Read more!

నిజమైన ధర్మానికి నిర్వచనం!!

 

నిజమైన ధర్మానికి నిర్వచనం!!

మనిషికి జ్ఞానం ముఖ్యమైనది. జ్ఞానం గలవాడు ప్రతిదాంట్లో ఒక క్రొత్తదనాన్ని, ఒక ప్రత్యేకతను చూడగలుగుతాడు. ప్రతిదాన్ని దానికున్న విలువను తెలుసుకోవడం లేదా గుర్తించడం చేస్తాడు. అలా జ్ఞానం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు నాలుగవ అధ్యాయంలో జ్ఞానయోగంలో భోదిస్తాడు.  అందులోనూ నిజమైన ధర్మం అంటే ఏమిటో చెబుతాడు. అందరూ తెలుసుకోవాల్సిన విషయమిది.

【శ్లోకం :- యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ||

ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మము తల ఎగరేస్తుందో, అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటాను. ఇది పరమాత్మ భూలోకమునకు రావడానికి కారణం. 】

సాధారణ ధర్మం, అందరూ ఆచరించవలసిన ధర్మం ఏమిటంటే, ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే తనకు కానీ, తన శరీరానికి కానీ బాధ, హాని కలుగుతుందో, ఆ పని తాను ఇతరులు పట్ల చేయకుండా ఉండటం. దీనినే సాధారణ ధర్మం అంటారు. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే అంటే ఎవరి పనులు వాళ్లు చేయడం. చేయవలసిన పనులు చేయడం, చేయకూడని పనులు చేయక పోవడం, చేసే పనులు నిష్కామంగా, కర్తృత్వ భావన లేకుండా, స్వార్థబుద్ధితో కాకుండా, సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, చేయడం, ధర్మం అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపము. ఇంక అధర్మం అంటే చేయవలసిన పనులు చేయకపోగా, చేయకూడని పనులు చేయడం. ఇతరులకు హాని చేయడం. తన చేతల వలన సమాజానికి హాని కలిగించడం. పరమాత్మను మరిచిపోవడం.

మానవుని ధర్మం ఏమిటంటే తాను ఎవరో తాను తెలుసుకోవడం. అందరిలో పరమాత్మ ఆత్మ స్వరూపుడుగా ఉన్నాడని భావించడం, ఒక్కమాటలో చెప్పాలంటే మానవుడు మానవుడిగా మానవత్వంతో జీవించడం. కాని మానవుడు ఆ పని చేయకపోగా, మానవత్వం మరిచిపోయి, చేయకూడని పనులు అంటే ఇతరులను హింసించడం, ధనం కోసం చేయరాని పనులు చేయడం, ఇతరుల శరీరము, మనసు, కష్టపెట్టడం. హింసకు ప్రతి హింస చేయడం. చేస్తున్నాడు. ఇదే అధర్మము, ఇటువంటి అధర్మము పెరిగిపోతుంటే, ధర్మానికి హాని కలుగుతుంది. పరమాత్మను నమ్ముకున్న సాధుజనులకు నష్టం కలుగుతుంది. కాబట్టి అధర్మాన్ని అణచడానికి పరమాత్మ తనకు తానే సృష్టించుకుంటాడు. (ఈ రోజుల్లో కూడా, ఏదైనా వార్తాపత్రికలో కానీ, న్యూస్ ఛానల్ లో గానీ, ఎక్కడైనా అధర్మం జరిగినట్టు అనిపిస్తే, హైకోర్టు, సుప్రీం కోర్టు, ఆ వార్తను తనకు తానుగా (స్యూ మోటో అంటే తనకు తానుగా దావా చేయడం) రిట్ ఫిటిషన్ గా స్వీకరించి విచారించడం దీని కిందికే వస్తుంది.) ద్వాపరంలో పరమాత్మ కృష్ణుడుగా అవతరించాడు అని మనకు తెలుసు. మరి కలియుగంలో ఎందుకు అవతరించడం లేదు అని కొంతమంది ప్రశ్న. ద్వాపరంలో కృష్ణుడు అవతార పురుషుడు అని ఎంతమందికి తెలుసు అని ఎప్పుడన్నా విచారించారా, చాలా మందికి తెలియదు. అదీకూడా కృష్ణుడు ద్వాపరయుగాంతంలో అవతరించాడు. ఈ కలియుగంలో ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతూ ఉందో, అప్పుడప్పుడు పరమాత్మ అవతరిస్తూనే ఉన్నాడు. నాస్తికత్వం పెచ్చరిల్లినపుడు, ప్రజలకు పరమాత్మ మీద నమ్మకం సన్నగిల్లినప్పుడు, శంకరాచార్యులుగా ఉద్భవించి అద్వైతాన్ని స్థాపించారు. 

ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. "తదాత్మానం సృజామ్యహమ్" అంటే ఎటువంటి ఆకారంలేని పరమాత్మ ఒక ఆకారం ధరిస్తాడు. అది అప్పటికప్పుడు ధరించడం. కావచ్చు లేక మన మాదిరే తల్లి గర్భం నుండి రావచ్చు.. లేక ఒక శిలావిగ్రహ రూపం కావచ్చు. హిరణ్యకశిపుడి నుండి లోకాన్ని విముక్తి కలిగించడానికి అప్పటికప్పుడు నరసింహావతారం దాల్చాడు. ఆ పని కాగానే ఆ అవతారం ఉపసంహరించాడు. రాముడిగా, కృష్ణుడిగా మాతృగర్భవాసాన జన్మించి ఎన్నో సంవత్సరాలు భూమి మీద నడయాదాడు. రాముడిగా, కృష్ణుడిగా నేటికీ అందరిచేతా పూజింపబడుతున్నారు. ఏడుకొండల మీద శ్రీవేంకటేశ్వరుడిగా ఒక విగ్రహరూపంలో అవతరించి కలియుగాంతం వరకు నిలిచి ఉండి, ప్రజలలో భక్తిభావాన్ని పెంపొందింపజేస్తున్నాడు. ఇవన్నీ పరమాత్మ తనకు తానుగా సృష్టించుకున్న ఎలా, ఏ రూపంలో ఎక్కడ అవతరించాలో ఆ పరమాత్మ ఇష్టం. 

◆ వెంకటేష్ పువ్వాడ