రమణులు "నేను" అనే మాట గురించి చెప్పడానికి మూలమిదే!

ఆంగ్ల తత్త్వవేత్తలలో పాల్ బ్రింటన్ ఒకరు. ఈయన తన జీవితకాలంలో యోగులు సన్యాసులను కలుస్తూ పలు ఆధ్యాత్మిక, తాత్త్విక విషయాలను తెలుసుకుంటూ ఉండేవారు. ఆయన అరుణాచాలంలో శ్రీ రమణ మహర్షిని కలిసినప్పుడు "నేను" అనే మాట గురించి జరిగిన సంఘటన ఆయనే స్వయంగా ఇలా చెప్పారు.

"మహర్షీ! నేను పాశ్చాత్య తత్త్వశాస్త్రమును, భౌతిక శాస్త్రమును బాగా అధ్యయనం చేసాను. క్రిక్కిరిసిన పట్టణాలలోని మనుష్యులతో కలసి జీవిస్తూ, పనిచేస్తూ, వారి సుఖాలను రుచి చూస్తూ, వారి ఆశలు, ఆశయాలలో బంధింప బడ్డాను. కానీ, నేను ఏకాంత ప్రదేశాలలోకి వెళ్ళి, ఏకాంతంగా గాఢాలోచనా మగ్నుడనై తిరిగాను కూడ. నేను పాశ్చాత్యులలోని జ్ఞానులను ప్రశ్నించి వున్నాను. ఇపుడు తూర్పు దేశాలలో ఇతోధిక జ్ఞానాన్వేషణ చేస్తున్నాను” అన్నాను.

మహర్షి నాకు అర్థమైంది అన్నట్లు తల పంకించారు.

"ఎన్నో అభిప్రాయాలను విన్నాను. ఎన్నో సిద్ధాంతములను శ్రద్ధగా పరిశీలించాను. మేధావంతులు వారివారి నమ్మకాలను ప్రదర్శిస్తూ, చేసే తర్క వితర్కాలు నా చుట్టూ ప్రోగుపడి వున్నాయి. అవి అన్నీ నాకు విసుగు పుట్టించాయి. ప్రత్యక్షానుభూతిని కలిగించని దేనిని నమ్మలేని స్థితిలో వున్నాను. నేను మత సిద్ధాంతబద్ధుడను కాను, క్షమించండి. 'మానవుడి భౌతిక జీవనంకన్నా మించినది ఏమైనా వుందా?' అనేది నా ప్రశ్న. వుంటే, 'దానిని నేను ఎలా అనుభవించ గలుగుతాను?".

నా చుట్టూ చేరిన మహర్షి శిష్యులు నలుగురైదుగురు నన్ను వింతగా చూసారు. నేను ఏమైనా ఆశ్రమానికి అనుచితమైన విధంగా సాహసించి, మొరటుగా వారి గురువుతో భాషించానా? ఏమో నాకు తెలియదు. అయినా ఆ విషయం ఏమీ నేను లెక్క చేయదలచుకోలేదు. అనేక సంవత్సరాలుగా ప్రోగుపడి వున్న నా కోరిక, అనుకోకుండ నానోటి నుండి వెలువడింది. మహర్షి సరైన వ్యక్తి అయితే, సంప్రదాయ భంగకరంగా నేను పలికిన పలుకులను పట్టించుకోకుండ, నన్ను అర్థం చేసుకుంటారు అనుకున్నాను. మహర్షి ఏమీ పలుకలేదు.

ఆయన ఏదో ఆలోచనలో పడినట్లు వున్నారు. ఇంక చేసేది ఏమీ లేదు. నా నోరు ఎలాగూ తెరువబడింది కనుక, ఆయనతో మరొకసారి ఇలా అన్నాను: "పాశ్చాత్య శాస్త్రవేత్తలు చాలా మేధావంతులు. వారి మేధాశక్తికి జోహార్లు అందుకుంటున్నాను. కానీ, జీవితం వెనక గల నిగూఢసత్యం గురించి వెలుగు చూపలేకపోతున్నారు". "పాశ్చాత్యులు వివరించలేని వాటి గురించి, మీ దేశంలో కొందరు తెలుపగలరని విన్నాను. నిజమేనా? జ్ఞానానుభూతిని పొందుటకు మీరు నాకు సహాయం చేయగలరా? కాకపోతే, ఈ అన్వేషణే కేవలం ఒక మృగతృష్ణా?"

నా సంభాషణా పరమార్థమును ఇపుడు చేరుకున్నాను. నేను మహర్షి సమాధానం కోసం వేచి వుందామని నిర్ణయించుకున్నాను. ఆయన నావైపు సాలోచనగా చూస్తున్నారు. బహుశ నా ప్రశ్నల గురించే ఆలోచిస్తున్నారేమో? పది నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి.

చివరకు ఆయన పెదవులు విప్పి, ఎంతో సౌమ్యంగా ఇలా అన్నారు. "నీవు', 'నేను' అంటున్నావు. 'నేను' తెలుసుకోవాలని అంటున్నావు. ఆ 'నేను' అనేది ఎవరో చెప్పగలవా?”

ఆయన ఉద్దేశ్యం ఏమిటి? ఆయన ఇపుడు దుబాసిని ఉపేక్షించి, సూటిగా ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నారు. నేను తెల్లబోయాను.

"మీ ప్రశ్న నాకు అర్థం కావడం లేదు" అన్నాను. 

"అర్థం కాలేదా? మరొకసారి ఆలోచించు" అన్నారు భగవాన్.

నేను మహర్షి మాటల గురించి తీవ్రంగా ఆలోచించాను. ఒక ఆలోచన నా మనస్సుకు హఠాత్తుగ తట్టింది. నా వ్రేలు నావైపుకే చూపించుకుంటూ, నా పేరు చెప్పుకున్నాను.

"నీకు అతని గురించి తెలుసునా?" అన్నారు మహర్షి,

నేను చిరునవ్వుతో "నా జీవితం పొడుగునా ఎరుగుదును" అన్నాను. 

"కానీ, అది నీ శరీరం మాత్రమే. మరల అడుగుతున్నాను. నీవు ఎవరవు?" అన్నారు మహర్షి

ఈ విచిత్రమైన ప్రశ్నకు నాకు వెంటనే సమాధానం స్ఫురించలేదు. మహర్షి మరల అన్నారు: “మొదట నీవు 'నేను' అంటున్న ఆ 'నేను'ను తెలుసుకో. అపుడు నీకు అసలు సత్యం తెలుస్తుంది" అని.

నా మనస్సు మరల అయోమయంలో పడింది. అయోమయంలోంచి ఇంకొక ప్రశ్న వుదయించింది. బహుశ మహర్షియొక్క ఇంగ్లీషు జ్ఞానం ఒక హద్దుకు చేరిందేమో, ఆయన దుబాసివైపు తిరిగి చెప్పిన మాటలను, దుబాసి నాకు మెల్లగా ఇంగ్లీషులో చెప్పాడు:

"చేయవలసింది ఒక్కటే, నీవు నీ లోపలికి చూసుకో, ఇది సరైన పద్ధతిలో చేయి. నీ ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానం లభిస్తుంది”అని.

నేను అనే మాటకు రమణులు వేసిన ప్రశ్న, దానికి మూలం ఇదే!!

                                              ◆నిశ్శబ్ద.


More Subhashitaalu