారెల్లా ఉన్నారు?"
"నీకు తెలీందేముంది వదినా? ఈయన కూడా అన్నయ్య మాదిరే!"
"గుడికే గదా!"
"అవునోదినా! నువ్వు కూడా గుడికేగా?"
"నీతో పాటు నడుస్తున్నాంటే అంతే కదా మరి? మీ అన్నయ్యను పందాల జోలికి వెళ్లకుండా బాగు చేసి పుణ్యం కట్టుకోమని వేణుగోపాలస్వామిని అడిగేందుకు వెడుతున్నా!"
"నేను కూడా స్వామిని ఆమాటే అడుగుదామనుకుంటున్నాను వదినా! పాపిష్టి పందాల అలవాటు నుండి మీ అన్నయ్యని దూరం చేయమని స్వామిని కోరుకుందామనుకుంటున్నాను."
"ఏమిటోనమ్మా! పడ్డచోటే వెత్తుక్కోవాలంటారు. ఆ దేవుడే నిన్ను కాపాడాలి!"
"బాగా చెప్పావు."
* * *
వేణుగోపాల స్వామి వారి ఆలయంలో-
దేవుడి ముందు కన్నీళ్లతో నిలబడి వున్నాడు రామానుజాచార్యులు.
"నేనేం తప్పుచేశానని నాకీ శిక్ష విధించావు స్వామీ! పెళ్లివారు ఊళ్లోకి వచ్చి పిల్లని చూడకుండా వెళ్లిపోయారు. నేను చేసిన పాప మేమిటి? ఎవరో దుండగులు, జూదగాళ్లు చేసే దుష్ట విన్యాసాలకు శిక్ష నాకు విదిస్తావా స్వామీ! వీథిలో జరుగుతున్న అనాచారానికి నేనా బాధ్యుడ్ని, ప్రభూ! ఇవాళ ఈ పెళ్లివారు వెళ్లిపోయారు. రేపు మరో పెళ్లివారు కూడా వెళ్లిపోతారు. ఎవరో చేస్తున్న కిరాతకానికి నన్నూ, నా పిల్లల్ని అన్యాయం చేస్తావా? ఇది నీకు ధర్మమా వేణుగోపాలా!" అని స్వామిని ప్రశ్నిస్తున్నాడు.
అంతలో - గుళ్లో గంట మోగింది. గర్భగుడి నుండి దృష్టి మరల్చి గంట కొట్టిన భక్తుల వైపు చూశాడు పూజారి.
తాయారమ్మ, జానకమ్మ నిలబడి వున్నారు!
ఆ ఆడంగులను చూడగానే రామానుజాచార్యులను కోపం ఉక్కిరి బిక్కిరి చేసింది. అడుగులో అడుగు బరువుగా వేసుకుంటూ ఆ ఇద్దరాడవాళ్లని చేరుకున్నాడు.
ఆడవాళ్లిద్దరూ నమస్కరించారు. రామానుజాచార్యులు నోరు తడి చేసుకుని అడిగేడు-
"స్వామివారిని దర్శించుకోడానికి వచ్చారా అమ్మా!"
"అవునండీ!" అంది జానకమ్మ.
"అర్చన చేయించుకుంటారా?"
"అవునండీ!" అన్నది తాయారమ్మ.
"ఎవరికి?" నీరసంగా అడిగేడు ఆచార్యులు.
పూజారి అంత విడ్డూరంగా అడిగే తీరు గమనించి ఒకరి మొహాలోకరు చూసుకున్నారు.
ఆచార్లు కటువుగా అడిగేడు -
"అర్చన మాత్రమే కాదమ్మా. అష్టోత్తరం కూడా జరిపిస్తాను. సరా!'
"గోత్రనామాలు మీకు తెలుసుగా?" అడిగింది జానకమ్మ.
"తెలుసునమ్మా! బాగా తెలుసు! నేను మంత్రాలవీ మరిచిపోవచ్చు. స్వామివారి పేరు వగైరా నా మెదడు నుండి మాయమైపోవచ్చు. మీ గోత్రాలు, నామాలు మరచిపోగలనా? అది నా తరమవుతుందా?" అన్నాడు ఆచార్యులు.
"ఏమిటా నిష్ఠూరం మాటలు?" అన్నది ఉడుకుమోత్తనంగా తాయారమ్మ.
"నిష్ఠూరం కాదు, తల్లీ! నా కడుపు మంట! నా పిల్లకి వచ్చిన క్షణమైన సంబంధం - మేము ఈ దిక్కుమాలిన వీథిలో కాపురముండటం మూలంగా కొట్టుకుపోయింది!"
"అయ్యోపాపం!" అన్నది జానకమ్మ.
