పితృయజ్ఞ ఉద్దేశ్యం తెలుసా??


పంచయజ్ఞాల గురించి తెలిసిన వాళ్ళు తక్కువ. ఇక అందులో ఉన్న అయిదింటి గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. అయితే అందులో  రెండవదైన పితృయజ్ఞం నిర్వహిస్తూ దాని గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రస్తుత తరానికి కొన్ని విషయాలు గురించి, కొన్ని పనులు గురించి, కొన్ని సంప్రదాయాల గురించి, వాటి వెనుక ఉన్న నిగూడార్థం గురించి తెలియదు కానీ ఏదో ఒక సెంటిమెంట్ గా ఫాలో అయిపోతూ ఉంటారు. అలాంటి వాటిలో ముఖ్యమైనది పితృయజ్ఞం కూడా. దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి?? చనిపోయిన శ్రాద్ధ కర్మలు చేయడంలోని అంతరార్థం ఏమిటి తెలియదు.

'పితృ' శబ్దం సంస్కృతంలో మాతా పితరులనిద్దరినీ తెలియజేస్తుంది. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతను ప్రకటించడం ప్రధాన కర్తవ్యం. దేవతల తరువాత పితృదేవతలే. నిజానికి తల్లిదండ్రుల స్థానం దేవతలతో సమానం. ఈ మాతా పితృభక్తిపై రామాయణాది ఇతిహాస పురాణాలు చాలా విశేషాలను ప్రతిష్ఠించాయి.

శ్రీకృష్ణుడు తన 14వ ఏట మధురలో ప్రవేశించి, కంసుని సంహరించాక దేవకీ వసుదేవుల చెర విడిపించాడు. తరువాత “14 ఏళ్లపాటు మీ శుశ్రూష చేయలేని దౌర్భాగ్యుణ్ణి నేను. ధర్మార్థ కామ మోక్షాలను సాధించడానికి ఉపకరించే ఈ శరీరం మీరు ప్రసాదించినదే. తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవడానికి నూరేళ్ళ ఆయుష్షు సైతం చాలదు" అని మాతాపితరుల ముందు మోకరిల్లాడు పరమాత్మ.

ఇది భారతీయుల పితృభక్తికి ఉత్కృష్టమైన ఉదాహరణ. వ్యక్తిస్వార్థం ప్రబలిన పరిస్థితుల్లో మన సనాతన ధర్మం చెబుతున్న ఇలాంటి మాటలు ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు.దేహానికి కారకులై, పోషకులైన తల్లిదండ్రుల పట్ల ఆదరభావం అత్యంత ఆవశ్యకమైన విధ్యుక్త ధర్మంగా భావించిన గొప్ప సంస్కృతికి వారసులం మనం.

“ఎవరి పని వారు చేస్తారు. అందులో కృతజ్ఞతలు ఎందుకు?" అనుకొనే స్వార్థవ్యక్తిత్వాన్ని పాపంగా భావిస్తాం మనం. లెక్కలేని అనాథల జీవితాల్ని చూస్తే తల్లిదండ్రుల ప్రేమలోని గొప్పతనం అర్థమవుతుంది.

శ్రవణ కుమారుడు, శ్రీరాముడు వంటి ఎందరో మహాత్ములు ఈ ఆదర్శానికి ప్రతీకలు. కుటుంబ వ్యవస్థలో మాతాపితరులది పూజ్యస్థానం. జీవితాంతం నొప్పించకుండా తల్లిదండ్రుల్ని ఆదరించడం తరువాత ప్రతి ఏటా వారిని స్మరించే శ్రాద్ధకర్మల్ని చేయడం మనకి ఆచారం. ఈ కర్మ వ్యవహారాలను చాదస్తంగానో, మూఢనమ్మకం గానో పరిగణించడం సరియైన దృక్పథం కాదు. ఈ ఆచారాలలో పరలోక విశ్వాసాల గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు. జన్మనిచ్చినవారు కళ్ళముందు లేకున్నా వారిని తలచుకొనే ఈ ప్రేమ భావనను కాదనలేం కదా! అందునా తల్లిదండ్రులతోపాటు తాతముత్తాతల వరకు ఈ ఆచారంలో స్మరిస్తాం. అంటే పూర్వతరాల రక్తాన్ని పంచుకొని పెరుగుతున్న దేహంతో వారికి కృతజ్ఞత ప్రకటిస్తున్నామంటే - ఎంత ప్రేమచింతన మన జీవన విధానాల్లో నిక్షిప్తం చేశారో గమనించాలి.

పాండురంగని కృపను పొందిన పుండరీకుని కథను పరిశీలిస్తే - మాతా పితృభక్తులనే భగవంతుడే అనుగ్రహిస్తాడని స్పష్టమౌతుంది. వ్యక్తికి లౌకిక సంబంధాలలో అగ్రగణ్యమైనది - మాతా పితృబంధమేనని పరమతాత్పర్యం. "మాతృదేవోభవ - పితృదేవోభవ" - అని వేదానుశాసనం.

"తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి" - అని శతకకారుని నిర్వేదం. దేహమూ, పోషణ మాత్రమే కాక, తరతరాల ధర్మపరంపర పూర్వతరాల నుంచి మనకు లభించే సంపద. ఆస్తి పాస్తుల కన్నా ఈ ధర్మాన్ని అందించడమే తల్లిదండ్రుల కర్తవ్యంకూడా.

ఈ రెండవ యజ్ఞ నిర్వహణవల్ల కుటుంబ వ్యవస్థ, తద్వారా సమాజక్షేమం సాధ్యపడుతున్నాయి. అందుకే పితృయజ్ఞం అనేది భారతీయుల జీవనంలో ఒక భాగంగా ఉంది. దాని గురించి ముందు తరాలకు కూడా తెలియజేస్తూ, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని వివరిస్తూ దానిని కొనసాగించేలా చేయడం ప్రతి ఒక్కరి ధర్మం కూడా.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories