మనో మధనమే! క్షీరసాగర మథనము

 

ఒకరోజు దూర్వాస మహర్షి స్వర్గానికి వెళుతున్నాడు. దారిలో మందారమాలలతో ఊర్వశి కనిపించగా, మాలను తనకి ఇవ్వమని అడిగి తీసుకున్నాడు. మాలను తీసుకొని స్వర్గానికి వెళ్లిన మహర్షి ఆ మాలను ఇంద్రుడి కి కానుకగా ఇచ్చాడు. ఇంద్రుడు ఆ మాలను ఐరావతానికి ఇస్తాడు. అది ఆ మాలను పాడు చేస్తుంది. దానితో మునికి కోపం వచ్చి " ఐశ్వర్య గర్వంతో నన్ను అవమానించావు కనుక నీ ఐశ్వర్యం అంతా సముద్రంలో కలుస్తుంది" అని శపించి వెళ్లిపోతాడు.

ముని శాప ప్రభావం వలన ఇంద్రుడి సర్వ సంపదలు నశించిపోయాయి.బ్రహ్మదగ్గరకు పోయి ప్రార్థింపగా అతడు శ్రీవిష్ణువున కీ విషయము చెప్పి ఉపాయమును చెప్పు మనెను. శ్రీనాథుడు, “ఇంద్రుని సంపదలతోపాటు అమృతమును గూడ సాధించుటకు సముద్రమథనము చేయాలి అని చెప్పి ఇది ఒక్క దేవతలవల్లగాదు, రాక్షసులను గూడ అమృతము దొరుకును అని ఆసపెట్టి వారిని కలుపుకోవాలి” అని ఉపాయం చెప్తాడు.

వెంటనే ఇంద్రుడు రాక్షస రాజు అయిన ప్రహ్లాదుని వద్దకి వెళ్లి " అక్కజెల్లెళ్ల బిడ్డలం. మనలో మనకి విభేదాలు ఎందుకు? అమృతము సాధించడానికి పాల సముద్రాన్ని చిలకాలి అని శ్రీహరి చెప్పాడు. మనం అందరం కలిసి ఈ కార్యం సాదిద్దాం" అని చెప్పి ఒప్పించాడు.

పాల సముద్రాన్ని మధించడానికి దేవతలు రాక్షసులు అంతా కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా తెచ్చారు. వాసుకి విష పాముని తాడుగా చేసుకొని దేవతలు తోక వైపు రాక్షసులు తల వైపు పట్టుకొని మధించడం ఆరంభించారు. వాసుకి సర్పము తల యందు కాలవిషం కలది. అది మృత్యుతో సమానం. తల వైపు నిలిచిన రాక్షసులంతా  విష జ్వాల ప్రభావంగా చాలామంది మరణించారు. తామస మనసు కలిగిన రాక్షసులు అది గమనించలేక పోయారు.

దేవదానవులు మందరపర్వతమును కవ్వముగా దెచ్చి, వాసుకిని త్రాడుగా జేసి, రాక్షసులు తలవైపునకు, దేవతలు తోకవైపునను పట్టుకొని పాలకడలిని మధింపసాగిరి.

◆కూర్మావతారము

పర్వతము బరువుగా వుండి, క్రింద ఆధారము లేకపోవటం వలన సముద్రములోకి మునిగిపోయింది. దేవతలు రాక్షసులు ఏమీ చేయలేక చూస్తున్నారు. అప్పుడు శ్రీహరి లక్ష యోజనములుగల విస్తీర్ణం బోరుసుతో మహా కూర్మరూప అవతారం దాల్చి మందర పర్వతంతో పాటు వాసుకిని కూడా పైకి ఎత్తాడు. దేవదానవులు మందర పర్వతాన్ని మధింపసాగారు.

సముద్రమునుండి మొదట భయంకరమైన విషము పుట్టెను. ఈశ్వరుని ప్రార్థింపగా ఆయన దానిని నేరేడుపండంత చేసి మ్రింగి కంఠములో దాచుకొన్నాడు. మృత్యుంజయుడు అవడం వలన ఆయనకు ఏమి కాలేదు.

తిరిగి సురాసురులు సాగరమథనము చేశారు. కామధేనువు పుట్టగా ఋషులు తీసుకున్నారు. తర్వాత ఉచ్చైశ్రవమును బలిచక్రవర్తి తీసుకున్నాడు. ఐరావతమును ఇంద్రుడు తీసుకున్నాడు. కల్పవృక్షము, అప్సరసలు, చంద్రుడు పుట్టారు. ఆ తరువాత లక్ష్మీదేవి పుట్టెను. సంపదలకు తల్లియని అందరు ఆమెను పూజించిరి. ఆమె విష్ణువును వరించెను. తుదకు ఆయుర్వేద విద్యావిశారదుడైన ధన్వంతరి అమృతకలశముతో పుట్టాడు. రాక్షసులు తుచ్ఛ బుద్ధితో దేవతలకు అమృతం అందకూడదు అని అమృతకలశమును లాగుకొనిపోయారు. దానితో దేవతలు అంతా శ్రీహరి ని వేడుకున్నారు. అప్పుడు శ్రీహరి మోహిని అవతారం దాల్చి తన దివ్య మోహనం చేత రాక్షసులను మాయ చేసి అమృతాన్ని దేవతలకు పంచాడు. అది గ్రహించిన రాక్షసులంతా మోసం చేశారు అని దేవతలపై యుద్ధానికి దిగారు. మహా సంగ్రామమే జరిగింది. అయితే శ్రీపతి అనుగ్రహం చేత దేవతలు విజయం సాధించారు.

ఈ సముద్ర మథనము ఘట్టాన్ని సూక్ష్మ పరిశీలన చేస్తే దీనిలో ఒక అంతరార్ధం మనకి గోచరిస్తుంది. సాధకుడు మంచి చెడ్డలు తెలుసు కోవడానికి  మనసును మథించవలెను. స్థిత ప్రజ్ఞకై సాధన చేయుట కూడ మథనమే అవుతుంది. అపుడు విషమువంటి విషమ పరిస్థితులు ఎదురు అవుతాయి. వాటిని లెక్కచేయక సాధన సాగిస్తారు. కామధేనువు, కల్పవృక్షము వంటి చిన్న చిన్న లాభములు మనసును ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి. వాటితో తృప్తి పడితే సాధన అక్కడితో ఆగిపోతుంది. అట్లాకాక ముందుకు సాగితే అమృత (మోక్ష) ప్రాప్తి కలుగుతుంది. జీవులకు మోక్షమే పరమావధి కదా!

◆వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories