రామలక్ష్మణుల నిష్క్రమణ కథ

 

విధి బలీయమైనది. ఈ సృష్టి మొదటి నుండి యుగాలు గడుస్తూ వచ్చినా ప్రతి దాంట్లో కొన్ని కారణాలు, ప్రతి కారణ జన్ముడికి కూడా ఏదో ఒక విధంగా మరణమూ సంభవించాయి. అలాంటిది సాధారణ మనుషులు మరణం గురించి చాలా ఆలోచిస్తూ, ఎంతో కృంగి పోతుంటారు. మనిషి మరణాన్ని కూడా సంతోషంగా ఆహ్వానించగలిగేంత పరిపక్వత చెందితే జీవితంలో ఎన్నింటినో సులువుగా అర్థం చేసుకునే స్థాయికి ఎదుగుతాడు.

మన హిందూ ధర్మంలో రామాయణం గురించి తెలియని వారు ఉండరు. రామచంద్రుడి బాల్య జీవితం, చందమామ కావాలని మారాము చేయడం, తరువాత విశ్వామిత్రుని దగ్గర విద్య, శివధనస్సు విరిచి సీతా పరిణయం, తండ్రి మాటతో అడవుల బాట పట్టడం. రావణాసురుడు సీతను అపహరించడం, సీతను వెతుకుతూ సుగ్రీవుడి స్నేహం, హనుమంతుని నీడ, రావణ వధ, తరువాత సీతను అడవుల పాలు చేయడం, లవకుశలు, సీత భూమాత ఒడిలోకి వెళ్లిపోవడం. ఇదీ కథ ఇదంతా చాలామందికి తెలుసు. ఎంతంటే సినిమాల్లో చూసి బట్టి పట్టినట్టు.

 మరి రామావతారం ఎలా ముగిసింది??

రామలక్ష్మణుల మరణం వెనుక కథ ఎంతమందికి తెలుసు?? 

తెలియకపోతే ఇదిగొండి మీకోసం!!

రామలక్ష్మణులు ఒకే తల్లి బిడ్డలు కాకపోయినా వాళ్ళిద్దరి మధ్య గల ప్రేమాభిమానం, ఆప్యాయతలు ఈ లోకానికి ప్రత్యేకంగా చెప్పాల్సినవి కాదు. అలాంటి రామలక్ష్మణులు ఇద్దరూ మరణంలో కూడా ఒకరి వెంట ఒకరు ఒకే ప్రాంతంలో మరణించారంటే ఈ అన్నదమ్ముల అనుబంధానికి పోలిక సరిపోవు.

దశావతారాల్లో రాముడు కూడా ఒకరు. రావణాసుడిని వధించడానికే పుట్టినవాడు రాముడు. అలాంటిది రావణ వధ జరిగిపోయాక సృష్టి కర్త బ్రహ్మ యముడిని పిలిచి, రామావతారం జరపవలసిన కార్యం ముగిసిపోయింది, ఇక రాముడిని తిరిగి వైకుంఠానికి పంపేయాలి నాయి చెబుతాడు. బ్రహ్మ మాటలు విన్న యముడు అతిబల అనే సన్యాసిగా  శ్రీరాముడి దగ్గరకు వెళ్లి ఏకాంతంగా మాట్లాడాలని అడుగుతాడు. అందుకు శ్రీరాముడు సరే అంటాడు. అయితే "రామా!! నేను నీతో మాట్లాడినంత సేపు ఇక్కడికి ఎవరూ రాకూడదు. అలా రాకుండా ఉండటానికి లక్ష్మణుడిని గది బయట కాపలాగా ఉంచు. ఒకవేళ లక్ష్మణుడు మాట తప్పి ఎవరిని అయినా ఇక్కడికి పంపితే లక్ష్మణుణ్ణి చంపేయాలి. అన్నమాట మీద నిలబడతావా??" అని అడుగుతాడు.

లక్ష్మణుడు మాట తప్పేవాడు కాదు కాబట్టి రాముడు ఎలాంటి భయం లేకుండా అతిబల మాటకు సరేనంటాడు. 

వాళ్ళు అలా లోపల మాట్లాడుకుంటూ ఉండగా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి, దేవుడి మెప్పు పొంది, తన శిష్యులతో కలసి దుర్వాసుడు అయోధ్యా నగరానికి వచ్చి "ఎన్నో ఏళ్లుగా తపస్సు చేసి వస్తున్నాం, నా శిష్యులు బాగా ఆకలిదప్పికలతో ఉన్నారు. ఒకసారి రాముడి దర్శనం చేసుకుని తరువాత వారికి ఆకలి తీరే ఏర్పాటు చేయండి" అని లక్ష్మణుడిని అడుగుతాడు. 

లక్ష్మణుడు దుర్వాసుడితో రామ దర్శనానికి కాసేపు ఆగాలి అని చెబుతాడు. ఆ మాటలు వింటూనే దుర్వాసుడు కోపంతో "రామ దర్శనానికి, ఆకలిదప్పికలకు వేచి చూడాలా?? నా తపశ్శక్తితో అందరిని భస్మం చేస్తాను" అంటాడు.

అసలే వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసొచ్చిన దుర్వాసుడు అలా కోపంతో మాట్లాడటంతో లక్ష్మణుడు వెంటనే రాముడి దగ్గరకు వెళ్లి విషయం చెబుతాడు. రాముడు దుర్వాసున్ని కలవడానికి అనుమతి ఇస్తాడు.  నీతో పూర్తిగా మాట్లాడేవరకు ఇక్కడికి ఎవరిని పంపకూడదని అలా పంపితే లక్ష్మణుడిని చంపాలనే మాటను మరచిపోయావా  రామా!!" అని అతిబల అడగడంతో.  లక్ష్మణుడు నా అన్నకు అవమానం జరగకూడదు అనే ఆలోచనతో తనకు తానుగా సరయు నదిలో మునిగి చనిపోతాడు.

ఇది జరిగిన తరువాత రాముడు పూర్తిగా కృంగిపోయి రాజ్యాధికారాన్ని వేరేవాళ్లకు అప్పగించి వేలాది మంది ప్రజలు చూస్తుండగానే తను కూడా సరయు నదిలో మునిగి తన జన్మను ముగిస్తాడు. 

ఇలా రామలక్ష్మణులు ఇద్దరూ ఒకే ప్రాంతంలో, లోకకల్యాణం కోసం జన్మించి, తమ కర్తవ్యం ముగియగానే మరణిస్తారు. 

ప్రతి మనిషి కూడా జననం, మరణం అనేవి ఇలాగే కారణ భూతాలు అనుకుంటే సుఖదుఃఖాల వలయంలో పడిపోకుండా జీవితాన్ని పరిపక్వతతో ఆస్వాదించగలుగుతాడు.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories