Read more!

గురుశిష్యుల మధ్య ఓ గొప్ప బంధం!!

 

గురుశిష్యుల మధ్య ఓ గొప్ప బంధం!!

శ్రీరామకృష్ణులు, నరేంద్రుల మధ్య ఉన్న అనుబంధం నిస్స్వార్థ ప్రేమజనితం, ఇందులో సాంప్రదాయిక గురుశిష్య సంబంధం లేదు. నరేంద్రుడి జన్మ వృత్తాంతాన్ని ఎరిగిన శ్రీరామకృష్ణులు అతణ్ణి తనతో సమానంగా చూడటమేగాక అతడితో ఒకే హుక్కా నుండి పొగ పీల్చటానికి కూడా వెనుకాడలేదు. నరేంద్రుణ్ణి నిత్య సిద్ధుడిగా పరిగణించేవారు. ఆయన ఎప్పుడూ నరేంద్రుల గురించి చెబుతూ "అతడిలో ఎల్లప్పుడు ప్రజ్జ్వరిల్లే జ్ఞానాగ్ని ఏ ఆహార దోషాలను అతడికి అంటనివ్వకుండా చేస్తుంది. జ్ఞానఖడ్గంతో అతడు నిరంతరం మాయాబంధాన్ని ముక్కలు చేస్తూంటాడు. మహామాయ అతణ్ణి తన వశంలో తెచ్చుకోవటంలో విఫలురాలవుతుంది" అని  పొగడుతూ ఆనాటి సుప్రసిద్ధులతో పోలుస్తూండేవారు.

సుప్రసిద్ధుడైన కేశవ్ చంద్రసేన్ పది దళాల పద్మమైతే నరేంద్రుడు సహస్రదళ పద్మమనీ, కేశవ్సేస్ లో ఒక్క శక్తి ఉంటే నరేంద్రుడిలో అలాంటి పద్దెనిమిది శక్తులున్నాయనీ, కేశవ్సెన్ ప్రమీద దీపమైతే నరేంద్రుడు మధ్యందిన మార్తాండుడనీ శ్రీరామకృష్ణులు కొనియాడే వారు. ప్రపంచ ప్రఖ్యాతుడైన కేశవ్సేన్తో ఊరూ పేరూ లేని తనను పోల్చటాన్ని తరచూ నరేంద్రుడు ప్రతిఘటించే వాడు. కాని శ్రీరామకృష్ణులు తాను ఆ విషయంలో నిస్సహాయుణ్ణనీ. జగజ్జనని తనకు ఆ యథార్ధాన్ని వెల్లడించిందనీ చెప్పేవారు. నరేంద్రుడి మనస్సు అత్యున్నత శిఖరాల్లో చరించేది. కాబట్టి ఎన్ని పెద్ద పొగడ్తలైనా అతడిలో గర్వాన్ని మొలకెత్తించవని శ్రీరామకృష్ణులకు తెలుసు. కాబట్టి అతణ్ణి ప్రశంసించటానికి ఆయన వెనుకంజ చేసేవారు కాదు. తోటి శిష్యులందరిలో నరేంద్రుడొక్కడు మాత్రమే శ్రీరామకృష్ణుల అభిప్రాయాలను, అనుభూతులను ప్రశ్నించేవాడు. శ్రీరామకృష్ణుల అనుభవాలను తరచూ అతడు కొట్టిపారేస్తూ,  "ఇవన్నీ జగజ్జనని మీకు చూపుతోందని ఎవరు చెప్పగలరు? ఇవన్నీ మీ భ్రమించిన బుర్ర వెర్రి ఊహాలు కావచ్చు గదా. నాకే ఈ అనుభవాలు కలిగితే, తప్పకుండా ఇవన్నీ నా వెర్రిబుర్ర చపలాలుగా భావించేవాణ్ణి, ఇంద్రియాలు  ప్రధానంగా మనలను ఏదైనా వస్తువు ఆకర్షించినప్పుడు తరచు మనలను మోసగిస్తాయని విజ్ఞాన, తత్త్వశాస్త్రాలు నిర్వివాదాంశంగా ఋజువు పరిచాయి. మీకు నా మీద ఎంతో అనురాగం. కాబట్టే నన్ను అన్ని కోణాల్లోను గొప్పవాడిగా చూడాలని మీరు కోరుకుంటారు. అందుకే మీకిలాంటి దర్శనాలు కలుగు తాయి" అనేవారు.

