Previous Page Next Page 
అశోకవనంలో సీత పేజి 7


    "మళ్ళీ వస్తా." అని ఓబయ్య వెళ్ళిపోయాడు.
    ప్రతివాళ్ళ దగ్గర సీతది ఇదే తంతు. వాళ్లమాటలు ఒకేరకం. వీళ్ళ మాటలినకపోయినా అంజమ్మ ఓ కంటేం ఖర్మ! రెండు కళ్లతో జరిగిన తంతు చూసింది.
    హొటల్ కొచ్చిన అందరూ కాఫీ, టిఫెన్ బాగుండలేదని- కౌంటరులో వున్న అంజమ్మ ముఖాన అని వెళ్లారు.
    కారణం తెలియని అంజమ్మ ముఖం మాడింది.
    రాత్రి భోజనాలు__
    భోంచేస్తున్న అందరికీ వెర్రి పుట్టింది. పది మంది- "కూరలన్నీ ఉప్పుకషాయం!" అన్నారు. పదమూడు మంది- "హా.....హా....కారం.... హా.....గొడ్డుకారం....హా...." అన్నారు. "చారు ఫెనాయిల్ కంపుకొడుతున్నది." చారు ప్రియుల బాధ. "చట్నీ కిరసనాయిలుతో తాళింపు పెట్టి నూరారా?" కొందరి ఏడ్పులాంటి జోకు.
    భోరున ఏడ్వకపోయినా, ఆడదానిలా అఘోరించకపోయినా, భార్యలా సతాయించకపోయినా, ఆ పూట హొటల్లో తిండి తిన్నవాళ్ళంతా తలో పదార్థానికి తలోవంకాపెట్టి వెళ్లిపోయారు.
    అంజమ్మ అన్ని పదార్థాలను రుచిచూసింది. తినెళ్లినవారు చెప్పింది నిజమే! ఎప్పుడూ చూడని రుచులు, ఎన్నడూ ఎరగని వాసనలు.
    అంజమ్మ అందరిమీద వాడు, బధ్ధవిరోధుల్లా నేరం మోపుకున్నారు. అదేమాట మరో అర్థంతో అన్నారు.
    గట్టి వార్నింగ్ ఇచ్చింది అంజమ్మ. అదీ మొదటిసారి కాబట్టి అంతటితో వూరుకుంది. మొదటిసారి కాబట్టి వూరుకున్నానని చెప్పింది.
    రాత్రి అందరూ పడుకున్నారు- దొంగనిద్ర నటిస్తూ.
    సీత అంజమ్మకి కాస్త పక్కగా పడుకుంది, ఒంట్లోబాగుండలేదని. ఆపూట ఏమీ తినలేదు, కాఫీ తాగింది.
    ఒంటరిగా సీతతో మాట్లాడి, దగ్గరకు తీసుకోవాలి. ఆ తర్వాత సీత స్వంతం అవుతుంది. ఆ తర్వాత....? ఎవరికీ వారు! ఇదే ఆలోచనతో పక్కవారు పడుకుంటాడేమో అని చూస్తూ పక్కమీద దొర్లుతున్నారు. దొర్లిదొర్లి ఎవరికి వారికి తెలియకుండానే నిద్రపోయారు.
    బాగా రాత్రి అయింది.
    నిద్రపోదల్చుకోలేదు కాబట్టి సీత నిద్రపోలేదు. వెలుగుతున్న బుడ్డి దీపాన్ని ఆర్పింది. గదిలో గాడాంధకారం అలముకుంది.
    ఒంటిగంట కావస్తుంది, సీత గావుకేకలేస్తూ లేచికూర్చుంది.
    అంజమ్మ లేచింది "ఏమయిందేమయింది...!?" అంటూ.
    గదంతా చీకటిగా  వుంది.
    "దీపమేది?" అంజమ్మ అంది.
    "ఊఁ. ఊఁ___" అంటూనే అగ్గిపెట్టె అందించింది సీత.
    అంజమ్మ బుడ్డిలైటు వెలిగించింది.
