Previous Page Next Page 
అశోకవనంలో సీత పేజి 9


    కిసుక్కున నవ్వింది నీరద.
  జానక్కి ఉడుకుమోత్తనం వచ్చింది. "నీ రాముడికన్నానా రావణాసురుడు వెయ్యిరెట్లు నయం. రాముడు, న్యాయం....ధర్మం...కర్తవ్యం..... గుడ్డూ...కూసు అంటూ అన్నింటికీ భయపడే పిరికివాడు. రావణాసురుడు మహా అందగాడు, ధైర్యస్థుడు, వీరుడు,శూరుడు...."
    "అంతేగాదు. పరాయివాడి పెళ్ళాన్ని దొంగచాటుగా ఎత్తుకెళ్ళేచోరుడు. అందగాడు నాబొంద, పిశాచంలాగా పది తలలు, రేపు పెళ్ళయిం తరువాత  పది తలలకి పనికల్పించి, పది నోళ్ళతో ఊపిరిపీల్చటానికయినా వీలులేకుండా నీపై ముద్దులవర్షం  కురిపిస్తే, నీపని ఠా!." అంటూ పూర్తి చేసింది శారద.
    "ఒసేయ్ శారదా! నీరదా! ణా రావణుడిని ఏమన్నా అన్నారంటే మీ మూతిపళ్లు రాళగొడతను." శారదవైపు తీవ్రంగాచూసి నీరదని నెత్తిన మొట్టి, సీతవైపు తిరిగి "మీరేం మాట్లాడటంలేదు మీ అభిప్రాయం కూడా చెప్పండి." అంది జానకి.
    "నాకూ కొద్దిగా రావణాసురుడంటేనే ఇష్టం" అంది సీత.
    "మెజార్టీ నాది గెలుపు నాకే." జానకి సంతోషంగా అరిచింది.
    "సీత,  వైదేహి, జానకి, ఈ పేర్లుగల వాళ్ళకి రాముడు నచ్చడెందుకనో?"
    శారద అనుమానం!
    "ఏమో? అది వాళ్ళకే తెలియాలి." అంది నీరద భుజాలెగరేసి.
    "నే వెళతాను." సీత లేవబోయింది.
    "వద్దొద్దు. కూర్చోండి. ఏ పాత్ర గొప్పదో తేల్చుకుని వ్యాసం రాసి పంపిద్దామనికదా, మాగోల! మా మాటలువిని మీకు తోచిన తప్పోప్పులు చెప్పండి." జానకి మర్యాద వుట్టిపడే స్వరంతో అంది.
    "ఇందాకనుంచి మీరు వాదులాడుకోటమే సరిపోయింది." అంది సీత.
    "ఇందాకటినుంచి జోక్ గా మాట్లాడుకున్నాము. అసలు విషయానికొస్తాను. రావణుని గొప్పదనం ఈవిధంగా.... ..... ....వర్ణిస్తూనే వ్యాసం పూర్తి చేస్తాను. ఎలా వుందంటారు?" జానకి అంది రావణుని గురించి ఎలా రాసేది వివరంగా చెప్పి.
    "బాగుంది. అలాగే రాయండి. మీ సైడ్ నుంచి ఆలోచిస్తే కరెక్ట్ గానే వుంది. మరి మీరో?" జానకిని మెచ్చుకోలుగాచూసి నీరదవైపు తిరిగి ప్రశ్నించింది సీత.
    "ణా ఫేవరెట్ రాముడు,  రాముడ్నిగురించి రాస్తాను. అదీ ఎలా రాస్తానంటే.  రాముడు .... దేముడు,  అంటూ పూర్తి చేస్తాను" నీరద రాముడి గుణాల్ని కీర్తిస్తూ, వర్ణిస్తూ చెప్పింది.
    నాకు మిగిలింది సీత. సీత కష్టాలుగురించి రాస్తే ఎడిటర్ గారు ఏడ్చినా, ఏడ్వకపోయినా, ఆడ పాఠకులు ఏడ్చి ణా వ్యాసమే బాగుందంటూ  ఉత్తరాలు రాస్తారు. ణా వ్యాసం బహుమతి కొట్టేస్తుంది." అంది శారద. సీత పాత్ర తీసుకోడానికి బోలెడు బాధ పడుతూ.
