Home » Punya Kshetralu » శివ పరివారమంతా ఒకే మూర్తిలో నెలకొన్న పంపనూరు (నాగ పంచమి స్పెషల్)


 

శివ పరివారమంతా ఒకే మూర్తిలో నెలకొన్న పంపనూరు

(నాగ పంచమి స్పెషల్)

శ్రావణ మాసం వచ్చేసింది.  అత్యంత వైశిష్ట్యంకల ఈ మాసంలో  ఆధ్యాత్మిక భావాలుకల మహిళలకు అన్నీ పండగలే.  శివుడు, పార్వతి, శ్రీ మహలక్ష్మి, శ్రీమన్నారాయణుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, ఇలా ఎందరో దేవతలను పూజించే పండగలు ఎన్నో.  ఈ హడావిడంతా మనకే కాదండీ, వేరే రాష్ట్రాలవారికి కూడా వున్నదని మొన్న తమిళనాడు వెళ్ళినప్పుడు తెలిసింది.  అక్కడ ఒక శివాలయానికి వెళ్తే మార్వాడీ మహిళలు (రాజస్ధాన్) శివ పార్వతుల పూజ చేస్తున్నారు సామూహికంగా.  ఇవాళ ఏమైనా ప్రత్యేక పూజ వున్నదా అని అడిగితే ఒకావిడ చెప్పారు కధ జరుగుతోంది.  శ్రావణ మాసంకదా ఈ నెలంతా పూజలు, కధలు జరుగుతూనే వుంటాయి అని.  వాళ్ళకి శ్రావణ మాసం మొదలయిపోయింది. 

సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పూజలు నాగుల చవితికి, సుబ్రహ్మణ్య షష్టికి చేస్తారు.  అలాగే తెలంగాణాలో శ్రావణ మాసంలో చవితి, పంచమి రోజుల్లో చేస్తారు.  పుట్టని పూజించి, పుట్టలో వున్న నాగేంద్రునికి పాలు, కోడి గుడ్లు, చిమ్మిరి, చలిమిడి సమర్పించి తమ పిల్లా పాపలని చల్లగా చూడమని ప్రార్ధిస్తారు.  ఈ పండగ సందర్భంగా మనంకూడా ఒక సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం దర్శించాలికదా. మీకోసం, ఈ శ్రావణ మాసంలో ప్రత్యేక ఆలయాల సమాచారం తీసుకొచ్చాను.  ముందుగా ఈ నెల 19వ తారీకున వచ్చే నాగుల పంచమి సందర్భంగా పంపనూరులోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్ధానము, పంపనూరుస్ధల పురాణం ప్రకారం ఈ ప్రదేశంలో పూర్వకాలంలో మునులు తపస్సు చేసుకుంటూవుండేవాళ్ళు.  అందుకనే ఈ ప్రాంతాన్ని తపోవనం అనేవారు.  ఆ సమయంలో ఇక్కడ ఏడు కోనేర్లు వుండేవంటారు.  ప్రస్తుతం మాత్రం ఒకటే కనబడుతుంది. 500 ఏళ్ళక్రితం, శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సమయంలో వ్యాసరాయలువారిచే ఈ దేవాలయం నిర్మించబడినది.  తర్వాత కాలంలో సరైన ఆదరణ లేక శిధిలమయింది.  పైగా దుండగులు ఆలయంలో నిధులున్నాయని తవ్వి పోశారు.  క్రీ.శ. 1980 –90 మధ్య ఆ గ్రామస్తులు ఆలయంలో పూజాదికాలు నిర్వహించటానికి ఆత్మకూరు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్న కీ.శే. వి. మధుసూదన శాస్త్రిగారిని తీసుకొచ్చారు.

పూజ నిర్వహించటానికి వచ్చిన శాస్త్రిగారు మూల విరాట్ ని చూసి ఆశ్చర్యపోయారు.  అందులోని విశిష్టతని గుర్తించి అక్కడకు వచ్చినవారికి స్వామి తేజోరూపాన్ని, అలాంటి స్వామిని పూజిస్తే కలిగే ప్రభావాన్ని తెలిపారు.  ఆ రోజు రాత్రి కలలో సుబ్రహ్మణ్యస్వామి సర్పరూపంతో సాక్షాత్కరించి, పంపనూరు దేవస్ధానంలో తనకు నిత్యపూజలుచేసి, నైవేద్యాలు సమర్పించి అన్నదానము చేస్తే భక్తులను అనుగ్రహిస్తానని చెప్పారు. 
తెల్లవారిన తర్వాత రాత్రి వచ్చిన కల దైవ సంకల్పంగా భావించి, పంపనూరు వచ్చి అక్కడివారికి ఆ కల గురించి చెప్పారు.  తర్వాత అక్కడి పెద్దలను, గ్రామస్తులను కలుపుకుని విరాళాలు సేకరిస్తూ, వాటితో ప్రతి ఆదివారం (శాస్త్రిగారికి సెలవురోజు) పూజకు, అన్నదానానికి కావలసిన సరుకులు తీసుకువచ్చి, స్వామికి శ్రధ్ధగా పూజలు, అభిషేకాలు నిర్వహించి, అన్నదానం జరిపేవారు. 

