శ్రీ అత్తి వరదరాజ స్వామి విశేషం..

 

40 ఏళ్ళకు ఒకసారి దర్శనమిచ్చే కంచి శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి పూర్తి విశేషాలు.. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధి పొందింది. సుమారు 1000 కి పైగా ఆలయాలు కలిగి ఉన్నది. దక్షిణాపథం లో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం(కంచి). కంచిలో గల ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి.

 

108 దివ్యతిరుపతులలో ఒకటై ప్రధానమైన వైష్ణవ దివ్యక్షేత్రలలో ఒకటిగాను విరాజిల్లుతుంది. (కంచి దర్శించిన తెలుగువారికి శ్రీ వరదరాజ స్వామి దేవాలయం అనేదానికన్నా బంగారు వెండి బల్లులు ఉన్న ఆలయం అంటే త్వరగా గుర్తువస్తుంది)... ఈ ఆలయ౦లోని విశేషం శ్రీ అత్తి వరదరాజ స్వామి.

 

పురాణ కాలంలో ఛతుర్ముఖ బ్రహ్మ గారు  దివ్యమైన యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ చే అత్తి చెట్టు కాండం తొ శ్రీవరదరాజ స్వామి (వరములను ద అనగా ఇచ్చునట్టి శ్రీ నారాయణుని) విగ్రహాన్ని చేయించి ప్రతిష్టించారు.ఈ మూర్తి కి యుగాలుగా అర్చనాదులు జరుగుతూ వస్తున్న క్రమం లో తురుష్కులు  కంచి పై దండెత్తి దేవాలయాలను కూల్చి సంపదలను దోపిడి చేస్తున్న సమయంలో శ్రీ వారి మూర్తి కి హాని కలుగకుండా వుండేందుకై ఆలయం లో ని ఆనంద పుష్కరిణి లో నీరాళి మంటపం పక్కగా చిన్న మండపం యొక్క అడుగు భాగం లో ఉంచారట. 

 

లోపలికి నీళ్లు చేరని విధం గా జాగ్రత్తలు తీసుకుని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున భద్రపరచారట. తదనంత కాలం లో అంతా పరిస్థితి సర్దుకున్నాక కూడా కారణాంతరాల వల్ల గర్భాలయంలో వేరొక దివ్య మూర్తి ని ప్రతిష్టించారు... అయితే పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపర్చబడిన శ్రీ అత్తి వరదరాజ స్వామి ని 40 సంవత్సరం లకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు.

చివరిగా 1979 లో దర్శనం ఇచ్చిన శ్రీ అత్తి వరదరాజ స్వామి ఈ సంవత్సరం అంటే 2019 జులై 1 వ తేదీ నుండి ఆగస్ట్17 వ తేదీ వరకు  తిరిగి దర్శనం ఇవ్వనున్నారు. మొదటి 38 రోజులు శయన(పడుకున్న) భంగిమ లోను చివరి 10 రోజులు స్థానక(నిలుచున్న)భంగిమ లో ను దర్శనం ఇస్తారు. ఉచిత దర్శనం తో పాటు 50రూపాయల టికెట్ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 11 to 12 వరకు సాయంత్రం 7 to 8 వరకు రెండు పూటలు స్వామికి సహస్రనామార్చన జరుగుతుంది.

 

ఈ సేవ లో స్వామి ని సేవించడానికి 500 రూ టికెట్ తీసుకోవలసి ఉంటుంది. దర్శన సమయాలు... ఉదయం 6 గం నుండి మద్యాహ్నం 2 గం వరకు తిరిగి మద్యాహ్నం 3 గ0 నుండి రాత్రి 9 గం వరకు... తమిళనాడు లో ని కాంచీపురం (కంచి)కి చేరేందుకు అన్ని ప్రధాన నగరాలనుండి తిరుపతి,చెన్నై లనుండి రైలు,బస్ సౌకర్యాలు ఉన్నాయి...


More Purana Patralu - Mythological Stories