    "ఎవరికివారు చెప్పింది సమంజసంగా వుంది. అలాగే రాయండి." అంది సీత,
    "మీకు రోచింది చెప్పండి, మీ విమర్శ, మీ అభిప్రాయము తెలుస్తుంది. మెయిన్ ఈమూడు పాత్రలు. అవిగాక చాలా వస్తాయికదా? లక్ష్మణుడు, ఊర్మిళ, కైక, మందర  వగైరాలు. వాళ్ళలో గొప్ప ఎవరిది? వాళ్ళగురించి రాస్తే వ్యాసం అచ్చవుతుందా? ఒకవేళ అచ్చయితే బహుమతి వస్తుందా?"
    వ్యాసం ఎలా వుండాలట?" అడిగింది సీత.
    "మెయిన్ పాత్రయొక్క గుణగణాలు వివరంగా రాస్తూ మిగిలినపాత్రలయొక్క కొన్ని బలహీనతలు రాయాలి! వ్యాసంలో వ్యంగ్యం కలిసిన వాస్తవం వుండాలి. రామాయణ వ్యాసాల పోటీ సీరియస్ ది కాదు. పాఠకుల కొరకు తమాషాగా నిర్వహిస్తున్నది." ఇవరం చెప్పింది శారద.
     అలా చెప్పండి! అయితే మీరు రాయవలసింది- రావణుడు, రాముడు, సీత గురించి కాదు, భరతుడిని గురించి రాస్తే బాగుంటుంది."
     సీత చెప్పింది  విని  ముగ్గురూ "భారతడా, ఆయనదేముంది? సినిమా హల్లో గేటుకీపరు పాత్రలాంటిది." అన్నారు ఏక కంఠంతో.
    "వాస్తవము, వ్యంగ్యమూ, తమాషా వ్యాసంలో వుండాలి కాబట్టి, భరతుడు సరిపోతాడు. ఆ వ్యాసం  ఎలారాస్తే బాగుంటుందో చెపుతావినండి...." అంటూ సీత మొదలుపెట్టింది.
    సీత ఏం చెపుతుందో అని ముగ్గురూ కుర్చీల్లోంచి కాస్త ముందుకు జరిగి చెవులప్పగించి కుతూహలంగా సీతవైపు చూశారు.
    "రాముడికి కీర్తి, కాంక్ష ఎక్కువ అందుకే సీత పాత్రని ఆయుధంగాతీసుకుని ప్రతి నిమిషం రామాయణంలో తనే కనిపించాడు ఆహల్యశాప విమోచానానికీ రాముడే, శివధనస్సు విరవటానికీ రాముడే, సీతని పెళ్లాడాటానికీ రాముడే, రాజ్య వారసుడూ రాముడే, పెద్ద కొడుకైందీ రాముడే, ఆడినమాట తప్పనివాడులా అడవులకెళ్ళిందీ రాముడే, వాలిని చంపి, సుగ్రీవుడికి తారనిచ్చి పెళ్ళి చేసిందీ రాముడే, సీత కోసం యుద్ధం చేసింది రాముడే, రావణాసురుడిని చంపిందీ రాముడే, సీతని అగ్ని పరీక్షకి గురిచేసింది రాముడే, రావణాసురుడిని చంపందీ రాముడే, సీతని అగ్ని పరీక్షకి గురిచేసింది రాముడే, సీతని దగ్గరకు తీసుకుని మాతృమూర్తిగా చేసిందీ రాముడే, ఏ గాడ్దెకొడుకు మాటోవిని అడవికి భార్యని తోలిందీ రాముడే సీతకి లవకుశలు పుట్టిన తరువాత వాల్మీకి మాటలువిని సీతని స్వీకరించిందీ రాముడే. రామ....రామ.... దీన్నిబట్టి చూస్తే రామాయణంలో రామ శబ్దం లేని పేరే లేదేమో!
