Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 16

                                 

   
            7.ఒత్తిడి:

    కొన్నికలాలు మనకి విపరీతంగా నచ్చుతాయి. కొన్ని కలాలని మనతోపాటు జీవితాంతం వుంచుకోవాలను కుంటాం. కలం సరిగ్గా వ్రాయకపోతే రచన చేసే మూడ్ పోవడం కూడా నాకు అనుభవం. మనం ఎన్నుకున్న కలాల నిబ్ మీద కూడా మన మనస్తత్వం ఆధారపడివుంటుందంటే అందులో ఆశ్చర్య పోవలసిందేమీ లేదు. కొంతమంది లావుగా వ్రాసేకలాన్ని ఇష్టపడితే మరికొందరు సన్నగా వ్రాసే దాన్ని ఇష్టపడతారు.

     అదే విధంగా కొందరు కలాన్ని బాగా ఒత్తి వ్రాస్తారు. మరికొందరు తేలికగా వ్రాస్తారు. బాల్ పాయింట్ పెన్ వాడుకలోకి వచ్చాక ఈ వత్తి వ్రాయటం అనేది ఎక్కువైంది. దాన్ని బట్టి ఈ గుణ గుణాలు ఆధారుడివుంటాయి. చాలా తేలికగా వ్రాసేవారి విశ్లేషణ,బాగా కలాన్ని ఒత్తి వ్రాసేవారి  ఈ చాప్టర్ లో ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందే చెప్పినట్లు ఏరేంజిలో ఒత్తి వ్రాస్తున్నారో పాఠకుడే నిర్ణయించుకొని తన గుణగణాలని అంచనావేసుకోవాలి.
     ఈ క్రింద రెండు ఉదాహరణలివ్వబడ్డాయి. ఒకటి ఉత్తర ధృవమైతే, రెండోది దక్షిణ ధృవం. అయితే, పాఠకులంరూ ఈ రెండు కేటగిరీలలోకి చెందరు అనేది నిర్వివాదాంశం. ముందు చెప్పినట్లు తమ రేంజి బట్టి వారే వారి మనస్తత్వాన్ని  నిర్ణయించుకోవాలి.

    1.తేలికగా వ్రాసేవారు:

           

    కలాన్ని తేలికగా ఉపయోగించే వాళ్లు సాదారణంగా ఎక్కువ సెన్సెటివ్ నెస్ (సున్నితత్వం) కలిగి వుంటారు, మరీ బలహీనంగా, అసలు కలం పేపర్ కి ఆంటీ అంటకుండా వ్రాసుకుంటు పోయేవాళ్లు ఆరోగ్యం విషయంలో కూడా అలాగేవుంటారు.జీవితంలో కూడా ఒక గమ్యం వుండదు, వీళ్లు ఎక్కువ స్త్రీత్వపు గుణాలు కలిగి వుంటారు.

     తాము అనుకున్న దాని పట్ల మొండిపట్టుదల లేకుండా అవతలివాళ్లు చెప్పేదాంట్లో ఏదేనా న్యాయం కనిపిస్తే, మార్చుకోడానికి సిద్దంగా వుంటారు.  రోడ్డు మీద వెళ్లుతూ వుంటే ఎవరేనా బిచ్చగత్తె దానం అడిగితే, పక్కకొట్టుకి వెళ్లి చిల్లర మార్చి, పదో, ఇరవయ్యో పైసలిచ్చే దానగుణం కలిగివుంటారు.

    వీరిలో గొప్ప క్వాలిటీ ఏంటంటే ప్రతీ చిన్న విషయానికి బాగా అలర్ట్ గా వుంటారు.  శారీరకంగా బలహీనంగా వున్నా మానసికంగా బాగా ఉత్తేజంతో వుంటారు.  వాతావరణ మార్పులు తరచూ వీరి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తూ వుంటాయి వీరి ప్రతీది న్యాయం జరగాలని ప్రపంచమంతా న్యాయ మార్గంలో నడుస్తుందనే అభిప్రాయంతో వుంటారు.

    దురదృష్టవశాత్తూ వీరిలో చొచ్చుకుపోయే గుణం తక్కువగా వుంటుంది. అలాగే నిరోధక శక్తి తక్కువగా  వుంటుంది. అవతల వాళ్లు బలంగా వాదిస్తే వాళ్ళ వాదనలకు, ఒత్తిడిలకులోనవుతారు.