    సీత తప్ప గదిలో ఎవ్వరూ లేరు. సీత మోకాళ్ళకు చేతులు బంధం వేసి, మోకాళ్ళలో తల దూర్చుకుని చాతయిన విధంగా చాకచక్య మంతా ఉపయోగించి ఏడ్పులాంటిది ఏడుస్తున్నది.
    "ఏమైంది సీతా?" అంది అంజమ్మ ప్రేమగా సీత తల నిమురుతూ.
    "ఇంకా ఏం కావాలా? ఎప్పుడో అవుతుంది!" అంది సీత.
    "ఏం అయ్యేది? ఏం జరిగింది? చెప్పకపోతే ఎలా తెలుస్తుంది?" అంది అంజమ్మ.
    "వాళ్ళనెళ్లి  అడుగు."
    "ఎవరిని?"
    "ఇంకెవరిని.... ఉన్నారుగా- ఈ హొటల్ని ఏలే మగ మహా రాజులు! వాళ్ళని." అంది సీత.
    "ఏంటో నువ్వు చెప్పేదేంటో సరిగ్గా చెప్పు!"
    "నాకు సిగ్గులేదు, ఏం చేస్తాను? నోరుతెరిచి నేనే చెప్పుకోవాలి. "ణా ఖర్మ, న రాత! ఒంటరి ఆడపిల్లగతి కాకులకి, గద్దలకి అని ఎరగను!" అని ఆపై ముక్కు ఎగబీల్చి ఊరుకుంది సీత.
    సగంలో ఆపేస్తే అంజమ్మలో ఆతృత పెరుగుతుంది. ఆతృతతో వున్న మనిషి ఎదుటి మనిషి మనస్తత్వాన్ని గ్రహించలేదు. మరి తను నాటకం కదా ఆడేది? నాటకం రక్తి కట్టాలంటే ముందేం జరుగుతుందా? లేక జరిగింది ఏమిటబ్బా? అనే ఆతృత వుండాలికదా! కాబట్టి....! సీత ఆలోచించే సగంలో ఆపేసింది.
    అంజమ్మకి నిజంగా ఆతృత ఎక్కువైంది.
    "చెప్పు సీతా! ఇలా సగంలో ఆపేస్తే, నాకు తెలిసిచావటం లేదాయె! ఎలా చావను చెప్పు?" అంది అంజమ్మ, ఫలానా విధంగా చావటానికి సిద్దమైనదానిలా ముఖంపెట్టి.
    "మరేమో..... నేను పడుకున్నా కదా! సరిగ్గా నిద్రపట్టలేదు. ఇప్పటిదాకా మేలుకుని మనసు బాగుండక ఆలోచించి, ఆలోచించి....." తన మనసెందుకు బాగుండలేదోచెప్పలేదు, దాటేసింది. దాటేసి__ఇప్పుడే ఇలా కన్నుమూశాను. అప్పుడేమో...." చెపుతున్నది ఆపి తడిక వేపు చూసింది. అంటే తనచూపుల్ని బట్టి అంజమ్మలో అనుమాన పిశాచంపైకి రావాలి. అందుకే అలా చూసి, తడికవైపునుంచి ముఖము, చూపులుతిప్పి మళ్ళీ అంజమ్మవైపు చూస్తూ- "దీపం వాళ్ళల్లో ఎవడో నా మీద కొచ్చి...." ప్చ్, ప్చ్....ముక్కు ఎగబీల్చింది. "నానోరు మూసి పడ్డాడు, నేను వాడ్ని తోసి కేకలేశాను. నువ్వు లేచావు, వాడెళ్ళిపోయాడు." సీత ఆగుతూ, చెపుతూ.... ఆగుతూ, చెపుతూ//// చెప్పవలసింది పూర్తి చేసింది.
    అంజమ్మ అర్థం చేసుకుని అపరకాళిలా లేచింది. తడిక చాటుకి వెళ్లింది.