    కొందరు పెద్దనటులు తమ అభిమానులచేత ఈహీరో ఇంద్రుడూ, చంద్రుడు అని పోగిడించుకుని, ప్రచారం చేయించుకుని పేపరు నిండా తమపేరూ. ఫోటోలు వేయించుకుంటుంటారు. విటమిన్ 'యమ్' వెదజల్లే అనుకోండి. అలాగే రాముడు, వాల్మీకిని పట్టుకుని రామాయణం రాయించి వుంటాడు. ఇటు తనకి, అటు ఆయనకి పేరు ప్రఖ్యాతులు వస్తాయని. ఒకే దెబ్బకి రెండు పక్షులన్నట్లు వాల్మీకి రాసుంటాడు."
    "హియర్, హియర్.... చూశావా నీ  సర్వ గుణగణ శోభితుడైన రాముడి కథ." జానకి చప్పట్లు కొడుతూ అంది.
    నీరద కొద్దిగా ముఖం ముడుచుకుంది.
    "నే చెప్పేది పూర్తి రామాయణ కథ కాదు, పాత్రలను కీర్తించి కాదు. ఆ బుర్రలేని ఎడిటరెవరో రామాయణం తీసుకుని వాస్తవానికి వ్యంగ్యం జోడించమన్నాడుకదా! వ్యంగ్యమైనా రాయమానాలి. వాస్తవమైణా రాయమనాలి. ఇదెలా వుందంటే ఆడా మగ కాకుండా నపుంసకుడి కథలా వుంది!" సీత అంది.
     "ఇవాళ రెండు పత్రికలు పడుతుంటే మర్నాడు ఓ పత్రిక చస్తున్నది. ఈ కొత్త పత్రికలవాళ్ళు నాల్గు కాలాలపాటు నిలబడటానికి చచ్చు పజిల్స్, తిక్క వ్యాసాలు! వాటికి బహుమతులు పెడుతున్నారు. రచయిత్రులవుదామని కోరిక- రాయలేక రచయిత్రి కాలేననే బాధగల మా లాంటి కొందరు. ఈ వ్యాసాల మీదికి, పజిల్స్ మీదికి దూకుతున్నారు." జానకి చెప్పింది.
    "ఇవాళ పుట్టి, రేపు చచ్చే పత్రికల జోతికి పోకండి."  సీత ఉచిత సలహా ఇచ్చి కుర్చీలోంచి లేచింది.
    ముగ్గురూ సీతని కుర్చీలో కూలేశారు.
    "మాకన్నా మీకే బాగా తెలుసు. ఒక్కోపాత్ర గురించి మీరు చెపితే- మాకు నచ్చింది మేం రాస్తాం. వ్యాసం రాసి పోటీలో బహుమతి తెచ్చుకోవాలని మా కాలేజీ గరల్స్ మొత్తం కొట్టుకుచస్తున్నాము. ప్లీజ్! మీరు చెప్పాల్సిందే!" అంది శారద.
    " మా సీత చాలా మంచిది. కమ్మగా  వంటచేస్తుంది. కమ్మగా కబుర్లు చెపుతుంది." అంది నీరద.
    నీరద పొగడ్తకు లొంగిపోయి పొంగిపోలేదు సీత. వంటమనిషి, వంటచేయటం, ఆ మాటింటే చాలు. ఎవరో కావాలని కంట్లో వేలుబెట్టి పొడిచినట్లు బాధపడుతున్నది. అదీ కాసేపే, వెంటనే- "తప్పేముంది? నే వీళ్ళింట్లో వంటచేస్తున్నా కాబట్టి వంట మనిషిని, రుచిగా పదార్థాలు ఉన్నాయి కాబట్టి కమ్మగా వుంది వుంట.....! అంటున్నారు. వాళ్ళ తప్పేంలేదు" అనుకుని తనకి తనే సముదాయించుకుంటున్నది.
    నీరద పొగడ్తకు బాధవేసి తలొంచుకున్న సీత బాధ తుడిచేసుకుని తలెత్తింది. ఎదురుగా శాంతకుమారి.
    "శాంతకుమారిని చూసి "వెళతానండి!" అంది సీత.