భజనలు చేసేవారు.  వారి పూజలకి సంతృప్తి చెందిన స్వామి కొలిచే భక్తులకు కొంగు బంగారమై తన మహిమలను చూపించసాగాడు.  క్రమ క్రమంగా స్వామి మహత్యం నలు మూలలా తెలిసి దూర ప్రాంతాలనుంచి కూడా భక్తులు రాసాగారు. ముఖ్యగా వివాహం కానివారు, సంతానం లేనివారు, జాతకంలో సర్పదోషం వగైరాలు వున్నవారు, గ్రహ గతి సరిగ్గాలేనివారు ఇక్కడికి వచ్చి 9 లేక 11 మంగళవారాలుకానీ, ఆదివారాలుకానీ స్వామిని పూజించి,  108 ప్రదక్షిణలు చేస్తే వారి కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం.

భక్తుల రాక అధికం కావటంతో దేవాలయమూ అభివృధ్ధి చెందుతూ వస్తోంది.  2004 సం. లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి ఆశీస్సులతో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తల్లిదండ్రులైన శివ పార్వతులను స్వామి పక్కనే రెండు ఉపాలయాలలో ప్రతిష్టించారు.  అప్పటినుంచీ, పక్క రాష్ట్రాలనుంచి కూడా భక్తుల రాక అధికమైంది.  ముఖ్యంగా గ్రహ దోష నివారణకు శాస్త్రోక్తమయిన పూజలు చేయించుకోవటానికి చాలామంది వస్తున్నారు. ఇంతకీ అన్ని ఆలయాలలోను ఇలాంటివి జరుగుతూనే వుంటాయి...దీనిలో విశేషమేమి టంటారా   ఈ ఆలయం మరీ పెద్దదేమీకాదు.  అద్భుతమైన శిల్పకళ లేదు.  కానీ ఇందులో వున్న అద్భుత మంతా మూలవిరాట్ లోనే.  సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహంలో శివ కుటుంబం మొత్తం దర్శనమిస్తుంది.

స్వామి విగ్రహంలోని విశిష్టతని గురించి  అక్కడ ప్రధాన అర్చకులు శ్రీ నారావఝ్ఝల సీతారామమోహన్ శర్మగారు వివరించినదాని ప్రకారము, స్వామి విగ్రహము సర్ప రూపంలో వుంటుంది.  పీఠంనుండి సింహతలం వరకు స్వామి ఐదు రూపాలలో దర్శనమిస్తాడు.  పీఠంలో శ్రీ చక్రము వున్నది.  ఇది అమ్మవారి శక్తి స్వరూపాన్ని సూచిస్తుంది.  శ్రీ చక్ర స్వరూపంలో వున్న అమ్మవారు రాహుగ్రహము యొక్క అధిష్టాన దేవత.    సర్పం చివరభాగము శ్రీచక్రానికి 3 1/2 సార్లు చుట్టుకోవటం మానవ శరీరంలోని వెన్నెముక చివరిభాగం మూలాధారంలో కుండలిని శక్తి రూపంతో సర్పాకారంతో మూడున్నర చుట్లు కలిగి వుండటాన్ని సూచిస్తోంది అన్నారు.

సర్ప రూపంలో క్రింద భాగము వక్రతుండ ఆకారంలో సుబ్రహ్మణ్యస్వామికి అన్నగారైన శ్రీ మహాగణపతి ఆకారంలో దర్శనమిస్తుంది.  ఈ గణపతి స్వరూపం కేతుగ్రహ అధిష్టాన దేవత, మూలాధార చక్ర అధిదేవత.  మూల విరాట్ లోని మధ్యభాగం శివలింగం ఆకారంతో దర్శనమిస్తుంది.  ఈశ్వర స్వరూపం కాల స్వరూపుడు.  కాల సర్ప అధిష్టాన దేవత.  ఆయన ఆయుష్యు, ఆరోగ్య ప్రదాత.

