ధనాధిపతి కుబేరుడు!!

ప్రతి ఇంట్లో కుబేరస్థానం ఏది అనేది చూసుకుని బీరువాలు, డబ్బు దాచే లాకర్లు, నగలు లాంటివి ఉంచుతారు. కుబేరుడి కరుణ ఉంటే ఆ ఇంట్లో ఎలాంటి లోటు ఉండదని నమ్ముతారు. 

అసలు ఇంతకు ఎవరు ఈ కుబేరుడు??

బ్రహ్మ కుమారుడైన పులస్త్యుని మనుమడు. విశ్రవసు ఇలిబిలకు జన్మించాడు. రావణ, కుంభకర్ణ, విభీషణులు విశ్రవసుడికి మరో భార్యవల్ల జన్మించారు. 

కుబేరుని ప్రాముఖ్యత : ఒకసారి దేవతలు కుబేరుడి తరఫున వరుణుడు యాగంచేసి సముద్రుడికి నదులకు అధిపతిని చేయగా అవి ఇతనికి ఎంతో సంపదని చ్చాయి. శివుడు కూడా కుబేరుడికి స్నేహితుడయ్యాడు.

లంకానగర రాజు : కుబేరుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరు కొమని అడుగుతాడు. అప్పుడు కుబేరుడు  దిక్పాలకుడ్ని(అన్ని దిక్కులను పాలించేవాడిని) కావాలని, సంపదకు అధిపతిని కావాలని కోరుకుంటాడు. అపుడు బ్రహ్మ కుబేరుడికి ఆ వరాలను  ప్రసాదిస్తాడు. కుబేరుడు తన తండ్రికి తానుపొందిన వరాలను గూర్చి చెప్పి తనకో నగరం నిర్మించమని అడుగుతాడు. అప్పుడు  విశ్రవసుడు దక్షిణ సముద్రంలో లంకానగరాన్ని నిర్మిస్తాడు. అప్పటి నుండి  కుబేరుడు లంకా నగరంలో  నివసించాడు. బ్రహ్మ నుండి సంపదతో పాటు పుష్పక విమానం కూడా పొందుతాడు.

రావణుని లంక : విశ్రవసువుకు మరో భార్య వల్ల జన్మించిన రావణుడు.  బ్రహ్మనుండి ఎన్నో వరాలు పొంది తన సైన్యంతో కుబేరునిపై దండెత్తి లంకా నగరానికి అధిపతి అవుతాడు. అప్పుడు కుబేరుడు గంధమాదనం పైకి వెళ్లి అలకాపురిని నిర్మించుకుని అక్కడే నివసిస్తూ ఉంటాడు.  

రావణ కుబేరుల యుద్ధం : రావణుడు దేవతల్ని బ్రహ్మణుల్ని హింసిస్తుండగా వారు మహావిష్ణువును ఆశ్రయిస్తారు. ఇది తెలిసిన కుబేరుడు తన సోదరుడైన రావణుడిని నీతిగా జీవించమని తన మనిషితో కబురు పంపుతాడు. అయితే కుబేరుడు పంపిన మనిషి చెప్పిన మాటలకు కోపం చేసుకున్న రావణుడు అతడిని నరికివేయడమేకాక ముందుగా కుబేరునిపై దండెత్తి కుబేరుడిని ఓడిస్తారు. అయితే రావణుడి చేతికి కుబేరుడు దొరకకుండా యక్షులు ఓ విమానంలో కుబేరుడ్ని తీసుకెళ్లిపోయి కాపాడుతారు. 

కుబేరుడు ఊసరవెల్లిగా మారిన సంఘటన పురాణాల్లో ఉంది.  మరుత్త మహారాజు మహేశ్వర యజ్ఞం చేస్తూ ఇంద్ర, కుబేర, వరుణ, యముల్ని ఆహ్వానిస్తాడు. అదే సమయంలో రావణుడు తన జైత్రయాత్ర ముగించుకొని ఈ యాగానికి వస్తాడు. అప్పుడు అక్కడున్న ఇంద్ర, కుబేర, వరుణ, యములు కొన్ని జంతువుల రూపాల్లోకి మరిపోతారు. కుబేరుడు ఊసరవెల్లిగా మారతాడు. 

పురాణాల ప్రకారం కుబేరునికి కొన్ని శాపాలు  ఉన్నాయి అవి ఎలా కలిగాయి అంటే:

ఒకసారి పార్వతి శివుని తొడపై కూర్చొని వుండగా కుబేరుడు ఈర్ష్యతో చూస్తాడు. అప్పుడు అది గమనించిన పార్వతి ఇతడి కన్నుపోయేటట్లు శపించింది. కుబేరుడు శాపవిమోచన కోరగా ఆ కన్ను గవ్వకన్నుగా మారుతుందని శాపవి మోచన కల్గిస్తుంది.

అలాగే ఇంకొకసారి  కుబేరుని అనుచరుడైన మణిమానుడు అగస్త్యుని తలపై ఉమ్మివేయగా ఇతడు ఇతడి సైన్యము ఓ మానవునిచే చంపబడతారని అందుకు నీవు దుఃఖిస్తావని శపిస్తాడు. భీమసేనుడు సౌగంధిక పుష్పాలకొరకు గంధమాదనం వెళ్లినపుడు మణిమానుడిని అతడి సైన్యాన్ని సంహరిస్తాడు. భీముడు కుబేరుడిని చూసినపుడు ఆ పాప పరిహారం జరుగుతుంది.

కుబేరుడి భార్య పేరు భద్ర. ఇతడు నరవాహనుడు. ఇతడి వాహనాన్ని నరులు మోస్తారు.

 కుబేరునికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి: అలకధీప, ధనేశ్వర, ధనపతి, కైలాసనిలయ, నరవాహన, పౌలస్త్య,  రాజరాజ, రాక్షసాధిపతి, రాక్షసేశ్వర, వైశ్రావణ, యక్షదీప, యక్షాధిపతి, యక్షపతి, యక్షరాజు.

◆ వెంకటేష్ పువ్వాడ
 


More Purana Patralu - Mythological Stories