మనిషిని కార్యోన్ముఖుణ్ణి చేసే శ్లోకం!!

 

ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక పని చేస్తుంటాడు. అయితే ఆ పని నుండి ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేయడం మనుషుల సహజ లక్షణం. దీని గురించి చెబుతూ భగవద్గీతలో రెండవ అధ్యాయంలో, నలభై ఎనిమిదవ శ్లోకం ప్రస్తావిస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.

【శ్లోకం:- యోగస్థః కురు కర్మాణి సఙ్గం త్యక్త్వా ధనంజయ॥ సిద్ధ సిద్ధః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ॥

ప్రతి వాడు తాను చేయవలసిన కర్మలు తప్పకుండా చేయాలి. ఆ కర్మలను ఒక యోగంగా చేయాలి. చేయబోయే పని మీద ఆసక్తిని వదిలిపెట్టాలి. ఆ పని జరుగుతుందా జరగదా అనే అనుమానం వదిలిపెట్టాలి. చేసే పని శ్రద్ధగా చేయాలి. లాభము, నష్టముల మీద సమభావన కలిగి ఉండాలి. ఆ సమత్వమే ఒక యోగము.】

ఈ శ్లోకంలో "యోగస్థ: కురు కర్మాణి" అని అన్నారు. అంటే కర్మలను ఒక యోగంగా చేయాలి. ఇక్కడ యోగం అంటే ఫలితం ఆశించకుండా కర్మచేయడం. కర్మలు మంచి ఫలితాలను ఇచ్చినా విపరీత ఫలితాలను ఇచ్చినా సమంగా చూడటం. ఇదే యోగము. ఇది ఎలా సమకూరుతుంది అంటే మనో నిగ్రహం ఉన్నప్పుడు కలుగుతుంది. మనో నిగ్రహం కలిగినపుడు మనసు ప్రాపంచిక విషయములలో కాకుండా ఆత్మవైపు చూస్తుంది. మనసు ఆత్మలో లీనమైనపుడు అంతులేని ప్రశాంతత కలుగుతుంది. ఏ పని చేస్తున్నాము దాని ఫలితం ఏమిటి అనే దాని మీద ఆసక్తి ఉండదు. చేసే పని శ్రద్ధగా చేస్తాడు. ఫలితం పరమాత్మ పరం చేస్తాడు. ఫలితం గురించి ఆందోళన పడకుండా నిర్వికారంగా ఉండటమే సమత్వం అనే యోగము. దీనికి మూలం అటాచ్ మెంట్ అంటే సంగమాన్ని విడిచిపెట్టడం. ఏ పని చేసినా శ్రద్ధతో ఒక యోగం లాగా చేయడం.

ముఖ్యంగా విద్యార్థులకు, వ్యాపారస్థులకు ఇది ముఖ్యం. బాగా చదివి పరీక్ష రాస్తే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. వ్యాపార మెళుకువలు తెలిసి ధర్మంగా వ్యాపారం చేస్తే తగిన లాభాలు వస్తాయి. అంతే కానీ ఈ పరీక్ష రాస్తానా లేదా, పాసవుతానా లేదా, లాభాలు వస్తాయా లేదా అనే వ్యాకుల చిత్తంతో పరీక్ష రాసినా, వ్యాపారం చేసినా, విపరీత ఫలితాలువస్తాయి. అంతే కాకుండా అపరిమితమైన ఆశకుపోతే కన్నీళ్లే మిగులుతాయి. కాబట్టి ఒక పని అవుతుందా కాదా అనే అనుమానం వదిలిపెట్టి, శ్రద్ధతో పని చేయాలి. లాభ నష్టాల మీద సమత్వ బుద్ధి కలిగి ఉండాలి. అదే నిష్కామ కర్మ.

ఒక పని చేసినప్పుడు అది సిద్ధిస్తుంది. లేక సిద్ధించదు. చేసిన పని వృధా అవుతుంది. ఒక్కోసారి గెలుస్తాము. మరొసారి ఓడిపోతాము. లాభం వస్తుంది నష్టం వస్తుంది. పంటకోసి కుప్ప వేయంగానే భోరున నాలుగు రోజులు వాన. పంట నాశనం అవుతుంది. ఇలాంటివి జరుగుతాయి. మరి పంట నాశనం అయితే, నష్టం వస్తే ఏడవకుండా ఎలా ఉండటం అని ఎదురు ప్రశ్నవేయవచ్చు. ఏడిస్తే పోయిన పంట తిరిగి వస్తుందా! వచ్చిన నష్టం లాభంగా మారుతుందా! అలా అయితే నష్టం వచ్చిన ప్రతి వాడూ భోరున ఏడుస్తాడు. కాని అలా జరగడం లేదు. నష్టం ఎందుకు వచ్చిందో తెలుసుకొని అలా రాకుండా చూసుకోవడం బుద్ధి మంతులు లక్షణం ఏడవడం అవివేకుల లక్షణం. బుద్ధిమంతుడు అయిన వాడు లాభం వస్తే పొంగి పోవడం నష్టం వస్తే కుంగి పోవడం పనికిరాదు. డిప్రెషన్లోకి జారిపోకూడదు. కిందపడ్డా పైకి లేవడానికి ప్రయత్నం చేయాలి. ఇదివరకే ఈ సమత్వ బుద్ధి గురించి చెప్పాడు కానీ మరలా చెబుతున్నాడు భగవానుడు, కాబట్టి మనం చెయ్యవలసిన కర్మ, ఒక కర్తవ్యముగా చేయడమే మనపని. 

ఫలితం మనది కాదు, ఫలితం గురించి ఆలోచించకూడదు. ఫలితం మీద ఆసక్తి లేకుండా, చెయ్యాల్సిన పనిని శ్రద్ధతో చెయ్యి మంచి ఫలితం దానంతట అదే వస్తుంది. సమత్వబుద్ధితో చేసేదే కర్మయోగ

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories