రామానుజాచార్యుల జయంతి ప్రత్యేకత

మనం విశిష్టమైన వైశాఖమాసంలో ఉన్నాం. చుట్టూ పరిస్థితులు బాగోలేకపోయినా… ఇంట్లో ఉండి జపతపాలు, పూజలు, దానం చేసుకోవడానికి ఈ నెలలో కావల్సినన్ని పుణ్యతిథులు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే వాటిలో శంకర జయంతి, రామానుజాచార్య జయంతి కూడా వెంటవెంటనే రావడం! శైవమతానికి బలాన్ని అందించిన శంకరుడు వైశాఖశుద్ధ పంచమినాడు జన్మిస్తే… వైష్ణవమతానికి వన్నె తెచ్చిన రామానుజులవారు వైశాఖశుద్ధ షష్ఠినాడు జన్మించాడని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. పంథాలు వేరైనా, పద్ధతులు వేరైనా శివ, కేశవులు ఇరువురూ ఒక్కరే అని చెప్పడం ఈ అవతరాల (శంకరుడు, రామానుజుడు) జన్మతిథుల వెనుక రహస్యం కాబోసు. ఇక రామానుజాచార్యుల గురించీ, వారి జన్మతిథి నాడు అనుసరించదగ్గ పనులు గురించి చెప్పుకుందాం.

రామానుజల జీవితం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకపక్క మతాన్ని ఉద్ధరిస్తూనే, అందులో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినవాడు. లక్ష్యసాధనలో ధైర్యం, భగవంతుని పట్ల నమ్మకం రెండూ పుష్కలంగా ఉన్నవాడు. రామానుజాచార్యుల జన్మస్థలం నేటి చెన్నైకి సమీపంలో ఉన్న శ్రీపెరంబదూరు. తను జన్మించిన రాశినక్షత్రాలు, అలాగే తన ఒంటి మీద ఉన్న పవిత్రగుర్తులను బట్టి, ఆయన అత్యున్నత స్థాయిని అందుకుంటాడని ఊహించారు. రామానుజలు సాక్షాత్తు ఆదిశేషుని అవతారం అని నమ్మారు.

విద్యాభ్యాసం కోసం కంచికి చేరుకున్న రామానుజల వారు, అక్కడ యాదవప్రకాశులు అనే గురువు దగ్గర నానా అగచాట్లుపడ్డారు. మతగ్రంథాలకు తాత్పర్యం చెప్పే క్రమంలో నేరుగా గురువునే ఢీకొన్నారు. ఇక అక్కడ తను ఉండటం క్షేమం కాదని తెలుసుకుని… యమునాచార్యులు అనే గురువు దగ్గరకు చేరుకున్నారు. ఆయన అప్పటికే కాలం చేయడంతో, ఆయన అసంపూర్ణంగా వదిలిపెట్టిన పనిని పూర్తిచేసే లక్ష్యంతో జీవితాన్ని కొనసాగించారు.

పరమాత్మ ఒక్కరే. అతను సాకారుడు. అతనే నారాయణుడు. జీవాత్మ, పరమాత్మ వేరువేరు. పరమాత్మను చేరుకోవడమే మోక్షం… ఇవీ విశిష్టద్వైతంలోని ముఖ్య భావనలు. నిజానికి ఇవి రామానుజాచార్యులకు ముందే ప్రచారంలోకి ఉన్నాయి. కానీ వాటిని మరింత మెరుగుపరచి, విస్తృతమైన ప్రచారంలోకి తీసుకువచ్చాడు. ఈ సిద్ధాంతానికి బలాన్ని కల్పించేందుకు వేదాంతసంగ్రహం, శ్రీభాష్యం (బ్రహ్మసూత్రాలకు భాష్యం), భగవద్గీత భాష్యం లాంటి గ్రంథాలు రాశారు. తన రచనలు, ప్రచారంతో పాటు… తన తర్కంతో నాటి పండితులందరినీ ఓడించి విశిష్టాద్వైతానికి విజయాన్ని అందించారు.

ఇప్పటికి వేయి సంవత్సరాలకు పూర్వం 1017లో రామానుజాచార్యులు జన్మించారు. అప్పట్లో కులవివక్ష ఎంత తీవ్రంగా ఉండేదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ నాటి రాజులు శైవమతాన్ని రక్షించడం కోసం ఎంతటి తీవ్రమైన చర్యలకైనా సిద్ధంగా ఉండేవారు. అలాంటి సమయంలో వైష్ణవమతాన్ని తలకెత్తుకోవడమే కాకుండా… హిందూమతానికి తలవంపుగా మారిన అంతరానితనాన్ని రూపుమాపే ప్రయత్నం చేశారు.

రామానుజల తొలి గురువు కంచిపూర్ణుడు అనే నిమ్నకులస్థుడు అని చెబుతారు. అలాగే అగ్రవర్ణాలకే పరిమితం అయిన అష్టాక్షరీ మంత్రాన్ని ఆలయగోపురం మీదకి ఎక్కి మరీ… అందరికీ వినిపించేలా చాలారు. అలా చేస్తే ‘నువ్వు నరకానికి వెళ్తావు’ అని గురువు శపించినా, ‘నేను నరకానికి వెళ్లినా ఫర్వాలేదు. ఆ మంత్రోపదేశాన్ని పొందనవారికి ముక్తి లభిస్తే చాలు’ అని తెగించినవాడు.

దేవుని దృష్టిలో అందరూ సమానమేనని రామనుజుల తన జీవితాంతం చెబుతూనే వచ్చారు. తిరుమలలో స్వామి విష్ణుమూర్తేనని నిర్ధరించడమే కాకుండా, అంతటి ఆలయంలో అప్పటి అంటరానివారికి ప్రవేశం కల్పించడమే కాకుండా… వారికి కొన్ని విధులను కూడా నియమించారు. అలా హిందూమతంలో ముఖ్యమైన సంస్కరణలు ఆద్యుడిగా మారాడు రామానుజాచార్యుడు.

రామానుజాచార్యుల జయంతి ఈ నెల 18న వచ్చింది (వైశాఖ శుద్ధ షష్టి). ఈ రోజున ఆదిశేషువు అవతారంగా భావించే ఆ రామానుజాచార్యుని తల్చుకుని, ఆయన మనందరి కోసం అందించిన అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించాలి. చాలా వైష్ణవాలయాలలో రామానుజాచార్యుని ప్రతిమ తప్పకుండా ఉంటుంది. ఈ వేళ ఆయన దర్శించి, లోకానికి ఓ విశిష్టమైన సిద్ధాంతాన్ని అందించిన మతాచార్యునిగా భావించి నమస్కరించుకోవాలి. దీనికి కులంతో పనిలేదు. ద్వైతం, అద్వైతం అన్న దృక్పధమూ ముఖ్యం కాదు.

తను నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడిన సంస్కర్తగా, దాన్ని ప్రచారం చేసేందుకు అసాధారణమైన కష్టాలను దాటిన వ్యక్తిగా, మేధావిగా… అన్నింటికీ మించి ఓ గొప్ప భక్తునిగా ఆయనను తల్చుకుని తీరాల్సిన సందర్భం ఇది!

- మణి

 


More Purana Patralu - Mythological Stories