మహాభారతాన్ని పంచమవేదంగా ఎందుకు పేర్కొంటారు?

కురుక్షేత్రయుద్ధం 5000 సంవత్సరాల క్రితం జరిగిందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. కాని, చరిత్రకారులు చెప్పే కాల నిర్ణయాలు క్రీ.పూ. 14వ శతాబ్దం నుండి 32వ శతాబ్దం వరకూ వ్రేలాడుతున్నాయి. అయితే, శ్రీ వేదవ్యాస్ (ఐ.ఎ.యస్) గారు చేసిన కాలనిర్ణయం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం క్రీ.పూ. 1328వ సం॥లో జరిగింది. మహాభారతంలోని అంతర్గత సాక్ష్యాలతోనూ, యుధిష్ఠిర జనమేజయుల పేర్లతో కనబడుతున్న శాసనాధారాలతోనూ, మరికొన్ని చారిత్రక పరిస్థితులతోనూ పరిశీలించిన తరువాత ఆ సంవత్సరంలో యుద్ధం జరిగి ఉంటుందని అనేకులు ఇప్పుడు విశ్వసిస్తున్నారు. ఈ కాలాన్నిబట్టి కురుక్షేత్రయుద్ధం జరిగి దాదాపు అయిదు వేల సంవత్సరాలు అయి ఉంటుంది అనటం కొంత సమంజసంగానే కనబడుతుంది.

కురుక్షేత్ర యుద్ధానికి ప్రత్యక్షసాక్షి కృష్ణద్వైపాయనుడు. ఒకవిధంగా ఆయన కురువంశాన్ని నిలిపినవాడు కూడా, ఆయనకు ఆ వంశచరిత్ర ఆమూలాగ్రం తెలుసు. అందువలననే ఆయన ఆ ఇతిహాసాన్ని నిర్మించటానికి ఉత్తమ అధికారి. అంతకు మించి ఆయన మహర్షి, ద్రష్ట, స్రష్ట. అయితే, ఆయన జయ కావ్యాన్ని ఎప్పుడు రచించి ఉండి ఉంటాడు అన్నది ఒక పెద్ద ప్రశ్న. జయాన్ని లోకంలో ప్రచారం చేయటానికి తన శిష్యులైన పైల, వైశంపాయన, సుమంతు, జైమిను అనే శిష్యులను నియోగించాడు. వారు దాన్ని భారతంగా పెంచారు. ఆ తరువాత సూతుడు(సౌతి) మహాభారతంగా విస్తృతపరిచాడు. వ్యాసుడు రచించిన జయ కావ్యాన్ని గురించి అర్జునునికి మూడవతరంవాడైన జనమేజయుడి కాలంలో మొదట వినైపిస్తుంది. వైశంపాయనుడు దానిని వినిపిస్తూ ఉపాఖ్యానాలతో పెంచాడు. 

ఆశ్వలాయన గృహ్యసూత్రాలలో "భారత, మహాభారతాచార్యాః" అని వ్యాసశిష్యులైన పైల వైశంపాయన సుమంతులను కీర్తించటం గమనిస్తే వారికాలంలో జయకావ్యం, భారతంగా, మహాభారతంగా మారిన విషయం ధ్రువపడుతున్నది. ఆ తరువాత భారతాన్ని శౌనకాదులకు వినిపించిన సూతుడు వ్యాసశిష్యుడైన రోమహర్షణుని కుమారుడే. భారతం మహాభారతం కావటానికి మరొకతరం కాలం గడచి ఉంటుంది. లేదా వైశంపాయనుని తరంలోనే భారతం మహాభారతం కాగా, దానిని సూతుడు మరీ పెంచి ఉంటాడు. ఈ విధంగా శ్రోతృజనాపేక్షలకు అనుగుణంగా పెరుగుతూ వచ్చిన సమగ్ర మహాభారత నిర్మాణం క్రీ.పూ. 3వ శతాబ్దం వరకూ సాగి ఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు.

జయకావ్యం మహాభారతరూపం దాల్చే మధ్యకాలంలో అందులో చేరిన అనేకాంశాలు ఆయాకాలాలలో తలయెత్తిన సామాజిక జీవన ధర్మాలను గురించిన మీమాంసలకు సమాధానాలై ఉంటాయి. క్రీ.పూ. 3వ శతాబ్దానికిముందే భారతదేశంలో  ఉన్న వేదసంస్కృతి ఇతర మతాల వారి దండయాత్రలతో క్రొత్త సమస్యలను ఎదుర్కుంది.  ప్రకృతి ఆరాధన, యజ్ఞయాగాది క్రతువులు క్రమంగా సన్నగిల్లటంతో వాటిని గురించిన అనేకప్రశ్నలు ప్రజలలో రేకెత్తాయి. ఇంద్ర వరుణాగ్ని సూర్యులవంటి. ప్రకృతి దేవతలస్థానంలో విష్ణు, రుద్ర, దేవీ మూర్తులు వెలసి వారివారి శాఖలను విస్తరింప చేయటం మొదలుపెట్టాయి. ఆ తరువాత క్రమంగా జైన బౌద్ధ మతాలు దేశమంతా వ్యాపించాయి. మహారాజులు చక్రవర్తులు వైదికధర్మం వదలి జైన బౌద్ధాలను స్వీకరించి వాటి ప్రచారానికి తోడ్పడ్డారు. దానితో వర్ణాశ్రమ ధర్మాలూ, యజ్ఞయాగాది కర్మ విధానాలూ శిథిలమై పోసాగాయి. వేదధర్మాన్ని ఆశ్రయించిన వ్యవస్థలు సడలిపోవటంలో బాగా దెబ్బతిన్నది గృహస్థాశ్రమ ధర్మం. 

జైన బౌద్ధాల వలన సమాజంలో సన్న్యాసులకు సన్న్యాసినులకు గౌరవం పెరిగింది. అది ఆశ్రమధర్మంగా కాక మతధర్మంగా మార్పు చెందింది. పరిణత చిత్త సంస్కారం లేకుండా సన్న్యాసాన్ని స్వీకరించినవారు దానికి న్యాయం చేయలేకపోగా, వ్యవస్థకు కీడు చేయవచ్చు. వేదధర్మంలో సమాజవ్యవస్థకు గృహస్థ్యధర్మమే పునాదిగా పేర్కొనటం ప్రసిద్ధం. జైన బౌద్ధాల  వలన దెబ్బతిన్న కుటుంబవ్యవస్థను, వేదధర్మాన్నీ పునరుద్ధరించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆ సామాజికమైన ధర్మపునరుద్ధరణ ఉద్యమంలో భాగంగా వేదవ్యాసమహర్షి రచించిన జయ కావ్యాన్ని ఆయన శిష్యులు బలమైన వాఙ్మయసాధనంగా వాడుకొన్నారు. జయకావ్యానికి ముందున్న వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, పురాణాలు మొదలైన సాహితీ శాఖలు వేదధర్మాన్ని విపులంగా వివరించి ఉన్నాయి. ఆ తాత్పర్యాన్నంతా ఒక ఇతిహాసంలో ఇమిడ్చి మిత్రసమ్మితంగా చెప్పవలసిన అవసరమూ, కాలానుగుణమైన ధర్మసమన్వయాలు చేయవలసిన అగత్యమూ ఏర్పడింది. అందువలననే మహాభారతం పంచమవేదంగా రూపొందింపబడింది.

           ◆వెంకటేష్ పువ్వాడ.


More Purana Patralu - Mythological Stories