శని జయంతి రోజు ఇలా చేస్తే కష్టాలు తీరిపోతాయి!

 

 శని అన్న మాటను మనం కాస్త ప్రతికూలమైన అర్థంలో వాడుతూ ఉంటాము. నిజానికి హైందవ గ్రంథాలలో శనీశ్వరుడు… మక కర్మఫలితాలను అనుభవింపచేసే దేవత. అతనే కనుక లేకపోతే, ఈ సంసారచక్రంలో నిరంతరాయంగా తిరుగుతూ ఉండాల్సిందే! అందుకే జాతకచక్రంలో శనిగ్రహాన్ని ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా చిహ్నంగా భావిస్తూ ఉంటారు. ఇంత విశిష్టమైన శనీశ్వరుని జయంతి వైశాఖమాసంలోని అమావాస్యనాడని (2021, జూన్‌-10) చెబుతారు. ఈ సందర్భంగా శనీశ్వరుని ఎలా పూజించుకుంటే, ఆయన అనుగ్రహం లభిస్తుందో ఓసారి చూద్దాము…

 వైశాఖ అమావాస్య రోజున అతి పవిత్రమైన శనిజయంతి. ఈ సందర్భంగా ఆ స్వామిని భక్తిశ్రద్ధలతో కొలచుకునేందుకు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలి. శనికి తైలాభిషేకం అంతే ప్రీతి. అందుకని ఆయన మనసు కరిగేలా సమీపంలో ఉన్న శనీశ్వరుని విగ్రహానికి నువ్వులనూనెతో తైలాభిషేకం చేయాలి. ఆయన ముందర నువ్వులు లేదా ఆవనూనెతో వెలిగించిన దీపాన్ని ఉంచాలి. శనికి సంబంధించిన జపతపాలు, హోమాలు చేయడానికి ఇది విశిష్టమైన రోజు!

 శనికి నలుపురంగంటే ఇష్టమని అంటారు. అందుకని ఈ రోజు నలుపురంగు వస్త్రాలను దానం చేస్తే మంచిది. అలాగే నల్లని శునకానికి ఆహారం పెట్టినా కూడా ఆయన ప్రసన్నులవుతారు. ఇక శనికి సంబంధించిన స్తోత్రాలను, మంత్రాలను పఠిస్తే ఈ రోజు అపారమైన ప్రభావం ఉంటుంది. కాబట్టి వీటిని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదివే ప్రయత్నం చేస్తూ… ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవాలి. ఈ రోజు యథాశక్తిగా దానాలు చేస్తే మంచిది. ఒకవేళ కుదరకపోతే కనీసం చీమలకు బెల్లాన్నయినా తినిపించాలి.

 శని అశుభ దృష్టి పడితే ఎంతటివారికైనా కష్టాలు తప్పవు. శివుడంతటివాడే శనీశ్వరుని నుంచి తప్పించుకునేందుకు చెట్టు తొర్రలో దూరాల్సి వచ్చింది. పార్వతి తనయుడు వినాయకుడు సైతం శని దృష్టి పడి కష్టాలుపాలయ్యాడు. అందుకని ఆయన మనల్ని చల్లగా కాపాడాలీ, విధిరాతలో ఏదన్నా అనుభవించాల్సి ఉన్నా… అది తక్కువలో జరిగిపోవాలనీ కోరుకోవాలి. ముఖ్యంగా అష్టమి, అర్ధాష్టమి, ఏలిననాటి శని లాంటి గ్రహస్థితుల్లో ఉన్నవారు శనిదేవుని ప్రసన్నం చేసుకునేందుకు మరింతగా ప్రయత్నించాలి.

 శనీశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు అతి విశిష్టమైన తిథి వైశాఖమాసంలోని అమావాస్య. కాబట్టి ఈ సందర్భాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి!

- మణి

 


More Purana Patralu - Mythological Stories