పరమ పవిత్రం కాశీ అన్నపూర్ణ దేవాలయం

 

విజయవాడ నగరంలోని శివక్షేత్రాల్లో అతి ప్రాచీనమైన దేవాలయంగా కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం ప్రసిద్ధి. 105 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎందరో భక్తులు కాశీ విశ్వేశ్వరుని అన్నపూర్ణను దర్శించుకొని సేవించారు. అప్పన్న వెంకట కృష్ణయ్య, అద్దెపల్లి వెంకటప్పయ్య అనే ఇద్దరు శివ భక్తులు శివ నామస్మరణతో ఆధ్యాత్మిక జీవనం చేస్తుండేవారు. ఈశ్వరుని సేవించికునేందుకు పరమ పవిత్ర క్షేత్రం అయిన కాశీకి వెళ్లారు. అక్కడ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకునేందుకు గంగానది తీరంలో స్నానం ఆచరిస్తుండగా వీరు మునిగి పైకి తేలిన వెంటనే వారి చేతిలో శివలింగాలు దోసిళ్లలోకి వచ్చాయి. వీరు వీటిని పవిత్రంగా ఈశ్వరుని ఆదేశంగా భావించి నగరానికి వచ్చి చల్లపల్లి బంగ్లా వద్ద గల ప్రదేశంలో 1909 మార్చి 3వ తేదీన శుద్ద ఏకాదశి బుధవారం నాడు వీటిని ప్రతిష్టించారు. అప్పటినుండి ఆధ్యాత్మికతో కూడిన భక్తి కార్యక్రమాలతో ఆ ప్రాంతం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిలోకి వచ్చింది.

కొంత కాలానికి అక్కడ దేవాలయాన్ని నిర్మించి వారి వంశీకులు స్వామివారిని ఆరాధిస్తూ, అభిషేకిస్తూ గడిపారు. భక్తులు కూడా స్వామి వారిని కొలుస్తూ తమ మనోభిష్టాన్ని నెరవేర్చాలని కోరుతూ స్వామి అనుగ్రహం పొందేందుకు పూజాదికాలు విశేషంగా జరుపుతారు. మహాకుంభాభిషేకం, సహస్ర శంకాభిషేకం, రుద్ర యాగం , చండీ పారాయణం, మహా యజ్ఞాది క్రతువులు నిర్వహించారు. స్వామి వారికి ప్రీతి కరమైన ప్రతి సోమవారం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేస్తున్నారు. ప్రతి నిత్యం భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ చేస్తున్నారు.

100 సంవత్సరాలనుండే దేవాలయాన్ని సుందరంగా అలంకరించి భక్తులకు కావాల్సిన సదుపాయాల కల్పనకు శ్రద్ధ తీసుకున్నారు. దేవస్థాన ధర్మ కర్తలు అయిన అప్పన సూర్యనారాయణ,మోహనరావు,వెంకట సత్యనారాయణలు ఈ విశేష పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దేవాలయం చుట్టూ ఉన్న గోడలపై స్వామి వారి ప్రతిమలను వివిధ రూపాలలో పెయింటింగ్ లు చేయించారు. దేవస్థానం ఆవరణలో ఫ్లోరింగ్ జనరేటర్ నిత్య ప్రసాదాలు, విశేష పూజా కార్యక్రమాలు, ధర్మ కర్తల సహాయంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేవస్థానం ఆవరణలో ఉన్న కోటి లింగాల చెట్టు పుష్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ పువ్వులు పరమ శివునికే అర్పితం. ఫిబ్రవరి లో లక్ష రుద్రాక్షల పూజ, రుద్ర యాగం, సర్వ దేవతల హోమాలు జరుగుతాయి.

ప్రతి షష్టికి సుబ్రహ్మణ్యేశ్వరునికి విశేష పూజలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు అభిషేకాలుహోమాలు జరుగుతాయి. విశేష పవిత్ర దినాల్లో కార్తీక మాసం, శివరాత్రిలో శరన్నవారాత్రులలో అమ్మవారికి త్రికాల పూజలు ,మహా మంత్రం అనుష్టానం, అభిషేకాలు, నిత్య అభిషేక వితరణలు జరుగుతాయి. ప్రతి నిత్యం లక్ష్మీ గణపతి హోమం, రుద్ర హోమం ఇక్కడ జరుగుతాయి. భక్తులంతా దర్శించుకొని ఆ కాశీ అన్నపూర్ణ ఆశీర్వాదం అనుగ్రహం పొందగలరు.

◆ వెంకటేష్ పువ్వాడ

 


More Purana Patralu - Mythological Stories