Read more!

మరణంలో మర్మానికొక విశ్లేషణ!!

 

మరణంలో మర్మానికొక విశ్లేషణ!!

 

భగవద్గీత రెండవ అధ్యాయం, ఇరవైరెండవ శ్లోకం విశ్లేషణ చూస్తే ప్రాణ భయం అంటే ఏమిటో తెలియనంత మార్పు వస్తుంది.

【శ్లోకం:- వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృష్ణాతి సరోజ పరాణి। తథా శరీరాణి విహాయ జీర్ణాస్యన్యాని సంయాతి నవాని దేహీ|||

ఓ అర్జునా! ఏ విధంగా నైతే మానవుడు చినిగిపోయిన వస్త్రములను విడిచిపెట్టి, కొత్త వస్త్రములను ధరిస్తాడో, అలాగే ఈ శరీరములలో ఉండే ఆత్మ ముసలి తనముతో కృశించి పోయి ఇంక తిరగడానికి కూడా పనికిరాని శరీరములను విడిచిపెట్టి, కొత్త దేహమును ధరిస్తుంది.. 】

ఇక్కడ కృష్ణుడు మరణము, పునర్జన్మ వీటి గురించి సోదాహరణంగా వివరిస్తున్నాడు. మనిషి మరణించిన తరువాత ఏమవుతాడు అనే ప్రశ్న అర్జునుడి మనసులో మెదిలిందని గ్రహించాడు కృష్ణుడు, మరణం అంటే కేవలం దుస్తులు మార్చుకోవడం లాంటిది. మనం కొత్త బట్టలు వేసుకుంటాము. కొన్నాళ్లకు ఆ దుస్తులు చినిగిపోతాయి. చినిగిపోయిన దుస్తులు వేసుకోము కదా. అందుకని చినిగిపోయిన బట్టలు వదిలి పెట్టి కొత్త బట్టలు ధరిస్తాము. ఇదివరకు ఒక రంగు బట్టలు వేసుకున్నాము. ఇప్పుడు మరొక రంగు బట్టలు వేసుకున్నాము, వాటికి ఒక బ్రాండెడ్ నేమ్ ఉంటుంది. ఆ పేరుతో పిలుస్తాము. అలాగని మనం మారలేదు. మన రంగు మారలేదు, మనం యథాప్రకారమే ఉన్నాము. కేవలం మనం వేసుకునే దుస్తులు, వాటి రంగు, వాటి బ్రాండ్ నేమ్ మారాయి.

మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని దేహి అని కూడా అంటారు. దేహి అంటే దేహమును ధరించిన వాడు. ఈ దేహి శరీరము అనే దుస్తులు మార్చుకుంటూ ఉంటాడు. ఒక శరీరము శిధిలము అయిపోయినపుడు శరీరమును వదిలిపెట్టి మరొక శరీరమును ధరిస్తాడు.

ఇది వరకు మనం అనుకున్నట్టు ఈ శరీరం పంచభూతముల కలయకతో ఏర్పడింది. కొన్నాళ్లకు ఈ శరీరం ముసలదయిపోతుంది. దేహి ఆ దేహములో ఉండటానికి ఇష్టపడదు. అందుకని ఆ దేహమును వదిలి పెట్టి మరొక దేహములో ప్రవేశిస్తాడు. పంచభూతములతో ఏర్పడిన ఈ శరీరం దీనికది విడిపోతుంది. గాలి గాలిలో, శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఈ విషయాన్ని జ్ఞాని అయిన వాడు అర్థం చేసుకుంటాడు. అందుకని ఈ దేహం వదిలిపెట్టడానికి ఏ మాత్రం సంకోచించడు. పైగా కొత్త దేహం వస్తున్నందుకు సంతోషిస్తాడు మనం కొత్త బట్టలు వస్తే ఎలా సంతోషిస్తామో అలాగ. కాని అజ్ఞాని "అయ్యో ఈ దేహం వదలాల్సివచ్చిందే" అని దుఃఖపడతాడు. ఓ పట్టాన ఈ దేహం వదలడానికి ఒప్పుకోడు. అదే చావుకు భయపడటం.

మన సంస్కృతిలో ఏమీ తెలియని వాడికి కూడా దేహము వేరు, లోపల ఉండే ఆత్మస్వరూపము వేరు అని తెలుసు. వచ్చిన చిక్కల్లా దానిని ఆచరించం. మరలా మోహంలో పడిపోతుంటాము, ఇంకొక విషయం ఈ దేహం లో నుండి జీవుడు బయటకు వెళ్లడానికి ఇష్టపడడు, చాలా యాతనపడతాడు. కాని బలవంతంగా బయటకు వెళతాడు. ఇంకా ఆ దేహాన్ని అంటిపెట్టుకొని దాని వెంటనే వెళతాడు. అంత్యక్రియలు జరిగేటప్పుడు అక్కడే ఉంటాడు. ఈ విషయాన్ని ఊహించిన మన ఋషులు ఒక కార్యక్రమం పెట్టారు. ఒకవేళ జీవుడు మరలా పొరపాటున తన శరీరంలో దూరుతాడేమో అని దింపుడు కళ్లం అని మూడు సార్లు దింపుతారు. తరువాత అంత్యక్రియలప్పుడు ఒక కుండలో నీరు పోసి దానిని తీసుకొని శరీరం చుట్టు తిరుగుతాడు. దానికి మూడు రంధ్రాలు చేస్తారు. తుదకు వెనక్కు విసిరేసి పగల గొడతాడు. దీని అర్థం ఏమిటంటే శరీరంలో నుండి బయటకు వచ్చిన జీవుడు అంతకాలం అంటిపెట్టుకున్న శరీరాన్ని వదలలేక అక్కడే తిరుగుతుంటారు. ఈ చర్య ద్వారా, బాబూ ఈ శరీరం ఒక కుండలాంటిది. అందులో ఉన్న నీరు ప్రాణాలు, అవి కుండలో నీరు మాదిరి చిల్లుల గుండా బయటకు వెళ్లిపోయాయి. కుండ పగిలిపోయింది. ఇంక దీనిని కాలుస్తాము. ఇంక ఈ శరీరం ఉండదు నీవు వెళ్లిపో అని జీవాత్మకు మనం ఇచ్చే సంకేతము.

కాబట్టి మృత్యువు అంటే కేవలం దుస్తులు మార్చడం లాంటిదని అనుకోవాలి. దాని గురించి భయపడకూడదు. స్వేచ్ఛగా ప్రాణాలు వదలగలిగి ఉండాలి. విభూతి ముఖాన ధరించేకారణం ఇదే. విభూతి అంటే ఈశ్వరుడు ధరించే శ్మశాన బూడిద. తుదకు ఈ శరీరం బూడిద కావాల్సిందే ఈ శరీరం గురించి ఆవేదన చెందవద్దు అనే సంకేతం మనకు అనునిత్యం ఇస్తుంది విభూతి ధారణ. (విభూతి అంటే ఐశ్వర్యం, ప్రకృష్టమైనది అని కూడా అర్థం.).

◆ వెంకటేష్ పువ్వాడ