స్కందషష్ఠి రోజు ఇలా చేస్తే సకల పుణ్యాలు లభిస్తాయి..

 

 

 

శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు జన్మించిన పవిత్ర పర్వదినం... శ్రీ స్కంద షష్టి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్ల పక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవటం మన ఆచారం.

 

ఆరుముఖాలు... పన్నెండు భుజాలు... కలిగి నెమలి వాహనారూడుడై దివ్య తేజస్సుతో వెలుగొందుతున్న స్వామిని సేవిస్తే....భక్తులకు వంశాభివ్రుద్ధిని బుద్ధి సమ్రుద్దిని ప్రసాదిస్తాడు అంటారు. ఈ పర్వదినాన్ని సుబ్రహ్మణ్య షష్టి, సుబ్బరాయ షష్టి, కుమార షష్టి, కార్తికేయ షష్టి ,గుహప్రియ వ్రతం అని పేర్లు ఉన్నాయి. మరి సుబ్రహ్మణ్యస్వామి అవతారం వివరాలు తెలుసుకుందామా..? సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులనూ కూడా బాధిస్తున్నారట. శివపార్వతుల కుమరుడే వీరిని చంపగలడని బ్రహ్మదేవుడు చెప్పారట. తన పూలబాణాలతో శివుని తపస్సుకి భంగము చేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయిపోయాడట. శివుడి నుండి వెలువడిన తేజస్సు ఆరు భాగాలుగా విభజించబడిందట. వాటిని వాయువు అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారట. అవి ప్రవాహంలో వెళ్ళి క వనం లో చిక్కుకుని రు చక్కన బాలుళ్ళలా మారాయట. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారట. విషయం తెలిసిన పార్వతీదేవి స్కందా అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకుంటే వారు ఆరుముఖాలు పన్నెండు చేతులు గల ఒక బాలునిగా అవతరించారట. అందుకే ఆయనకి....

 

షణ్ముఖుడు....అంటే ఆరు ముఖాలు కలవాడు అని...
స్కందుడు.....అంటే పార్వతి పిలిచిన పదాన్ని బట్టి అని....
కార్తికేయుడు ...అంటే క్రుత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడని...
వేలాయుధుడు...అంటే శూలము ఆయుధముగా గలవాడు అని...
శరవణ భవుడు అంటే...శరవణము అంటే రెల్లుగడ్డిలో అవతరించినవాడు అని
గాంగేయుడు అంటే గంగలో నుండి వచ్చినవాడు..అని
సేనాపతి అంటే దేవతల సేనకు నాయుకుడు అని
స్వామినాధుడు....అంటే శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పిన వాడు అని
సుబ్రహ్మణ్యుడు....అంటే బ్రహ్మ జానము తెలిపినవాడు అని అర్ధం...
దేవతల కోరినందున ఈయన సురపద్ముని, సింహముఖుని, తారకాసురుని వధించాడు.
ఈయనకు ఇద్దరు భార్యలు...వారి పేర్లు...వల్లి, దేవసేన. ఇచ్చా శక్తికి, క్రియాశక్తికి
వీరిద్దరూ స్వరూపాలు అంటారు. షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు ఉన్నవాడు అని
అర్ధం... ఈ ఆరు ముఖాలు పంచభూతాలను ఆత్మను సూచిస్తాయి అంటారు.
షట్చకరాలకు సంకేతాలు అంటారు. 

 

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని బాల్యంలోని బందించాడట.  . సుబ్రహ్మణ్యస్వామి పసివాడుగా తల్లి పార్వతీదేవి ఒడిలో ఉన్న సమయంలో ఒకసారి శివుడు పార్వతీదేవికి ప్రణవ మంత్రార్థాన్ని వివరించారు. బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి దానిని విన ఆకళింపు చేసుకున్నాడు. ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి రాగా బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ప్రణవమంత్రార్థాన్ని చెప్పాల్సిందిగా అడిగాడు. బ్రహ్మ సరిగ్గా చెప్పకపోవడంతో సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మదేవుడుని బంధించాడట. పరమశివుడు జోక్యం చేసుకుని విడిపించాడట. మరి ఈయనకి నెమలి వాహనం, కోడి ధ్వజం ఎలా ఏర్పడ్డాయో తెలుసా... తెలుసుకుందాం....

 

తారకాసురుడి సోదరుడైన శూరపద్ముడు దేవతలను ఇబ్బందిపాలు చేస్తూ ఉంటే అది చూసి సుబ్రహ్మణ్యస్వామి శూరపద్ముడుపై దండెత్తి యుద్ధం చేశాడట. యుద్ధంలో ఆరవరోజు శూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి తలపడ్డాడట. సుబ్రహ్మణ్యస్వామి శూలాయుధం ప్రయోగించడంతో పక్షి రెండుగా ఖండింపబడిందట. ఆ రెండిటిలో ఒకటి నెమలిగా, మరొకటి కోడిపుంజుగా మారి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని శరణు వేడుకోవడంతో....నెమలిని వాహనంగా, కోడిని ధ్వజంగా చేసుకుంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. మరి స్కందషష్టి నాడు మనం చేయాల్సినవి ఏమిటో అందరికీ తెలియాలి కద..

 

సుబ్రహ్మణ్య షష్టి నాడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ దినమంతా ఉపవాస వ్రతం పాటించి మరుసటిరోజు తిరిగి పూజ చేసి భోజనం చేసి ఉపవాసంను విరమించాలి. అంతేకాకుండా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారిని సర్పంగా కూడా ఆరాధిస్తూ ఉండడం ఆచారం. కనుక పుట్ట వద్దకు వెళ్ళి పూజ చేసి పుట్టలో పాలుపోయడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. దీనికి తోడు గ్రహదోషాలతో బాధపడేవారు ముఖ్యంగా రాహు, కేతు, సర్ప, కుజదోషములున్న వారు కఠినమైన ఉపవాసం ఉండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఫలితాలుంటాయని అన్నది మరిచిపోకండి. అలాగే ఈరోజు బ్రాహ్మణ బ్రహ్మచారిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి రూపంగా భావించి పూజించి పులగం, క్షీరాన్నం వంటి వంటలను చేసి భోజనం పెట్టి, పంచలచాపు,దక్షిణలను తాంబూలను ఉంచి ఇచ్చి నమస్కరించాలి. ఈ విధంగా చేయడం వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి. వీటికి తోడు ఈరోజు "శరవణభవ" అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని  పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది.  ఈ విధంగా సుబ్రహ్మణ్యషష్టి జరుపుకోవడం వల్ల వంశాభివృద్ధి, విజ్ఞానాభివృద్ధి, బుద్ధి సమృద్ధి కలుగుతాయి. షదాననం చందన లేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం రుదస్య నూనుం సురలోకనాథం శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే. అంటూ మననం చేసుకొని సుబ్రహ్మణ్యస్వామి పాదాభివందనం చేసుకొని...దీవెనలు తీసుకోండి...


- కుల శేఖర్


More Purana Patralu - Mythological Stories