మనుషుల్లో ఉన్న వికారాలకు అర్థం చెప్పే శ్లోకం!!

న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః
అజో నిత్యశ్యాశ్వతో అయం పురాణో నే పాన్యతే పాన్యమానే శరీదే॥

ఆత్మ ఎన్నడూ పుట్టలేదు. పుట్టలేదు కాబట్టి దానికి చావులేదు. పుట్టుక లేదు కాబట్టి ఉండటం, ఉండకపోవడం అంటూ కూడా లేదు. అంటే ఆత్మకు పుట్టుక, ఉండటం, పెరుగుదల, మార్పు, తరుగుదల, రావు, ఈ ఆరు వికారములు ఏవీ లేవు. ఈ శరీరం మరణించినా ఆత్మ మరణించదు.

ఈ శ్లోకం చిన్న పదాల మార్పుతో యథాతథంగా కఠోపనిషత్ లో నుండి తీసుకోబడింది.

సత్ పదార్ధము అయిన ఆత్మ ఏ కాలములోనూ జన్మించలేదు. ఏకాలములోనూ మరణించలేదు. ఆత్మ ఒకప్పుడు ఉన్నది లేదు. అలా అని మరొకప్పుడు లేదు అన్నదీ లేదు. అంటే ఆత్మకు అస్తిత్వము లేదు. నాశము లేదు. ఈ ఆత్మకు జనన, మరణములు, వృద్ధి క్షయములు లేవు. ఈ ఆత్మ స్వరూపానికి కాలపరిమితి లేదు. ఈ కాలము దాన్ని ఆక్రమించదు. అంటే 

ఆత్మకు కాలంతోనూ స్థానంతోనూ పని లేదు.  ఉన్నచోటనే ఉంటూ మార్పుచెందుతుందా అంటే అది లేదు. ఎన్నాళ్లు ఉన్నా ఎటువంటి మార్పులేకుండా ఉండేది ఆత్మ. ఈ ఆత్మ శాశ్వతమైనది. ఈరోజు ఉండి రేవు పోయేది కాదు. పురాణమైనది అంటే ఎల్లప్పుడూ కొత్తగా ఉండేది. దీనికి పాతబడటం అంటూ లేదు. సనాతనమైనది. ఊహకు అందనిది. ఏ శరీరంలో ఆత్మ ఉంటుందో, శరీరం మరణించినా, అందులో ఉన్న ఆత్మ మరణించదు. ఆత్మ సనాతనమైనది. అది ఒకప్పుడు పుట్టలేదు. పుట్టలేదు కాబట్టి చావు అనే వికారము కూడా ఆత్మకు లేదు.

శ్లోకంలో ఆత్మకు ఎటువంటి వికారము లేదు అని కృష్ణుడు చెప్పాడు. వికారములు అంటే మార్పులు ప్రపంచంలో ఉన్న ఏ వస్తువుకు అయినా ఆరు వికారములు తప్పవు. ఉదాహరణకు మన శరీరాన్నే తీసుకుందాము. 1. తల్లి గర్భంలోనుండి బయటకు రావడం(పుట్టడం), 2. ఉండటం, 3. పెరగడం, 4. అవయవాలు మార్పుచెందడం, 5. క్షీణించడం, 6. మరణించడం అనేవి శరీరమునకు కలిగే ఆరు విధములైన వికారములు అంటే మార్పులు. ఆ మార్పులు ఆత్మకు లేవు. ఏదైనా వస్తువు ఒకప్పుడు ఉనికిలోకి వస్తే అది తరువాత లేకుండా పోతుంది. శరీరం కూడా తల్లి గర్భంలోనుండి వస్తుంది. మార్పులు చెందుతుంది. తరువాత భూగర్భంలో కలిసిపోతుంది. కాని ఆత్మ ఎక్కడి నుండీ రాదు. ఎక్కడికీ పోదు. అలాగే పుట్టినప్పుడు శరీరం చిన్నదిగా ఉంటుంది. కాలం గడిచేకొద్దీ పెరుగుతుంది. మరలా క్షీణిస్తుంది. తుదకు మరణిస్తుంది.

ఉదాహరణకు మనం మన ఫామిలీ ఆల్బం చూస్తున్నాము. అందులో మీ చిన్నప్పటి ఫోటో చూపించి ఇది ఎవరు అని అడిగితే ఎవరూ చెప్పలేదు. ఇది నేనే అని మీరే చెప్పాలి. కాని ఆ ఫోటోలో ఉన్న చిన్ని పాపాయి శరీరానికి ఇప్పటి మీ అరడుగుల శరీరానికి ఎంతో తేడా ఉ ఉంది. అసలు పోలికే లేదు. కాని అది నేను అంటున్నారు. అంటే ఈ నేను ఎవరు. అంటే ఈ శరీరం నేను కాదు అని మీకు తెలుసు. కాని దైనందిన జీవితంలో ఈ సత్యాన్ని ఒప్పుకోవడానికి మీ మనసు అంగీకరించదు. "ఇది అంతా నా... ఎవ్వరికీ ఇవ్వను" అనే అహంకారము, లోభము మనలోని జ్ఞానాన్ని కప్పివేస్తాయి. అజ్ఞానంలో పడదోస్తాయి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కావాలి, ఆత్మస్వరూపం గురించి అవగాహన పెంచుకోవాలి. ఈ పెరుగుదల, తరుగుదల అంటే వృద్ధి, క్షీణతలు అత్మకు లేవు, ఆత్మ ఎల్లప్పుడూ ఒకేవిధంగా ఉంటుంది. ఎందుకంటే దానికి ఎటువంటి ఆకారము లేదు. శరీరం మార్పు చెందినపుడు ఆత్మ మార్పు చెందదు కాబట్టి, శరీరం మరణించినప్పుడు ఆత్మ మరణించదు అని అర్ధం చేసుకోవాలి. మరణం అనేది బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము మాదిరి శరీరానికి కలిగే ఒక పరిణామము అంటే మార్పు మాత్రమే అనే అవగాహన కలిగిన నాడు, జీవితంలో విషాదానికి చోటులేదు. అంతా ఆనందమే.

ఈ విషయాన్నే కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు. ఓ అర్జునా! ఈ భీష్ముడు, ద్రోణుడు, నువ్వు నేను అందరూ ఆత్మస్వరూపాలే. నీతాత, నీ గురువులు, నీ బంధువుల శరీరాలు పోతాయే గానీ వారు చావరు కాబట్టి వాళ్ళు మరణిస్తారేమో అని నీవు దుఃఖించడం నీ అవివేకము అని బోధించాడు కృష్ణుడు.

 దీని నుండి మనం తెలుసుకోవలసింది ఏమిటంటే మన కళ్లముందు సహజంగా జరిగే పరిణామాలకు అమితంగా దుఃఖించడం, కుంగి పోవడం, కర్తవ్య నిష్ఠను వదిలిపెట్టడం అవివేకము అని తెలుసుకోవాలి. మార్పులను స్వీకరించాలి తప్ప మార్పును చూసి దుఃఖించకూడదు.

◆ వెంకటేష్ పువ్వాడ
 


More Purana Patralu - Mythological Stories