Read more!

గీతలో చాలా మందికి తెలియని శ్లోకమిదే!

 

గీతలో చాలా మందికి తెలియని శ్లోకమిదే!

భగవద్గీత 700 శ్లోకాలు గ్రంథం. ఈ ఏడువందల శ్లోకాలు గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. అవును మరి గీతాసారం మొత్తం తెలుసుకున్నవాళ్ళు తక్కువే, ఇక ఆ గీతలో అంతర్లీనంగా చెప్పినదాన్ని ఆచరించేవాళ్ళు ఇంకా ఇంకా తక్కువ. అందుకే చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదే గీతలో ఇంకొక శ్లోకం ఉందనే విషయం. అంటే గీతలో 700 కాదు 701 శ్లోకాలు ఉంటాయి. ఆ 701 వ శ్లోకం ఏమిటి అనేది తెలుసుకుంటే వచ్చే నష్టం ఏమీ ఉండదు.

ఒక ప్రశ్న, ఒక సమాధానం లేదా ఒక ప్రశ్న వంద సమాధానాలు అయినా అది వినేవాడికి సమంజసంగా ఉంటుందేమో కానీ అసలు ప్రశ్న అనేది లేకుండా కేవలం సమాధానం చెబితే వినే వాళ్లకు అనిపిస్తుంది "అసలు ఇప్పుడు ఇది ఎందుకు చెప్పినట్టు?? దేనికోసం చెప్పినట్టు" అని. 

ఒక ప్రశ్నను వివరంగా తెలుసుకుంటే దానికి సమాధానం చాలా వరకు ప్రశ్నలోనే ఇమిడి ఉంటుందని తెలుస్తుంది. ఇది పెద్దలు చెప్పే మాట. అలాగే ఒక సమాధానాన్ని వింటే ఆ సమాధానం అర్థం చేసుకునే వారిని బట్టి బోలెడు ప్రశ్నలు పుడతాయి. ఒక్కొక్కరికి ఒకో విధమైన ప్రశ్న బుర్రలో మొలకెత్తవచ్చు. కాబట్టి ప్రశ్న, ప్రశ్నకు తగ్గ సమాధానం రెండూ ఉన్నప్పుడు ఇక విషయం ఎంతో స్పష్టతను కలిగి ఉంటుంది.

మనం చెప్పుకుంటున్న భగవద్గీతలో 701 వ శ్లోకం ఒక ప్రశ్న. ఆ ప్రశ్నను అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు. 

【శ్లోకం:- ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ మేవచ |

 ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ॥


"కృష్ణా! నీవు ఇది వరకు ప్రకృతి అనీ, పురుషుడు అనీ, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనీ జ్ఞానము(తెలుసుకొన్నది) అనీ, జ్ఞేయము (తెలుసుకోదగినది)అనీ, ఇలా వీటి గురించి చెప్పావు. నాకు ఏమీ అర్ధం కాలేదు. మళ్లీ వాటన్నిటి గురించి వివరంగా చెప్పవా!!" అని అడిగాడు అర్జునుడు. 

ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయము. ఈ ఆరు పదాలు వేదాంతంలో అక్కడక్కడ కనపడే సాంకేతిక పదాలు. ఈ ఆరుపదాలను అర్జునుడు చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా కృష్ణుని నోటి గుండా విని ఉన్నాడు. కాని వాటి గురించి అర్జునుడికి పరిపూర్ణమైన అవగాహన లేదు.

అంటే ఇక్కడ అర్ధమయ్యే విషయం ఒకటి ఉంది. ఎప్పుడూ వింటూ ఉండటం వేరు, ఆ విన్న వాటిని గురించి వివరంగా తెలుసుకోవడం వేరు. 

చిన్నప్పటి నుండి పిల్లలు బడిలో చదువుకుంటారు గాలి పీడనాన్ని కలిగిస్తుంది అనే విషయం. కానీ అది చదివితే వాళ్లకు కేవలం ఆ వాక్యం మాత్రమే తెలుసు అంతే. పీడనాన్ని కలిగి ఉంటుంది అనేది వాళ్లకు నోటెడ్. కానీ ఆ పీడనం ఎలా ఉంటుంది?? అది ఏ విధంగా తన ప్రభావాన్ని చూపిస్తోంది. అసలు గాలి ఎలా పీడనాన్ని కలిగిస్తుంది?? ఇవన్నీ పిల్లలు పై తరగతులకు వెళ్లే కొద్దీ ప్రాక్టీకల్స్ ద్వారా అర్థం చేసుకుంటారు. అలాగే అర్జునుడు చిన్నప్పటి నుండి ఎన్నెన్నో విన్నాడు కానీ అవన్నీ కేవలం వినడం వరకే సరిపోయాయి. అందుకే మళ్ళీ చెప్పమని కృష్ణుడిని అడుగుతున్నాడు. 

చాలా మంది వ్యాఖ్యాతలు ఈ శ్లోకానికి వ్యాఖ్య రాయలేదు. జగద్గురువులు శ్రీ శంకరాచార్యులవారు కూడా ఈ శ్లోకానికి వ్యాఖ్యరాయలేదని పెద్దలు చెబుతారు. భగవద్గీత పూర్తిగా కృష్ణార్జున సంవాదము. అర్జునుడు ప్రశ్న అడిగితే కృష్ణుడు సమాధానాలు చెప్పడం. ఈ అధ్యాయంలో, ఈ శ్లోకం తీసేస్తే, అర్జునుడు ప్రశ్న అడగకుండానే కృష్ణుడు సమాధానం చెప్పినట్టు అవుతుంది కాబట్టి ఈ శ్లోకం అవసరమయింది. శ్లోకంలో ఉన్నది ప్రశ్ననే.

                                   ◆వెంకటేష్ పువ్వాడ.