    పుల్లారావు , ఓబయ్య, సాంబు - మొద్దునిద్రపోతున్నారు, కుంభ కర్ణుడి తమ్ముళ్ళలాగా.
    అంజమ్మ కాలితో తన్ని లేపింది వాళ్ళ ముగ్గురిని.
    సీతతో చెయ్యికలిపి రికార్డింగ్ డాన్స్ చేస్తున్న పుల్లారావు.....సీతతో కాశ్మీర్ కొండల మంచుమీద చెప్పులులేని కాళ్ళతో గెంతుతున్న సాంబు..... సీతతో దాంపత్యం చేస్తున్నా ఓబయ్య....కలలోంచి అంజమ్మ కాలిదెబ్బకి ధన్ మని లేచి కూర్చున్నారు.
    "ఎవరీ పని చేసింది?" అంజమ్మ ముగ్గురినీ మార్చి మార్చి చూస్తూ అడిగింది.
    "ఏం  పనబ్బా?" అన్నట్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆపై తిన్నగా అంజమ్మ ముఖం చూచి గతుక్కుమన్నారు.
    అంజమ్మ నిప్పులు కక్కుతున్నట్లు చూసింది వాళ్ళ ముగ్గురిని.
    "రండి." అంటూ అంజమ్మ గిరుక్కున వెనుతిరిగి నడవగా, ముగ్గురూ పిల్లుల్లా అంజమ్మని అనుసరించి సీత దగ్గరకొచ్చి ఆగారు.
    సీతని చూడగానే వాళ్ళ ఆరుకళ్ళూ మెరిశాయి.
    సీత ముఖం పక్కకు తిప్పుకుంది.
    "ఊ....చెప్పుండి." అంజమ్మ గర్జన!
    ఎవరు చెప్పాల్సింది, ఏం చెప్పాల్సింది, వాళ్ళ ముగ్గురిలో ఎవరికీ తెలియలేదు.
    "నే ఇక్కడున్నానని తెలిసి.... నా మోచేతి నీళ్ళు తాగుతూ...! నేను బాగా చూసుకుంటున్న సీతని....! నా ఆజ్ఞ- పోనీ సీత ఆజ్ఞలేనిదే ....సీత మీద....దీపం ఆర్పి...పడతావా....? ఎవరా పడ్డది...? ఊ....చెప్పండి...?" అంజమ్మ నోట్లోంచి ఉరమని పిడుగులాంటి శబ్దం.
    ఈమాటవిన్న ముగ్గురు కంగారుపడలేదు! "వెధవకానా! ఈ పని చేసింది నువ్వే," అన్నట్లు నమిలిమింగే కోపంతో ఓబయ్యనని పుల్లారావు సాంబుని ఓబయ్య, వాళ్ళిద్దరినీ ఓబయ్యా, అనుమానంతో చూసుకున్నారు! ఎవరికివారు ఆ ....పని చేసింది తాను కాదనే ధైర్యంతో నుంచున్నారు!
    "మాట్లాడరేం?" మండిపడింది అంజమ్మ!
    "నేనుకాదు." ఓబయ్య-
    "నే నసలేకాదు." పుల్లారావు-
    "నాకేం తెలుసు?" సాంబు-
    "మీ ముగ్గురితో ఈపని చేసింది ఒకరే నిజం చెప్పండి." మళ్ళీ అంది అంజమ్మ.
    "కావచ్చు. నే మటుకు కాదు." ఓబయ్య ధైర్యంగా చెప్పాడు.
    "నే కాకుండా.  వాళ్ళిద్దరిలో ఎవరైనా కావచ్చు." పుల్లారావు మరింత ధైర్యంగా మాట వదిలాడు.
    "నేనూ కాదు కాబట్టి....!" ఆగాడు సాంబు. మరెవరైనా కావచ్చనే అర్థంతో.
    ఈ అర్థరాత్రి అంకమ్మశివాలుకి అంజమ్మకి కోపం వస్తున్నది.  సీతకి నవ్వొస్తుంది.
