మనలో ఉండే ఇద్దరి రహస్యం!!

ప్రతీ మనిషిలో ఉండే రెండు స్వాభావాలు, రెండు రూపాలు. రెండింటి కలయికలో నిలిచిన మానవదేహం తెలుసుకోవలసిన విషయమిది. ముండకోపనిషత్తులో ప్రస్తావించిన ఈ విషయాన్ని గురించి స్వామివివేకానంద ఎంతో ప్రత్యేకంగా చెప్పేవారు.

1.ద్వా సుపర్ణా సయుజ సఖాయా సమానం వృక్షం పరిషస్పజాతే !

తయోరస్యః పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి ॥

సయుజ = ఎన్నరూ విడిపోని; సఖాయా = ఒకేలాంటి; ద్వా - రెండు; సుపర్ణా: = పక్షులు; సమానం = ఒకటే అయిన; వృక్షం = చెట్టు మీద పరిషస్వజాతే - ఉంటున్నవి: తయోః = వాటిలో: అన్యః = ఒకటి; పిప్పలం = పండును; స్వాదు = ఆస్వాదిస్తూ; అత్తి - తింటున్నది; అస్యః = మరొకటి; ఆనశ్నన్ = తినకుండా; అభిచాకశీతి = చూస్తూ ఉన్నది.

ఎన్నడూ విడిపోని, ఒకే విధమైన రెండు పక్షులు ఒకే చెట్టు మీద కూర్చుని ఉన్నవి. వాటిలో ఒకటి పండును ఆస్వాదిస్తూ తింటున్నది. మరొకటి తినకుండా చూస్తూ ఉన్నది.

2. సమానే వృక్షే పురుషో నిమగ్నో ఒనీశయా శోచతి ముహ్యమానః || జుష్టం యదా పశ్యత్యన్యమ్ ఈశమస్య మహిమానమితి వీతశోకః

సమానే = ఒకే; వృక్షే = చెట్టుమీద; పురుషః = మనిషిః నిమగ్నః = మునిగిపోయి; అనీశయా - అజ్ఞానంచే; ముహ్యమాన = భ్రాంతిచెంది; శోచతి = దుఃఖిస్తున్నాడు; జుష్టం = ఆరాధనీయమైన; అన్యం = మరొక; ఈశం = ఆత్మను; అస్య = దాని; మహిమానం = మహిమను; యదా ఎప్పుడు; పశ్యతి - చూస్తాడో: వీకశోకః ఇతి - దుఃఖాలనుండి విడివడుతున్నాడు.

2. జీవుడు, ఆత్మ ఒకే శరీరంలో ఉన్నారు. జీవుడు, అంటే మనిషి అజ్ఞానంలో మునిగిపోయి, భ్రాంతిచెంది దుఃఖిస్తున్నాడు. ఆరాధనీయమైన తన ఆత్మనూ దాని మహిమనూ అతడు ఎప్పుడు చూస్తాడో అప్పుడు దుఃఖాలనుండి విడివడుతున్నాడు.

శరీరం, మనస్సు, ప్రాణం, ఆత్మ మొదలైన వాటి కలయిక మనిషి రెండు పక్షుల దృష్టాంతాన్ని పోల్చి చూస్తే

చెట్టు శరీరం

పండు తినే పక్షి = జీవుడు (మనస్సు+ప్రాణం) - నీరు

పండు తినని పక్షి ఆత్మ నిజం. సామాన్యగా మనం మనలను జీవంతో, అంటే మనస్సుతోను శరీరంతోను ఏకంచేసి చూడడానికి అలవాటుపడ్డాం. అవి రెండు నీడ, నిజం కానివి, పరిణామం చెందేవి. ఇవి తీసుకువచ్చే అనుభవాలతో మనలను తాదాత్మ్యంచేసుకొన్నప్పుడు సుఖదుః ఖాలకు లోనవుతున్నాం. జనన సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంటాం.

కాని మనలో ఉన్న ఆత్మ నిజం, భగవంతుడనే అగ్ని నుండి ఉద్భవించిన విస్ఫులింగం. కనుక భగవదంశం సంతరించుకొన్నది. దానిలో మనలను తాదాత్స్మం చేసుకొన్నప్పుడు మనం దుఃఖాలనుండి విడివడుతున్నాం. మన మహిమలో మైమరుస్తాం.

