Home » Temples » తెలుగువారి అతిథి - రాఘవేంద్రస్వామి


 

తెలుగువారి అతిథి - రాఘవేంద్రస్వామి

 

తెలుగువారు గొప్ప పుణ్యం చేసి ఉంటారు. కాకపోతే మరేంటి! దేశమంతా గోవిందా గోవిందా అని తల్చుకుంటూ చేరుకునే ఏడుకొండలు శ్రీనివాసుడు మన దగ్గరే ఉన్నాడు. వైష్ణవులంతా అవతార పురుషునిగా భావించే రాఘవేంద్రుడూ ఇక్కడే ఉన్నాడు. ఈ శ్రావణ బహుళ విదియనాటికి (ఆగస్టు 9), రాఘవేంద్రస్వామివారు సజీవసమాధిని పొంది సరిగ్గా 346 ఏళ్లు కావస్తున్నాయి. ఆ సందర్భంగా స్వామివారి తలపు...


స్వామివారు 1595లో తమిళనాడులోని భువనగిరి అనే గ్రామంలో తిమ్మనభట్టు, గోపికాంబ అనే దంపతులకు జన్మించారు. ఈ దంపతులు వేంకటేశ్వరుని భక్తులు కావడంతో తమ కుమారునికి వెంకటనాథుడు అని పేరు పెట్టారు. వేంకటనాథుడు అక్షరాభ్యాసం నుంచే సకల శాస్త్రాలనూ ఔపోసన పట్టసాగాడు. నాలుగు వేదాలతో సహా ఆధ్మాత్మికలోకంలో వినుతికెక్కిన సకల గ్రంథాల మీదా అతను పట్టు సాధించాడు. యుక్తవయసు వచ్చేసరికి తానే పదిమందికీ బోధించే స్థాయిలో జ్ఞానాన్ని సాధించాడు.


వెంకటనాథుడు తన విద్యను ముగించుకుని ఇంటికి తిరిగివచ్చేసరికి ఆయనకు సరస్వతీబాయితో వివాహం జరిపించారు. వారికి ఓ చక్కని కుమారుడు కూడా జన్మించాడు. అయితే వేంకటనాథడు ఆధ్మాత్మిక గ్రంథాలని కేవలం చదవలేదు. వాటిని మనసారా ఆకళింపు చేసుకున్నాడు. వాటిలో నిత్యం వినిపించే మోక్షమనే పదమే తన లక్ష్యం కావాలనుకున్నాడు. అందుకే కుంబకోణానికి చేరుకుని అక్కడ సుధీంద్ర తీర్థులు అనే పీఠాధిపతి వద్ద శిష్యరికం సాగించాడు.
 


వేంకటనాథుని జ్ఞానం, వాదనాపటిమ చూసిన సుధీంద్ర తీర్థులు ముగ్థులైపోయారు. ఒకానొక సందర్భంలో ఆయన కూడా రాయలేకపోయిన ఒక ఘట్టాన్ని వేంకటనాథుడు పూరించాడట. ఆ సందర్భంగా గురువుగారు ఆయనకు ‘పరిమళాచార్య’ అన్న బిరుదుని అందించారట. ఇక సుధీంద్ర తీర్థునికి అవసాన దశ రాగానే... తన వారసునిగా వేంకటనాథుడు తప్ప మరో పేరే స్ఫురించలేదు. గురువుగారి వారసత్వాన్ని కొనసాగించేందుకు, వేంకటనాథడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు. తన ఇష్టదైవమైన రాముని పేరుమీదుగా ‘రాఘవేంద్ర తీర్థులు’గా మారి గురువుగారి శ్రీమఠం బాధ్యతలను తలకెత్తుకున్నాడు.


స్వామివారు చాలా ఏళ్లు కుంబకోణలోని శ్రీమఠాన్ని నిర్వహించారు. పిదప ధర్మప్రచారం చేస్తూ ఉత్తర దిక్కుగా బయల్దేరారు. స్వామి ఒకో ఊరు దాటుతూ... తన ఉపన్యాసాలతోనూ, తర్కంతోనూ ప్రజలందరినీ భక్తి మార్గానికి మరలిస్తూ సాగారు. ఆ సందర్భంగా ఆయనకు ‘గురుసార్వభౌమ’ అన్న బిరుదు వరించింది. ఇలా సాగుతున్న స్వామివారు కర్ణాటక సరిహద్దులోని పంచముఖికి చేరుకున్నారు. అక్కడ 12 సంవత్సరాలపాటు పంచముఖి ఆంజనేయుని ఉపాసించారట. ఆయన దీక్షకు మెచ్చి ఆ స్వామివారు పంచముఖి రూపంలోనే దర్శనమిచ్చారట. 


అక్కడి నుంచి స్వామి ఆదోనికి చేరుకున్నాడు. అప్పట్లో మసూద్‌ఖాన్‌ అనే ముస్లిం రాజు అదోనిని పాలించేవాడు. స్వామివారి మహిమలకు ముగ్ధుడైన మసూద్‌ఖాన్‌, తన రాజ్యంలో స్వామివారికి ఎలాంటి లోటూ ఉండదని హామీ ఇచ్చాడు. స్వామివారు సాక్షాత్తూ ఆ ప్రహ్లాదుని అవతారం అని భక్తులు విశ్వాసం. అందుకు తగినట్లుగానే ప్రహ్లాదుని రాజ్యంలోని భాగమని చెప్పబడుతున్న మాంచాల అనే గ్రాహానికి చేరుకున్నారు రాఘవేంద్రులు. అక్కడే తాను జీవసమాధి చెందబోతున్నట్లు ప్రకటించారు.


1671 శ్రావణ బహుళ విదియనాడు స్వామివారు సాలగ్రామాల తోడుగా, వేదమంత్రాల సాక్షిగా.... సజీవంగా మాంచాల గ్రామంలోని బృందావనంలోకి ప్రవేశించారు. అదే ఇప్పుడు మంత్రాలయం అన్న పేరుతో పిలవబడుతోంది. తాను బృందావనంలోకి ప్రవేశించినప్పటికీ, 700 ఏళ్లపాటు జీవించే ఉంటానని ఆయన చెప్పారట. అందుకు సాక్ష్యంగా ఇప్పటికీ స్వామివారు పలుభక్తులకు దర్శనమిచ్చినట్లు చెబుతారు. బ్రటిష్‌వారు పాలించే సమయంలో కర్నూలు కలెక్టరుగా విధులు నిర్వహించిన సర్ థామస్ మన్రోకు సైతం స్వామివారు కనిపించినట్లు తెలుస్తోంది.


మధ్వాచార్యులు స్థాపించిన ద్వైతమత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలోనే రాఘవేంద్రులు తన జీవితాన్ని గడిపేశారు. కేవలం ప్రవనచాల ద్వారానే కాకుండా సుధాపరిమళం వంటి అనేక గ్రంథాలను రచించడం ద్వారా మధ్వ సిద్ధాంతాన్ని బలపరిచారు. జ్ఞానాన్ని పలికించడంలోనే కాదు, సరిగమలు వినిపించడంలోనూ స్వామివారు దిట్ట. ఆయన వీణ మోగిస్తుంటే అలౌకికమైన అనుభూతి కలిగేదట. ఇప్పటికీ మంత్రాలయంలోని ఆయన సన్నిధికి చేరుకున్న ప్రతిఒక్కరికీ ఇదే అనుభూతి కలుగుతూ ఉంటుంది.

 

- నిర్జర.
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.