    చిన్న చిన్న విషయాలకీ కోపం తెచ్చుకోవటం వీరి దుర్గుణం. వీరిని నమ్మి వీరిమీద ఆధారపడటం కూడా కష్టమే.  వీళ్లు మనని మోసం చేస్తారని కాదు. నమ్మకాన్ని నిలుపుకోలేక పోవటం వీళ్ల బలహీనత.

    వీరు ఒకసారి స్నేహం చేస్తే గొప్పగా అల్లుకుపోతారు. అంతేకాక స్నేహానికి ప్రాణం ఇస్తారు కూడా.

     వీరు సాధ్యమైనంత వరకూ తక్కువ మాట్లాడతారు. కానీ, మాట్లాడటం ప్రారంభిస్తే మాత్రం ఆపరు. (ఇళాంటి చేతి వ్రాత వున్న మీరు మీ భార్యతో కలిసి హోటల్ కి వెళ్లారనుకోండి. సాధారణంగా, మీరు వెళ్లే హోటల్స్ అన్నీ, పెద్దవై వుంటాయి. పెద్ద పెద్ద హోటల్స్ లో మెనూలో వున్న పదార్దాలన్నిటికీ ఎదురుగా అవి సర్వ్ చెయ్యడానికి ఎంత టైమ్ పడుతుందోకూడా  సూచించివుంచుతారు. మీరు ఆర్డర్ ఇఛ్చిన తర్వాత చెప్పబడిన సమయం కంటే రెండు నిమిషాల ఆలస్యం అయితే సహించరు. దురదృష్టవశాత్తూ, మీతో పాటు మీ భార్యకూడా ఆ హోటల్ కు వచ్చివుంటే ఆమె మనసులో  వేయి దేవుళ్లకు మొక్కుకుంటుంది కానీ, ఏం లాభం! అప్పటికే మీరు మేనేజర్ ని పిలిచి సమయం విలువ గురించి పెద్ద లెక్చర్ ఇస్తుంటారు.ఆ ఆవేశంలో వెయిటర్ పై గెంతులేస్తూ ఆర్డర్ చేసిన పదార్దాలని తినకుండా భార్యతో సహా బైటకు వెళ్ళిపోయినా ఆశ్చర్య పోనవసరం లేదు.)

    మీలో వున్న సహనం మెచ్చుకోదగ్గదే అయినా ఇతరుల దగ్గర మాత్రం అసహనమే  బైటపడుతూ వుంటుంది.

    అక్షరాలని తేలికగా వ్రాసేవారు ప్రతి వస్తువుకీ ఒక నిర్దిష్టమైన స్థలాన్ని కేటాయించుకునే వాళ్ళై వుంటారు. ఏదేనా ఊరు వెళ్లాల్సి వచ్చినప్పుడు టూత్ పేస్ట్ తో సహా అన్నీ వున్నాయా లేదా అని గమనించుకునే వారైవుంటారు.  ఎక్కడేనా హోటల్లో దిగగానే ఏ వస్తువు కావస్తువుని ఆయా స్థలాలలో అమర్చుకొని ఆ హోటల్ రూమ్ న కూడా ఆ ఒక్కరోజూ తమ స్వంత గదిలాగే భావించే వారై వుంటారు.

     2. ఒత్తిడితో వ్రాసేవారు:

    ఈ క్రింది వ్రాతను గమనించిట్లైతే, ఒకలావు పాటి నిబ్ ని ఉపయోగించటం గానం, కలంతో బాగా ఒత్తి వ్రాసే అలవాటున్న   చేతివ్రాత గానీ అయి వుంటుందని గమనిస్తాం. మీరు చేతి వ్రాతకోసం ఇంక్ పెన్ను ఉపయోగించక పోతే నిబ్ ప్రసక్తేరాదు. బాల్ పాయింట్ పెన్నుతో వ్రాసేటప్పుడు మీరు ఒత్తివ్రాస్తున్నారా?అనేది నిర్ణయించుకోవాలి. ఒత్తి వ్రాస్తున్నట్లైతే మీకు ఈ విశ్లేషణ వర్తిస్తుంది.

 Previous Page Next Page