ఈ రోజు గంగాజయంతి. ఏం చేయాలంటే!

 

గంగ ఓ నది మాత్రమే కాదు… గంగమ్మ అని ఆర్తిగా పిలుచుకునే దేవత. ఒక్క మునక వేస్తే మనసులో పాపాలను సైతం కడిగేసే పుణ్యమూర్తి. అందుకే పవిత్రంగా భావించే ఏ నీటినైనా గంగాజలంగానే భావిస్తుంటారు. అందుకే గంగానది భూమి మీదకు దిగి వచ్చిన రోజును గంగాసప్తమిగా భావించి ఆ తల్లిని పూజిస్తారు. అది వైశాఖశుద్ధ సప్తమి రోజే (2021, మే 18) అని చెబుతారు.

గంగాదేవి జన్మించడానికి త్రిమూర్తులు ముగ్గురూ కారణమేనని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుని కమండలంలో శక్తిరూపంలో ఉన్న గంగ… ఈశ్వరుని గానంతో స్పందించిన నారాయణుడి ప్రభావంతో జలరూపంలోకి మారింది. కానీ అది దేవలోకం వరకే పరిమితం అయింది.

ఇదిలా ఉండగా భగీరథుడనే మహర్షి, తన పూర్వీకులైన 60 వేల మంది సగరకుమారులకు ఉత్తమగతులను కలిగించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కపిలమహాముని కోపాగ్నితో భస్మమైన వారందరికీ పుణ్యలోకాలు ప్రాప్తించాలంటే… ఆ భస్మరాశుల మీద గంగ ప్రవహించడమే ఏకైక మార్గమని తెలిసింది.

భగీరథుని కోరిక మేరకు దివి నుండి భువికి దిగి రావడానికి గంగాదేవి సిద్ధపడింది. కానీ తన ప్రవాహపు ఉధృతిని తట్టుకోగలిగేవారుంటే, నేలకి దిగివస్తానని చెప్పింది. దాంతో భగీరథుడు, శివుని ప్రార్థించాడు. గంగాప్రవాహాన్ని తన జటాజూటములో బంధించిన శివుడు, నిదానంగా ఒక పాయను మాత్రం నేల విడిచాడు.

ఇక్కడితో కథ సుఖాంతం కాలేదు. నేలమీదకు ఉరికిన గంగ, జాహ్నవి అనే ముని ఆశ్రమాన్ని ముంచెత్తింది. దాంతో కోపించిన ఆ రుషి, ఆమెను తన శరీరంలో బంధించాడు. భగీరథుని ప్రార్థనతో  జాలిపడి, తన చెవి నుంచి విడిచిపెట్టాడు. అందుకని, గంగాదేవికి జాహ్నవి అనే పేరు కూడా వచ్చింది.

తన పూర్వీకుల కోసం భగీరథుడు ఇన్ని తపస్సులు చేసి, అంతమందిని మెప్పించి… చివరికి అనుకున్నది సాధించాడు కాబట్టి అసాధ్యమైన కార్యాలను భగీరథ ప్రయత్నంగా పిలుస్తూ ఉంటారు. పవిత్రమైన గంగాదేవి నేల మీద అవతరించిన ఈ రోజును గంగాసప్తమి లేదా గంగాజయంతిగా పిలుస్తారు.

ఈ రోజు గంగానదిలో స్నానం చేస్తే మంచిది. ప్రస్తుత పరిస్థితులలో అది కుదరదు కాబట్టి, గంగాస్తోత్రాన్ని చదువుకుంటూ, తల మీద నీరు చల్లుకుంటే మంచిదని పెద్దలు చెబుతున్నారు. ఈ రోజు గంగాదేవని స్తుతించినా, పూజించినా… పాపాలు తొలగిపోతాయనీ, దీర్ఘకాలిక రోగాలు తగ్గిపోతాయని కూడా చెబుతారు.

గంగాదేవికి పవిత్రమైన ఈ రోజున ఇత్తడి చెంబు లేదా కుండలో నీరు నింపి, దక్షిణ, మామిడిపండ్లతో సహా దానం చేస్తే నీటివనరులు అంతరించకుండా ఉంటాయనే నమ్మకం కూడా ప్రచారంలో ఉంది. కాశీలో ఈ రోజు జరిగే గంగాహారతి మరింత ప్రత్యేకంగా ఉంటుంది.

- మణి

 


More Purana Patralu - Mythological Stories