Read more!

ద్రాక్షారామం

 

 

ద్రాక్షారామం

 

 

మనం పుట్టి పెరిగిన వూళ్ళు, మనకు తెలిసిన ప్రదేశాలు ఎన్నో పురాణ గాధలకు, చారిత్రిక విశేషాలకూ నిలయమంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది..ఎంతో ధ్రిల్లింగ్ గా కూడావుంటుంది కదా.  మీలో చాలా మంది ద్రాక్షారామం పేరు వినే వుంటారు.  అదేనండీ.  తూర్పు గోదావరి జిల్లాలో వున్న పుణ్య క్షేత్రం.  పంచారామాల్లో ఒకటి.  ఈ ప్రదేశంతో ముడిపడి వున్న పౌరాణిక గాధలు మీకు తెలుసా  తెలుసు.  దక్షుడు, యజ్ఞం బ్లా బ్లా బ్లా ఏదో వుంది.  అదే కదా.   పూర్తి వివరాలు చెప్పటానికి మీకే ఛాన్సు ఇస్తున్నాము.   మీరే చెప్పెయ్యండి అంటారా.  సరే నేనే చెప్తాను.

పురాణ కధలు
·    తారకాసురుని మెడలోని శివ లింగాన్ని కుమారస్వామి ఛేదించగా  ఐదు చోట్ల పడ్డ ఆ లింగం ముక్కలను వివిధ దేవతలు ప్రతిష్ఠ చేశారని చెప్పుకున్నాము కదా.  అందులో ఒక ముక్క ఇక్కడ పడింది.  ఇది వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠిత లింగం.

·    పూర్వం దక్షప్రజాపతి నివసించిన ప్రదేశం ఇది.  అందుకే దాక్షారామం అయింది.  అలాగే ద్రాక్ష తోటలు ఎక్కువ వుండేవి, అందుకని ద్రాక్షారామం అన్నారు.   ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం చేయ తలపెట్టాడు.  ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు కానీ, తన అల్లుడైన శివుణ్ణి  ఆహ్వానించలేదు.  కారణం అంతకు ముందెప్పుడో ఈయనగారిని చూసి ఆయన పలకరించలేదనీ, అభివాదం చేయలేదని కోపం వచ్చి.  ఈ అలకలూ, కోపాలూ ఈ కాలంలోనే అనుకున్నాము, ఆ కాలంలోనూ వున్నాయా అనకండి.  ఏ కాలమైనా గుణాలు తమ సహజత్వాన్ని కోల్పోవుకదండీ.  అందుకని వాదోపవాదాలకు దిగకుండా ముందుకు సాగుదాం.

 

 

ఈ యజ్ఞం గురించి పార్వతీ దేవికి తెలిసింది.  పుట్టింట్లో యజ్ఞం జరుగుతోంది, ఆసంబరం, ఆ హడావిడి తను మిస్ అయిపోతోందే అనుకుంది.  శివుడి దగ్గర పుట్టింటికెళ్ళే ప్రపోజల్  పెట్టింది.  కానీ శివుడు జగదీశ్వరుడు కదా.  ఆయన పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, వద్దు అని నీతి చంద్రిక తిరగేశాడు.  కానీ ఆడవారు  ఏదైనా తలచుకుంటే, అందులోనూ, పుట్టింటి విషయంలో దాన్ని సాధించకుడా వుండరుగా.  మొత్తానికి పరమేశ్వరుడిని ఒప్పించి, పుట్టింట్లో జరిగే యజ్ఞానికి వెళ్ళింది.  అక్కడ ఏమయింది.  ఎవరూ ఆవిడని పలకరించలేదు.  ప్రేమాదరాలు చూపించలేదు.  దానితో పార్వతీదేవికి కోపం వచ్చింది.  భర్త మాట వినకుండా వచ్చినదానికి పశ్చాత్తాప పడింది.  ఇటు పుట్టింట్లోనూ వుండలేక పోయింది, అటు శివుడి దగ్గరకెళ్ళి జరిగిన విషయం చెప్పలేక పోయింది.      పాపం.  ఆ అవమానం భరించలేక  తనని తను కాల్చుకుని బూడిద అయింది.  ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు.  తన జటాజూటంనుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు.  ఆయన వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు.  

 

 

పత్నీ వియోగాన్ని భరించలేని శివుడు పార్వతి  సూక్ష్మ శరీరాన్ని భుజంమీద పెట్టుకుని ఆవేశంతో ప్రళయ తాండవం చేశాడు.  శివుణ్ణి ఆపటానికి విష్ణువు పార్వతీ దేవి సూక్ష్మ శరీరాన్ని తన చక్రాయుధంతో ముక్కలు చేశాడు.  ఆ శరీరం 18 ముక్కలయి 18 చోట్ల పడ్డాయి.  అవే అష్టాదశ శక్తి పీఠాలు.  వీటిని జగద్గురువు శంకరాచార్యుల వారు పున  ప్రతిష్టించి అన్ని చోట్లా శ్రీ చక్రాలను కూడా స్ధాపించారు.    దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశంలోనే శివుడు భీమరూపంలో స్వయంభువుడిగా వెలిశాడు.

ఇంకొక్క కధ మాత్రమే చెప్తానండీ ఈ క్షేత్రం గురించి.  పూర్వం వేదవ్యాసుల వారు కాశీలో నివసించేవారు.  ఒకసారి కాశీ విశ్వేశ్వరుడు ఆయన్ని పరీక్షించదలచి  ఎక్కడా భిక్ష దొరక్కుండా చేశాడుట.  దానికి  వేదవ్యాసుడు కోపించి కాశీని శపించబోయాడుట.  అప్పుడ అన్నపూర్ణాదేవి ఆయనకీ, శిష్యులకీ భిక్ష పెట్టిందట.  వేదవ్యాసుడు కాశీని శపించబోవటం శివుడికి కోవం తెప్పించింది.  వెంటనే శివుడు వేదవ్యాసుణ్ణి శిష్యసమేతంగా కాశీ విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు.  దానికి వేదవ్యాసుడు బాధపడగా అన్నపూర్ణాదేవి  ఆయనకు దక్షారామము పోయి అక్కడ భీమేశ్వరుని  సేవించమనీ, అక్కడ వుంటే కాశీలో వున్నట్లే వుంటుందనీ  చెప్పగా వ్యాసుడు తన 300 మంది శిష్యులను వెంటబెట్టుకుని దాక్షారామం వచ్చి అక్కడ నివసించాడు.  దీనికి గుర్తుగా ఆలయంలో ఒక స్తంబంమీద వ్యాసుని విగ్రహం చెక్కబడింది.

 

 

వింధ్య పర్వతం గర్వమణిచే కార్యక్రమంలో అగస్త్య మహర్షి ఇక్కడకొచ్చి కొంతకాలం ఇక్కడ నివసించాడు.  

వివరణ చాలా పెద్దగా  వుందా.  మరి అన్ని విశేషాలు వున్నాయండీ.  ఇంకా పైన చెప్పని విశేషాలు బోలెడున్నాయి.  క్లుప్తంగా......
·    మన దేశంలో దాక్షారామం, శ్రీ శైలం, శ్రీ కాళహస్తి మధ్య వున్న ప్రదేశాన్ని త్రిలింగ దేశమన్నారు.  త్రిలింగ దేశానికి ఉత్తర సరిహద్దుగా దాక్షారామం ప్రసిధ్ధికెక్కింది.
·    ఇక్కడ వెలసిన భీమేశ్వరునికి అభిషేకం చేయటానికి  సప్త ఋషులు సప్తగోదావరులను తీసుకువచ్చారు.  ఇవి అంతర్వాహినులు.
·    వేదవ్యాసుడు, అగస్త్య మహర్షి ఒకే సమయంలో ఇక్కడ కొంతకాలం నివసించారు.  
·    ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ.  అష్టాదశ శక్తిపీఠాలలో 12వ పీఠమిది.
·    ఇక్కడ క్షేత్ర పాలకుడు లక్ష్మీ నారాయణ స్వామి.  ఈయన్ని శ్రీ రామచంద్రుడు ప్రతిష్ఠించాడు.
·    గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం వుంది.  ఈయనకి జుట్టు ముడి వేసి కొప్పులాగా వుంటుంది.  అందుకే ఆ పేరు. గద లేదు.  నమస్కార ముద్రలో వుంటాడు.  తుష్కరులు ఈ విగ్రహం కాళ్ళ దగ్గర కొట్టేశారు.
·    ప్రక్కనే ఒకే పానువట్టంమీద 108 చిన్న చిన్న శివ లింగాలు వుంటాయి.  దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలూ చూసినంత ఫలమట.

