గురువులది దైవస్థానం

 

తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ 
సమిత్పాణిః శ్రోత్రియం బహ్మనిష్ఠమ్
      (ముండకోపనిషత్తు)

మనం ఎంత జ్ఞాన సంపన్నులం అయినా గానీ గురువు దిశా నిర్దేశం లేకుండా మంచి కర్తవ్యాలపై మనసు మల్లదు. ఆత్మ శోధనకు, సత్యాన్వేషణ మార్గం తెలుసుకునేందుకు వైదిక వాఙ్మయం తెలిసినవాడు, ఆచరణాత్మకంగా భాగవత్ప్రాప్తి నొందిన గురువుని ఆశ్రయించాలి అని ముండకోపనిషత్తు చెప్తుంది.

సత్యాన్ని అన్వేషించేవారు గురువే ఆదిగా శరణాగతి కావాలి. ప్రాపంచిక విషయాలను పక్కన పెట్టి,  వేదాంతాన్ని అర్ధం చేసుకుని భగవంతుడిని ఆశ్రయించి ఉంటే సన్మార్గ జ్ఞానం పొంది వివేకంతో కూడిన విజ్ఞానన్ని పొందగలవు. 

తులసీదాసు రామచరిత మానస్ లో కూడా ఇలా అంటారు.

“గురు బిను భవ నిధి తరఇ న కోఈ, జో బిరంచి 
శంకర సమ హోఈ”

"ఆధ్యాత్మికతని అన్వేషించేవారు ఎంత ఉన్నత స్థాయి గొప్ప వారయినా, గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఈ భౌతిక సంసార సాగరాన్ని దాటలేరు". శ్రీ కృష్ణుడు తనే స్వయంగా భగవద్గీత లో నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పాడు: "ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి పరమ సత్యాన్ని తెలుసుకోండి. పూజ్యభావం తో సేవించి,సేవ చేసి ప్రశ్నించండి. అలాంటి సత్పురుషుడైన జ్ఞాని మీకు జ్ఞానాన్ని ప్రసాదించగలడు, ఎందుకంటే అతను స్వయంగా సత్యాన్ని చూసి ఉన్నవాడు." 

గురువు యొక్క సాంగత్యం ఎంత ప్రముఖ్యమో చెప్పడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. స్వయంగా శ్రీ కృష్ణుడే ఆ పని చేసాడు. తన యౌవ్వనంలో, అరవై నాలుగు శాస్త్రాలను నేర్చుకోడానికి, సాందీపని ముని ఆశ్రమానికి వెళ్ళాడు. వేదములే ఆయన జ్ఞానం నుంచే వచ్చాయి. అటువంటిది ఆయనకి గురువుతో పనిలేదు. కానీ మాయ యొక్క ప్రభావం చేత జీవాత్మలకి అజ్ఞానం తొలగించడానికి ఒక గురువు అవసరం ఉంటుందని తెలియజేశాడు.

అందుకే గొప్ప సాధువైన కబీర్ ఇలా అన్నాడు “ఒకవేళ భగవంతుడే నా ముందు సాక్షాత్కరించినా, నేను నా గురువు పాదాలనే కోరుకుంటాను, ఎందుకంటే నన్ను భగవంతుడి వద్దకు చేర్చింది నా గురువే” అని. ఒకరు ఎంత సంపద, జ్ఞానం, కీర్తి లేదా యోగ సిద్ధులను గడించినా సరే, గురువు అనుగ్రహం లేకపోతే ఇవి ఉన్నా ఉపయోగం లేదు అన్న విషయాన్ని ఈ స్తోత్రం మనకు చెబుతోంది.

కళత్రం ధనం పుత్ర పౌత్రాధి సర్వం
గృహం బాంధవా సర్వ మేతాధి జాతం,
గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం
తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్

భార్య, సంపద, పుత్రులు, మనుమలు, మంచి ఇల్లు, బంధువులు ఉండి

గొప్ప కుటుంబములో పుట్టినప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి

ఏమి లాభం? అంటారు ఆయన. అందువలనే గురుదక్షణ కు అంత ప్రాముఖ్యత సంతరించుకుంది.

 
◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories