• Prev
  • Next
  • నేనూ - ఇంపోర్టెడ్ కెమేరా - 3

    నేనూ - ఇంపోర్టెడ్ కెమేరా

     

     

    - మల్లిక్

    పార్ట్ - 3

     

    ఒక అయిదు నిమిషాలపాటు నిశితంగా పరిశీలించి కెమెరాని ఎలా ఉపయోగించాలో చెప్పాడు యాదగిరి.

        "ఎలాగూ ఇక్కడికి వచ్చాం కదా... ఒక రీలుకుని ఫోటోలు తీద్దాం... ఈ కెమెరాతో ఫోటోలుతీస్తే ఎలా వస్తుందో తెలుస్తుంది" అన్నాడు చంచల్రావు.

        "మా ఇస్టుడియోల రీళ్ళుభి అమ్ముతామ్ సార్" అన్నాడు యాదగిరి హుషారుగా.

        "సరే... ఒక రోల్ ఎంత?"అని అడిగాను.

        "నల్ పై రూపాయల్ సాబ్!"

        'నలభై ఎందుకూ?"

        "కలర్ ఫిల్ము సాబ్!"

        "కలర్ ఫిల్ము వద్దులే... బ్లాక్ అండ్ వైట్ అయితే ఇరవై రూపాయలే. కలర్ ఫిల్ము అయితే నలపై రూపాయల్. ఇరవై రూపాయల్ కి ఏం జూస్తావ్ సాబ్? కలర్ ల ఫోటోలు మంచిగా కొడ్తది" అన్నాడు.

        "కలర్ ఫిల్మే తీస్కోరా" అన్నాడు చంచల్రావు.

        నేను కలర్ ఫిల్ము తీసుకున్నా.
                          
       "ఫోటోలు నాతోనే కడిగించండి సార్" అన్నాడు యాదగిరి పళ్ళికిలిస్తూ.

        "సరేనోయ్" అన్నాడు వాడికి చంచల్రావు అభయం ఇస్తూ.

        "అర్రే కిషన్ రెండు చాయ్ చెప్పరా..." అని లోపలికి చూస్తూ అరిచాడు యాదగిరి.

        ఇందాకట్నుండీ నా మనసులో పీకుతున్న సందేహాన్ని అడిగేశాను.

        "అవునుగానీ, మీ స్టూడియో ముందు ఇచ్చట మీ మొహంలాగే ఫోటోలు తీయబడును' అని బోర్డు పెట్టావుకదా... అలాగెందుకు పెట్టావ్?"

        "అదీ భి సమజ్ కాలేదా సార్ మీకు?" అంటూ ఘొల్లున నవ్వాడు యాదగిరి.

        మేమిద్దరం జేబు రుమాళ్ళతో ముఖం తుడుచుకున్నాం.

        "చమించాలి సార్! నేను నవ్వితే గట్లనే జల్లు పడ్తది. ఆ ఏమ్మంటిరీ... గా బోర్దెందుకు పెట్టినాననా? సార్! వేరే స్టూడియోల ఫోటో తీయించుకుంటే మీ ముఖం మీది ముఖంలా కన్పడదు. గదే మా స్టూడియోల దీయించుకుంటే మీది ముఖం మీదిలానే కన్పిస్తది... సమజైంది కదా, హాహహ...."

        మేమిద్దరం వెనక్కి తిరిగాం.

        యాదగిరి నవ్వు ఆపాడు.

        మళ్ళీ మేం ముందుకు తిరిగాం.

        కిషస్ అనే కుర్రాడు లోపలినుండి టీలు తెచ్చాడు. మేము టీ తాగి బయట పడ్డాం.

        గదికి వచ్చిన తరువాత చంచల్రావు అడిగాడు.

        "ఒరేయ్ బుచ్చిబాబూ! ఈ కొత్త కెమెరాతో మొట్టమొదటిసారిగా నువ్వు ఎవరి ఫోటో తీద్దామని అనుకుంటున్నావు?"

        "ఏ గర్ల్ ఫ్రండో ఉండివుంటే ఆ కోమలాంగిని తీసి ఉండేవాడిని కానీ, ఎవరూ లేరుకదా! నీకంటే నాకు ముఖ్యులు ఎవరున్నారునా. ముందు నీ ఫోటోనే తీస్తాను, అలా నిల్చో..." అన్నాను కెమెరాను అడ్జెస్టుచేస్తూ.

        చంచల్రావు కిటికీలోంచి బయటికి చూసి ఆనందంతో కెవ్వున కేకేశాడు.

        "ఏమైందిరా చెంచిగా? ఎవరైనా అమ్మాయా? నొక్కేస్తా నొక్కేస్తా" అంటూ కెమెరాని అడ్జెస్టుచేస్తూ కిటికీ దగ్గరకి పరుగెత్తాను నేను.

        "నీ ముఖం.వీధిలో ఎవరిదో కారు ఆగివుంది చూడు. ఇంపోర్టెడ్ కారు" అన్నాడు చంచల్రావు ఆనందంగా.
                                         
         "అయితే ఏమిటి?"

        "ఆ కారుదగ్గర నిలబదిడ్ ఫోటో తీయించుకుంటా" అని బయటికి ఉరికాడు చంచల్రావు.

        నేను వాడిని ఫాలో అయ్యాను.

  • Prev
  • Next