 

 

·    ఇక్కడ నవగ్రహ మండపమే కాక  అష్ట దిక్పాలకులకూ మండపం వుంది.  బహుశా దీన్ని ఇక్కడే చూస్తామేమో.
·    ఇంకా శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించిన విరూపాక్ష స్వామి, రెండు తలల అష్టబంధ నాగేశ్వర స్వామి,  కైలాస గణపతి  దర్శనీయ  దేవతా మూర్తులు.
·    ఏక  శిలలో మలచిన  నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు.
·    అష్టదిక్పాల మండపానికి ఎదురుగా వున్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటికోణం అని పిలుస్తారు.  ఇందులో మూడు ప్రాకారాలున్నాయి.  అందులో మొదటి రెండు ప్రాకారాలలో గోడలకి బొడిపలు కనబడతాయి.  పూర్వం అక్కడ నవరత్నాలు పొదగబడి వుండటంవల్ల  ఆ ప్రదేశమంతా కాంతిమయంగా వుండేదట.
·    9—10 శతాబ్దాలలో నిర్మింపబడిన ఈ ఆలయ కుడ్యాలపై 832 శాసనాలు చెక్కబడివున్నాయి.  మనకి వీటిలోని వ్రాత అర్ధంకాకపోయినా చారిత్రిక పరిశోధకులకు ఇవి పెన్నిధి వంటివి.  ఇలాంటి శాసనాల ఆధారంగా చేసిన పరిశోధనల ద్వారానే  మనకు మనదేశ పూర్వ చరిత్ర తెలుస్తుంది.
·    ఆలయాభివృధ్ధికి ఏ ఏ రాజులు ఎలా తోడ్పడ్డారు, ఏ మండపాలు, ప్రాకారాలు ఎవరు కట్టించారు, ఆలయ నిర్వహణకి ఏ రాజులు ఎంత దానాలిచ్చారు వగైరా వివరాలన్నీ ఈ శాసనాలలో లభ్యమవుతుంది.  
·    వాడ్రేవు జమీందారులిచ్చిన 125 ఎకరాల భూమిమీద ఆదాయం నేటికీ ఆలయాభివృధ్ధికి తోడ్పడుతోంది.
·    భీష్మ ఏకాదశినాడు భీమేశ్వరస్వామి, లక్ష్మీ నారాయణ స్వామి, సూర్యనారాయణ స్వామిల కళ్యాణం ఒకే వేదికపై జరపడం కూడా ఇక్కడి విశేషమే.

 

ఇన్ని విశేషాలున్న ఆలయాన్ని మరి మీరూ దర్శిస్తారుగా.  దర్శన వేళలు గుర్తు పెట్టుకోండేం.  
ఉదయం 6-00 గం. లనుండి 12-00 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3-00 గం. లనుండి 8-00 గం. ల వరకు.


వుండటానికి దేవస్ధానంవారి వసతి గృహాలు, ఉచితంవి, డబ్బు చెల్లించేవి వున్నాయి.  దేవస్ధానం వారు మధ్యాహ్నం 12 గం.లకు ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.  

ఈ ప్రదేశం చేరటానికి కాకినాడ దాకా వెళ్ళి అక్కడనుంచి ఉదయం 9-30 కి. పాసెంజరులో వెళ్ళవచ్చు.  గోదావరి జిల్లాలో ముఖ్య పట్టణాలన్నింటినుంచీ బస్సు సౌకర్యం బాగా వుంది.  బస్సు స్టాండు గుడికి 1/2 కి.మీ. దూరంలో వుంది.

 

.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)