Read more!

శాంతి మంత్రమే సత్యసాయి మార్గం!!

 

శాంతి మంత్రమే సత్యసాయి మార్గం!!

 

ఒకప్పటి కాలంలో ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులు. వాళ్ళందరూ వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలను ఒక్కొరు ఒకో విధంగా ఈ లోకానికి చాటి చెప్పాలని అనుకున్నారు. ఇప్పుడూ ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. వాళ్ళూ తమ అనుభూతిని, అభిప్రాయాలను చెబుతున్నారు. అయితే ప్రపంచానికి శాంతి మంత్రం భోంచిన వారిలో సత్యసాయిబాబా ఒకరని చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో కరువు జిల్లా అనంతఃపురం కేంద్రం నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది సత్యసాయి కలలుగన్న ప్రశాంతి గ్రామం. పుట్టపర్తిలో సత్యసాయి స్థాపించిన ప్రశాంతి నిలయంలో అడుగు పెడితే అదొక కొత్త ప్రపంచంగానూ నిశ్శబ్ద గోదావరీ ప్రవాహం అక్కడే ఉన్నట్టుగానూ అనిపిస్తుంది. చీమ చిటుక్కుమన్నా అక్కడ అనవసరంగా మాట్లాడుతూ గందరగోళం చేసేవాళ్లకు "సాయిరాం సైలెన్స్ ప్లీస్" అంటూ సున్నితంగా  అక్కడ నిశ్శబ్దానికి ఆటంకం కలిగించకుండా సేవ చేసే భక్తుల విషయం కూడా చెప్పదగినదే. జిల్లాలు, రాష్ట్రాలు దాటి ఖండాతరాలుగా ఖ్యాతి గాంచిన సత్యసాయి కేవలం ఆధ్యాత్మికతను మాత్రమే భోదించలేదు. ఆయనొక సకల సేవా స్వరూపుడు.

అపర భగీరథ ప్రయత్నం సత్యసాయి నీటి సరఫరా!!

కరువు ప్రాంతమైన  రాయలసీమ, అందునా అనంతపురం జిల్లా ప్రజలకు ఎప్పుడూ ఎదురయ్యేది రెండే. ఒకటి అతివృష్టి, మరొకటి అనావృష్టి. అలాంటి పరిస్థితులలో కూడా వ్యవసాయం చేయడం వారికే చెల్లుతుంది. ఇకపోతే తాగునీటి సౌకర్యం సరిగా లేని ప్రాంతాలకు సత్యసాయి వాటర్ సప్లై నిజంగా గొప్ప వరం. కొన్ని వేల కిలోమీటర్ల కొద్దీ నీటి సరఫరా చేయించడం ఏ స్వచ్చంధ సంస్థ కూడా చేయలేని, ఇప్పటిదాకా చేయని పని. కానీ సత్యసాయి నీళ్లు పల్లె పల్లెకూ దాహాన్ని తీర్చిన అమృత ధారలు. అందులోనూ స్వచ్ఛమైన తియ్యని నీళ్ల రుచి తాగినవాళ్ళు మాత్రమే అనుభూతి చెందగలరు.

విద్యా ప్రసాదం!!

ఏ దానం చేసినా, మనిషి దగ్గర ఎమున్న ఇతరులు ఎదో ఒకవిదంగా, ఏదో ఒక కారణంతో దొంగిలిస్తారేమో కానీ విద్యను మాత్రం ఎవరూ దొంగిలించలేరు. అలాంటి విద్యను దిగువ తరగతి వారికి కూడా అందించినదే సత్యసాయి పాఠశాలల పరంపర. మండల, జిల్లా, గ్రామీణ స్థాయి పాఠశాలలు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా సత్యసాయి విద్యానిలయాలు నెలకొల్పి క్రమశిక్షణ, ఉన్నత విలువలు, అన్ని రకాల కళల గురించి ఎంతో ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించడం నిజంగా గొప్ప విషయం.

