Read more!

హనుమంతునిపై పనిచేయని రామబాణం

 

 

హనుమంతునిపై పనిచేయని రామబాణం

 

 

రామనామం గొప్పదా! రామబాణం గొప్పదా అని అడిగితే చెప్పడం కష్టం. కానీ మనసు చెక్కు చెదరని భక్తితో నిండిపోతే... రాముడైనా, ఆయన సంధించే రామబాణమైనా శాంతించక తప్పదన్నది భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే రామాంజనేయుల మధ్య కొన్ని కథలను సృష్టించారు. వాటిలో ఒకటి ఇదిగో...

 

ఒకసారి రాములవారు నిండుసభలో కొలువుదీరి ఉన్నారు. ఆ సమయంలో ఆయనను దర్శించుకునేందుకు మహామహా రుషులెందరో విచ్చేశారు. వారందరూ రాములవారికి గౌరవనీయులే! అంచేత హనుమంతునికి కూడా పూజనీయులే! కానీ అక్కడే ఉన్న నారదునికి ఒక కొంటె బుద్ధి కలిగింది. కలహభోజనుడు కదా. తన అలవాటు ప్రకారం హనుమంతునికీ, రాములవారికీ మధ్య గొడవ పెట్టాలన్న కోరిక కలిగింది. అంతే! హనుమంతుని పక్కకు పిలిచి ‘నువ్వు సభలో ఉన్నవారందికీ అభివాదం చేయవచ్చునేమో! కానీ విశ్వామిత్రుని ముందు మాత్రం తల వంచవద్దు. ఎందుకంటే ఆయన ఒకప్పటి రాజు కదా. రాములవారు ఉండగా మరో రాజు ముందు నువ్వు తలవంచితే ఎలా!’ అంటూ రెచ్చగొట్టాడు. ఆ మాటలు హనుమంతునికి సబబుగానే తోచాయి. నారదుని సూచన మేరకు రుషులందరికీ అభివాదం చేసి ఒక్క విశ్వామిత్రుని మాత్రం పట్టించుకోనేలేదు. ఆపై ఆయనను కాస్త రెచ్చగొట్టాడు కూడా!

 

హనుమంతుని చేష్టలకు కోపగించుకున్న విశ్వామిత్రులవారు వెంటనే రాముని దగ్గరకు వెళ్లి, ఆంజనేయునికి మరణదండన విధించమని ఆజ్ఞాపించాడు. తన చిన్ననాటి గురువుగారి మాటను రాములవారు తిరస్కరించలేరు కదా! అందుకని హనుమంతుని మీదకు బాణాలు సంధించమని సైనికులకు ఆదేశమిచ్చాడు. కానీ విచిత్రం! రాములవారు మరణదండన విధించిన విషయం తెలిసి హనుమంతుడు ఇసుమంతైనా చలించలేదు సరికదా... రామనామం జపిస్తూ ద్యానంలో మునిగిపోయారు. ఇక ఆయన మీద ఎటువంటి బాణమైనా ఎలా పనిచేస్తుంది. ఆఖరికి స్వయంగా రాముడే వచ్చి బ్రహ్మాస్త్రం సంధించినా అది నిష్ఫలం అయిపోయింది. ఇదంతా హనుమంతుని రామభక్తిని తెలిపేందుకు నారదుడు ఆడిన నాటకం అని తేలడంతో కథ సుఖాంతమయ్యింది.

- నిర్జర.