Read more!

యుగయుగానికి వర్తించే శ్లోకం!!

 

యుగయుగానికి వర్తించే శ్లోకం!!

【పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్| 

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే॥

సాధువులను అంటే మంచివారిని రక్షించడం, దుష్కృ తులను అంటే దుర్మార్గులను నాశనం చేయడం, తద్వారా ధర్మమును స్థాపించడం, దీని కొరకు పరమాత్మ యుగయుగములోనూ సంభవిస్తుంటాడు అంటే అవతరిస్తుంటాడు.】

సాధుజనులను, సన్మార్గులను, మంచి వారిని, ధర్మాత్ములను, పరమాత్మ ఎల్లప్పుడూ రక్షిస్తుంటాడు. దుర్మార్గులను, హింసచేసేవారిని, మంచి వారిని హింసించేవారిని, పాపాలు చేసేవారిని, అకృత్యాలు చేసేవారిని పరమాత్మ నాశనం చేస్తుంటాడు. దీని వలన ధర్మము రక్షింపబడుతుంది. ఈ పని చేయడానికి పరమాత్మ ప్రతి యుగములో అవతరిస్తుంటాడు. ఈ శ్లోకంలో పరమాత్మ అవతరించడానికి మూడు కారణాలు చెప్పారు. 

1. మంచి వాళ్లకు హాని కలుగుతున్నప్పుడు వారిని రక్షించడానికి

2. దుర్మార్గులు పేట్రేగిపోతున్నప్పుడు వారిని శిక్షించడానికి

 3. అడుగంటి పోతున్న ధర్మమును తిరిగి పునరుద్ధరించడానికి

పరమాత్మ ఎప్పుడు అవసరం అయితే అప్పుడు అవతరిస్తాడు.

పరమాత్మ జ్ఞానస్వరూపుడు అని మనం నేర్చుకున్నాము. జ్ఞానమే పరమాత్మ. మానవునిలో ప్రతిక్షణం మంచి చెడు, సన్మార్గము, దుర్మార్గము, వీటి మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. మనసు, ఇంద్రియములు ఒకటి అవుతాయి. అప్పుడు మానవునిలో ఉన్న విచక్షణా జ్ఞానము, వివేకము, బుద్ధి రూపంలో అవతరించి దుర్మార్గమును పరిహరించి మానవుని సన్మార్గంలో నడిపిస్తుంది. ఒక్కొక్కసారి, బుద్ధి కూడా ఈ విషయంలో విఫలమౌతుంది. ఎలాగంటే, అవతారమూర్తి అయిన కృష్ణుడు స్వయంగా కురు సభకు వెళ్లి, సుయోధనునికి నయానా భయానా ఎన్ని చెప్పినా వినలేదు. మనసు, ఇంద్రియాలు చెప్పినట్టు విన్నాడు. బుద్ధిని ఉపయోగించలేదు. 

బుద్దిః కర్మానుసారిణి అని బుద్ధికూడా మనసును ఇంద్రియాలను అనుసరించింది. తుదకు శ్రీకృష్ణుని బంధించడానికి కూడా సిద్ధపడ్డాడు. తద్వారా సర్వ నాశనం అయ్యాడు.

అలాగే ధర్మరాజు కూడా మనసు, ఇంద్రియములు చెప్పినట్టు జూదం ఆడాడు. బుద్ధిని, ఆలోచనా శక్తిని, విచక్షణా బుద్ధిని ఉపయోగించలేదు. రాజసూయయాగంలో తమ్ములు నలుదిక్కులకు వెళ్లి సంపాదించిన ధన, కనక, వస్తు, వాహనముల మీద, రాజ్యముల మీద తనకు ఏ అధికారము లేకపోయినా, అధర్మంగా, అక్రమంగా, జూదంలో పణంగా పెట్టాడు. అన్నదమ్ములు అందరికీ ధర్మపత్నిఅయిన ద్రౌపదిని తన ఒక్కడి భార్యగానే భావించి పందెంలో ఓడిపోయాడు. కనీసం పందెం పెట్టేటప్పుడు తన తమ్ములతో గానీ, భార్యతోగానీ సంప్రదించలేదు. వరుసగా పందెములు ఓడిపోతున్నప్పుడు, ఇది ఎందుకు, ఎలా జరుగుతూ ఉంది అని ఆలోచించలేదు. ఆట మానేద్దాము అనే ఆలోచన రాలేదు. అహంకారము, ఉక్రోషము, ఉద్వేగము లో మునిగిపోయాడు. తన బుద్ధిని విమర్శించుకోలేకపోయాడు.. కేవలం శరీరం, మనసు చెప్పినట్టు ఆడాడు. ఫలితంగా వనవాసము, అజ్ఞాత వాసము అనుభవించాడు. ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఏమిటంటే పాండవులు, ఆ భగవంతుడు కృషుడికి ఆప్తులు అయినా వాళ్ళు కూడా శిక్ష అనుభవించారు.

అయితే ఆయన్ను నమ్ముకుంటే ఆ శిక్షను సులువుగా ముగిసిపోయేలా చేస్తాడు. ఆ శిక్ష వెనుక పరమార్థాన్ని గ్రహించిన వాళ్లకు ఆ శిక్షలో కూడా గొప్ప జీవితాన్ని ప్రసాదించగలడు.

ఎవరిలోనైనా అధర్మం తలెత్తితే, ముందు పరమాత్మ బుద్ధిరూపంలో ఆ అధర్మాన్ని నివారించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు మాట వినకపోతే అధర్మాన్ని నిర్మూలిస్తాడు. దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది దుర్మార్గులను సన్మార్గులుగా మార్చడం. (దీనినే ఈ రోజుల్లో జైళ్లలో అవలంబించే రిఫార్మేటరీ సిస్టమ్). ధర్మరాజులో అధర్మం తాత్కాలికంగా పొడసూపింది. అందుకని ఆ అధర్మాన్ని రూపుమాపడానికి అతనికి 12ఏళ్ల వనవాసం విధించి, ఋషుల సాంగత్యంలో ధర్మాచరణకు అవకాశం కల్పించాడు పరమాత్మ..

రెండవది. ఎన్నటికీ సన్మార్గంలోకి రాలేని వాడిని నిర్మూలించడం. సుయోధనునిలోని అధర్మం అతని నరనరాలలో జీర్ణించుకుపోయి ఉంది. వాడు ఎన్నటికీ మారడు, మారలేడు. అందుకని అతడు ఆచరించిన అధర్మం అతని రాజ్యభ్రష్టత్వానికీ, మరణానికి దారి తీసింది. సుయోధనుడు గుడ్డిగా నమ్మిన అతని మేనమామ శకుని రూపంలో సుయోధనుడి రాజ్యపాలనకు, జీవితకాలానికి 13ఏళ్లకే చరమ గీతం పాడించాడు. కాబట్టి సమాజంలో కానీ, శరీరంలో కానీ ధర్మానికి హాని కలిగి అధర్మం పెచ్చరిల్లితే, ఆ అధర్మాన్ని నిర్మూలించడానికి పరమాత్మ ఏదో ఒక రూపంలో తనను తాను సృష్టించుకొని, ధర్మాన్ని స్థాపిస్తాడు. ఇది ఒక యుగంలో కాదు ప్రతి యుగంలో జరుగుతూ ఉంటుంది. అనే విషయం మనకు ఈ శ్లోకం తెలియజేస్తుంది.

◆ వెంకటేష్ పువ్వాడ