ఇంక పైన, ఏడు పడగలు విప్పిన నాగేంద్రుని రూపాన్ని దర్శించవచ్చు.  విగ్రహం చివరి భాగంలో వున్న సింహధ్వజము నరసింహ స్వరూపంగా విష్ణు తత్వాన్ని సూచిస్తుంది.  ఇది శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య రాజముద్రగా భావింపబడుతోంది.  స్వామికి ఇరువైపుల నెమలి పింఛాలతో కూడివున్న చక్రాలు స్వామివారి వాహనం మయూరాన్ని సూచిస్తుంది.  అంతేకాదు కాలగమనంలో పంచ భూతాలు, సంవత్సర, ఆయన, ఋతు, మాస, పక్ష, తిధి, వార, నక్షత్రాలను సూచిస్తాయి.

ఇవ్వన్నీ చూస్తే మూల విరాట్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపం పైన చెప్పిన విధంగా వివిధ శక్తి రూపాలతో వెలసి వుండటం, ఒకే విగ్రహంలో శివుడు, పార్వతి, గణపతి,  నాగేంద్రుడు, ఇలా శివుని పరివారమంతా ఒకే చోట దర్శనము ఇచ్చే విధంగా వుండటంతో ఈ క్షేత్రానికి ప్రాముఖ్యత ఏర్పడింది.

ఈ క్షేత్రంలో వున్న సర్ప రూప సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజించడం ద్వారా నాగ దోషాలు, సర్ప దోషాలు, రాహు కేతు, కాల సర్ప దోషాలు, గ్రహ దోషాలు, కుజ దోష పరిహారము జరిగి, విద్య, ఉద్యోగము, వ్యాపార, వివాహ, సంతామను కలిగి సుఖ సంతోషాలతో వుంటారని భక్తుల నమ్మకం, అనుభవం. అద్భుత మూల విరాట్ నెలకొనియున్న ఈ క్షేత్రం అభివృధ్ధికి ఎక్జికూటివ్ ఆఫీసర్ శ్రీమతి బి. సుధారాణి, ప్రధాన అర్చకులు శ్రీ యన్. సీతారామమోహన్ గారు అభినందనీయ కృషి చేస్తున్నారు.
మార్గము
అనంతపురం జిల్లా, ఆత్మకూరు మండలంలో వున్న ఈ గ్రామానికి అనంతపురంనుంచి బస్సులు వున్నాయి.    అనంతపురంనుంచి వెళ్ళి రావచ్చు.
వసతి
చిన్న ఊరుకనుక భోజన, వసతి సదుపాయాలు అంతగా వుండవు.  శాంతులు జరిపించుకునేవారికోసం ఆలయంలోనే వసతి సౌకర్యం వుండవచ్చు.  ప్రధాన పూజారిగారి ఫోన్ నెంబరు ఇస్తున్నాను.  ఆసక్తి వున్నవారు సంప్రదించవచ్చు. శ్రీ నారావఝ్ఝుల సీతారామమోహన్    9701799468

ఒక విన్నపం
పాములు పాలు తాగుతాయనే అపోహతో చాలామంది పుట్టలో పాలుపొయ్యటం, కోడిగుడ్లు, చిమ్మిలి, చలిమిడి, అరటిపండు వగైరాలు వెయ్యటం చేస్తారు.  దయచేసి అలా చెయ్యవద్దు.  పాములు పాలు తాగవు.  పుట్టలో పాలు వగైరాలు వేసి వాటిని ఇబ్బంది పెట్టవద్దు.  అసలు ఈ పుట్టలో పాలు పోయటం అనేది ఏ శాస్త్రంలోనూ చెప్పలేదని పెద్దలు అంటున్నారు.  పాములను పూజించే విధానం ప్రకారం ఇంటి బయట ఆవు పేడతోగానీ, పసుపుతోగానీ పాము ఆకారం వేసి దానిని పూజించాలి.  అది వీలుకాకపోతే పూజా స్ధలంలో బంక మట్టి, బియ్యంపిండి, గోధుమ పిండి, మినప పిండి (ఏదో ఒకదానితో) పాము ఆకారం చేసి పళ్ళెంలో పెట్టి దానిని పూజించాలి.    ఇంట్లో ఇవ్వన్నీ చేసుకోలేనివారు, దేవాలయాలలో  నాగ ప్రతిష్టలు చేసి నాగుల విగ్రహాలు పెడతారుకదా.  వాటికి అభిషేకం చెయ్యవచ్చు.  ఆలోచించి, ఆచరిస్తారుకదూ.

 

 

 

 

 

- పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.