స్వామి వివేకానంద పదే పదే ఉదారణగా చూపే దృష్టాంతం ఇది. ఈ రెండు పక్షుల దృష్టాంతాన్ని చెప్పేటప్పుడు ఆయన పారవశ్యంలోకే వెళ్లేవారని చెప్పాలి. ఆయన వివరణను ఒకసారి గమనిస్తే

ప్రపంచంలో ఉన్న పారమార్థిక జ్ఞానరాశిని, హిందువుల వేదాంత తత్త్వసారాన్ని, మానవ జాతియొక్క అఖండమోక్షాదర్శాన్ని, పై శ్లోకాలలో తెలియజేసిన భాషకన్నా మనోహరమైన భాషలోగానీ, రమ్యతరమైన అలంకార రూపంలో గానీ విశదం చేయజాలిన వాక్యాలు మీకెక్కడ లభిస్తాయి?

ఒకే చెట్టు మీద రెండు అందమైన పక్షులున్నాయట! అవి రెండూ స్నేహితులు. ఒకటి పళ్లు తింటూ ఉండగా, రెండవది ఏమీ తినక, శాంతంగా నిశ్చలంగా కూర్చున్నది. క్రింద కొమ్మమీద ఉన్న పక్షి, తియ్యనిపళ్లను, చేదుపళ్లను తింటూ, సుఖాన్నీ, దుఃఖాన్నీ పొందుతుండగా, రెండవ పక్షి శాంతంగా, గంభీరంగా చెట్టుకొనలో కూర్చున్నదట!! అది తియ్యని పళ్లనుగానీ, చేదుపళ్లనుగానీ తినదు. సుఖాన్నిగానీ, దుఃఖాన్నిగానీ అనుభవించదు. తన స్వస్వరూపమహిమలో లీనమై ఉంటుంది.

ఇది మానవుని ఆత్మరూప చిత్రం! మనిషి, ఐహిక జీవిత మధురఫలాలను, విషఫలాలను తింటున్నాడు. డబ్బు కోసం పరుగులు పెట్టుకున్నాడు. ఇంద్రియాల వెంటపడి పరుగెత్తుతున్నాడు. నిరాశోపహతుడై వెర్రిగా, ఇలా జీవితాన్ని గడుపుతున్నాడు. వేరే స్థలాల్లో, ఉపనిషత్తులు (కఠోపనిషత్తు, 1:3, 3, 4) నరుని జీవాత్మను రథికునితో, ఇంద్రియాలను, మదించి పట్టవశంకాక పరుగులు పెట్టే గుర్రాలతోనూ పోల్చాయి. లౌకికాడంబరాల వెంట పరుగులు పెట్టే నరుని జీవనగతి ఇలాగున్నది. బంగారు కలలుకనే యువత అవి అన్నీ చివరికి బూటకాలే అని కనుగొనగా, వృద్ధులు, తమ గతకర్మలను గురించి అలోచిస్తూ ఉంటారు.  అయినా ఈ వలలోనుండి తప్పించుకొని బయటపడే మార్గం కనిపించడంలేదు. ప్రపంచమంటే ఇలాంటిది!

కానీ ప్రతివ్యక్తి జీవితంలోను ఉత్తమ ఆశాజనకమైన క్షణాలు కొన్ని వస్తూవుంటాయి. ఘోరమైన దుఃఖాల మధ్య మహానందాలమధ్య సైతం సూర్యుని ప్రకాశాన్ని కప్పివేసే ఈ నల్లనిమబ్బులు కొన్నైనా తొలగిపోయే నిమిషాలు రాగలవు. అప్పుడు ఇంద్రియానుభవాలనుదాటి. చాలాదూరంగా ఎక్కడో, అతీతంగా ఉండే తత్త్వం యొక్క ఒక వెలుగు రేఖ హఠాత్తుగా, అప్రయత్నంగా, మన కళ్లను మిరుమిట్లు గొలుపుతుంది. ఈ జీవితాడంబరాలకు అతీతంగా, ఈ సుఖాలకు, ఈ కష్టాలకు దూరంగా ఈ ప్రకృతిని అంటే ఇహపరాలలోని మన ఆనంద భ్రాంతులను దాటి ఐశ్వర్యంకోసం, పేరుకోసం ప్రతిష్ఠకోసం, వంశాభివృద్ధికోసం, మనం పొందే ఆరాటానికి చాలాదూరంగా అది మెరుస్తుంది. దాని దీప్తి చూచి, మనిషి ఒక నిమిషంపాటు చకితుడైపోతాడు. శాంతంగా, గంభీరంగా కూర్చుని, తీపి పళ్లనుగాని, చేదుపళ్ళనుగానీ తినక ఆత్మతృప్తి కలిగి, ఆత్మానందంతో స్వకీయ తేజస్సుతో ప్రకాశించే, ఆ రెండవ పక్షిని చూస్తాడు.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories