ధ్యానం నేడు ఎట్లా మార్పుకు లోనయ్యింది?

మనస్సు ఎప్పుడు అంతమౌతుందో అప్పుడు ధ్యానం ప్రారంభమౌతుంది మనస్సు లేని స్థితే ధ్యానం. అది స్వచ్ఛమైన నిర్మలమైన నిశ్చలమైన మనోస్థితి. అంటే ఇతరమైనది ఏదీ కాని స్థితి. అదే చైతన్యం, ప్రజ్ఞ. మనోవ్యాపారం లేని ధ్యానమే మౌనం ఆ మౌనం మొదట్లో ఇబ్బందిగా వుంటుంది మౌనకాలం దీర్ఘమయ్యేకొద్దీ మనస్సు నెమ్మదించి నిశ్చలమై శాంతపడుతుంది. సనాతనమైన ఆ మహా మౌనంలోనే సత్యం వ్యక్తమౌతుంది.

మన ఆలోచనల, భావాల, అభిప్రాయాల, కోర్కెల, ఆశల ప్రయత్నాల, స్మృతుల, భయాల, దురాశల, దురభిమానాల పక్షపాతాలు, రాగద్వేషాల తికమకల గందరగోళాల ఆతృతల ఆరాటాలు, ఆందోళనలతో కదిలే మనస్సును గమనిస్తూ ఆయా విషయాలకు సాక్షిగా వుండాలే కాని బలవంతంగా ఉద్దేశ్యపూర్వకంగా మనస్సును అణచినా, పక్కన పెట్టినా అప్పుడు మనస్సులో ఘర్షణ ఏర్పడుతుంది ద్యాన పద్ధతులన్నీ మన సహజస్థితిని కలత చెందించేవే.

మనస్సు నిశ్చలమైతే ధ్యానం సహజంగా జరుగుతుంది నిజమైన అనుభూతి కలుగుతుంది. అటువంటి ధ్యానం నిత్యజీవితంలో ఒక భాగమే కాని జీవితం నుంచి పలాయనం కాదు అది నిజ జీవితంలో ప్రవేశించడం. ధ్యానమంటే సంకల్ప రహిత స్ధితే కాని ఒక అనుభవం కాదు. వర్తమానంలో నిలవడమే ధ్యానం. పూర్వం ఋషులు ఆశ్రమాలలో సద్గురువుల సమక్షంలో మహాయోగుల అధ్వర్యంలో అర్హులైన సాధకులు ద్యానం ద్వారా సత్ఫలితాలు పొందిన సంగతులు వున్నాయి. ఆ తర్వాత బౌద్ధం ధ్యానాన్ని బహుళ ప్రచారంలోకి ప్రజా జీవనంలోకి తీసుకువచ్చింది.

 క్రీ శ 500 ప్రాంతంలో చైనాలో బోధిధర్మ అధ్వర్యంలో జెన్ అను పేరు మీద ఒక విధమైన ధ్యాన పద్ధతి అమలులోకి వచ్చింది. జెన్ అంటే ధ్యానం దాని ఉద్దేశ్యం మనో నాశనం అది సహజస్థితి, శుద్ధ చైతన్యం,  పరిపూర్ణ వికాసం అంటే అహంకారానికి అతీతంగా వుండటం. ఆ పద్ధతిలో శ్వాసగమనిక ముఖ్యం. ఆ సమయంలో సాధకుడు వూరికే ప్రశాంతంగా కూర్చోవాలి. ఆలొచనలు లేకుండా రాకుండా చూసుకోవాలి వచ్చిన ఆలోచనను చివరి వరకు గమనించాలి దృష్ఠి శ్రద్ధ శ్వాస మీదే నిలపాలి. చైనా జపాన్ దేశాలలో బౌద్ధం దేశమతం కావడంతో ఆ ధ్యాన పద్ధతిని తమకు అనుకూలంగా మలచుకోవడంతో ఆయాదేశాల్లో జెన్ విశేష ప్రజాదరణ పొందడమే కాక ప్రపంచమంతా వ్యాపించింది. 

టిబెట్ దేశీయుల ధ్యాన పద్ధతి వేరొక విధంగా వుంది. ఆ పద్ధతిలో వూరికే ప్రశాంతంగా కూర్చుని వినవచ్చే శబ్దాల్ని వినడం, ఆ వినడంలో శబ్దానికి శబ్దానికి మధ్య వ్యవధిని గమనించడం. ఈ మధ్యకాలంలో భావాతీత ధ్యానం అనే ఒక పద్ధతి వచ్చింది. ధ్యానం చేయాలి అనేది ఈనాడు అన్ని తరగతుల వారిలో ఒక ఫ్యాషన్ అయింది. ధ్యానం చేయని వారిని అనాగరికులుగా ఆధ్యాత్మిక లోకంలో అస్పృశ్యులుగా చూసే వారూ వున్నారంటే అతిశయోక్తి కాదు. అందుచేత ఈనాడు నూటికి తొంబ్భై తొమ్మిది మంది ధ్యానం చేస్తున్నారు. వారిలో అనేక జాతులు మతాల వర్గాల వారు వున్నారు. చివరకు తార్కికులు శాస్త్రవేత్తలు కూడా వున్నారు. వారిలో కొందరు ధ్యానం గురించి రాస్తున్నారు, విస్తారంగా మాట్లాడుతున్నారు. కొందరు తాము ఎన్నుకున్న పద్ధతిని ధ్యానం చేసి పురోగతి సాధించినట్లు చెప్పి తాము ఆ పద్ధతికి అధికారులుగా చెలామణి అవుతూ ఇతరులకు నేర్పిస్తున్నారు. తత్ఫలితంగా అనేక ధ్యాన పద్ధతులు, ప్రచార కేంద్రాలు, శిక్షణా శిబిరాలు, ధ్యాన మందిరాలు విపరితంగా వచ్చాయి వాటిల్లో కొన్నింటిని కొందరు ప్రేమతో ఎర్పాటు చేస్తే స్వార్ధపరులైన కొందరు ధనార్జనకు ఏర్పాటుచేశారు. ఇట్లా ధ్యానం అనేది ఒక అమ్మకపు వస్తువుగా తయారైంది.

                                             ◆నిశ్శబ్ద.


More Subhashitaalu