Home » Dasara - Navaratrulu » విజయదశమి వైభవం!!


విజయదశమి వైభవం!

!

విజయాలను చేకూర్చేది విజయదశమి ఆరాధన. శరత్కాలంలో  వచ్చే ఈ పండుగలో తొమ్మిది రోజులు దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఈ తొమ్మిది రోజులకు శరన్నవరాత్రులు అని పేరు కూడా. ఎన్నో పండుగలు, ఎందరో దేవతలు.అయితే స్త్రీ శక్తిని స్మరిస్తూ సాగే నవరాత్రులు, ఆ నవరాత్రుల తర్వాత విజయదశమి వైభవం మాటల్లో వర్ణించలేనిది.

మహిషాసురుడితో తొమ్మిది రోజుల పాటు ఆపకుండా యుద్ధం చేసిన జగజ్జనని దుర్గాదేవి తొమ్మిదవ రోజైన మహర్నవమి నాడు మహిషాసురుడిని వధించి లోకానికి విముక్తి కలిగించిందని. ఆ విజయాన్ని సంబరంగా పండుగగా సకల జనులు పదవరోజు జరుపుకుంటున్నారని. అదే విజయదశమిగా పిలువబడుతోందని కొన్ని కథనాలు. ఇలా దసరాను యావత్ భారతమంతా కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటుంది. కొన్ని ప్రాంతాలలో వినాయకచవితికి ఎలాగైనా మంటపాలు ఏర్పాటు చేసి, వినాయకుడి విగ్రహాన్ని ఉంచి పూజలు చేస్తారో అదే విధంగా మంటపాలు ఏర్పాటు చేసి  అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ట చేసి నవరాత్రులు మొత్తం ఒకో రోజు ఒకో విధంగా అమ్మవారిని అలంకరించి, నైవేద్యాలు, పూజలు నిర్వహించి. దసరా రోజున పూజలు ముగిసిన తరువాత అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి నీటిలో నిమజ్జనం చేస్తారు. 

ఇది తెలంగాణలో బతుకమ్మ పండుగకు కాస్త దగ్గరగా అనిపించినా సంస్కృతి, సంప్రదాయాలు మొత్తం వేరుగా ఉంటాయి. 

రామ-రావణ యుద్ధ విజయదుందుభి!!

ఇది ఇలా ఉంటే కొన్ని ప్రాంతాలలో మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. సీతను అపహరించిన రావణాసురుడి జాడ కనుక్కుని లంకలో రావణాసురుడితో జరిపిన యుద్ధంలో రాముడు రావణాసురుడిని శరత్కాలంలోని ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు వధించాడని. ఆ విజయానికి గుర్తుగా విజయదశమిని వేడుకగా చేసుకుంటారని చెబుతారు. కేవలం కథనమే కాదు విజయదశమి రోజున ఎన్నో ప్రాంతాలలో రావణాసురుడి దిష్టిబొమ్మను తయారుచేసి విజయదశమి రోజున సాయంత్రం కాసేపట్లో చీకటి పడుతుందనగా రామ దనస్సును నమూనా తయారుచేసి బాణానికి అగ్నిని వెలిగించి, ఆ బాణాన్ని విడవడం ద్వారా రావణ దహనం చేస్తారు. ప్రఖ్యాత నగరాలలో అయితే ఈ రావణ దిష్టిబొమ్మలు ఎంతో పెద్దగా తయారుచేస్తారు.

ఇలా ఒకో ప్రాంతంలో ఒక్కో విధంగా విజయదశమిని ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు. పిల్లలు, పురుషులు,పెద్దలు, మహిళలు ఇలా అందరూ కలసి ఎంతో సందడిగా అంతకు మించి భక్తిగా జరుపుకునే విజయదశమి రోజున ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకుని, స్థోమత లేనివారు శుభ్రంగా ఉతికిన బట్టలు ధరించి అమ్మవారికి పూజలు చేస్తారు. వివిధరకాల పూలతో పూజ చేసి, పండ్లు, పిండివంటలు నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత ఇంటిల్లిపాది కలసి భోజనం చేస్తారు.

సాయంకాలపు సంబరం!!

ఉదయం పూజ, పండుగ ఒక ఎత్తైతే సాయంకాలం సందడి మరింత పెరుగుతుంది. సొంతం వాహనాలు ఉన్నవారు తమతమ వాహనాలను శుభ్రం చేసి, పువ్వులతో, రంగురంగుల కాగితాలతో, కుంకుమ బొట్లతో ఎంతో అందంగా అలంకరించి, వాహనాలకు నిమ్మకాయ హారాలు వేసి, ఊరంతా తిప్పుతారు. మరోవైపు ప్రతి ఊరిలో ఉన్న గుడులు, ముఖ్యంగా అమ్మవారి గుడులలో సందడి అంబరాన్ని అంటుంది. గుడులు విద్యుద్దీపాల వెలుగులో ఎంతో శోభాయమానంగా అలంకరించబడతాయి. కుటుంబసమేతంగా జమ్మిచెట్టును దర్శించుకుని పూజలు చేసి, జమ్మి చెట్టు ఆకులు తీసుకుని, వాటిని  పెద్దలకు ఇచ్చి పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇలా దసరా పండుగ ముగుస్తుంది.

◆ వెంకటేష్ పువ్వాడ
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.