    "ఏంటి సీతా! వీళ్ళిట్లా అంటున్నారు?" అంజమ్మ అంది.
    "చేసినవాడు చెపుతాడేంటి? చెప్పేవాడయితే ధైర్యంగానే ప్రవర్తిస్తాడు. ఎవడో నాకేంతెలుసు. చేతయితే నీవే కనుక్కో, నాదోవననేపోతా?" అంది సీత.
    సీత వెళ్ళిపోవటం అంజమ్మకిష్టంలేదు. ఆలోచించింది, మెదడులో ఓ మెరుపు మెరిసింది.
    "పుల్లారావ్! సాయంత్రంనుంచీ నే కనిపెడుతూనేవున్నాను. సీతని నువ్వే...!" అంజమ్మ పుల్లారావుమీద బాణం విడిచింది.
    "సీత వంటిమీద నే చెయ్యి వెయ్యలేదు. నా మీద ఒట్టు." పుల్లారావు సీత వంటిమీద ఇంతవరకు చెయ్యి వెయ్యలేకపోయానే అని బాధపడుతూ అన్నాడు.
    "ఓబయ్య నువ్వే ఈపని చేసింది."
    "రామ .... రామ .... నేనే పాపమూ ఎరగను." లబలబ లాడాడు ఓబయ్య.
    "అర్థ మయింది. సాంబూ! నువ్వేరా ఈపని అన్నాడు.
    "దేముడిమీద ఆన." సాంబు భయపడుతూ అన్నాడు.
    ముగ్గురూ నిజం చెప్పినట్లే అనిపించింది అంజమ్మకి. సీతా! నీమీద పడ్డవాడి ఎత్తూ, లావూ చెప్పగలవా?" అంది సీతవైపు తిరిగి.
    "చీకటిగావుంది .... భయపడి చచ్చాను ..... తడిమిచూసి చచ్చేనేమిటి ఎత్తూ, లావూ చెప్పటానికి?" గింజుకుంది సీత.
    అంజమ్మ దీర్ఘంగా ఆలోచించింది.
    "పుల్లారావ్! సీతని నువ్వుపెళ్ళిచేసుకుంటావా? సీతంటే ఇష్టమేనా?"
    పుల్లారావు బోలెడు సంతోషంతో తల వూపాడు.
    "ఓబయ్యా! నీకు సీతంటే ఇష్టమేనా! సీతని పెళ్ళాడతావా?"
    "ఓ....యాస్....సీత ఒప్పుకోవాలేగాని...నా అభ్యంతరంలేదు." ఓబయ్య రుబ్బుడుపత్రంలా తల వూపుతూ మరీ చెప్పాడు.
    "నువ్వురా సాంబూ!"
    "సీత "ఊఁ" అంటే రేపే పెళ్ళిచేసుకుంటాను." సాంబు ఏ అడుగు ముందుకేసి అన్నాడు.
    "విన్నావా, సీతా! ముగ్గురికి నీవంటే ఇష్టమే. నీ యిష్టమయిన వాడిని పెళ్ళాడు. హాయిగా ఇద్దరూ హొటల్లో చిలకా గోరింకల్లా వుండండి." అంజమ్మ, సీతకి సలహా యిచ్చింది.
    సీత మాట్లాడలేదు. కనీసం "ఊఁ" అనికూడా అనలేదు. తను విఅజయవాడవచ్చేటప్పుడు ఏ సంచితో అయితే వచ్చిందో, ఆ సంచి వంకెన వుంటే తీసి దులిపింది. దండేనవున్న రెండు చీరలు, మూడు జాకిట్లు, సంచిలో పెట్టుకుంది. చెప్పులేసుకుంది. వెళుతున్నాను. ఇన్నాళ్ళు నన్ను పోషించినందుకు కృతజ్ఞతలు." అంటూ రెండడుగులేసింది.
    గుడ్లప్పజెప్పిచూస్తున్న అంజమ్మలో చలనం వచ్చింది. "అదేంటి సీతా! వెళ్ళటమేమిటి?" అంది.