    "చూడమ్మా! మా వ్యాసానికి కావలసిన మేటర్ సీత చక్కగా చెపుతూ మధ్యలో లేచిపోతానంటున్నది. నువ్వుండమని చెప్పమ్మా! మా  అమ్మ మంచిది. అమ్మ చెపితే సీత వింటుంది! సీత  మంచిది." నీరద గారాలుపోతూ అంది.
    శాంతకుమారి  అంతవరకూ జరిగిన చర్చ తెలుసుకుని, వివరాలు కనుక్కుని "సీతా! నాకూ సరదాగా వుంది! ఇప్పుడేం పనిలేదుగా! చెప్పు' చెప్పు!" అంది.
    ఇంటి యజమానురాలే అడుగుతుంటే సీత ఏమనగలదు?
    సీత మళ్లీ మొదలుపెట్టింది, హరికథలాంటి గిరికథ.
                                            8
    రావణారుసుడ్ని గురించి ముందుగా చెప్పు!" అంది జానకి.
    "మన కాలేజీలో రావణుని పేరుగల హీరో ఎవరైనా వున్నాడటే  శారద?" నీరద అడిగింది.
    "ఉహూఁ___శ్రీ రామకుమార్ అనే కుర్రాడున్నాడు! ఊరికే అమ్మాయిలని ఏడిపిస్తూవుంటాడు!" శారద అంది.
    "సరేలే నోరుమూసుకో!" అంది నీరద చిరుకోపంతో.
    "నేను చెప్పేదేమంటే....." శారద నోరు తెరుచింది.
    "నువ్వేం చెప్పక్కరలేదు! మూసుకోమన్నా కదా నీ నోరు, తగ్గించు నీ జోరు! మాటాడకు మారు, కాదంటే మేము వేరు." అంటూ శారద నోరు మూసింది నీరద. "మొదలుపెట్టు సీతా!" అంది సీత వైపు తిరిగి.
    సీత రావణాసురుడ్ని గురించి మొదలుపెట్టింది.
    "రావణాసురుడు- వీరుడు. శూరుడు, చోరుడు. రాజనేవాడు అన్ని ధర్మాలకు కట్టుబడి వుండనక్కరాలేదు. వుంటే- ధర్మరాజు గతి, సత్య హరిశ్చంద్రుడి గతీ పడుతుంది. అంటే ఊరికే కష్టాలుపడటం! రాముడు అందుకే పడ్డాడు కష్టాలు. కాబట్టి రాజుకుండాల్సింది వీరత్వం, శూరత్వం, సమయానుకూలతగా  వ్యవహరించే నేర్పు, ఓర్పు!  అంతేగాని అన్నీవుండి చొరత్వం ఏమిటి? అంటే రాజుకి, దొంగకి బేధం లేనట్లేకదా?  మన్మధ రూపుడు, శివభక్తుడు, లక్ష్మిని చేజిక్కించుకున్నవాడు, మహా  సౌందర్య వతి మండోదరికి పతి, రమణుల పాలిటి రసికుడు, సీత కోసం దొంగ చాటుగా రానేలా, తన సర్వనాశనానికి తానే కారణం కానేల? దీనినే___ 'వినాశాకాలే విపరీత బుద్ధి!' అన్నారు. ఓ విధంగా చూస్తే సీతా, రాముడి ప్రాముఖ్యం కన్నా రావన ప్రాముఖ్యం రామాయాణంలోఎక్కువ! ఎందుకంటే సీతని దొంగచాటుగా దొంగలించికెళ్ళిన తరువాతే కదా రామాయణ కథ మాంచి రసపట్టు, సస్పెన్స్ తోను నడిచింది. ఇంకోటి గమనించారో, లేదో! రామాయణం మొత్తం తిరగేసినా మెడకాయ మీద తలకాయ  అందరికీ ఒకటే వుంది. రావణుడికి  అలాకాదు,  పది తలలు! పాపం..... తలంటుకోవాలంటే పది తలలకీ చమురు పెట్టుకుని- పది తలలూ రుద్దు కోవాలి కదా! మంగలాడు రోజూ పది గడ్డాలు గీయాలి..... పది తలల మీద జుట్టు...." 

 Previous Page Next Page