శనిత్రయోదశి సమస్యలను దాటించే వంతెన

 

భాద్రపద మాసం. శనివారం, త్రయోదశి తిథి. చాలా గొప్పదిగా తెలుగు క్యాలెండర్ లో పేర్కొనబడుతుంది.  శనిత్రయోదశి రోజు ఎంతో మంది తమ జీవితంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం పూజలు చేస్తారు. ప్రతి మనిషి తమ జీవితంలో చేసుకున్న కర్మ ఆధారంగా కష్టసుఖాలను అనుభవిస్తూ ఉంటారు. కర్మను నమ్మే వాళ్ళు గత జన్మలో పాపపుణ్యాల ఫలితమే నేటి జన్మలో సంతోషమైనా, దుఃఖమైనా అని విశ్వసిస్తారు. అయితే ఈ కర్మను మనిషి జీవితంలో తప్పక ప్రవేశపెట్టేది శని మహాత్ముడే. జీవితంలో మంచి చెడుల విచక్షణను గమనించి చెడుకు దండన విధించేది శని దేవుడే.

శనిత్రయోదశి విశిష్టత

సాదారణంగా శనివారం అంటే శని దేవుడికి ఎంతో ప్రీతికరమైనది అని నమ్ముతారు. గ్రహాల గమనం ప్రకారం చూసినా శనివారం శని గ్రహా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే స్థితి పరంగా శనివారానికి  విష్ణువు  అధిపతిగా ఉంటాడు. ఇక త్రయోదశి తిథి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనది. విష్ణువును హరి అని శివుడిని హర అని పిలుస్తారు. ఈ విధంగా ఈ హరిహరులిద్దరికి ఇష్టమైన సందర్భాలు రెండూ ఓకేరోజున రావడం వల్ల శనిత్రయోదశి అంటే శనిదేవుడికి చాలా ఇష్టం. ఆరోజున శనిదేవుణ్ణి భక్తిగా పూజించి ఆయన్ను శాంతివంతుడిగా చేసే వాళ్ల జీవితాల్లో కష్టాలను సులువుగా దాటే ధైర్యాన్ని శనిదేవుడు ఇస్తాడని, శారీరక మానసిక ఆర్థిక సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తాడని పెద్దల మాట.

శని త్రయోదశి రోజు చేయవలసిన పని

త్రయోదశి తిథిలో వచ్చే శనివారమే శనిత్రయోదశిగా పేర్కొంటారు. ప్రతి గుడిలో తప్పకుండా నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాలలో శని దేవుడి ప్రత్యేకత గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  శనిదేవుడికి నలుపురంగు అంటే ఇష్టం. నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నలుపు రంగు వస్త్రం మొదలైనవి తీసుకెళ్లి శనిదేవుడికి నల్లనువ్వుల నూనెతో అభిషేకం చేసి, నల్లని వస్త్రం సమర్పించి, ఒక చిన్న నల్లని నూలు బట్టలో కొద్దిగా నల్లనువ్వుల వేసి చిన్న మూటగా కట్టి దాన్ని నువ్వుల నూనెలో ముంచి, దాన్ని వత్తిగా ఒక ప్రమీదలో వేసి దీపం పెట్టాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుడు ప్రసన్నంగా మారతాడు. 

దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయం కు వెళ్లి,  నవగ్రహాలకు దగ్గరలో కాసింత స్థలాన్ని చూసుకుని, అక్కడ ఒక చిన్న గోతిలాగా తవ్వి అందులో ఒక చిన్న ఇనుప మేకు, కాటుక డిబ్బి వేసి తిరిగి మట్టి కప్పేయాలి. దీనివల్ల ఏలినాటి శని పీడితులకు సమస్యల నుండి స్వాంతన చేకూరుతుందని నమ్మకం. అయితే ఆలయ నిర్వాహకుల దగ్గర సమస్యలు ఎదురుకాకుండా చూసుకుంటే మంచిది. వారి అనుమతి లేనిది ఇలాంటివి చేయరాదు.

శనిత్రయోదశి రోజు ఈ పనులు చేయాలి 

నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం ఆచరించడం. తరువాత నవగ్రహ దర్శనం, శనిదేవుడికి తైలాభిషేకం చేయాలి. 

నలమహారాజు రాజ్యాన్ని పోగొట్టుకుని బాధపడుతున్నపుడు శనిదేవుడి నాలమహారాజుకు స్వయంగా కలలో కనిపించి ఒక మంత్రాన్ని చెప్పాడట. నలమహారాజు ఆ మంత్రాన్ని జపం చేయడం వల్ల తాను పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడట. అంత శక్తివంతమైన స్వయంగా శనిదేవుడే ఉపదేశించిన మంత్రాన్ని శనిత్రయోదశి రోజు వీలైనన్ని సార్లు జపం చేసుకోవడం వల్ల ఎంతో స్వాంతన చేకూరుతుంది. 

【మంత్రం: క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్ 
ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్ 
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార వర్ణాంజనమేచకాయ 
శ్రుత్వా రహస్యం భవకామదశ్చ ఫలప్రదో మే భవ సూర్యపుత్రం 
నమోస్తు ప్రేతరాజాయ కృష్ణదేహాయ వై నమః
శనైశ్చరాయ క్రూరాయ శుద్దబుధ్ధి ప్రదాయనే 
య ఏభిర్నామభిః స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి】

పై మంత్రాన్ని చెప్పుకుంటూ కింద పనులు చేయడం వల్ల మరింత గొప్ప పలితాన్ని పొందుతారు. 

పేదవాళ్లకు, వృద్ధులకు సహాయం చేయడం. తినడానికి తిండి సరిగా లేనివాళ్లకు అన్నదానం చేయడం. 

మూగజీవులకు ఆహారం పెట్టడం

శనిదేవుడి వాహనం కాకి కాబట్టి కేవలం శనిత్రయోదశి  రోజు మాత్రమే కాకుండా. మిగిలిన సాధారణ రోజుల్లో కూడా కాకులకు ఆహారం వేయడం.శనిత్రయోదశి రోజు నువ్వుల నూనెతో కాల్చిన రొట్టెలను కాకులకు ఆహారంగా పెట్టడం.

నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి చేతనైన తోడ్పాటు అందించడం

ఈర్ష్య, అసూయ వంటి వాటిని వదిలి అందరితో సామరస్యంగా ఉండటం.

చివరగా మనిషి నీతి, నిజాయితీ, వ్యక్తిత్వాలు ఉన్నతంగా  మార్చుకోవడం వల్ల శనిదేవుడు తనకు తానే సమస్యలను తొలగిస్తాడు. 

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories