• Prev
  • Next
  • నా చేతి వంట - అందమైన చిట్కాలు

    నా చేతి వంట - అందమైన చిట్కాలు

    పెయ్యేటి శ్రీదేవి

    ఉదయం పదకొండు గంటలకి మహిళ ఛానెల్ లో 'రుచి చూడు కార్యక్రమం చూసి, తరవాత కొంత వంటింటి పని చేసుకుని, మళ్ళీ పన్నెండు గంటలకి టి.వి. ఆన్ చేసింది. టి.వి.లో వచ్చే మా 'ఊరి వంట', 'మీ ఊరి వంట', 'భోంచేద్దాం రండి', 'అరగంటలో వంట', 'కిచెన్ 65', 'ఆహా ఏమి రుచి!', 'అభిరుచి', 'మీరు మెచ్చిన వంట', 'అందరు మెచ్చిన వంట'......ఇలా పదకొండు గంటల నించి, సాయంత్రం ఐదు గంటల వరకు వచ్చే  వంటలు, పిండి వంటలు, అన్నీ రోజూ రిమోట్ తో ఛానెళ్ళు కలయతిరుగుతూ, మార్చి మార్చి చూస్తూంటుంది.

    రుచిగా, శిచిగా పిల్లలకి, భర్తకి, ఇంకా వచ్చే అతిథి, అభ్యాగతులకి మంచి వంటలు, పిండివంటలు వండి పెడుతుంటే, వాళ్ళు తృప్తిగా అవి తిని, 'ఓహ్, అద్భుతం! సూపర్! చాలా బాగుంది!' అంటూ తనని పొగుడుతుంటే మహాలక్ష్మికి అదో చెప్పలేని ఆనందం. వాళ్ళ పొగడ్తలకి గాల్లో తేలిపోతుంది. ఎవరు ఏపని చేసినా చాలా బాగుందని, అందంగా లేకపోయినా చాలా బాగున్నావు అనే ఒక్క పదంతో ఏ మానవమాతృలైనా, చెప్పలేని సంతోషంతో, బక్కగా వున్న వాళ్ళు కూడా పూరీల్లా పొంగిపోతారు. కాని కొంతమంది ఎంత బాగా వంట చేసినా, పదార్థాలు ఎంత బాగున్నా, వాళ్ళ సొమ్మేదో పోయినట్టు, చాలా బాగుందని ఒక్కమాట అనరు. దాంతో అవతలి వాళ్ళు చాలా బాధ పడిపోతారు.

    ఆరోజు భర్త మోహనరావు పుట్టినరోజని, మంచి మంచి వంటలు చెయ్యాలని, పొద్దున్నే పూజ పూర్తిచేసుకుని, అందరికీ బ్రేక్ ఫాస్ట్ లు చేసి పెట్టేసి, టి.వి. ముందర పన్నెండు గంటలకి కూచుని ఒక ఛానెల్ లో వస్తున్న 'నా చేతి వంట' చూస్తోంది.

    'నా చేతి వంటకు స్వాగతం. ఇప్పుడు మనం విజయవాడలో ఉంటున్న కనకలత గారింటికి వెళ్ళి, ఆవిడేం వంట చెయ్యబోతున్నారో తెలుసుకుందాం.'

    'హాయ్ కనకలతగారూ! బాగున్నారా?'
    'మేం చాలా బాగున్నాం. మీరెలా వున్నారు?'

    'చూస్తూంటేనే తెలుస్తోంది మీరెంత బాగున్నారో. సంతోషమంతా మీ మొహంలో కనిపిస్తోంది. మేం కూడా చాలా బాగున్నాం.'

    'మీరేం వంట చెయ్యబోతున్నారు?'
    'ఇవాళ బెండి జెండి బేసిన్ కోకోనట్ కాజు ఫ్రై చేస్తున్నానండి.'
    ' పేరు చాలా వెరైటీగా వుందండి. ఇది దేంతో చేస్తారు? దీనిక్కావలసిన పదార్థాలు చెబుతారా?'

    'ఆ, చెబుతానండి. లేతబెండకాయలు ముందర కడిగేసి, ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఉప్పు తగినంత, కారం, జీడిపప్పు పొడి, కొబ్బరిపొడి, కొత్తిమీర తరుగు, కప్పు శనగపిండి, స్పూన్ జీలకర్ర.

    'ఇప్పుడు ముందుగా ఏం చెయ్యాలండి?'

    'ముందుగా స్టౌ వెలిగించుకుని, బాండీ పెట్టి, అరకె.జీ. నూనె పొయ్యాలండి. నూనె కాగేలోపు, శనగపిండిలో ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాలపొడి కలిపి, అందులో కొద్దిగా నీళ్ళు కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఆ మిశ్రమంలో బెండకాయముక్కలు వేయాలి. ఈ బెండకాయలు కలిపిన మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా నూనెలో వేసి పెద్దమంట మీద వేయించాలి. ఇదుగోనండి. నేను ముందరే ఈ మిశ్రమాన్ని చేసి వుంచానండి.'

    'ఇప్పుడేం చెయ్యాలండి?'

    'నూనె కాగిందో లేదో అందులో వేలు ముంచి తియ్యాలండి. వేలు కాలగానే తీసెయ్యాలి.'

    'అమ్మో, మీరలా చూస్తారా? అందరూ పైనుంచి చూస్తారు వేడిక్కిందో నని.'

    'నాకు అలవాటే లెండి. కాలినా వెంటనే పోతుంది. లేకపోతే, నూనె కాగకపోతే కూర నూనె లాగేస్తుంది.'

    'సరే. తరవాతేం చెయ్యాలి?'

    'ఇప్పుడు శనగపిండిలో కలిపిన ఈ బెండకాయ మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి.'

    'కనకవల్లి గారూ ! మీకీ వంట ఎవరు నేర్పించారు? చాలా కొత్తరకంగా వుంది.'

    'ఇది కొత్తదేం కాదండి. బాగా పాత, సాంప్రదాయకమైన వంటే. కాకపోతే ఈ బెండకాయ వేపుడునే ఈ కాలానికి తగ్గట్టు పేరు మార్చి, కొన్ని మార్పులు చేసి ఇలా వండితే మా పిల్లలు ఇష్టంగా తింటారండి. 'ఈ వాళ ఏం కూర చేసావు మమ్మీ?' అని వాళ్ళడిగితే, 'బెండకాయ వేపుడు' అని చెప్పగానే మాడిపోయిన బెండకాయ వేపుడులా మొహం మాడ్చుకుని అస్సలు భోజనమే చెయ్యరు. అందుకే 'బెండి జెండి బేసిన్ కాజు కోకోనట్ ఫ్రై' అని పేరు పెట్టి ఇలా చేస్తే, ఎంతో ఇష్టంగా లాగించేస్తారు.'

    'బాగుందండి. పిల్లల కోసం వాళ్ళ చేత బెండకాయ ఎలా అయినా తినిపించాలని మీ క్రియేటివిటీ చాలా బాగుంది. ఐతే పాతవంటల్ని మోడిఫై చేసి కొత్తరకంగా చేస్తూంటారన్నమాట. మీకెంత మంది పిల్లలండి? మీ వారేం చేస్తారు? మీ హాబీలేమిటి?"

    'నాకు ఇద్దరబ్బాయిలండి. ఒకడు ఎయిత్, రెండోవాడు సిక్స్త్ చదువుతున్నారండి. మావారు బిజినెస్. నేను హౌస్ అడ్మినిస్ట్రేటర్. నేను చేసే వంటలన్నీ చాలా బాగుంటాయని అందరూ తృప్తిగా భోంచేస్తుంటే ఆనందించడం నా హాబీ అండి. ఇంకా టి.వి. చూడ్డం, పాటలు పాడడం నా హాబీలండి. మీ ఛానెల్ లో వచ్చే వంటలన్నీ చూస్తానండి.'

    'అబ్బో, మీకు చాలా టాలెంట్లే వున్నాయి. ఐతే ఒక పాట పాడండి కనకలత గారూ.'

    'జననీ, శివకామినీ! జయశుభకారిణి, విజయరూపిణీ, జననీ, శివకామినీ! అమ్మవు నీవే అఖిల జగాలకు, అమ్మల గన్న అమ్మవు నీవే, ణీ చరణములే నమ్మితినమ్మా, శరణము కోరితినమ్మ, భవానీ...., జననీ, శివకామినీ!'

    'సూపర్ ! చాలా చాలా బాగా పాడారండి. ఆ, అడుగుదామని మర్చిపోయాను. ఇంతకీ ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారండి?'


    'మా అత్త దగ్గిర నేర్చుకున్నానండి. మా అత్త వాళ్ళమ్మ దగ్గిర, వాళ్ళమ్మ వాళ్లత్త గారి దగ్గర, వాళ్ళత్తగారు మళ్ళీ వాళ్ళ బామ్మ దగ్గిర, వాళ్ళ బామ్మ వాళ్ళమ్మ దగ్గిర, వాళ్ళమ్మ వాళ్ళమ్మమ్మ దగ్గర, వాళ్ళమ్మమ్మ.....'


    'ఉండండి, ఉండండి కనకవల్లి గారూ! మీ ఏడు తరాల గురించి తరవాత చెబుదురుగాని. ఇప్పుడో చిన్న బ్రేక్ తీసుకుందామా?'

    'నా చీతి వంటలో ఇప్పుడో చిన్న.....బ్రేక్.'


    ********************************

    'అబ్బ! టైమ్ అప్పుడే తొమ్మిది గంటలయింది. రాత్రి టి.వి. చూస్తూ ఆలస్యంగా పడుకున్నా. మెలకువ రాలేదు. ఇప్పుడెలా? పిల్లలకి అన్నం  పెట్టాలి, కేరేజివ్వాలి. వంట చేసే టైము లేదు.'

    'టైముంది! మా క్విక్ ప్రెషర్ కుక్కర్ నే కొనండి. క్షణాల్లో వంట రెడీ! మీరు నిశ్చితంగా పడుకుని, బద్ధకంగా లేవండి. మహిళల కోసం ప్రత్యేకించి ప్రవేశపెడుతున్నాం కొత్త క్విక్ క్విక్ ప్రెషర్ కుక్కర్! ఇందులో ఇంకో సౌకర్యం కూడా వుంది. రాత్రే బియ్యం కడిగిపెట్టి, మీకే టైముకి వంట అవాలో టైమ్ సెట్ చేసి, స్విచ్ ఆన్ చేయండి. ఉదయానికల్లా వంట రెడీ! మీరింకా ఎంత సేపైనా పడుకోవచ్చు. దీని ధర కేవలం ఐదువేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే. త్వరపడండి. మా క్విక్ క్విక్ ప్రెషర్ కుక్కర్ కొంటే పది చెంచాలు, ఒక సాల్టు డబ్బా ఉచితం.'


    ************************************


    'దొరుకునా ఇటువంటి
    సేవ....ఖళ్ళు...ఖళ్ళు....ఇటువంటి.....ఖళ్ళు...ఖళ్ళు...సేవ....ఖళ్ళు....ఖళ్ళు......నీ...ఈ...పద రాజీవముల నేలు....ఖళ్ళు...ఖళ్ళు....ఖళ్ళు...ఖళ్ళు...నిర్వాణ...ఖళ్ళు...సోపానమధిరోహణము సేయు తోవ ...ఖళ్ళు....ఖళ్ళు.....ఖళ్ళు.....ఖళ్ళు.....'

    'ఇదుగో తాతయ్యా! ఈ దగ్గుప్లెక్స్ రెండు చెంచాలు వేసుకో. బాగా పాడగలవు...'

    'ఖళ్ళు ఖళ్ళు......ఇయ్యి బాబూ...దొరకునా ఇటువంటి సేవ, నీ పదరాజీవములనేలు నిర్వాణసోపాన మదిరోహణము జేయు తోవ...దొరకునా....ఇటువంటి సే ఏఏఏవ.....'

    'మా దగ్గుప్లెక్స్ నే వాడండి. క్షణాల్లో మీ దగ్గు మటుమాయం! దగ్గు లేకుండా హాయిగా పాడుకోవాలంటే....దగ్గుప్లెక్స్! దగ్గుప్లెక్స్!'


    ***************************

    'ఏమేవ్! త్వరగా అమ్మాయిని తీసుకురా. పెళ్ళివారు వచ్చేస్తున్నారు.'

    'అబ్బ! నా నడుం...నడుం పట్టేసింది. పెళ్ళివారు ఏమనుకుంటారో?'

    "ఏమీ అనుకోరు. ఈ పెయిన్ రబ్బుజామ్ వాడితే ఇప్పుడే మీ నడుం నొప్పి మటుమాయం!'


    *************************************


    'ఆ....కనకవల్లి వారూ! మీ బెండకాయకూర ఎవరు ఎవరికి నేర్పారో, మీరు చెప్పిన తరాలన్నీ అయిపోయినట్లున్నాయి కదా?'

    'ఆరు తరాల వరకు చెప్పారనుకుంటా. అటేడు తరాలు, ఇటేడు తరాలు అంటారు కాబట్టి, ఇంకో తరం...మీ బామ్మకి అత్తో, ఆడబడుచో చెప్పుంటుందిలెండి.'

    'ఈ తరాలన్నీ చెప్పుకుంటూ కూచుంటే వంట ప్రోగ్రామ్ కి గంటె కాదు, రోజంతా చెప్పినా చాలదు.'

    'పోనీ ఏదన్నా చిట్కా చెప్పండి.'

    'పాదాలకి పగుళ్ళు వచ్చినప్పుడు చాలా మంటగా వుంటాయి. గోరింటాకు ఆ పగుళ్ళ దగ్గిర పెడితే గనక వెంటనే తగ్గిపోతాయి. వడదెబ్బ తగిలినప్పుడు సోడానీళ్ళతో మొహం కడుక్కుని, నిమ్మకాయ మజ్జిగ తాగితే వడదెబ్బ తగ్గుతుంది.'

    'చాలా మంచి చిట్కాలు చెప్పారండి.'


    'బెండి జెండి బేసిన్ కాజు కోకోనట్ ఫ్రై అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుని, చుట్టూ బెండకాయలు ఇలా పువ్వులా చీల్చి, చుట్టూ గుచ్చి, జీడిపప్పుతో, కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసి, పైన కొబ్బరి చల్లాలి. ఇంకా, కేరెట్ ని ఇలా పువ్వు షేపులో చేసి మధ్యన పెట్టాలి.'

    'సూపర్! కూరెలా వుంటుందో ఏమోగాని, డెకరేషన్ అదిరింది!'

    'బెండి జెండి బేసిన్ కాజు కోకోనట్ ఫ్రై రెడీ! రుచి చూసి ఎలావుందో చెప్పండి.'

    'తప్పకుండా. అన్నట్టు కనకవల్లి గారూ! బెండి అంటే బెండకాయ అని, బేసిన్ అంటే శనకపిండి అని, కాజు కోకోనట్ అంటే జీడిపప్పు, కొబ్బరి అని ఈజీగా తెలిసిపోతుంది. కాని జెండి అంటే ఏమిటండి?'

    'ఏంలేదండి. బెండికి జతగా బాగుంటుందని జెండి అని యాడ్ చేసాను. ఎలా వుందండి కూర? ఏం, బాగాలేదా? అస్సలు బాగాలేదా మొహం అలా పెట్టారు?'

    'ఛీ! ఇంత పరమచెత్త కూర జీవితంలో ఎప్పుడూ తినలేదు.......... అని అంటాననుకున్నారు కదూ నా మొహం చూసి? భయపడకండి. పొరబాట్న అలా పెట్టా. కామెడీకి ట్రాజెడీ మొహం, ట్రాజెడీకి కామెడీ మొహం పెట్టేస్తుంటా. అందుకే మా అమ్మ 'పిచ్చిమొహం' అని తిట్టి ఎప్పుడెలా మొహం పెట్టాలో సరి చేస్తుంటుంది.'


    'మీరు చాలా కామెడీగా మాట్లాడుతున్నారు.'

    'అవును. ఈ కూర తినగానే కామెడీ వచ్చేస్తోంది. ఓ.కె. మీరు చేసిన బెండి జెండి బేసిన్ కాజు కోకోనట్ ఫ్రై చాలా చాలా బాగుందండి. సూపర్బ్! నిజంగా చాలా బాగుంది. కొంచెం కారంగా, కొంచెం ఉప్పగా, కొంచెం క్రిస్పీగా ....నిజంగా చాలా బాగుంది. ఇంకో విషయం చెప్పమంటారా? మీ పిల్లాల్లాగే నేను కూడా బెండకాయ కూరంటే అస్సలు తినను. కాని మీరు చేసిన కూర చాలా బాగుంది. ఇవాళ నాచేత బెండకాయ కూర తినిపించారు. కనకవల్లిగారూ! మీరు ఇంత రుచికరమైన వంట చూపించినందుకు క్విక్ క్విక్ ప్రెషర్ కుక్కర్ వారు మీకీ ఏ ప్రాన్ బహుమతిగా ఇచ్చారు. ఇక నుంచి పట్టుచీర కట్టుకుని ఈ ఏ ప్రాన్ వేసుకుని వంట చేసినా, మీ పట్టుచీర పాడవ్వదు.'


    *                *                    *


    మహాదేవి మరో ఛానెల్ మార్చింది.

    'బామ్మా! ఇప్పుడు ఏం వంట చేస్తున్నావు? ఆకలి దంచేస్తోంది. తొందరగా ఏదో తినకపోతే నేనాగలేను.'

    'సరే, తొందరపడితే ఎలా? ఆకలి అంటున్నావు, ఆగలేను అంటున్నావు కాబట్టి, తొందరగా అయిపోయేలా ఓ వంట చేస్తాను, చూస్తూండు.'

    'సరే, ఏం వంట చేస్తున్నావు బామ్మా?'

    'ఇడ్లీతో బజ్జీలు, బజ్జీతో ఇడ్లీలు.'

    'ఆ, ఏముంది? పొద్దున్న మిగిలిన ఇడ్లీలు సాయంత్రం స్నాక్సుగా ఇడ్లీని బజ్జీపిండిలో ముంచి వెయ్యడమేగా ఇడ్లీతో బజ్జీలంటే? ఇక బజ్జీతో ఇడ్లీలంటే, ఇడ్లీపిండిలో బజ్జీముక్కలు కలిపి ఇడ్లీలేస్తావు. అంతేగా?'

    'ఇదుగో, నువ్వు నన్ను వంట చెయ్యనిస్తావా లేదా? ప్రశ్నలతో వేధించక చెప్పేది శ్రద్ధగా విని నేర్చుకో. ఇప్పుడేమో, ఈ ఇడ్లీలు ఇంటి దగ్గర్నుంచి తెచ్చాను. వీటిని....'


    ************************

    ఇంతలో....

    'మహాదేవీ! ఆకలేస్తోంది. ఆ వంటల ప్రోగ్రామ్ లన్నీ చూసేదాకా అన్నం పెట్టావా?' అని భర్త రఘురామ్, కూతురు శ్రావ్య, కొడుకు సతీష్ 'అమ్మా! త్వరగా అన్నం పెట్టు.' అంటూ వచ్చారు.

    ఆవేళ టి.వి.లో చూసిన వెంటనే, ఆ బెండి జెండి బేసిన్ కాజు కోకోనట్ ఫ్రై చేసింది. ఇంకో ఛానెల్లో చెప్పిన అరటికాయ తొక్కల పచ్చడి, మరేదో ఛానెల్లో అంతకుముందెప్పుడో చెప్పిన జీడిపప్పుకూర, జామకాయ్ పికిల్, పుచ్చకాయ చెక్కల పచ్చడి, తాటిముంజెల రైస్, అన్నంతో కట్ లెట్ ళు, ద్రాక్షపళ్ళ ఊరగాయ...ఇలా చాలా రకాలు చేసి, టేబులు మీద అందరికీ వడ్డించింది.

    'అబ్బ, చాలా బాగున్నాయోయ్ వంటలు!', మమ్మీ! సూపర్! ఎక్స్ లెంట్!' అంటూ భర్త, పిల్లలు మెచ్చుకుంటూంటే మురిసిపోతోంది మహాదేవి. చాలా బాగుంది అన్న ఒక్క మాటకి, ఆ ఒక్క పొగడ్తకి ఎంతటివాళ్ళైనా పడిపోక తప్పదు. అందుకే మహాదేవి కూడా సంతోషానందాలతో తేలిపోతోంది.

    ఊహల్లో తేలిపోతున్న మహాదేవికి భళ్ళున శబ్దాలు వినిపించి, ఉలిక్కిపడి చూడగా, ఎవరూ భోంచెయ్యకుండా కంచాలు వేసిరేసారు. నేల మీదంతా అన్నం, కూరలు చిందరవందరగా పడున్నాయి!

    మహాదేవికి కళ్ళంబటి నీళ్ళొచ్చాయి. 'ఏమైందర్రా మీకు?' అని గట్టిగా అరిచింది.

    'మహాదేవీ! ఎప్పుడూ ఆ టి.వి.  లో వచ్చే వంటలు చెయ్యకు.'

    'అవును మమ్మీ! అసలు వాళ్ళైనా చేసుకుంటారో లేదో తెలియదు. రోజూ ఏదో ఓ వంట చెప్పాలి కదా? అందుకే రకరకాల చెత్త వంటలన్నీ కనిపెడతారు.'


    'ఏమే రమా! నీకేం వచ్చిందే మాయరోగం? ఆ వంటల ఛానెల్లో నువ్వేగా యాంకర్ వి? ఆ బెండీ జెండీ బేసిన్ కాజు కోకోనట్ ఫ్రై కూర 'సూపర్!, ఎక్సలెంట్! యమ్మీ! యమ్మీ! చాలా బాగుంది!' అంటూ అన్ని భాషలలో పోగిడేసావు కదే? 'ఎప్పుడూ బెండకాయ కూర తినని దాన్ని, ఈ రోజు నాచేత తినిపించారు' అంటూ లోట్టలేసుకుని తిని, ఆ కనకవల్లి చేసిన కూరని, ఆవిడ అందాన్ని తెగమెచ్చేసుకున్నావు. ఆఖరికి,'జననీ, శివకామినీ!' అన్న అంత మంచిపాటని కూడా అంత ఛండాలంగా పాడితే, చాలా బాగా పాడారంటూ పొగిడేసావు. నేను తల్లిని కాబట్టి నామీద నువ్వూ విరుచుకు పడతావా? ఎంతో కష్టపడి మీకోసం ఇన్ని వంటలు చేస్తే, కంచాలు విసిరికొడతారా? పోనీ, ఇలా చెయ్యద్దు, మీకు నచ్చలేదని చెప్పచ్చుగా?'

    'మమ్మీ! నేను యాంకర్ని కాబట్టి, అక్కడ బాగుండకపోయినా బాగుందని చెప్పాలి. తప్పదు. అది నా వృత్తి. ఈరోజు సాయంత్రం కొత్తగా రిలీజయిన 'వీరబాదుడు' చిత్రంలోని సుత్తి హీరోతో ఇంటర్వ్యూ వుంది. వాడంటే నాకస్సలు ఇష్టం లేదు. ఐనా మీరు చాలా బాగా నటించారంటూ పొగడాలి. తప్పదు. మా వృత్తిలో రాణించాలంటే అందర్నీ పొగడుతూనే వుండాలి. అప్పుడేం మేం ఈ రంగంలో నిలదొక్కుకోగలం. ఆ కనకవల్లి గారు చేసిన బెండకాయకూర నేను నిజంగా రుచి చూడలేదు. చెంచాతో అలా తిన్నట్టు నటించాను.అది నిజమనుకుని ఆ కూరే నువ్వు చేస్తావనుకోలేదు. ఆ టి.వి. వంటలు చెయ్యకు మమ్మీ! రోజుకీ ఇరవైనాలుగు గంటలూ ఏవో ప్రోగ్రామ్ ళు పెట్టాలి. మధ్యాహ్నం టైములో ఈ వంటల ప్రోగ్రామ్ లే అందర్నీ ఆకట్టుకుంటాయి. అలాగని అవే చెయ్యకూడదు. మాకు నీచేతి వంటే నచ్చుతుంది మమ్మీ.'

    'అవును మహాదేవీ! నాకు కూడా నీచేతి వంటే నచ్చుతుంది. మాకేమీ వద్దు, ఓ కూర, చారు, పప్పు చాలు. ఇడ్లీలతో బజ్జీలు, అన్నంతో వడలు, అల్లం వెల్లుల్లి పేస్టుతో కొత్తిమీర రైసులు, కరివేపాకు రైసులు, నానా రకాల పిచ్చికూరలు చెయ్యకు. అందరం ఆకళ్ల మీద వున్నాం. సారీ, కంచాలు విసిరేసినందుకు. బాధపడకు. ఇవాళ నా పుట్టినరోజు కదా! మొహం కడుక్కుని మళ్ళీ ఫ్రెష్ గా వంట చెయ్యి. అందరం కలిసి హాయిగా తిందాం.'

    'ఔను మమ్మీ! నీ చేతి వంట చాలా బాగుంటుంది. నే బాక్సు తీసికెళ్ళినప్పుడు మా ఫ్రెండ్సందరూ వాళ్ళక్కూడా పెట్టమని అడుగుతారు. నువ్వు చేసే గుత్తివంకాయకూర, పులిహోర, కట్టెపొంగలి, సాంబారు అంటే వాళ్ళకి చాలా యిష్టం. వాళ్ళు తెచ్చుకునేవేం బాగుండవు. అన్నిట్లో అన్నం వెల్లుల్లి పేస్టుంది. అందుకని అన్నీ ఒకే రుచిలో వుంటాయి.'

    మనసులో పడ్డ బాధంతా తుడిచేసుకుని, వాళ్ళ మాటలకి శాంతించి, మహాదేవీ దొండకాయ వేపుడు, టొమేటో పప్పు, మజ్జిగపులుసు, అరటికాయ బజ్జీలు, చింతపండు పులిహోర, సేమ్యాపాయాసం...అన్నీ నిముషాల్లో చేసి భర్త, పిల్లలకి వడ్డించింది.

    వాళ్ళు 'వంట నిజంగా సూపర్!' అంటూ తన యాంకర్ కూతురు, భర్త, కొడుకు కూడా చాలా బాగుందంటూ ఆనందంతో భోంచేసి, 'అన్నదాతా సుఖీభవ!' అంటూ లేచారు.

    మహాదేవి 'నా చేతివంట ఇంత బాగుంటుందా!' అనుకుని తనుకూడా తృప్తిగా భోంచేసింది.

    ఆ తర్వాత నించి మహాదేవీ టి.వి.లో వచ్చే వంటలన్నీ చెయ్యకుండా ఆ వంటల కార్యక్రమాల మధ్యలో వచ్చే సన్నబడటానికి, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు, బ్యూటీ టిప్సు పాటించడం మొదలుపెట్టింది.

    అందుకే క్రితంరోజు భర్త తెచ్చిన కేరెట్లు, కీరాలు, తేనె, పాలు ఇవన్నీ మొహానికి, తెల్లబడుతున్న వెంట్రుకల్ని కప్పిపుచ్చడానికి వారం వారం  తలకి హెన్నా పట్టించడం మొదలుపెట్టింది. దాంతో జుట్టంతా ఎర్రగా తయారయింది. ఈ మధ్య బరువు తగ్గే ప్రయత్నంలో అన్నం మానేసి సలాడ్లు తినడం మొదలుపెట్టింది. టి.వి.లో బరువు తగ్గడానికి చెప్పే చిట్కాలన్నీ పాటిస్తోంది. ఒకసారి భర్త భోంచేస్తూ, "అన్ని కేరెట్లు తెచ్చాను. ఒక్కనాడూ కూర చెయ్యలేదేం?' అని అడిగాడు.

    'నాన్నా! ఆ కేరెట్లు, టొమేటోలు పేస్ట్ చేసి అమ్మ మొహానికి పట్టించుకుంటోంది. కీరాలు చక్రాలుగా తరిగి కళ్ళకి పెట్టుకుంటోంది. తలకి హెన్నా, ఒంటికి పాలు, తేనె, శనగపిండి పెట్టుకుంటోంది.' అంటూ కొడుకు కిరణ్ చెబుతూంటే, 'సరే, సరే. అమ్మ మీద నేరాలు చెప్పకు. బుద్ధిగా చదువుకో. మహాదేవీ! రాత్రీ కెంపుకెడుతున్నాను. ఈసారి నెల్లాళ్ళు పట్టవచ్చు. ఇల్లు జాగ్రత్త.' అంటూ భోజనం పూర్తి చేసి హడావిడిగా సూట్ కేస్ తీసుకుని ఆటోలో బయలుదేరాడు.

    'మమ్మీ! నేను క్రికెట్ ఆడుకోవడానికి వెడుతున్నాను.' అంటూ తుర్రుమన్నాడు సుపుత్రుడు.

    కూతురు రమ టీ.వి.లో ఒక సినిమా హీరోని ఇంటర్వ్యూ చెయ్యాలంటూ వెళ్ళిపోయింది.

    ఇంక తననెవరూ హేళన చేస్తూ ఆటంకపరచరని తలుపులేసుకుని మొహానికి ఫేస్ ప్యాక్ వేసుకుంది. తరవాత తలకి హెన్నా పెట్టుకుంది. ఇంకా జుట్టు ఎదగడానికి మినపపిండి, మెంతులు కలిపిన పేస్టు పెట్టమని వంటల ప్రోగ్రామ్ లో ఏదో చిట్కా చెబితే అది కూడా పట్టించింది. ఎలాగూ భర్త కేంపుకెళ్ళి ఇప్పట్లో రారు.

    పిల్లలిద్దరూ బైటికెళ్ళిన సమయంలో రోజూ క్రమం తప్పకుండా అందానికి కూరముక్కల పేస్టులు పట్టించుకుంటోంది. అన్నం మానేసి, కూరముక్కల సల్లాడ్లు, మొలకలు తింటూ, ఆరోగ్యానికి అరవై సూత్రాలు టి.వి.లో చెప్పినట్లు అక్షరాలా పాటిస్తోంది. ఒకసారి మహాదేవీ వంటల కార్యక్రమంలో పాల్గొని, సలాడ్లు, వెజిటబుల్ జ్యూస్ లు ఎలా చెయ్యాలో చెప్పింది.

