Read more!

మానవ లక్షణ మర్మాన్ని తెలిపే కృష్ణుని పలుకులు!!

 

మానవ లక్షణ మర్మాన్ని తెలిపే కృష్ణుని పలుకులు!!

 

భగవద్గీతలో సాంఖ్యయోగంలో, ఇరవై ఏడవ శ్లోకం చెబుతూ కృష్ణుడు, అర్జుడితో ఇలా చెబుతాడు. 

జాతస్య హి ధ్రువో మృత్యుర్ధువం జన్మ మృతస్యచ

తస్మాదపరిహార్యేణ ర్థ స త్వం శోచితు మర్షసి.॥ 

అర్జునా!! ఆత్మజ్ఞానమును పక్కన పెట్టి భౌతికంగా ఆలోచించినా, నీవు నీ బుద్ధితో ఆలోచించినా, నీకు ఒక విషయం మనసులో తట్టి ఉండాలి. అదేమిటంటే, పుట్టిన ప్రతివాడూ చావడం తప్పదు కదా. నీవు చూస్తూనే ఉన్నావు కదా, పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. అలాగే మరణించిన ప్రతిజీవి మరలా పుట్టక తప్పదు. అది ప్రకృతి సహజం. దీనిని ఎవరూ తప్పించలేరు. మార్చడానికి సాధ్యముకాని ప్రకృతి స్వభావమును మార్చడం ఎవరితరమూ కాదు. కాబట్టి వీళ్లంతా ఇప్పుడు యుద్ధంలో మరణించినా మళ్లీ పుడతారు. 

అలా పుట్టినప్పుడు సంతోషించాలి గానీ, ఇప్పుడు వీళ్ళు చనిపోతారే అని వీరి గురించి శోకించడం వ్యర్థం. 

ఈ శరీరంతో పుట్టినవాడు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండడు కదా! అలా ఉండగలిగితే నీ తండ్రి పాండురాజు, నీ తాత విచిత్రవీర్యుడు, ముత్తాత శంతనుడు కూడా ఇప్పటికీ ఉండాలి. కాని వాళ్లు ఎవరూ లేరు కదా. అందుకని పుట్టిన ప్రతి వాడూ చావక తప్పదు. మరణించిన వాళ్ళు మరలా పుట్టడం తప్పదు. 

మరణించిన వాడు అటే పోతే, పుట్టే వాళ్లు ఎలా పుడుతున్నారు. కాబట్టి చావడం, పుట్టడం, మరలా చావడం ప్రకృతి సహజం. దీనిని ఎవరూ మార్చలేరు. నివారించలేరు. నివారించలేని మరణాల గురించి నీవు  బాధపడటం సరైనది కాదు కదా!!

ఈ భీష్ముడు, ద్రోణుడు, కృపుడు నీవు చంపక పోయినా, చావక తప్పదు. కాకపోతే ఇంట్లో ముసలితనంతో మరణించే బదులు యుద్ధంలో అనుకోకుండా మరణిస్తున్నారు. అంతే, మరణం తప్పనప్పుడు, తప్పించుకోలేని మరణం కోసరం చింతించడం, శోకించడం అవివేకము కదా!

ఇదే విషయాన్ని ప్రస్తుత మనుషులకు అన్వయించుకుంటే పుట్టినవాడు చావక తప్పదు అన్న సూత్రాన్ని అందరికీ అన్వయిస్తాము కానీ మనకు మన భార్యాబిడ్డలకు, మనకు కావాల్సిన వాళ్లకు మాత్రం అన్వయించుకోము. అదే మాయ. ఇతరులను మాత్రం "పుట్టడం చావడం సహజం ఊరుకోండి. ఏ ఎల్లకాలం ఉంటాడా. కాలం తీరింది పోయాడు" అని ఓదారుస్తాము. ఇది ఈ నాటిది కాదు. మానవుడు పుట్టినప్పటి నుండి మొదలయింది. ఇదే మనకు యక్షప్రశ్నలలో కనపడుతుంది. యక్షుడు ధర్మరాజును ఒక ప్రశ్న వేస్తాడు. ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైనది ఏది అంటే ధర్మరాజు అంటాడు ప్రతిరోజూ తమ కళ్ల ఎదుట ఎంతో మంది చనిపోతున్నా. తాము మాత్రం శాశ్వతంగా ఉంటాము అని అనుకుంటూ ఉంటారు అని. ఎందుకంటే ప్రతిమనిషి తాను కలకాలం జీవించాలని అనుకుంటాడు అది అతని స్వభావము.

దానికి విరుద్ధంగా మనిషి ఆలోచించలేదు, ప్రవర్తించలేదు. కాబట్టి అర్జునా పుట్టిన ప్రతివాడూ చాపక తప్పదు ఇది ప్రకృతి సహజం. అందుకని ఈ భీష్ముడు ద్రోణుడు నీ చేతిలో మరణిస్తారు అని వారి కోసం శోకించడం అవివేకము, ఒకనాటికి నువ్వు నేను కూడా పొయ్యేవాళ్లమే! మనకు కూడా ఈ ధర్మం వర్తిస్తుంది.

ఎవడికైనా ఒక ధర్మము, ఒక శాస్త్రము, ఒక విషయం, అర్థం అయింది అంటే దాని అర్థం, ఆ విషయాన్ని అందరి మాదిరి తనకూ అన్వయిస్తుంది అని అర్థం చేసుకున్న నాడే అతనికి పూర్తిగా అర్ధం అయినట్టు. లేకపోతే అతడికి ఆ ధర్మం అర్థం కానట్టే. అర్థం అయినట్టు ఒక భ్రమలో ఉంటాడు. పుట్టడం చావడం ఎవరి చేతిలో లేదు. మానవుడు తన ఇష్టం వచ్చినట్టు. ఇష్టం వచ్చినవారి ఇంట్లో, ఇష్టం వచ్చిన రోజు పుట్టే అవకాశం లేదు. అలాగే ఇష్టం వచ్చిన మాదిరి, ఇష్టం వచ్చిన రోజున మరణించే అవకాశం లేదు. పుట్టడం చావడం మన చేతుల్లో లేదు కాబట్టి జరిగినదానిని, జరుగుతున్నదానిని అంగీకరించడమే మానవ లక్షణం. ఇది తెలుసుకుంటే చాలు. కాని ఈ విషయాన్ని మనం అందరికీ చెబుతాము కానీ మనకు మాత్రం అన్వయించుకోము. అదే మాయ,

కాబట్టి అర్జునా! నీవు చంపుతాను అన్న వాళ్లందరూ నీ చేతిలో మరణించినా మరలా పుడతారు. అది వాళ్ల ధర్మం, దానిని నీవు ఆపలేవు, మరలా పుట్టే వాళ్ల గురించి చింతించడం అవివేకము అని అన్నాడు కృష్ణుడు..

◆ వెంకటేష్ పువ్వాడ