8. వాక్యాల గమనం:
రూళ్లులేని కాగితాల మీద వ్రాసేవాళ్లు సాధారణంగా కాగితానికి తిన్నగా నేరుగా వ్రాయాలను కుంటారు కానీ, వారి పని ఒత్తిడి,మూడ్ బట్టి ఒక్కొసారి వాక్యాలు పైకి వెళ్లిపోతూ వుంటాయి. మరోసారి క్రిందకు జారిపోతూ వుంటాయి. దీనిబట్టి కూడా ఆయా వ్యక్తుల మనస్తత్వాన్ని మనం పట్టుకోవచ్చు.
A.వాక్యాల్ని తిన్నగా వ్రాసేవారు:
వాక్యాన్ని కాగితానికి తిన్నగా తీసుకెళ్లేవాళ్లు చాలా నెమ్మదస్తులు. పెద్ద పెద్ద పదవులు మీద ఆశలేనివారు, నీతికి నిజాయితికీ కట్టుబడేవాళ్లు అయివుంటారు.
1. సముద్రం మధ్యలో శాంతంగా గంభీరంగా నిలిచివుండే రాక్ ఆఫ్ జిబ్రాల్ట్ ర్ లాంటి వ్యక్తి మీరు. త్వరగా ఆవేశపడటం మీ అభిమతం కాదు. అవతల వాళ్లుమిమ్మల్ని ఎంతగా రెచ్చగొట్టి తమ చూపులతో చేష్టలతో మిమ్మల్ని లొంగదోసుకోవాలనుకుంటారో, మీరంతగా బిగుసుకుపోతారు.
2. ప్రశాంతంగా, ఒంటరిగా గడపడం అంటేమీకు ఇష్టం మిమ్మల్ని మీ మానసిక ప్రశాంతతను భంగం చెయ్యనన్నాళ్లు మీరు నెమ్మదస్తులుగా గంభీర స్వభావులుగా కాలం గడుపుతారు. ఏళ్ల తరబడి కొందరు మిమ్మల్నివిసిగిస్తున్నా మీరు భరించగలుగుతారు. మీ ప్రశాంతతకు ఆపు కోలేనంత గాయంచేస్తే అప్పుడు మీలోని కోపం లావాలా ఎగజిమ్మి చుట్టుపక్కల వాళ్లను సర్వనాశనం చేస్తుంది. అనడం కంటే సమూలంగా తుడిచిపెట్టేస్తుంది అనడం సరియైనది.
3. కొంత మందికి ఎంత ఓపిక వుంటుందంటే జీవిత కాలం మొత్తంలో ఒకటిరెండు సార్లు మాత్రమే ఇలా రెచ్చిపోతారు.
4. మీమీ కోపాలకి కారణాలు చాలా వింతగా అనిపించవచ్చు. ఉదాహరణకి ఇంటికి తెచ్చిన ఆఫీసు ఫైల్ లో ఏదోవ్రాసుకుంటూవుంటే వెనకాలనుంచీ మీపై బిందెడు నీళ్లు కుమ్మరించిన మీ భార్యను మీరు ఏమీ అనకపోవచ్చు. అదే, ఏదో విషయమై వంటింట్లో మీ పిల్లవాడిని మీ భార్య తిడితే మీరు ఆమెపై విరుచుకుపడొచ్చు.
5. మీరు అవసరమైతే తప్ప సాధారణంగా అవతలవాళ్లకి సలహా ఇవ్వరు. మీరు ఏసందర్బంలోనైనా కంగారు పడటంగానీ,నెర్వస్ నెస్ ఫీలవటం గానీ చెయ్యరు.
6. మీరు ఒకొసారి మీ మాటలతో అవతల వాళ్లని కఠినంగా దండించి నప్పటికీ మంచి చేస్తుందే తప్ప చెడుచేయదు.
7. మీ నెమ్మదితనం మీ చుట్టుపక్కల వాళ్లకి చేతకాని తనంగా అనిపించవచ్చు. మీ పట్టుదల మొండితనంగా అనిపించవచ్చు. కానీ, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీరేమిటో మీకు కరెక్ట్ గా తెలుసు.
8.మీమీద ఇతరులు వేసే జోకులు లెక్కచేయని మీరు, ఎవరేనా అరటిపండు తొక్కమీద జారిపడితే నవ్వటం ముక్కుమీద పెద్ద మచ్చవుంటే చూసి వెక్కిరించడం లాంటివి చేసి వారికి కోపాన్ని తెప్పిస్తారు. అయితే అవతలవాళ్ల బలహీనతలను చూసి ఏడిపించాలనే సరదామీకు వున్నప్పటికీ అదిమరీ వాళ్లని నష్ట పరచే విధంగా వుండదు.
9.మీరు నిర్దిష్టమైన గమ్యాన్ని ముందే నిర్దేశించుకొని అటువైపు సాగిపోటానికి ఇష్టపడతారు. అమ్మాయిలంటే/ అబ్బాయిలంటే మీకు అమితాశక్తి వున్నా మీరు వెంటబడటం కన్నా వాళ్లే మీ వెంట పడటాన్ని ఇష్టపడతారు.
10. ఒక మంచి గృహస్థు(లేదా గృహిణి)అనిపించుకోవటానికి ఇష్టపడతారు మీరు.
11. మహా అయితే తొందరగా నడిచివెళ్లి గమ్యాన్ని చేరుకోవాలనుకుంటారే తప్ప పరుగెత్తాలనుకోరు.
12. మనిషి అన్నవాడికి ధనబలమే కాదు. గుండెబలం కండబలం కూడా వుండాలన్నది మీ ఆశయం అటువంటి వ్యక్తులనే మీరు ప్రేమిస్తారు. దురదృష్టవశాత్తూ మీరు బలహీనులైతే, మీ కొడుకు/ కూతురుని హెవీ వెయిట్ ఛాంపియన్గా చూడడానికి మీరు ఇష్టపడతారు.
13. ఒకసారి మీరు అనుకున్నవి మీ చేతికి అందాక ఇంకా ఏవో కావాల నుకోకుండా అక్కడితో తృప్తి పడతారు.
14. ఒక అమ్మాయినో! అబ్బాయినో చూసి ఇష్టపడ్డాక ఇక వేరే ఆలోచనలనీ మీ మనసులోకి రానివ్వరు.
15. వాక్యాన్ని మొదలు పెట్టిన దగ్గరనుంచీ స్ట్రయిట్ గా తిన్నగా చివరివరకూ తీసికెళ్ళి చేతివ్రాతను అందంగా కాగితంమీద గీతలు గీసినట్లు వ్రాయగలిగే స్త్రీలు చాలా సహనపరులై వుంటారు. ఎంత సహన పరులంటే - మీకొలీగ్ తో చెట్టాపట్టా లేసుకుంటూ తిరిగే మీ భర్త మీ కళ్ళబడ్డా - ఆమెను మీ కళ్లముందు ముద్దుపెట్టుకుంటే తప్ప మీకు కోపంరాదు. ఒకసారి వచ్చిందంటే మాత్రం ఆమె, మీ భర్త సమూలంగానాశనం అయ్యారన్నమాటే.
16. మీరు చాలా ఎత్తరి. ఇది మీ మనసుకి సంబంధించినది. శరీరానికి సంబంధించిన మాట కాదు. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటి ఎత్తుకి వెళ్లి మళ్లీ దిగి వాటితో సమానంగా జీవితాన్ని లాగే శక్తి సామర్ద్యాలు గల వ్యక్తులు మీరు.