    ఆ ఛానెల్ లో యాంకరు, మీ సౌందర్యానికి రహస్యం ఏమిటని, మీకు పెద్ద పిల్లలున్నారని అంటే ఎవరూ నమ్మరని పొగిడేసరికి పొంగిపోయింది. ఈలోగా పని పూర్తయి ఇంకా నెలరోజులు కాకుండానే కేంపునించి వచ్చాడు రాఘవ.

    అపార్ట్ మెంట్లో అన్ని ఫ్లాట్లు ఒకే మాదిరిగా వుండడంతో, ఇంటిలోపలికి వెడుతూ ఒక కొత్త అమ్మాయిని చూసి, 'సారీ అమ్మా! మా ఫ్లేటనుకుని పొరపాటున మీ ఇంటికొచ్చేసాను.' అనగానే సుపుత్రుడు కిరణ్, కూతురు రమ లోపల్నుంచి వస్తూ పగలబడి నవ్వి, 'నాన్నా! నువ్వు మనింటికే వచ్చావు. ఈవిడ అమ్మాయి కాదు, అమ్మ! గుర్తు పట్టలేదా? బ్యూటీ టిప్స్ ఫాలో అవుతూ, డైటింగ్ చేసి అమ్మ అమ్మాయిలా అయిపోయింది.' అన్నారు.

    భర్త మెచ్చుకుంటాడనుకుని గర్వంగా చూసింది మహాదేవీ.

    'ఛీ, అసలేం బాగాలేదు. మొహం అంతా తెల్లగా పాలిపోయి, జుట్టు పల్చబడిపోయి కళావిహీనంగా వున్నావు. సంనబడ్డట్టుగా లేవు. రోగిష్టిదానిలా, జబ్బుపడి లేచినట్టుగా వున్నావు. ఎవరేం చెప్పినా అతిగా పాటించావు. ఇందుకే గుర్తుపట్టలేనంతగా ఇలా తయారయ్యావు. ఏది చేసినా ఆరోగ్యకరంగా వుండాలి. అనారోగ్యాన్ని కొన్ని తెచ్చుకోకూడదు.'

    ఆ మాటలు వింటూ తూలిపడబోతున్న మహాదేవిని పట్టుకుని రాఘవ ఆస్పత్రికి తీసికెడితే, లో బి.పి. అంటూ, శుభ్రంగా తిండి తినమన్నాడు డాక్టరు.

    'మహాదేవీ! ఏ వయసుకి తగ్గట్టుగా ఆ వయసులో వుండడమే అందమైన గౌరవం. ఏభయ్యేళ్ళ వాళ్ళూ ఇరవై ఏళ్ళవాళ్ళలా వుండడానికి ప్రయత్నిస్తే చూసేవాళ్ళకు సిల్లీగా వుంటుంది. వయసు పెరిగే కొద్దీ జుట్టు నెరవడం, లావవడం, శరీరం దృఢత్వాన్ని కోల్పోవడం లాంటి మార్పులన్నీ సహజం. పదహారేళ్ళ అమ్మాయిలా వుండాలని ప్రయత్నిస్తే, మీద పడే వయసు దాచినా దాగదు. వ్యార్ధక్యం నేరం కాదు. ఎవరో హేళన చేస్తారని అనుకోవడం పొరపాటు. ముందుతరం వాళ్ళకి గౌరవం కలిగేలాగా పెద్దరికంతో వ్యవహరించి, మన జీవితానుభవాలతో పిల్లల జీవనమార్గానికి మార్గదర్శులుగా నిలిచి పెద్దరికాన్ని నిలుపుకోవాలి.'

    అప్పటినించి మహాదేవీ ఫేస్ ప్యాకులు, హెన్నాలు, సలాడ్ లు ఇలాంటి టి.వి. లో చెప్పే అందమైన చిట్కాలని పాటించడం మానేసి, క్రమబద్ధంగా ఆహారం తీసుకుంటూ, చిన్నపాటి వ్యాయామం చేస్తూ, ఆరోగ్యాన్ని తన అధీనంలో వుంచుకుంటూ, మీద పడుతున్న వార - క్యానికి స్వేచ్ఛనిచ్చింది.



    ********

                                     



  • Prev
  • Next