"అదేమి విడ్డూరం?" ఆశ్చర్యపోయింది తాయారమ్మ.
"విడ్డూరమే నమ్మా! విడ్డూరమే! హల్లో స్విచ్ వేస్తే పెరట్లో లైటు వెలిగినట్టు - ఈ వీథిలో వున్న ఆనందం, పరమానందం పేర్లు వినగానే, మా ఇళ్లల్లో దీపాలు ఆరిపోవడం మామూలైపోయిందమ్మా! వాళ్ల కీర్తి ఆ విధంగా అఘోరిస్తోంది!"
"అర్థమయ్యేలాగా చెప్పండి!" అన్నది జానకమ్మ.
"మరేంలేదమ్మా! మీ భర్తలు పందాలవీ కట్టుకుంటూ కాలక్షేపం చేస్తూంటారుకదా! ఆ దిక్కుమాలిన పందాలకి నీతి నియమాలుండవు కదా? అంచేత ఏమిటంటే - ఈ వీథివారితో సంబందాలు పెట్టుకుంటే తమ బతుకులకు ముప్పు కలుగుతుందేమో నన్న భయంతో పెళ్లివారు ఇంటికి రాకుండానే పారిపోయేరు. మా పిల్లకే కాదు. ఈ వీథిలో ఆడపిల్లను యావన్మందికీ పెళ్లిళ్లుకావు. మగవెధవలకు సంబంధాలు రావు. ఏం ఫరవాలేదమ్మా! ఊరు వల్లకాడైనా మీరు, మీభర్తలూ పచ్చగా వుంటే అదే పదివేలు! ఇప్పుడు నేను శఠగోపురం పెట్టకుండా వుండలేను. అంచేత శఠగోపురం మీ నెత్తిన పెడతా! ఎలాంటి దీవెనలు కావాలో మీరే అనుకోండి!"
"పూజారిగారూ!...." అన్నది కన్నీళ్లతో తాయారమ్మ.
"అంతే కాదమ్మా! మీపేరిట, మీ భర్తల పేరిట అర్చన చేస్తాను అష్టోత్తరం, సహస్రనామం కూడా జరిపించాలనే వుంది కానీ, నా మతిపోయింది కదా! అంచేత మంత్రాలు గుర్తుకు రావడం లేదు. స్వామివారిని గుర్తుచేయమని వేడుకుని వస్తాను. ఇక్కడే వుండండి!" అని కన్నీళ్లతో రామానుజా చార్యులు గర్భగుడిలోకి వెళ్లేడు.
ఆడవాళ్లిద్దరూ గొప్ప బాధతోనూ, అవమానభారంతోనూ తల లోంచుకున్నారు.
అక్కడున్న సాటి ఆడవాళ్లు మాటా అన్నారు. "మగాళ్లనెందుకు ఆడిపోసుకొడం? వాళ్లని వీథికి వదిలేసిన ఆడవాళ్లని తిట్టాలి!"
"మొగుళ్లకు బుద్దిచెప్పుకుంటే వీథికి మేలు చేసినట్టవుతుంది. గుళ్లు గోపురాలు పట్టుకు తిరగడం మాని ఆ పని చేస్తే బోలెడు పుణ్యం దక్కుతుంది!"
"ఆ మగ మారాజులు ఆడవాళ్ల మాటలు విన మని ప్రతిజ్ఞ చేసేరో ఏమో?"
"పిండాకూడు ప్రతిజ్ఞలు! ప్రతిజ్ఞలు ఏమిటి? ప్రాణాలు తీసుకుంటామని ఆడవాళ్లు బెదిరిస్తే అప్పటికైనా పందాలు మానుకోరా ఏమిటి?"
"బెదిరింపులెందుకు? నిజంగానే ఛస్తామని బోర్డుకట్టుకుంటే -వీళ్లుచావనైనా చస్తారు. వాళ్లు మారనైనా మారతారు!"
అన్ని మాటలు విని -
జానకమ్మ, తాయారమ్మలు తలలు వంచుకుని అక్కడనుంచి కదిలారు. సిగ్గుతోను, బాధతోను, కొండంత అవమానం, అశాంతితోనూ వాళ్లు తమ ఇళ్లకు నడుస్తున్నారు భారంగా!
* * *
ఆనందం తీరుబడిగా తన గదిలో కూర్చున్నాడు.టి.వీలో హైదరాబాద్ దూరదర్శన్ తాలూకు కార్యక్రమాలు చూస్తున్నాడు. తలపోటుగా వుంది. టీ.వి కార్యక్రమాల వల్ల తలపోటు వచ్చిందో తలపోటు రావడం వల్ల కార్యక్రమాలు నచ్చడంలేదో తేల్చుకోలేకపోతున్నాడు.