    "అవును! ఇక్కడ నా ఇష్టంలేదు? మీకు తోచిందే ఇష్టం. చదువుకున్నాను. నాకు కొన్ని అభిరుచులు, ఆశయాలు వున్నాయి. వీళ్ళని నేను పెళ్ళిచేసుకోటమా? ఇంపజిబుల్, వీళ్ళ గుణం అర్థమయింది కదా? నామీద చెయ్యివేసింది మేం కాదంటే మేం కాదన్నారు. పెళ్ళి చేసుకోమంటే ఎగిరి గంతేసి ముగ్గురూ ముందుకొచ్చారు, మొదటినుంచి వీళ్ళ చూపులు, మాటలు భరించలేక నీతో చెప్పుకుంటే "మొగముండా కొడుకుల బుద్ధే అంత  చూసీచూడనట్లు వెళ్ళు." అన్నావు ఏమయింది? నే చూసీచూడనట్లు పోవటంవల్ల వీళ్ళకి అలుసయింది. ఇష్టమొచ్చినట్లు మొరగటం ఎక్కువయింది.
    "ఇది మొగుడ్ని విడిచేసివచ్చిన బాపతురా ఓపట్టుపడదామా?" అని ఒకడంటే, ఇంకొకడు. "అదేదో నేనే చూస్తా, కొత్తకదా అని చూస్తున్నాను." అన్నాడు. అంటే...? ఏదో ఓరోజు సమయం చిక్కితే నన్ను లోంగదీసుకునే ప్రయత్నంలో ఉన్నారన్నమాటేకదా?
    సమయం చిక్కింది. ఈరోజు ఇంతకు క్రితమే చీకట్లోపిరికివెధవలా లోంగదీసుకోటానికి ఓ వెధవ ప్రయత్నించాడు. నా కేకలు, పక్కన నీవు వుండటంతో వెధవ తోకముడిచాడు. ఇవాళగాకపోతే రేపయినా తప్పదు ప్రమాదం. ఏదయినాజరక్కుండానే వుండాలి, జరిగిందా! అదలా మంచో, చెడో జరుగుతూనే వుంటుంది." సీత చిన్నసైజు ఉపన్యాసం ఇచ్చింది.
    అంజమ్మకి ఏం మాట్లాడాలో తెలియలేదు.
    వాళ్ళ ముగ్గురూ మింగా కక్కలేని పరిస్థితిలో  పడ్డారు.
    "ఈవూరు వచ్చింతరువాత కన్నబిడ్డలా నన్నాదుకున్నావు. ఇహ ముందుకూడా నన్ను బిడ్డలాగానే చూసుకుంటావు. ఆ నమ్మకం ఎప్పటికీ నాకు నీపై చెదరిపోదు. ఎక్కడికిపోతున్నావని అడగవద్దు. దిక్కులేని వారికి దేముడు ఉచితంగా దిక్కు చూపిస్తాడట. ఏదో ఓ దిక్కు చూసుకుంటాను. మనస్ఫూర్తిగా ఇచ్చటినుంచి పోవటం నాకూ ఇష్టంలేదు. పరిస్థితులు, నన్ను ఈ హొటల్ కి దూరంచేస్తున్నాయి. ఎప్పుడయినా వచ్చి కనపడుతుంటాను. సెలవ్." అంజమ్మతో సీత అని వెళ్ళిపోవటానికి తలుపుతీసింది.
    "వెళ్ళకు సీతా! నామాట విను." అంది అంజమ్మ.
    సీత సంచితో గుమ్మందాటింది.
    "తొందరపడకు సీతా! పోనీ తెల్లారనీ వెళుదువుగాని." అంజమ్మ గుమ్మందాకావచ్చిఅంది.
    సీత తిరిగిచూడలేదు. జవాబివ్వలేదు. చకచకా ముందుకు సాగింది-
    అంజమ్మ పెద్దగా వాళ్ళ ముగ్గురినీ కేకలేయటం సీత వింది.

 Previous Page Next Page