• Prev
  • Next
  • తాతా ధిత్తై తరిగిణతోం 20

    తాతా ధిత్తై తరిగిణతోం 20

     

    జీడిగుంట రామచంద్రమూర్తి

     

     

    "గురూగారూ...మనదగ్గిర అగ్గి పెట్టుంటే ఓసారిప్పించండి."
    అసలే అవమానంతో ఉడికిపోతున్న వీరభద్రానికి పుండు మీద కారం చల్లినట్టు అనిపించింది.
    "అలాగే ఇచ్చెదను. ముందు నీ కారులో వున్న పెట్రోలు తీసుకురమ్ము."
    "పెట్రోలా ఎందుకూ?"
    "నీ తలపై గుమ్మరించి అటుపై అగ్గిపుల్ల గీయుటకు!" అన్నాడు వీరభద్రం. డ్రైవరుకి కోపం వచ్చింది.
    "ఇదిగో పంతులూ!...ఒళ్లెలా వుందేమిటి? నేను మర్యాదగా అగ్గిపెట్టె అడిగితే అనవసరంగా అలా నోరుపారేసు కుంటావేమిటీ?" అన్నాడు.
    "నోరు పారేసుకోవటమే కాదు...నీ 'లెగ్సూ', హేండ్సూ' కట్టి కార్లో పారవేయగలను. నన్నే అగ్గిపెట్టె ఇమ్మందువా? ఎంతసాహసము?"
    "ఊ సర్లే...నీతో నాకేంటి?...పైగా ఆ మొఖానికి సాయం వికారంగా ఆ భాషొకటి?" అంటూ వెళ్ళిపోయాడు డ్రైవరు.
    వీరభద్రం కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. పద్యం తప్పుగా చదువుతున్న లక్ష్మణమూర్తిపై ఆ కోపాన్ని ప్రదర్శించి వీపు మీద ఒకటి తగిలించాడు.
    "సరిగ్గా చదివి అఘోరించు." అంటూ మండిపడ్డాడు.
    ఇకలోపల...
    హాల్లోకి అడుగుపెట్టిన విష్ణుమూర్తి చుట్టూ కలయచూశాడు...అక్కడ ఎవరూ కనిపించలేదు.
    "ఎవరండీ లోపల ?" పిలిచాడు.
    అప్పుడే నీళ్ళ కావిడి తీసుకుని ఎవరుచేసిన ఖర్మవారనుభవింపకా ఎవరికైనను తప్పదన్నా' అని పాడుకుంటూ, అటుగా వెడుతున్న నారాయణ ఆగిపోయి వాళ్ళవైపు విశ్మయంగా చూస్తూ ప్రశ్నించాడు.
    "ఎవరు కావాలండీ?"
    "వీరభద్రంగారు కావాలి!...పిలు!" అంటూనే ఠీవీగా అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు విష్ణుమూర్తి.
    నారాయణ ఇంకా విస్తుపోయాడు.
    "అదేంటండీ?... ఈరభద్రం గారు ఈదరుగు మీద కూసుని ఆరబ్బాయిగారికి సదువు సెప్తున్నారు కదా? సూళ్ళేదా?"
    ఆ మాట విన్న విష్ణుమూర్తి తన పక్కనే టపాకాయ పేలినట్టు ఉల్కిపడ్డాడు. అంటే?  ఇంతకు ముందు తాను, వీధి అరుగుమీద చూసింది, 'ఉగ్రనరశింహం' అని బిరుదిచ్చిందీ, ఫేసు దరిద్రంగా వుందంటూ రిమార్కుచేసిందీ వీరభద్రం గారినే నన్నమాట...!
    విష్ణుమూర్తికి ముచ్చెమటలు పోశాయి. వచ్చిన పని వాకిట్లోనే అయిందన్న సామెతగా ఇప్పుడు వీరభద్రం తనతో 'చెడుగుడు' ఆడతాడేమోనన్న భయం కూడా కలిగింది.
    "మీరుండండి! నేను చూసొస్తాను" అంటూ నారాయణ బయటకు నడిచాడు.
    (ఇంకావుంది)
    (హాసం వారి సౌజన్యంతో)

     

  • Prev
  • Next