ఆరోగ్య ప్రదాత!! 

పుట్టపర్తి లో జనరల్ హాస్పిటల్, ప్రశాంతి గ్రామంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్  వీటికి అనుసంధానంగా బెంగళూరు, ఇంకా పలు ప్రాంతాలలో బోలెడు ఆసుపత్రులు, వీటిలో చాలావరకు ఫారిన్ డాక్టర్స్, వివిధ సమస్యలకు ఎంతో గొప్ప నిపుణుల చేత వైద్యం ఇదంతా కూడా రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా మొత్తం ఉచితంగా అందించడం ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. హాస్పిటల్ అక్కడి వాతావరణం, అక్కడి బెడ్ లు, పేషెంట్ లకు అందించే ఆహారం, అనుక్షణం కనిపెట్టుకుని ఉండే నర్స్ లు, వీటి వల్ల సేవ మాత్రమే కాదు ఎంతో మందికి ఉపాధి కూడా కల్పించడం సత్యసాయి ప్రత్యేకత. సాధారణ జ్వరమూ, జలుబు వంటి సమస్యల నుండి కంటి ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు కూడా సురక్షితంగా చెయ్యడం, అంతే సురక్షితంగా డిశ్చార్జ్ చేయడం, దాని  తాలూకూ సమస్య ఏదైనా ఎదురైనప్పుడు ఎలాంటి సమయంలో వెళ్లినా తిరిగి వారి ఆరోగ్యానికి హామీ ఇస్తూ మళ్ళీ పరీక్షించడం దానికి తగ్గట్టు సలహాలు, సూచనలు అందించడం. ఇదంతా ఎంత చెప్పినా తక్కువే.

ఇవి మాత్రమే కాకుండా సత్యసాయి మాతృమూర్తి జ్ఞాపకార్థం పాఠశాలలు, ఆమె స్మృతి కింద మహిళలకు చేయూత ఇవ్వడానికి టైలరింగ్, వివిధ చేతి పనుల శిక్షణ అనంతరం స్వయం ఉపాధి కోసం ఉచితంగా వస్తువుల పంపిణీ, లేక వాళ్లే ఉపాధి చూపించడం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. 

సత్యసాయి క్యాంటీన్, అక్కడ ప్రస్తుతం పది రూపాయలకు అన్నం, సాంబారు, చారు, పచ్చడి, మజ్జిగతో కూడిన మంచి భోజనం, అది కూడా లిమిట్ అంటూ లేకుండా కడుపునిండా పెట్టడం, అలాగే టిఫిన్లు, సాయంత్రం స్నాక్స్ ఇలా క్షుద్బాధ తీర్చడంలోనూ ఒక అడుగు ముందే ఉంది సత్యసాయి సంస్థ.

ఇంకా ప్రతి సంవత్సరం సత్యసాయి పుట్టినరోజు పురస్కరించుకుని పదిరోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, విదేశాల నుండి వచ్చి మరీ సత్యసాయి సమాధిని దర్శించుకునే భక్తులు, చుట్టూ పక్కల ప్రాంతాలలలో అందరికీ అన్న, వస్త్ర వితరణ ఇలా చెబితే ఎన్నో, ఎన్నేనో సత్యసాయి సేవల మధ్య ఆ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు.

ప్రతి సంవత్సరం నవంబర్23 న ఎంతో గొప్పగా జరిగే వేడుకలు కరోనా కారణంగా గత రెండు సంవత్సరాల నుండి సందడి తగ్గించుకుని ప్రశాంతగా మొదలుపెట్టి, అంతే ప్రశాంతంగా ముగుస్తున్నాయి. మానవీయ కోణంలో సాగిన సత్యసాయి సేవలు పలువురికి ఆదర్శంగా నిలిచి శాంతివైపు అడుగులు మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ.

"ఓం సాయి రాం"

◆ వెంకటేష్ పువ్వాడ