శ్రీరామకృష్ణులు ఉన్నత భావావస్థల్లో ఉండేటప్పుడు నరేంద్రుడి విమర్శలను లక్ష్యపెట్టేవారు కారు. కాని కొన్నిసార్లు ఆయన పిల్లడి మనస్తత్వంలో ఉండేవారు. నరేంద్రుడు నిజం చెప్పేవాడని ఆయనకు తెలుసు. కాబట్టే అతడి పలుకులు ఆయనలో అలజడి కలిగించేవి. ఆయన అలాంటప్పుడు జగజ్జననికి తన బాధను చెప్పుకునేవారు. అప్పుడు జగజ్జనని శ్రీరామకృష్ణులతో "అతడి పలుకులను ఎందుకు లెక్కిస్తావు. ఇవన్నీ సత్యమని అతడు త్వరలోనే గ్రహిస్తాడు" అంటూ తల్లి ఆయన్ను ఊరడించేది.

శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి ఇంత ఉన్నతంగా చూసుకుంటూ ప్రేమిస్తున్నా కూడా అతడి భక్తి విశ్వాసాలను మాత్రం కఠోర పరీక్షకు గురిచెయ్యకుండా వదల్లేదు. సామాన్యంగా నరేంద్రుడు వచ్చినప్పుడల్లా శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందించేవారు, అతణ్ణి ప్రేమతో ఆదరించేవారు. ఎన్నోసార్లు అతణ్ణి చూడగానే భావమగ్నులయ్యేవారు. కాని అకస్మాత్తుగా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. నరేంద్రుడి పట్ల ఆయన ఎంతో ఉదాసీనత చూపసాగారు. ఒకరోజు యధాప్రకారం నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వచ్చి గురుదేవులకు ప్రణామం చేసి కూర్చున్నాడు. కాని శ్రీరామకృష్ణులు ఉదాసీనత వహించి ఆ రోజు అతడితో ఒక్కసారైనా మాట్లాడలేదు. ఇదే రీతిలో ఒక నెల గడిచింది. గురుదేవులు తనను ఇంత ఉదాసీనపరుస్తున్నా కూడా నరేంద్రుడు మామూలుగానే దక్షిణేశ్వరానికి వస్తూపోతూ ఉన్నాడు. ఆయన ప్రవర్తన అతడి మనస్సులో ఒకింతైనా. మార్పును తీసుకురాలేదు. అతడు బాధ చెందలేదు. 

చివరికొక రోజు శ్రీరామకృష్ణులు అతణ్ణి పిలిచి "చూడు, నేను నీతో ఒక్కమాటైనా మాట్లాడటం లేదు. అయినా నువ్వు రావటం మానుకోలేదు. ఎందుకిక్కడికొస్తావు?" అని అడిగారు. 

అందుకు నరేంద్రుడు "నేనిక్కడకు వచ్చేది మీతో మాట్లాడటానికి కాదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కాబట్టే మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నాను" అన్నాడు. 

ఇది విని ఎంతో సంతోషపడి "నిన్ను నేను పరీక్షిస్తున్నాను. నీలాంటి గొప్ప ఆధ్యాత్మిక సాధకుడు మాత్రమే అంతటి నిర్లక్ష్యాన్ని, ఉదాసీనతను తట్టుకోగలడు. ఇతరులైతే నన్నెప్పుడో విడిచిపెట్టిపోయేవారు. తిరిగి వచ్చేవారే కారు." అన్నారు.

ఇలా ఆ గురుశిష్యుల మధ్య ఎంతో గొప్ప అనుబంధం ఉండేది.

◆ వెంకటేష్ పువ్వాడ