మల్లన్న తోపాటు జి.కె. రూంలోకి నడిచింది. మంచం మీద పడుకుని మూలుగుతున్నాడు. లేచే స్థితిలో లేడు.
" బాండికాట్" ఈసడించుకుంది.
ఇప్పుడు సిగరెట్ కాల్చి వీడికి అంటిస్తే
ఆమె పెదవుల పైన నవ్వు.
తనని అతను పెట్టిన హింసలన్నీ ఇప్పుడు తను పెట్టగలదు.
మల్లన్న జి.కె. తలపైన ఐస్ బ్యాగ్ పెట్టాడు.
" వీడి స్వామి భక్తి తగలడిపోను" అని మనసులోనే అనుకుంది.
" అమ్మా ఎవరూ లేరిక్కడ"
"అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు కోటీశ్వరుడుగదా!... చేసుకున్నాళ్ళకి చేసుకున్నంతని. సెక్రటరీకి చెప్పాను ఇద్దరు సిప్టర్స్ ని పెట్టమని" అంది నాగమణి.
ఆమె మనస్సు కరిగిపోతుంది.
" వీడా నా మొగుడు!" అనుకుంది మనస్సులో.
మొగుడు చావాలని ఏ ఆడదీ కోరుకోదు. వాడెంత వెధవై నా సరే! కానీ ఆమె ఆ స్థితికి చెరుకుందంటేనే అతనెంత కిరాతకంగా వ్యవహరిస్తున్నాడో అర్థం చేసుకోవాలి.
జి.కె. కళ్ళు తెరిచాడు.
ఎదురుగా నాగమణి.
అతని చూపు కఠినంగా మారిపోయింది.
" హౌ ఆర్యూ జి.కె." అంది.
తనని పేరుపెట్టి పిలుస్తున్న భార్యని చూసి కోపంతో మనస్సు ఉడికిపోతోంది. కానీ లెవలేని స్థితిలో అతను మంచంపై వుండిపోయాడు.
" మీరు కనీసం పదిరోజులన్నా మంచంమీద విశ్రాంతి తీసుకుంటే గాని ఈనాగమణి శరీరం మీరు కొట్టే దెబ్బలకీ పనికిరాదు."
" అదేమిటమ్మా?" అన్నాడు మల్లన్న.
" నా శరీరం తిరిగి నా స్వాధీనంలోకి రావటానికి పదిరోజులు పడుతుంది. మల్లన్నా ఈలోగా ఎలాంటి టార్చర్ నీ నాశరీరం భరించలేదు. పదిరోజులన్నా ఆయనకి కుడా విశ్రాంతి దొరకితే తప్ప తిరిగి ఆయన సిగరెట్ తో కాల్చటానికి గానీ హంటర్ తో కొట్టటానికి గానీ ఈశరీరం పనికి రాదు."
"ఐ విల్ కిల్ యూ...." అరవడానికి ప్రయత్నించాడు జి.కె.
" నువ్వేం చేయగలవో నాకు తెలుసు జి.కె. హింస పెట్టదలవు, చంపగలవు. దానివల్ల నీకు కలిగేది పైశాచిక ఆనందం ఒక్కటే నిన్నొక్కసారి సిగరెట్ తో కాల్చనా? ఒద్దులే కేవలం సెగ చూపిస్తాను" అంది నాగమణి.
" రాక్షసీ...." అన్నాడు జి.కె.
"నేను నిజంగా రాక్షసినే అయితే ఈక్షణం చాలు నిన్ను నరకానికి పంపించటానికి. కానీ నేను మనిషిని. ఆవిషయాన్ని నేను మరిచపోయేటట్లు చేస్తున్నావు. అప్పుడు తప్పదు నీకు నరకం"అంది.
"అమ్మా ఇప్పుడెందుకమ్మా గొడవ?" అన్నాడు మల్లన్న.
ఆమె కళ్ల నిండా నీరు.
"మల్లన్నా నువ్వు నా తండ్రిలాంటివాడివి. కొన్ని కొన్ని విషయాలు ఆడది తండ్రికి కూడా చెప్పుకోలేదు. తన శరీరంలో కొన్ని భాగాలని చూపించుకోలేదు. కానీ నీకు చూపిస్తున్నాను చూడు" ఆమె చీరని మోకాళ్ళపైకి దోపింది.
కాలిన మచ్చలు..... వాతలు.....
కళ్లు మూసుకున్నాడు మల్లన్న.


